బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు..
posted on Dec 15, 2021 @ 10:16AM
ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణకు వచ్చేసింది. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్లు హెల్త్ డెరైక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
12వ తేదీ కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారని.. ఆమెకు నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలో ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు డా. శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్ టోలిచౌకిలో ఆమెను గుర్తించి గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. బాధిత మహిళకు సన్నిహితంగా ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యుల శాంపిల్స్ కూడా సేకరించినట్లు తెలిపారు. కెన్యా మహిళతో పాటు సోమాలియాకు చెందిన 23ఏళ్ల వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకినట్లు డీహెచ్ వెల్లడించారు.
ఇక హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లిన ఓ కుటుంబంలోని ఏడేళ్ల బాలుడికి కూడా ఒమిక్రాన్ నిర్దారణ అయిందని డీహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. బాలుడికి సంబంధించిన సమాచారాన్ని బెంగాల్ ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఒమిక్రాన్ నిర్దారణ అయిన ఇద్దరికి టిమ్స్ లో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని.. కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ శ్రీనివాస రావు సూచించారు.