అలిపిరిలో ముగిసిన మహాపాదయాత్ర.. 17న భారీ బహిరంగ సభ...
posted on Dec 14, 2021 @ 4:19PM
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ముగిసింది. అలిపిరి శ్రీవారి పాదాల చెంతకు పాదయాత్ర చేరగానే.. రథానికి 108 కొబ్బరికాయలు కొట్టి యాత్రకు ముగింపు పలికారు. స్థానికులు గుమ్మడికాయలతో దిష్టితీశారు. మంగళ హారతులు పట్టారు. జై అమరావతి, జైజై అమరావతి నినాదాలతో అలిపిరి మారిమోగిపోయింది.
నవంబర్ 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరులో ప్రారంభించిన మహా పాదయాత్ర 45 రోజులకు అలిపిరిలో ముగిసింది. రైతులు.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా 450 కి.మీ.పైగా పాదయాత్ర చేశారు. చివరి రోజు మహాపాదయాత్రకు రాజధాని ప్రజలు భారీగా తరలివచ్చారు. అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలంటూ నినదించారు. సుదీర్ఘ పాదయాత్రలో తాము పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు రైతులు.
మహాపాదయాత్ర ముగియడంతో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రోజుకు 500 మంది చొప్పున శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు అమరావతి జేఏసీ ప్రతినిధులు. ఆ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 17న తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రాజధాని రైతులు సిద్ధమవుతున్నారు.