సజ్జల హ్యాండ్సప్... పీఆర్సీపై ఉద్యోగులకు షాకేనా?
posted on Dec 14, 2021 @ 4:19PM
పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగులకు షాక్ తప్పదని తెలుస్తోంది. ఫిట్ మెంట్ ను 14.29 శాతం సిఫారస్ చేస్తూ సీఎం జగన్ కు సోమవారం సీఎస్ కమిటి నివేదిక ఇచ్చింది. పీఆర్సీ కమిటి 27 శాతం ప్రతిపాదించగా సీఎస్ కమిటి 14.29 శాతమే సూచించడంపై ఉద్యోగ సంఘాలు ఫైరవుతున్నాయి. ఐఏఎస్ ల కమిటిైప భగ్గుమంటున్నాయి. తమకు 30 శాతానికి పైగా పీఆర్సీ ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగులకు నిరాశ తప్పదని చెబుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఇదే సంకేతం ఇచ్చారు.
సీపీఎస్ విషయంలో రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు చెబుతున్నాయని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీపీఎస్ నుంచి బయటకు వస్తే వారికి పెన్షన్ సెక్యూరిటీ ఎలా అని ఆలోచిస్తున్నామని చెప్పారు. ఫైనాన్స్‌కు సంబంధంలేని 71 డిమాండ్లను అధికారులు తేల్చేస్తారని సజ్జల తెలిపారు. సీపీఎస్ విషయంలో టెక్నికల్ ఇష్యూస్ తెలియకుండా హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందేనన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి సుప్రీంకోర్టు తీర్పు అవరోధం అయ్యిందన్నారు. దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సి ఉందని సజ్జల తెలిపారు.
రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలతో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరాతి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లడుతూ పీఆర్సీ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో అంతర్గత భేటీ నిర్వహిస్తున్నామన్నారు. అధికారుల కమిటీ రికమెండ్ చేసిన మొత్తాన్ని మించి ప్రభుత్వం భరించే స్థితిలో లేదన్నారు. తెలంగాణలో ఐఆర్ ఇవ్వడం లేదన్నారు. అక్కడ రికమెండెషన్స్ అమలు చేయకుండా వాయిదా వేస్తున్నారన్నారు. ఉద్యోగ సంఘాలకు ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తామన్నారు. ఉద్యోగులు సీఎంని కలిసే ముందే మార్గాన్ని సుగమం చేస్తామని సజ్జల తెలిపారు.
మరోవైపు పీఆర్సీ విషయంలో బుధవారం ఉదయం సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. పీఆర్సీ నివేదికపై ఉద్యోగులతో జగన్ చర్చించనున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సజ్జల చర్చల తర్వాత.. ఆ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ బుధవారం ఉదయం సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఏర్పాటు చేస్తామని సజ్జల తెలిపారన్నారు. అయితే ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత సజ్జల మాట్లాడిన విషయాలను బట్టి పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులకు షాక్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వచ్చాకే ఉద్యోగ సంఘాల కార్యాచరణ తెలిసే అవకాశం ఉంది