జాతీయ పార్టీలలో ఉద్యమ పార్టీల విలీనం?
posted on Dec 14, 2021 @ 12:01PM
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించిన కీలక నేతలు కొందరు రాష్ట్ర సాధన తర్వాత తెరాసకు దూరమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలను, కుటుంబ పాలనను, వ్యతిరేకించి బయటకు వచ్చారు.అందులో కొందరు సొంతంగా పార్టీలు పెట్టారు. అయినా,కేసీఆర్ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలను తట్టుకుని నిలవలేక పోయారు. జేఏసీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రొఫెసర్ కోదండ రామ్ స్థాపించిన తెలంగాణ జన సమితి(టీజేఎస్) సహా ఏ ఒక్క పార్టీ కూడా ఆశించిన మేరకు ప్రజాదరణ పొందలేక పోయింది. చివరకు కోదండరామ్ సహా ఆ పార్టీ తరపున, పోటీచేసిన ఏ ఒక్కరూ ఏఒక్క ఎన్నికలోనూ గెలవలేదు. చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కోదండరామ్ గెలవలేక పోయారు. ఒక్క కోదండరామ్ మాత్రమే కాదు, తెలాగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించిన చెరుకు సుధాకర్ ఏర్పాటు చేసిన తెలంగాణ ఇంటి పార్టీ, జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ ఏర్పాటు చేసిన ‘యువ తెలంగాణ’ పార్టీలు కూడా తెలంగాణ రాజకీయలను అంతగా ప్రభావితం చేయలేక పోయాయి.
ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రాష్ట్రంలో పట్టుపెంచుకుని, తెరాసకు ప్రత్యాన్మాయంగా నిలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఉద్యమ పార్టీలుగానే మిగిలిపోయిన పార్టీలు, నాయకులు ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తెరాసను ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీలతో చేతులు కలిపేందుకు, తమ పార్టీలను జాతీయ పార్టీలలో విలీనం చేసేదుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా చెరుకు సుధాకర్ ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఇంటి పార్టీ’, జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ ఏర్పాటు చేసిన ‘యువ తెలంగాణ’ పార్టీలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయని అంటున్నారు.
రాష్ట్రంలో తెరాస తర్వాత అన్ని విధాలా బలమైనపార్టీ ఏదైనా ఉందంటే అది, కాంగ్రెస్ పార్టీనే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉంది ... బలమైన నాయకులు ఉన్నారు.. ఇంచుమించుగా 20 శాతం ఓటు బ్యాంక్ వుంది. అన్నిటినీ మించి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు మీదున్న నాయకుడు. తెరాస నాయకత్వాన్ని, తెరాస ప్రభుత్వాన్ని ఎదుర్కునే సత్తా, సామర్ధ్యం ఉన్న నాయకుడు. అయితే, కాంగ్రెస్ నాయకుల మధ్య అనైక్యత కారణంగా హస్తం పార్టీని తెరాసకు ప్రత్యాన్మాయంగా నిల్దోక్కుకోలేక్ పోతోంది. మరో వంక హుజూర్ నగర్ నుంచి హుజూరాబాద్ వరకు జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం (హుజూర్ నగర్) సహా నలుగు స్థానాల్లో ఓడిపోయింది. మరోవంక, బీజేపీ,అధికార తెరాస సిట్టింగ్ స్థానాలు రెండింటిని ( దుబ్బాక, హుజూరాబాద్ ) సొంతం చేసుకుంది. అన్నిటినీ మించి బీజేపీ కేంద్రంలో అధికారంలో వుంది. జాతీయ నాయకత్వం బలంగా వుంది. ఈ కారణంగా తెరాసకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం బలపడుతోంది.
ఈ నేపధ్యంలోనే తెలంగాణ ఉద్యమ నాయకులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తెరాస నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి, హుజూరాబాద్’ ఉప ఎన్నికలో విజయ కేతనం ఎగరేయడంతో, తెరాస, కేసీఆర్ వ్యతిరేక శక్తులు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నాయి. అయితే జాతీయ పార్టీలలో ఉద్యమ పార్టీల విలీనం విషయం వచ్చేసరికి ఎవరి దారి వారిదే అన్నట్లుగా వార్తలు అందుతున్నాయి. ప్రొఫెసర్ కోదండ రామ్ .. టీజేఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినా చేయక పోయినా కాంగ్రెస్, వామ పక్షాలతో కలిసి వెళ్ళే ఆలోచనలోనే ఉన్నారని సమాచారం. ఇటీవల టీఎన్జీఓ మాజీ నాయకుడు విఠల్, తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరిన నేపధ్యంలో కోదండరామ్ కూడా బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వినవచ్చినా, అలాంటి ఆలోచన లేదని ఆయనే స్వయంగా పేర్కొన్నారు. అలాగే చెరుకు సుధాకర్ కూడా తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ సారధ్యంలోని యువ తెలంగాణ పార్టీలు బీజేపీలో విలీనం చేసేందుకు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మరో వంక ఉద్యమ నాయకులతో మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సంకేతాలు ఇస్తున్నారు. ప్రాంతీయ పార్టీని ఇంకొక ప్రాంతీయ పార్టీ మాత్రమే దీటుగా ఎదుర్కోగలదని ఆయన అంటున్నారు. అలాగే, జాతీయ స్థాయిలో తెరాస అధినేత కేసీఆర్ కాంగ్రెస్’ తో పొత్తుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సో .. రాష్ర రాజకీయాల్లో ముందు ముందు అనేక మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి.