అమెరికాలో కొత్త చట్టం!.. డాలర్ డ్రీమ్స్‌పై ప్రభావం...
posted on Dec 14, 2021 @ 1:18PM
‘అమెరికన్ టెక్ వర్క్ ఫోర్స్ యాక్ట్’ ముసాయిదా బిల్లు చట్టంగా ఆమోదం పొందితే తమ డాలర్ డ్రీమ్స్‌కు బ్రేక్లు వేస్తుందనే ఆందోళనను పలువురు భారతీయ టెకీలు వ్యక్తం చేస్తున్నారు. ‘అమెరికా ఉద్యోగాలు అమెరికా పౌరులకే’ అనే వాదనకు ఈ మధ్య కాలంలో స్థానికంగా మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలోనే ‘అమెరికన్ టెక్ వర్క్ ఫోర్స్ యాక్ట్’ ముసాయిదా బిల్లు అమెరికా ప్రతినిధుల సభం ‘కాంగ్రెస్’ ముందుకు వచ్చింది. ఈ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు జిమ్ బ్యాంక్స్ సభలో ప్రవేశపెట్టారు. అమెరికా కలలను సాకారం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న భారతీయులకు ఈ బిల్లు ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువగా ఉందన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
నిజానికి అగ్రరాజ్యంలో స్థిరపడాలి, డాలర్స్ రూపంలో దండిగా సంపాదించాలనుకునే వారు ముందుగా లక్షలు ఖర్చు పెట్టి, స్టూడెంట్ వీసాపై అమెరికా వర్శిటీల్లో చదువుకోవాలి. వృత్తిలో అనుభవం సంపాదించేందుకు ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’ (ఓపీటీ) కోసం విద్యార్థులు ఏదో ఒక అమెరిన్ సంస్థలో జాబ్ కొట్టాలి. ఓపీటీ శిక్షణ పూర్తయ్యే లోగా హెచ్ 1బీ సంపాదించుకున్న విద్యార్థి డాలర్ డ్రీమ్స్ కల నిజం అవుతుంది. ఒక వేళ హెచ్ 1 బీ వీసా రావడం ఆలస్యం అయితే.. స్టూడింట్ వీసాను మరికొంత కాలం పొడిగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఓపీటీ, హెచ్ 1బీ వీసా భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ కు అంత్యంత కీలకం అనే చెప్పాలి.
ఓపీటీ, హెచ్ 1బీ వీసా అంశాల్లో అమెరికన్ టెక్ వర్క్ ఫోర్స్ యాక్ట్ మార్పులు ప్రతిపాదిస్తోంది. హెచ్ 1బీ వీసాదారులకు ఇచ్చే జీతాల్లో మార్పులు చేయడం ఈ చట్టంలోని ప్రధాన అంశం. హెచ్ 1బీ వీసా ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలంటే.. అంతకు ముందు అదే ప్లేస్ లో పనిచేసిన అమెరికన్ కు ఇచ్చిన జీతం కంటే ఎక్కువ ఇవ్వాలని ‘అమెరికన్ టెక్ వర్క్ ఫోర్స్ యాక్ట్’ ముసాయిదా ప్రతిపాదిస్తోంది. లేదంటే హెచ్ 1బీ కలిగిన టెకీకి లక్షా 10 వేల డాలర్లు వార్షిక వేతనంగా చెల్లించాలని చెబుతోంది. ‘అమెరికన్ టెక్ వర్క్ ఫోర్స్ యాక్ట్’ కొత్తగా పెడుతున్న ఈ రెండు నిబంధనలు భారతీయ కంపెనీల నెత్తిన పిడుగులా మారతాయని పరిశీలకుల విశ్లేషణ. దీంతో పాటు థర్డ్ పార్టీ కంపెనీలు స్పాన్సర్ చేసే హెచ్ 1బీ వీసా కాలాన్ని ఒక్క ఏడాదికే పరిమితం చేయాలనే ప్రతిపాదన కూడా భారతీయ కంపెనీలకు ఇబ్బందిగా మారనుంది. వీసా పునరుద్ధరణ వ్యయం భారమై.. స్పాన్సర్ చేసేందుకు కంపెనీలు ఆసక్తి చూపించకపోవచ్చని నిపుణుల అంచనా. ఇది కూడా డాలర్ డ్రీమ్స్ పై నీళ్లు చల్లుతుందని అంటున్నారు.
మరో పక్కన.. ఓపీటీ సదుపాయాన్ని పూర్తిగా తొలగించాలనేది కొత్త ముసాయిదా ప్రతిపాదన. ఇది కూడా భారతీయుల డాలర్ డ్రీమ్స్ కు బ్రేకులు వేస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓపీటీ సౌకర్యం వల్లే భారతీయ విద్యార్థులు అమెరికాలో లక్షలు ఖర్చుచేసి చదివేందుకు ముందుకు రావడం గమనార్హం. ఓపీటీ తొలగించాలనే ప్రతిపాదనపై అమెరికాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఓపీటీ నిబంధన అమలు చేస్తే.. భారతీయ విద్యార్థులు కెనడా బాట పట్టే ప్రమాదం వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇది అమెరికా వర్శిటీలనే ఆర్థికంగా నష్టపరిచే అంశం అవుతుందంటున్నారు.
‘అమెరికన్ టెక్ వర్క్ ఫోర్స్ యాక్ట్’ ముసాయిదా బిల్లు ప్రస్తుతం ప్రతినిధుల సభ పరిశీలనలో ఉంది. ప్రతినిధుల సభలో ఓకే అయితే.. ఎగువ సభ సెనెట్కు వెళ్తుంది. అక్కడా ఆమోదం పొందితేనే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. ఇదే జరిగితే.. తమ డాలర్ డ్రీమ్స్ పరిస్థితి ఏమిటనే చర్చ భారతీయ టెకీల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.