ముందస్తు ఎన్నికలకు జగన్? పీఆర్సీతో పొలిటికల్ స్కెచ్!
posted on Dec 14, 2021 @ 2:51PM
మధ్యంతర ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారా? ఆ దిశగానే ఆయన అడుగులు పడుతున్నాయా? పీఆర్సీపై సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదికలో ముందస్తు సిగ్నల్ కనిపిస్తోందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. పీఆర్సీపై సీఎం జగన్ కు సీఎస్ కమిటి ఇచ్చిన నివేదికలో కీలక అంశాలు ఉన్నాయి. ఫిట్ మెంట్ ను 14.29 శాతం సిఫారస్ చేసింది సీఎస్ కమిటి. ఇక్కడే మరో కండీషన్ కూడా పెట్టింది. పెరిగిన పీఆర్సీ వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి అమలు కానుంది. అంటే ఏడాది తర్వాత నవంబర్ లో పెరిగిన వేతనం తీసుకుంటారు ఉద్యోగులు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
ఉద్యోగులు 30 శాతానికి పైగా పీఆర్సీ కావాలని డిమాండ్ చేస్తుండగా.. సీఎస్ కమిటి మాత్రం 14.29 చాలని చెప్పింది. అది కూడా వచ్చే ఏడాది నవంబర్ లో ఇవ్వాలని సూచించింది. ఎందుకిలా.. పీఆర్సీని ఇప్పుడు ప్రకటించి 11 నెలల తర్వాత ఇవ్వడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. సీఎస్ కమిటీ అంటే సీఎంకు తెలియకుండా పనిచేసే అవకాశం ఉండదు. సీఎస్ కమిటి సిఫారస్ అంటే అవి దాదాపుగా సీఎం ప్రతిపాదనలే.. మరీ ఎందుకు 11 నెలలు వాయిదా వేస్తున్నారు.. నిధుల కొరత వల్లే సర్కార్ ఇలా చేస్తుందా.. అంటే కాదనే తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నిధుల కొరత ఉంటే.. వచ్చే నవంబర్ లోనూ అదే పరిస్థితి ఉంటుంది. ఏపీ ప్రభుత్వానికి కొత్తగా వచ్చే ఆదాయం ఏదీ లేదు. ఇంకా చెప్పాలంటే మరో 11 నెలల సమయానికి ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారే అవకాశం ఉంది.
ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేసింది జగన్ రెడ్డి సర్కార్. ఇంకా చేస్తూనే ఉంది. ఎక్కడ దొరికితే అక్కడా ఎడాపెడా రుణాలు తీసుకుంటూనే ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ప్రతి నెలా అప్పులు చేస్తూనే ఉంది. చివరికి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా అప్పు తేవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో నవంబర్ లో అదనంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి ఏది లేదు. అయినా ప్రభుత్వం పెరిగిన పీఆర్సీని నవంబర్ నుంచి ఇస్తామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్ లో ప్రభుత్వాన్ని రద్దు చేసే యోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. అక్టోబర్ లో అసెంబ్లీని డిసాల్వ్ చేసి మధ్యంతర ఎన్నికలను పోవాలనే జగన్ వ్యూహంలో భాగంగానే.. ఉద్యోగులకు కొత్త పీఆర్సీని వచ్చే ఏడాది అక్టోబర్ నెల నుంచి ఇస్తామని సీఎస్ కమిటీ సిఫారస్ చేసిందని, ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే జరిగిందని అంటున్నారు.
ఇప్పుడిస్తున్న జీతమే ఎక్కువ.. తగ్గించేద్దాం! సీఎంకు సీఎస్ కమిటి నివేదిక...
ఏడాదికి సంబంధించి ఆదాయవ్యయాలను సంబంధించిన లెక్కలన్ని మార్చిలోనే ఖరారవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన రుణాల గురించి మార్చిలో క్లారిటీ వస్తోంది. అందుకే జగన్ సర్కార్ ఈ స్కెచ్ వేసిందని అంటున్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దొరికినకాడికి అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు పంపిణి చేయాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఓట్లే లక్ష్యంగా మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చి.. ఓటర్లకు పంచిపెట్టాలనే యోచనలో వైసీపీ సర్కార్ ఉందంటున్నారు. ఇలా అవకాశం ఉన్నంత వరకు అప్పులు తెచ్చి... జనాలకు అందించి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకే ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించి.. అమలు మాత్రం మరో 11 నెలల తర్వాత ఉండేలా స్కెచ్ వేశారని తెలుస్తోంది.
నవంబర్ నెలలో కొత్త పీఆర్సీ అందుకోవాల్సిన ఉద్యోగులు.. ప్రభుత్వం రద్దు అయితే చేసేదిమి ఉండదు. పీఆర్సీ విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఉద్యోగులు వైసీపీ ఆగ్రహంగా ఉంటారన్న ప్రశ్న రావొచ్చు. వాళ్లంతా జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తారు కదా.. ప్రభుత్వం ఎందుకిలా చేస్తుందని అన్నఅనుమానం కూడా వస్తోంది. అయితే ఉద్యోగులంతా ఇప్పటికే జగన్ పాలనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వైసీపీ పాలనతో తీసుకున్న అస్తవ్యస్థ విధానాలతో వాళ్లంతా విసిగిపోయి ఉన్నారు. గత చంద్రబాబు పాలనతో ప్రస్తుతం వైసీపీ పాలనను పోల్చుకుంటూ మండిపడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఎప్పుడు జగనన్న ఇంటికి పంపిద్దామన్న అన్న భావనలో ఉన్నారు. సీఎం జగన్ కు కూడా ఈ విషయం తెలుసు. అందుకే పీఆర్సీ ఇచ్చినా ఉద్యోగులు వైసీపీకి మద్దతుగా ఉండరనే ఉద్దేశ్యంతోనే.. ఇలా స్కెచ్ వేశారని అంటున్నారు. ఉద్యోగులు ఎలాగూ తమకు సపోర్ట్ చేయరు కాబట్టి... వాళ్లతో కొత్తగా వచ్చే సమస్య ఏది ఉండదని జగన్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది.
పదవి ఫసక్?.. సోము వీర్రాజుకు హైకమాండ్ పిలుపు..