తప్పు చేసి ఉంటే క్షమించండి.. బహిరంగంగా వేడుకున్న టీడీపీ నేత
posted on Dec 15, 2021 9:19AM
సాధారణంగా రాజకీయ నేతలకు అహం ఎక్కువగా ఉంటుందంటారు. ప్రతి విషయంలోనూ తమదే పై చేయి కావాలని కోరుకుంటారు. కొన్ని సార్లు తాను తప్పు చేసినా ఎక్కడ తగ్గరు. తమ తప్పును కూడా ఒప్పు అనేలా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంక జనాల్లోకి వెళితే నాయకుల తీరు మరోలా ఉంటుంది. తమ ఆధిపత్యం ప్రదర్శించడంతో వాళ్ల ఎక్కడా తగ్గరు. కాని గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. తాను తప్పు చేసి ఉంటే క్షమించాలంటూ బహిరంగంగానే ప్రజలకు, పార్టీ కార్యకర్తలను కోరారు.
తప్పుచేసి ఉంటే క్షమించాలంటూ టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శిరస్సు వంచి పార్టీ కార్యకర్తలను కోరారు. టీడీపీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో గౌరవసభ నిర్వహించారు. ప్రజా సమస్యలపై చర్చా వేదిక నిర్వహించగా, రైతులు ఎండ్లబండ్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సభలో యరపతినేని మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.విభేదాలను పక్కనపెట్టి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునేందుకు పాటుపడదామని పిలుపునిచ్చారు.
సమష్టిగా పనిచేసి గురజాల సహా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని గెలిపించుకుందామన్నారు యరపతినేని శ్రీవివాస రావు. నాయకులు, కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడతానని హామీ ఇచ్చారు. తాను మారానని, మరింతగా మారతానని చెప్పారు. జనవరి నుంచి గ్రామాల్లో పర్యటిస్తానని, ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాచేపల్లిలో గెలిచిన టీడీపీ కౌన్సిలర్లు ఏడుగురిని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యరపతినేని సన్మానించారు.