కిరణ్ పై షర్మిల వాగ్బాణాలు
posted on Oct 20, 2012 @ 11:15AM
“రాష్ట్రంలో ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకుని సతమతమౌతుంటే ముఖ్యమంత్రి మొద్దునిద్రపోతున్నారా లేక ఏమీ చేయలేక మొద్దనిద్రని నటిస్తున్నారా ?” అంటూ వై.ఎస్ తనయ షర్మిల ముఖ్యమంత్రిపై విమర్శలు కురిపించారు. మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా కడపజిల్లా వేంపల్లె దగ్గర్లోని రాజీవ్ నగర్ నుంచి వేముల మండలం భూమయ్యగారి పల్లె మలుపు వరకూ రెండోరోజు పాదయాత్ర చేశారు. రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని, వై.ఎస్ హయాంలో అమలుచేసిన పంటలబీమా పథకాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదని షర్మిల విమర్శించారు. మళ్లీ అధికారంలోకొస్తే రైతులకు న్యాయం చేస్తానంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆమె అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యల్ని గుర్తుచేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్రని టార్గెట్ చేస్తూ షర్మిల పాదయాత్రను మొదలుపెట్టారని వస్తున్న ఆరోపణల్ని ఆమె కొట్టిపారేశారు. తన యాత్ర పూర్తయ్యేలోపు జగన్ జైలునుంచి బైటికొస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, వై.ఎస్ హయాంలో జరిగిన మంచి పనుల్ని ఏకరువుపెడుతూ ప్రజాభిమానాన్ని చూరగొనే ప్రయత్నంచేస్తూ.. షర్మిల పాదయాత్రలో ముందుకు కదులుతున్నారు.