వన్డే సిరీస్ కు కోహ్లీ డుమ్మా! రోహిత్ కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేకేనా?
posted on Dec 15, 2021 @ 9:49AM
భారత క్రికెట్ లో ముసలం పుట్టిందా? క్రికెటర్లు రెండు గ్రూపులుగా విడిపోయారా? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కలిసి ఆడటానికి కూడా ఇష్టపడటం లేదా? అంటే అవుననే తెలుస్తోంది. రెండు, మూడు రోజులుగా బీసీసీఐలో జరుగుతున్న పరిణామాలు, సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కు రోహిత్ శర్మ డుమ్మా కొట్టడం వంటి అంశాలతో భారత క్రికెట్‌లో ఏం జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీని కెప్టెన్ గా తప్పించి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించడంపై పెద్ద దుమారమే సాగుతోందని తెలుస్తోంది.
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు.. ఇప్పుడు టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వ్యవహారం కూడా అలానే ఉందని చెబుతున్నారు. కొంత కాలంగా కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఇవి బాగా ముదిరాయని సమాచారం. ఈ సమయంలోనే కెప్టెన్ గా కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు అప్పగించడం.. ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెంచేంసిందని తెలుస్తోంది. ఒకరి కెప్టెన్ లో మరొకరు ఆడటానికి కూడా ఇష్టపడటం లేదని అంటున్నారు. అందుకే టెస్టు సిరీస్ కు కెప్టెన్ గా కోహ్లీ ఉండగా.. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ కు గాయం పేరిట రోహిత్ శర్మ దూరమయ్యారని అంటున్నారు. హిట్ మ్యాన్ కు కౌంటర్ గా తాను వన్డే సిరీస్ లో ఆడబోనని విరాట్ స్పష్టం చేసినట్టు కథనాలు వినిపిస్తున్నాయి..
యూఏఈలో టీ20 ప్రపంచకప్ ఆరంభం కాక ముందే విరాట్ కోహ్లీ ఓ సంచలన ప్రకటన చేశాడు. ఆ మెగా టోర్నీ తర్వాత ట్వీట్వంటీ ఫార్మాట్ బాధ్యతల నుంచి వైదొలుగుతానని, వన్డే.. టెస్టు జట్ల సారథిగా మాత్రం కొనసాగుతానని చెప్పాడు. అయితే పరిమిత ఓవర్లలో ఇద్దరు కెప్టెన్లు ఉండడం సరికాదని భావిస్తూ.. బీసీసీఐ వన్డేల నుంచి కూడా కోహ్లీ సారథ్యానికి ఉద్వాసన పలికి రోహిత్‌కు పగ్గాలు అప్పగించింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం టీమిండియాలో సంచలనంగా మారింది. ఇది విరాట్ కోహ్లీ కూడా ఊహించలేదని అంటున్నారు. వన్డే కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టంగా చెప్పినప్పటికీ.. తనను అవమానకరంగా తొలగించారనే భావనలో అతడున్నట్టు సమాచారం. ఇది మనసులో పెట్టుకున్నాడో.. మరేంటో కానీ.. వన్డే సిరీస్ లో ఆడనని కోహ్లీ ఇదివరకే బోర్డుకు సమాచారమిచ్చినట్టు కథనాలు వస్తున్నాయి.
టీ20 ప్రపంచకప్ ముగిశాక భారత జట్టు కివీస్ తో టీ20, టెస్టు సిరీస్ లు ఆడింది. ఇందులో టీ20 సిరీస్ కొత్త కెప్టెన్ రోహిత్ ఆధ్వర్యంలో జరగ్గా కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత జట్టు ఆడిన రెండు టెస్టుల్లో రోహిత్‌కు రెస్ట్ ఇచ్చారు. దీంతో కెప్టెన్సీ చేతులు మారాక ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు కలిసి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్టు జట్టును ప్రకటిస్తూనే.. వన్డేలకు కూడా రోహిత్ సారథ్యం వహిస్తాడని బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది విరాట్‌ను తీవ్ర మనస్థాపానికి గురి చేసినట్టు చెబుతున్నారు. తాజాగా కండరాలు పట్టేయడంతో రోహిత్ మూడు టెస్టుల సిరీస్ కు దూరమయ్యాడు. వన్డే సిరీస్ వరకల్లా సిద్ధం కావాలనే ఆలోచనలో అతడుండగా.. ఆ సిరీస్ కు కోహ్లీ విశ్రాంతి తీసుకుంటాడనే వార్తలు వినిపిస్తుండడంతో ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
వచ్చేనెల 11న తన కూతురు వామికా మొదటి పుట్టిన రోజు ఉండడంతో వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ దూరంగా ఉండాలనుకుంటున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే సఫారీ టూర్‌కు క్రికెటర్లంతా కుటుంబసభ్యులతోనే వెళుతున్నారు. అంతా ఒకేచోట ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మొత్తం సిరీస్ నుంచే వైదొలగడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా తన కుమార్తె పుట్టినరోజైన 11వ తేదీనాడే మొదలయ్యే టెస్టులో ఆడనున్న కోహ్లీ.. ఆ తర్వాత వారానికి మొదలయ్యే వన్డే సిరీస్ లో ఆడేందుకు అతనికున్న ఇబ్బంది ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైకి ఎలాంటి కారణం చెబుతున్నా.. తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకే కోహ్లీ ఇలా చేస్తున్నాడని రోహిత్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కావాలని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తమను ఇప్పటిదాకా కోరలేదని బీసీసీఐ తెలిపింది. వచ్చే నెల 19 నుంచి రోహిత్ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ప్రస్తుతానికైతే కోహ్లీ వన్డే సిరీస్ ఆడతాడు.. కెప్టెన్ కోహ్లీ సహా అందరు ఆటగాళ్లు తమ ఫ్యామిలీలతో ఒకే చార్టెడ్ ఫ్లయిట్‌లో వెళతారు. ఒకవేళ టెస్టు సిరీస్ తర్వాత విశ్రాంతి కావాలనుకుంటే అతడు తప్పకుండా సెలెక్షన్ కమిటీ చైర్మన్‌కు, జైషాకు సమాచారమిస్తాడు అని బోర్డు అధికారి తెలిపాడు.