కేజ్రీవాల్ పార్టీలో అంతర్గత లోక్ పాల్
posted on Oct 20, 2012 @ 11:29AM
కేజ్రీవాల్.. యూపీఏ సర్కారుతోపాటు ప్రతిపక్ష నేతలకుకూడా పంటికింద రాయిలా నలుగుతూ ఇబ్బందిపెడుతున్న పేరిది. సమాచార హక్కు చట్టమనే బ్రహ్మాస్త్రాన్ని అడ్డంపెట్టుకుని కేజ్రీవాల్ సేకరిస్తున్న సమాచారం పొలిటీషియన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారుకదా.. అని ప్రతిపక్ష పార్టీలు సంబరపడేలోపే విపక్షంలో ఉన్న అవినీతి జలగల్ని రోడ్డుమీదికి లాగడం కేజ్రీవాల్ కి నిత్యకృత్యమైపోయింది. దీంతో అన్ని రాజకీయపార్టీలూ కలిసి కట్టుగా కేజ్రీవాల్ పై ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నాయ్. రివర్స్ గేర్ లో కేజ్రీవాల్ పార్టీలోని వ్యక్తులకు సబంధించిన వివరాలను సేకరించి వారిపై ఆరోపణలు గుప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్. ఇలాంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టేందుకు కేజ్రీవాల్ తెలివిగా ఓ ఉపాయాన్ని ఆలోచించారు. తన పార్టీలోని సభ్యులపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాల్ని నిగ్గుతేల్చేందుకు ముగ్గురు రిటైర్డ్ జడ్జ్ లతో ఓ ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేశారు. ఢిలీ హైకోర్ట్ ప్రథాన న్యాయమూర్తి జస్టిస్ ఎపి షా, బాంబే మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.హెచ్. మర్లపల్లె, ఢిల్లీ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిల్ జస్పాల్ సింగ్ ఈ బృందంలో సభ్యులు.