నగరిలో రోజాకు ఎర్త్!.. చక్రం తిప్పుతున్న పెద్దలు!
posted on Dec 14, 2021 @ 2:22PM
ఎమ్మెల్యే రోజాకు తెలుగు స్టేట్స్‌లో ఫుల్ పాపులారిటీ. మాజీ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ ఉంది. జబర్దస్త్‌తో జబర్దస్త్ పేరు వచ్చింది. వైసీపీలోనూ క్రేజ్ బాగానే ఉంది. జగనన్నకు దేవుడిచ్చిన చెల్లెలిగా సీఎంతో సాన్నిహిత్యం ఉంది. నగరిలోనూ ప్రజాధారణ ఉండటంతో ఎమ్మెల్యేగానూ గెలిచారు. అన్నీఉన్నా.. జిల్లా నేతలతో మాత్రం అసలేమాత్రం సఖ్యత లేదు. రోజా ముందరి కాళ్లకు బంధాలు వేసేందుకు.. పెద్ద పెద్ద లీడర్లంతా తమదైన స్టైల్‌లో సంకెళ్లు వేస్తున్నారు. జగన్‌తో క్లోజ్‌నెస్ వల్ల ఎలాగోలా రాష్ట్ర స్థాయి రచ్చబండలో గెలుస్తూ వస్తున్నా.. నగరిలో మాత్రం అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవలి స్థానిక సంస్థల ఎలక్షన్లతో ఆ జగడం మరింత ముదిరింది. రోజా వర్గం.. రోజా వ్యతిరేక వర్గంగా నగరి వైసీపీ చీలిపోయింది. జిల్లా మంత్రుల అండదండలతో.. రోజా వ్యతిరేకులు రోజురోజుకూ బలపడుతున్నారు. రోజాకు రాజకీయ ముళ్లుల్లా మారుతున్నారు.
నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ముఖ్యనేతలు నగరిలో సమావేశమయ్యారు. మరోసారి రోజాను గెలిపించేది లేదని తీర్మానించారు. ఈ ఐదుమండలాల నేతల్లో ఇద్దరు రాష్ట్ర స్థాయి పదవులు ఉన్న వారున్నారు. మిగిలిన వారు వారి వారి స్థాయిల్లో మండలాల్లో మంచి పట్టు ఉన్న వారే. గత అసెంబ్లీ ఎన్నికల్లో రోజా విజయానికి వీరంగా కృషి చేశారు. ఆ తర్వాత సమీకరణాలు మారుతూ వచ్చాయి. రోజా తన సొంత వర్గాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో పలువురు నేతలు ఆమెకు దూరమయ్యారు. వారంతా రోజా వ్యతిరేక వర్గం పెద్దల పంచన చేరిపోయారు. పెద్దల దీవెనలు లభించడంతో.. ఆ ఐదు మండలాల ముఖ్యనేతలు రోజాకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. ఆమెను ఓడించాలని పట్టుదలతో ఉన్నారు. గెలిపించడం కాదు.. అసలు వచ్చే ఎన్నికల్లో రోజాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని వారంతా డిమాండ్ చేస్తున్నారు. తమను కాదని రోజాకు పోటీలో నిలిపితే.. గెలిపించే ప్రసక్తే లేదని తీర్మానించుకున్నారు.
నగరి నియోజకవర్గంలోని వైసీపీ ముఖ్య నేతలంతా ఇలా ఎమ్మెల్యే రోజాపై రివర్స్ కావడం మామూలు విషయం కాదు. పెద్దల బ్లెస్సింగ్స్ లేనిదే వారంతా సాహసం చేసుండరు. మొదటి నుంచీ రోజాకు కంట్లో నలుసులా మారిన మంత్రి పెద్దారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామిల దన్నుతోనే నగరి వైసీపీ నాయకులు ఇలా మీటింగ్ పెట్టి.. రోజాకు టికెట్ ఇవ్వొదంటూ తీర్మానాలు చేసే వరకూ వెళ్లారని అంటున్నారు. విషయం తెలిసి ఎమ్మెల్యే రోజా ఫైర్ అవుతున్నారు. గతంలో మాదిరి కన్నీళ్లు పెట్టుకునే ప్రసక్తే లేదని.. చిన్నా-పెద్దలు అందరితో తేల్చుకుంటానని మండిపడుతున్నారు. త్వరలో జరగబోవు మంత్రి మండలి విస్తరణలో తనకు మినిస్టర్ పోస్ట్ పక్కాగా వస్తుందని.. అప్పుడు వాళ్ల సంగతి చూసుకుంటానని తన సహచరుల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోజా.