తిరుగులేని శక్తి అయితే దుబ్బాక, హుజురాబాద్ సంగతేంటి కేటీఆర్..
posted on Dec 14, 2021 @ 4:39PM
తెలంగాణలో జరిగిన ఆరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. నిజానికి ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులే ఎక్కువన్నారు. కాబట్టి వాళ్లే గెలిచారు. అందులో ఆశ్చర్యం ఏమి లేదు. టీఆర్ఎస్ రెబెల్ రవీందర్ సింగ్ పోటీ చేయడంతో కరీంనగర్ ఎన్నిక కొంత ఉత్కంఠ రేపింది. కాని ఆ సీటును కూడా కారు పార్టీ అనుకున్నదాని కంటే ఈజీగానే గెలుచుకుంది. ఆరు స్థానాలు గెలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ లో అయితే హంగామా చేశారు.
ఇక స్థానిక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలతో టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ ఎదిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ ను గెలిపించారని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లీడర్లు చేసిన ప్రకటనలే ఇప్పుడు చర్చగా మారాయి. టీఆర్ఎస్ కే మెజార్టీ ఉంది కాబట్టి.. ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారని, దీనికి ఇంతగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా మరోసారి నిజమైందని కేటీఆర్ చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో కారే గెలిచిందన్న కేటీఆర్ కామెంట్లపై నెటిజన్లు, విపక్షాల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలిస్తే.. దుబ్బాక, హుజురాబాద్ లో గెలిచింది ఎవరూ సార్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల జరిగిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన విజయం సాధించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది. ఒక్కో ఓటుకు అరు వేల రూపాయలు ఇస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. హుజురాబాద్ కోసమే ప్రత్యేక పథకాలు తీసుకొచ్చారు. దళిత బంధు ద్వారా దాదాపు 20 వేల దళిత కుటుంబాలకు .. ఒక్కొ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించారు. కులాల వారీగా తాయిలాలు ప్రకటించారు.అయినా హుజురాబాద్ పై టీఆర్ఎస్ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించారు ఈటల రాజేందర్. గత ఏడాది నవంబర్ లో జరిగిన మెదక్ జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలోనూ అధికార పార్టీకి షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ జిల్లాలో, టీఆర్ఎస్ కు కంచుకోటగా చెప్పకునే దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన విజయం సాధించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తమకు తిరుగులేదని చెబుతున్న కేటీఆర్.. గత ఫలితాలను గుర్తు చేస్తున్నాయి విపక్షాలు. హుజురాబాద్, దుబ్బాక ఫలితాలను గుర్తు చేస్తూ కేటీఆర్ కు విపక్షాలు కౌంటరిస్తున్నాయి. గెలిచిన వేళ సంబరాలు చేసుకోవడం కామనే కాని.. పాత విషయాలు మర్చిపోయి ఇలా ప్రకటనలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి.