దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కూటమి! కేసీఆర్ కొత్త ఎత్తు..
posted on Dec 14, 2021 @ 3:18PM
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడులోని శ్రీరంగం వెళ్ళారు. శ్రీరంగనాథ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.కుమార్తె కవిత మినహా కుటుంబ సభ్యులు అందరూ యాత్రలో ఉన్నారు. అయితే, ఇది కేవలం భక్తి యాత్రేనా లేక భక్తి, ముక్తితో పాటు రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్న యాత్రా అంటే, అదీ ఇదీ రెండు కలసిన యాత్రగానే పరిశీలకులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేగంగా మారుతున్న నేపధ్యంలో సహజంగానే, ముఖ్యమంత్రి మారుతున్న పరిస్తితులకు తగ్గట్టుగా, తమ వ్యూహాన్ని మార్చుకునే ప్రయత్నాలలో ఉన్నారు. అందులో భాగంగానే,కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసేందుకు, దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే, ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్’టప్ భేటీ అవుతున్నట్లు సమాచారం.
ఐదు దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాట, తర్వాత తెలంగాణలోనే బీజేపీ కొంత బలంగా ఉంది.మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ ఆటలో అరటి పండు. మరోవంక తమిళనాడులో అధికార డిఎంకే, కాంగ్రెస్ పార్టీకి మిత్ర పక్షం. గత అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. తెలంగాణ విషయం వచ్చే సరికి, అధికార తెరాస, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్ధి పార్టీలు. ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉప్పు, నిప్పు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ, కాంగ్రెస్ పార్టీ తెరాసతో సంబంధం పెట్టుకున్న మరు క్షణం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండరని , ఆయన నైజం తెలిసిన ఎవరికైనా అర్థమవుతుంది.
అలాగే కర్ణాటకలోనూ బీజేపీకి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రత్యర్ధి. కేరళలోనూ కాంగ్రెస్, వామ పక్ష కూటమి మధ్యనే పోటీ బీజేపీకి కనీసం ఉనికి కూడాలేదు. ఇక పొరుగు రాష్ట్రం ఏపీ విషయానికి వస్తే, వైసీపీ, టీడీపీల మధ్యనే పోటీ, వైసీపీ లేదా టీడీపీ ఎట్టిపరిస్థితిలోనూ తెరాసతో చేతులు కలిపే అవకాశమే లేదు. అదే జరిగితే అది ఆ పార్టీల ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. కాబట్టి, కేసీఆర్ గతంలో ప్రయత్నించి విఫలమైన థర్డ్‌ఫ్రంట్ లానే, దక్షిణాది రాష్ట్రాల ప్రాతీయ పార్టీల కూటమి కూడా మరో విఫల ప్రయోగంగానే మిగులుతుందని పరిశీలకులు అంటున్నారు. నిజానికి, దేశంలో ఇటు దక్షిణాదిలో అయినా అటు ఉత్తరాదిలో అయినా కాంగ్రెస్ లేకుండా ఏర్పడే ఫ్రంట్ ఏదీ కూడా బీజేపీని బలంగా ఎదుర్కొనలేదని, రాజకీయ విశ్లేషకులు చాలా గట్టిగా చెపుతున్నారు.
అందుకే, కాంగ్రెస్ పార్టీని, యూపీఏ కూటమిని కాదని మమతా బెనర్జీ చేస్తున్న మరో కూటమి ప్రయత్నం అయినా అయ్యే పని కాదనే అంటున్నారు. కాంగ్రెస్ లేని ఫ్రంట్ ఏదైనా బీజేపీ/ ఎన్డీఏకి ప్రత్యాన్మాయం కాలేదు ...అవునన్నా కాదన్నా ప్రశాంత్ కిశోర్, శరద్ పవార్ సహా అందరి అభిప్రాయం అదే ... పైకి ఎవరు ఏమి చెప్పినా ... కాంగ్రెస్ లేని ఫ్రంట్ .. నిలబడదు.