అన్ని సభల్లోనూ ప్రాతినిధ్యం.. మాజీ ప్రధాని ఫ్యామిలీ రికార్డ్
posted on Dec 14, 2021 @ 4:43PM
భారత రాజకీయాల్లో కుటుంబ వారసత్వ రాజకీయాల గురించి కొత్తగా చెప్పుకోవలసింది ఏదీ ఉండదు. జాతీయ రాజకీయాల నుంచి ప్రాంతీయ రాజకీయాల వరకు, జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీలలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఆనావాయితీగా సాగిపోతున్నాయి. అయితే, ఒకే కుటుంబంలో ఇంచుమించుగా ప్రతి ఒక్కరు ఏదో ఒక చట్ట సభలో సభ్యులుగా ఉండడం లేదా అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ ఉభ్ సభల్లో ఫ్యామిలీ రిప్రజెంటేషన్’ ఉండడం కొంత విచిత్రంగానే అనిపిస్తుంది.
మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం, అదిగో అలాంటి అరుదైన రికార్డును సృష్టించింది. పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభల్లో దేవెగౌడ ఫ్యామిలీ మెంబర్ సభ్యులుగా ఉన్నారు. ఈ రోజు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్న గెలుపొందారు. దీంతో, మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం. లోక్సభ, రాజ్యసభతో పాటు రాష్ట్ర ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబంగా ఘనత సాధించింది. జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ రాజ్యసభ సభ్యునిగా ఉండగా... ఆయన చిన్న కుమారుడు హెచ్డీ కుమారస్వామి చెన్నపట్నం ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. సూరజ్ సోదరుడు ప్రజ్వల్.. హాసన్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు సూరజ్ శాసనమండలికి ఎన్నికయ్యారు.
దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్డీ రేవన్న వారసుడే సూరజ్ రేవన్న. వీరితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు సైతం ప్రజా జీవితంలో ఉన్నారు. సూరజ్ తండ్రి హెచ్డీ రేవన్న ప్రస్తుతం హొలెనర్సిపుర నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తల్లి భవాని జిల్లా పరిషత్ సభ్యురాలిగా ఉన్నారు.మరోవైపు, కుమారస్వామి సతీమణి అనిత రామనగర ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. వీరి కుమారుడు నిఖిల్ జేడీఎస్ యూత్ వింగ్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వెనకటికి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఫ్యామిలీ నుంచి ఇలాగే ఎనిమిదిమంది చట్ట సభల సభ్యులు ఉన్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలోనూ ఐదుగురు చట్ట సభల సభ్యులు ఉన్నాఋ.కానీ, వారి సభ్యత్వం మూడు సభలకే పరిమితం అయింది. ముఖ్యమంత్రి కేసీర్’తో పాటుగా ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు ఎమ్మెల్యేలు, మంత్రులు. కేసీఆర్ కూతురు కవిత శాసన మండలి సభ్యురాలు(ఎమ్మెల్సీ), మరో ఇంటి మనిషి సంతోష్ రాజ్య సభ సభ్యులు, ఎటొచ్చి లోక్ సభ లోనే కేసీఆర్ ఫ్యామిలీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నెక్స్ట్ టైమ్ బెటర్ లక్..