భారత్ అదుపులో టెర్రరిస్ట్ ఫసీ అహ్మద్

  మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఇండియన్ ముజాహిదీన్ సంస్థ సభ్యుడు ఫసీ అహ్మద్ పట్టుబడ్డాడు. భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో అహ్మద్ కీలక నిందితుడు. భారత ప్రభుత్వ అభ్యర్ధనపై సౌదీ సర్కారు ఫసీని ఢిల్లీ పోలీసులకు అప్పగించింది. 2010లో ఢిల్లీలో జరిగిన జామా మస్ జిద్ పేలుళ్లు, బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పేలుళ్ల కేసుల్లో ఫసీ ప్రథాన నిందితుడు. కరుడుగట్టిన ఉగ్రవాది ఫసీ.. సౌదీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. ఇండియన్ ముజాహిదీన్ ఛీప్ రియాత్ కి ఫసీ అత్యంత సన్నిహితుడు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్న అబూ జిందాల్ ని కూడా సౌదీ ప్రభుత్వం భారత్ కి అప్పగించింది.  

ఎపీపీఎస్సీలో అంతా గందరగోళం

  ఏపీలో చదువుకున్న కుర్రాళ్లకు గవర్నమెంట్ కొలువులు భారీగా ఇస్తామంటూ ప్రభుత్వం ఊదరగొట్టింది. లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయంటూ ప్రచారం జోరుగా సాగింది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లమీద నోటిఫికేషన్లు జారీ చేస్తూ యమా స్పీడ్ తో పరీక్షలు నిర్వహించింది. తర్వాత ఉన్నట్టుండి ఏపీపీఎస్సీ స్పీడ్ జీరోకి పడిపోయింది. కారణం.. పరీక్షల నిర్వహణలో దొర్లిన పొరపాట్లే.. బోర్డ్ తాను చేసిన తప్పుల తడకల్ని సరిదిద్దుకుని మళ్లీ లేచ్చి గట్టిగా నిలబడే ప్రయత్నంలో ఉన్నట్టు గట్టి సమాచారం. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై అభ్యర్ధులు ట్రిబ్యునల్ ని ఆశ్రయిస్తుండడంతో బోర్డ్ మెంబర్ల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. నిర్వహించిన పరీక్షలన్నింటికీ బోర్డ్ మెంబర్లు ట్రిబ్యునల్ ముందు చేతులుకట్టుకుని నిలబడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏపీపీఎస్సీ బోర్డ్ నిర్వహిస్తున్న ఇంటర్వూల్లో పూర్తి స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోందని విస్తృతస్థాయిలో ప్రచారం జరుగడంతో ప్రభుత్వం ఇంటర్వూలను పూర్తిగా రద్దుచేసింది. ఈ పరిణామం బోర్డ్ మెంబర్లకు పూర్తిగా తలవంపులు తెచ్చినట్టే.. చైర్ పర్సన్ రేచల్ చటర్జీ పదవీకాలం డిసెంబర్ తో పూర్తవుతుంది. కార్యదర్శి పూనం మాలకొండయ్ సెలవులో వెళ్లడంతో ప్రస్తుతం ఏపీపీఎస్సీ పరిస్థితి గాల్లో దీపంలో కనిపిస్తోందని అభ్యర్ధులు అంటున్నారు.

తెలంగాణకి మేం వ్యతిరేకం కాదు : చంద్రబాబు

  తెలంగాణ కి తాము వ్యతిరేకం కాదని టిడిపి అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. అఖిలపక్షం ఏర్పాటు చేస్తే అక్కడకూడా తాము ఈ విషయాన్నే చెబుతామన్నారు. తెలంగాణ ఇవ్వడం ఇవ్వకపోవడం అంతా కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది కాబట్టి, తాము తెలంగాణకి మద్దతు ప్రకటించడంతప్ప ఏమీ చేయలేమని బాబు అన్నారు. తెలంగాణ ఇవ్వగల సత్తా ఉండికూడా మౌనం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని వదిలేసి తమ పార్టీపై ఒత్తిడి పెంచడం ఏమేరకు సమంజసమో తెలంగాణ వాదులు ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తెలంగాణ విషయంలో నాటకాలాడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కై మరో పార్టీకూడా రాష్ట్రంలో తెలంగాణ పేరుతో పబ్బం గడుపుకుంటోందంటూ విమర్శించారు.  మహబూబ్ నగర్ జిల్లా రాజోలిలోకి అడుగుపెట్టి తెలంగాణలో పాదయాత్రని కొనసాగిస్తున్న చంద్రబాబు తను మళ్లీ అధికారంలోకి రాగానే మాదిగల రుణం తీర్చుకుంటానని ప్రకటించారు. పదివేల కోట్ల రూపాయలతో బీసీ లకు ఉపప్రణాళికను ఏర్పాటు చేస్తానని పాలమూరు పాదయాత్రలో చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరిని కనుక్కుంటామంటూ పాదయాత్రకి అడ్డుతగిలే ప్రయత్నం చేసిన తెలంగాణ పొలిటికల్ జెఎసి నేతల్ని పోలీసులు దారిలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు.  

కాంగ్రెస్ లో పదవుల పందారం

  కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్ట్ ల పందారం మొదలయ్యింది. అధికార భాషాసంఘం అధ్యక్షుడి కుర్చీలో మండలి బుద్ధప్రసాద్ ని కూర్చోపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయితే బాధ్యతలు చేపట్టేందుకు ఆయన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి  నేదురుమల్లి రాజ్యలక్ష్మి పేరు పరిశీలనలో ఉంది. ఐదేళ్లనుంచీ మరుగునపడిపోయిన నామినేటెడ్ పోస్ట్ ల భర్తీ వ్యవహారం ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో తెరమీదికొచ్చింది. ఈ రెండు పోస్టులూ భర్తీ అయితే నామినేటెడ్ పోస్ట్ ల భర్తీ ప్రక్రియ పూర్తి స్థాయిలో మొదలైనట్టే లెక్కని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయ్. కావాల్సిన పదవులను చేజిక్కించుకునేందుకు పార్టీలో లాబీయింగ్ మరింతగా ఊపందుకుంది. ఆఖరు క్షణంలో అనుకున్న వ్యక్తి పేరు మారిపోయి కొత్త వ్యక్తికి కుర్చీ దక్కినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నంతగా నామినేటెడ్ పోస్ట్ ల కోసం ఢిల్లీ స్థాయిలో భారీ లాబీయింగ్ జరుగుతోందని పార్టీలో సీనియర్లు అంటున్నారు. ఏకాభిప్రాయం ఉన్నచోట్ల గతంలోనే పోస్టుల్ని భర్తీ చేసినా, పోటీ గట్టిగా ఉన్నచోట్ల లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకోవడం ఎందుకన్న ధోరణిలో పోస్ట్ లు భర్తీని పార్టీ వాయిదా వేస్తూ వచ్చింది. వేడిలోవేడికింద ఆ పోస్టుల్నికూడా భర్తీ చేసేస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో నేతలు గట్టిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కేజ్రీవాల్ చిన్న చీమతో సమానం : సల్మాన్ ఖుర్షీద్

  కాంగ్రెస్ పార్టీ ఏనుగులాంటిదని, చీమలాంటి కేజ్రీవాల్ అనవసరంగా రెచ్చిపోతున్నారన్న విషయాన్ని తనంతటతానుగా తెలుసుకోవాలని కేంద్రమంత్రి సల్మాన్ ఘుర్షీద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖుర్షీద్ పై కేజ్రీవాల్ ఆరోపణలు చేశాక.. నాకు పెన్నుతోనే కాదు రక్తంతో కూడా రాయడంవచ్చు అంటూ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని కలిగించాయి. అవినీతిపై పోరు పేరుతో అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ నేతలతో చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయ్. ఉద్దేశపూర్వకంగా తమ కార్యకర్తలపై దాడి చేస్తున్నారంటూ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నేతలమీద విమర్శలు కురిపించారని బిజెపి జాతీయ అధ్యక్షుడు సంతోషించేలోగానే కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ఆయనపైకూడా ఆరోపణల్ని గుప్పించారు. కేజ్రీవాల్ దాదాపుగా పిచ్చిపట్టినట్టుగా మాట్లాడుతూ క్రేజ్ ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. రోజురోజుకీ కేజ్రీవాల్ ఆరోపణల పర్వం కారణంగా రాజకీయవర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన పెరిగిపోతోందని విశ్లేషకులు అంటున్నారు.

కేజ్రీవాల్ పై షీలా దీక్షిత్ పరువునష్టం దావా

  ఓ టీవీ షోలో దలాల్ అంటూ షీలాదీక్షిత్ ని సంబోధించినందుకు ఆమె కేజ్రీవాల్ పై పరువునష్టం దావా వేశారు. బ్రోకర్ అన్న పదాన్ని ఉపయోగించడం తప్పన్న విషయంకూడా తెలీని స్థితిలోకి కేజ్రీవాల్ జారిపోవడం శోచనీయమని ఆమె అన్నారు. వ్యక్తిగత ఛరిష్మాని పెంచుకునేందుకు, రాజకీయ లబ్ధి పొందేందుకు రాజకీయనేతలమీద ఆరోపణలు గుప్పించడం ఓ ఫ్యాషనైపోయిందని షీలా వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ సామాజిక కార్యకర్త స్థాయినుంచి స్వలాభంకోసం పాకులాడే స్థాయికి దిగజారిపోయారన్న విషయాన్ని జనం స్పష్టంగా గమనిస్తున్నారన్నారు. షీలా రాజకీయ సలహాదారు పవన్ ఖేరా.. కేజ్రీవాల్ కి పరువునష్టం దావా నోటీసులు పంపించారు.

అరెస్టు చేయడం దుర్మార్గం: కోదండరాం

  చంద్రబాబు పాదయాత్రకు నిరసన తెలియజేసేందుకు వెళ్ళిన తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు పొ. కోదండరాం, స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులను జిల్లాలోని శాంతినగర్ వద్ద సోమవారం పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జెఏసి నేతల అరెస్టును పలువురు తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా కోదండరామ్ నిప్పులు చెరిగారు. తమను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని తాము భావిస్తే అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణపై టిడిపి వైఖరి చెప్పమని ప్రశ్నిస్తే తప్పేమిటన్నారు. తాము బాబు యాత్రను అడ్డుకుంటామని చెప్పలేదని, నిరసన మాత్రమే తెలియజేస్తామని చెప్పామన్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ జేఏసీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు.

తెలంగాణలో చంద్రబాబు

  వస్తున్నా…మీకోసం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం మధ్యాహ్నం సుంకేశుల డ్యామ్ దాటి తెలంగాణలో అడుగుపెట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజోళిలో ఆయన ప్రవేశించారు. అక్కడ అయనకు టీడీపీ నేతలు పోతుల సురేష్ పరిటాల రవి అనుచరుడు, ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు స్వాగతం పలికారు. జిల్లాలో మొత్తం 12 రోజుల పాటు 200 కిలోమీటర్లు జరగనుంది. అలంపూర్, గద్వాల్, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, కొడంగల్ లలో యాత్ర జరుగుతుంది. బాబు యాత్రను అడ్డుకుంటారని తెలంగాణవాదులను, విద్యార్థులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అక్కడక్కడా నిరసనల మధ్యే బాబు యాత్ర జరుగుతుంది. పాదయాత్రలో మాదిగ విద్యార్థి ఫెడరేషన్, ఎమ్మార్పీఎస్ బాబుకు మద్దతుగా నడుస్తోంది.

కోదండరామ్ అరెస్ట్

  మహబూబ్ నగర్ జిల్లాలోకి అడుగుపెట్టిన చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్రని అడ్డుకునేందుకు వెళ్లిన తెలంగాణ జెఎసి నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పొలిటికల్ జెఎసి చైర్మన్ కోదండరామ్ తోపాటు  స్వామిగౌడ్, శ్రీనివాస్ లను శాంతి నగర్ లో అరెస్ట్ చేశారు. తెలంగాణపై బాబు వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తామని, యాత్రని అడ్డుకోబోమని చెప్పి అక్కడికెళ్లిన జెఎసి నేతల్ని, తెలంగాణ వాదుల్ని టిడిపి కార్యకర్తలు నిలువరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జెఎసి నేతల్ని అరెస్ట్ చేశారు. రాజోలికి వెళ్లేందుకు ప్రయత్నించిన జెఎసి నేతల్ని పోలీసులు శాంతి నగర్ లోనే నిలువరించారు

తెలుగువన్ డాట్ కామ్ జైత్రయాత్ర

దక్షిణ భారత దేశంలోకెల్లా అతిపెద్దదైన యూట్యూబ్ ఛానెల్ గా రికార్డ్ సృష్టించిన తెలుగువన్ డాట్ కామ్ వెబ్ ఛానెల్ మరో అరుదైన ఘనతని సొంతంచేసుకుంది. యూట్యూబ్ లో ప్రసారమౌతున్న టాప్ టెన్ ఛానెల్స్ లో రెండో స్థానంలో నిలిచి తెలుగుతేజాల ఘనతని ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది. కంఠమనేని రవిశంకర్ సారధ్యంలో శరవేగంతో దూసుకుపోతున్న తెలుగువన్ డాట్ కామ్ వెబ్ ఛానెల్ మిలియన్ యూజర్ సబ్ స్క్రైబర్స్ క్లబ్ దిశగా పరుగులు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగాఉన్న తెలుగువాళ్లంతా తెలుగు వన్ ప్రసారాలపై రోజురోజుకీ మక్కువ పెంచుకుంటున్నారనడానికి ఆదరణే నిదర్శనమంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. యూట్యూబ్ లో టాప్ టెన్ ఛానెల్స్ ఎందుకు ఎలా సక్సెస్ అవుతున్నాయో వివరిస్తూ అక్టోబర్ 20 ఓ విశ్లేషణాత్మక కథనాన్ని అందించింది. 

పవన్ రాంబాబు రగడ, పూరి పై ఫిర్యాదు

  పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా పై తెరాస నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత దానయ్య తెలంగాణ ఉద్యమాన్ని కించపరచేలా సినిమా తీశారని కంప్లైంట్ చేశారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రేచ్చగోట్టేలా నిర్మాత దర్శకుడు కుట్ర చేశారని ఆరోపించారు. అభ్యంతకర సన్నివేశాలను తొలగించకుండానే సినిమాను ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని కించపర్చేలా ఉన్న సన్నివేశాలు తొలగించడంతో సరిపోదని, సినిమానే బ్యాన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేలా సినిమా తీశారని చెప్పారు. రాంబాబు చిత్రంపై వివాదం రావడంతో తాను తీవ్ర౦గా నష్టపోయానని నైజం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రాజు గారు అన్నారు. ఎవరి మనోభావాలు దేబ్బతీనకుండా ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సినిమాపై తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేయడంతో వారికి అభ్యంతరంగా ఉన్న సన్నివేశాలను తొలగించామని చెప్పారు. ఈ సినిమా వివాదం అనుకోకుండా జరిగిన సంఘటన అన్నారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి ఈ రోజు నుండి థియేటర్‌లకు పంపిస్తున్నట్లు చెప్పారు.

యశోచోప్రా కన్నుమూత

  రొమాన్స్ చిత్రాల రారాజు యశ్ చోప్రా కన్నుమూశారు. హిందీ సినిమాల్లో ప్రేమభావాల్ని పండిచడంలో మాస్టల్ అని ఈయనకు పేరుంది. జబ్ తక్ హై జాన్.. యశ్ చివరి చిత్రం.. ఎనభై ఏళ్ల చోప్రా, డెంగీ జ్వరం కారణంగా మరణించారు. ఈ నెల 13న లీలావతి ఆసుపత్రిలో చేరిన ఆయన చివరికంటా మృత్యువుతో పోరాడారు. సోమవారం ఉదయం 9 గంటలనుంచి 12 గంటలవరకూ అంధేరీలో ఉన్న యశ్ రాజ్ ఫిల్మ్ స్టూడియోలో యశ్ చోప్రా మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం ఉంచాలని నిర్ణయించారు. ఇద్దరు కుమారుల్లో ఆదిత్య చోప్రా సినీ దర్శకుడు, ఉదయ్ చోప్రా నటుడు, నిర్మాత. యశో చోప్రాని దాదా సాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. సిల్ సిలా, త్రిశూల్, చాందిని, దిల్ తో పాగల్ హై, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, మొహబ్బతే, వీర్ జారా లాంటి చిత్రాల్లో యశ్ చోప్రా రొమాన్స్ ని పండించిన తీరుని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని బాలీవుడ్ సినీ ప్రముఖులు అంటున్నారు. 1932 సెప్టేబర్ 27న లాహోర్ లో ఓ పంజాబీ కుటుంబంలో జన్మించారు యశ్ చోప్రా. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం భారత్ కి వచ్చేసింది. పెద్దన్నయ్య బీఆర్ చోప్రా దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన యశ్.. 1959లో ధూల్ కా పూల్ సినిమాతో దర్శకుడిగా మారారు.

పండక్కి గ్యాస్ కొరత

  రాష్ట్రంలో గ్యాస్ కొరత చాలా కుటుంబాల్ని వేధిస్తోంది. పండగ రోజునకూడా దాదాపుగా 15 లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకుండా పోతున్నాయ్. కట్టెల పొయ్యి వెలిగించుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ పిండివంటలు చేసుకోవడంతప్ప వీళ్లందరికీ మరో మార్గం లేదు. రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు విపరీంతగా పెరిగిపోతున్నాయ్. ప్రస్తుతం దాదాపు కోటిన్నరకు పైగా కనెక్షన్లున్నాయ్. వీళ్లందరికీ గ్యాస్ సరఫరా చేయాలంటే కనీసం 90 లక్షల సిలిండర్లు అవసరం పడతాయ్.. కానీ.. ప్రస్తుతం సరఫరాలోఉన్న సిలిండర్లు కేవలం 55 లక్షలు మాత్రమే.. ఎనిమిదేళ్ల క్రితం ఏ పరిస్థితి ఉందో ఇప్పటికీ అదే పరిస్థితి గ్యాస్ సరఫరా విషయంలో రాష్ట్రంలో కొనసాగుతోంది. పెరిగిన కనెక్షన్లకు అనుగుణంగా సిలిండర్లనుకూడా పెంచాల్సిన చమురు సంస్థలు వినియోగదారుల కష్టాలుచూస్తూ ఆటలాడుకుంటున్నాయ్. ఏమన్నా అంటే కొరత అనే తిరుగలేని అస్త్రం ఉండనే ఉంది కదా మరి.. ఇప్పటికే నానారకాలుగా తిప్పలు పెట్టి, రకరకాలుగా ఇబ్బందులు పెట్టి సబ్సిడీ మా కొద్దూ బాబూ కేవలం గ్యాస్ సిలిండర్లు ఇస్తే చాలు అనిపించే దిశగా చమురుసంస్థలు చేస్తున్న ప్రయాత్నాలు కాస్తోకూస్తో వినియోగదారులమీద పనిచేస్తున్నట్టే కనిపిస్తున్నాయ్.

చంద్రబాబు తెలంగాణ యాత్ర

  తెలుగుదేశం పార్టీ అధినేత చేపట్టిన వస్తున్నా మీకోసం యాత్ర సోమవారం మధ్యాహ్నానికి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా రాజోలి దగ్గర చంద్రబాబు తెలంగాణలోకి అడుగుపెడుతున్నారు. బాబుని అడ్డుకుని తీరతామంటూ బీరాలు పలికిన తెలంగాణ వాదులంతా ఇప్పుడు పూర్తిగా చప్పబడిపోయినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు యాత్రని అడ్డుకోబోమని, కేవలం నిరసన తెలిపి ఊరుకుంటామని పొలిటికల్ జెఎసి చైర్మన్ కోదండరామ్ తేల్చిపారేశారు. అటు టిఆర్ ఎస్ కూడా చంద్రబాబు తెలంగాణ యాత్ర విషయంలో స్తబ్దుగానే ఉంది. భవిష్యత్తులో ఎలాంటి అవసరాలు వస్తాయో ఎలా నెట్టుకురావాల్సొస్తుందో తెలీదు కనుక చంద్రబాబుతో వైరం పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఏమీ లేదన్న విషయం ఆ పార్టీకికూడా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. హరీష్ రావ్ లాంటి పెద్ద తలకాయలుకూడా ఈ విషయాన్ని బాహాటంగానే అంగీకరిస్తున్నారుకూడా . పైగా ఇక్కడింకో చిక్కుంది. టిఆర్ ఎస్ విరగబడి నిరసన తెలిపినంతమాత్రాన టిడిపికి వచ్చే నష్టం ఏం లేదు. పైగా ఆ ప్రార్టీకి, పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకి అనవసరంగా విస్తృతమైన ప్రచారం కల్పించినట్టువుతుందేమోనన్న మీమాంసకూడా జనంలో గట్టిగానే ఉంది. మరోవైపు చంద్రబాబుకి ఘన స్వాగతం చెప్పేందుకు రాజోలిదగ్గర 30మంది ఎమ్మెల్యేలు, టిడిపి నేతలు కాచుక్కూర్చున్నారు. కొందరు కరుడుగట్టిన తెలంగాణ వాదులు మాత్రం ఆరునూరైనా చంద్రబాబుకి తడాఖా చూపించి తీరాలని గట్టిగానే నిర్ణయించుకున్నారు. అందుకే ఈ తెల్లవారు జామున కరీంనగర్ లోని టిడిపి కార్యాలయాన్ని అగ్గిపాలుజేసి బాబు తెలంగాణ యాత్రపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.

అంత నోటి దూల అవసరమా?

  చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్రకి పోటీగా జగన్ పక్షాన సోదరి షర్మిలకూడా పాదయాత్రని మొదలుపెట్టారు. చంద్రబాబుకి జనంలో కనిపిస్తున్న విపరీతమైన స్పందనని చూసి ఖంగుతిన్న వైకాపా వర్గాలు తమ పార్టీకి జనంలో ఫాలోయింగ్ ఎక్కడ తగ్గుతుందేమో అన్న భయంతో వెంటనే షర్మిలని రంగంలోకి దింపారు. వై.ఎస్ మీద ఉన్న అభిమానంతో జనం షర్మిలకుకూడా పోయినచోటల్లా బ్రహ్మరథం పడుతున్నారు.. ఎవరి సత్తా ఏంటో చూపించుకునే అవకాశం అటు చంద్రబాబుకి, ఇటు జగన్ వర్గానికీ పాదయాత్రలవల్ల కలుగుతోంది. ఇంతవరకూ బానే ఉంది కానీ.. ద్వితీయ శ్రేణిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు షర్మిలమీద వ్యక్తిగత దూషణలకు దిగడం జనానికి ఏమాత్రం నచ్చడంలేదు. షర్మిల ఓ కాపురాన్ని కూల్చారంటూ తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయ్. అనిల్ తో పెళ్లి షర్మిల వ్యక్తిగత వ్యవహారం.. రాజకీయంగా దెబ్బకొట్టడానికి వ్యక్తిగత వ్యవహారాలు, అంశాల్ని ఎంపికచేసుకుని దాడిచేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో మొదట్నుంచీ లేదు. ఇప్పుడుకూడా శోభా హైమావతి మాట్లాడేతీరు, దుందుడుకు వైఖరి.. ఏదో చేసేసి అధినాయకుడైన చంద్రబాబు దగ్గర మంచి మార్కులు కొట్టేయాలన్న పద్ధతిలో ఉంది తప్ప, చంద్రబాబు ఇలాంటి చిల్లర రాజకీయాన్ని ప్రోత్సహిస్తారనుకోవడానికి వీల్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైకాపా వర్గాలుకూడా శోభా హైమావతి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నాయ్. అసలు ఆమె ఎస్టీనే కాదని నిరూపించేందుకు కావాల్సిన రుజువులు సాక్ష్యాల్ని పక్కాగా సేకరించి, కడిగిపారేసే ప్రయత్నాల్ని వైఎస్సార్ సీపీ నేతలు ముమ్మరం చేసినట్టు సమాచారం.

ఢిల్లీకి పోనూ పొయ్యారు రానూ వచ్చారు!

  “ ఏదో ఒకటి చేయాలి.. ఏం చేయాలో అర్థం కావడంలేదు.. అటు జనంలో నమ్మకంపోతోంది... ఇటు అధిష్ఠానం మాట వినట్లేదు.. తెలంగాణ ఎంపీలు ఏం చేసినా చేయకపోయినా కాస్త గట్టిగా నోరన్నా చేసుకుంటున్నారు.. మాకు ఆ అవకాశంకూడా లేదు.. పరిస్థితి ముందునుయ్యీ వెనక గొయ్యిలా ఉంది..“ ఇది.. తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల అంతర్మథనం. తెలంగాణ వాదులనుంచి పెద్ద ఎత్తున పెల్లుబికుతున్న వ్యతిరేకతను తట్టుకోవాలంటే ఏదో ఒకటి చేసితీరాలని తెలంగాణ మంత్రులు గట్టిగా నిర్ణయించుకున్నారు. జానా రెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం హస్తినలో చక్రం తిప్పే ప్రయత్నం చేసింది కానీ.. అధిష్ఠానం పెద్దలనుంచి రెస్పాన్స్ పూర్తిగా కరువైంది. ఓ దశలో అప్పాయింట్ మెంట్ దొరకడంకూడా కష్టమయ్యింది. ఏదో ఒకటి దొరికిందిలే అనుకుని చేతులు కట్టుకుని గడగడా ఎక్కాలు అప్పజెప్పినట్టు చెప్పదలుచుకున్న విషయాన్ని కక్కేసి బైటపడ్డ తెలంగాణ మంత్రులు.. తాము ఢిల్లీకి చేరిన కార్యక్రమం పూర్తయ్యిందనిపించారు. తీరా.. మేడమ్ నుంచొచ్చిన స్పందన ఏంటంటే.. పాడిందే పాడరా పాచిపళ్ల దాసుడా అన్నట్టు మళ్లీ మళ్లీ చెప్పిందే చెప్పి రకరకాలుగా చెప్పి ఎందుకయ్యా విసిగిస్తారు.. అన్న ధోరణిలో ఓ ఎక్స్ ప్రెషన్.. చివరికి తెలంగాణ మంత్రుల పరిస్థితి సింగడు అద్దంకిపోనూ పొయ్యాడు రానూ వచ్చాడు.. అన్నట్టుగా ఉందన్న విషయాన్ని మొత్తం తెలంగాణ ప్రజలంతా గ్రహించారన్న విషయంకూడా వాళ్లకు తెలుస్తూనే ఉంది.. కానీ.. ఏం చేయలేని పరిస్థితి... కాలం అలా ఉంది.. ఏం చేస్తారు మరి..

డెన్మార్క్ ఫైనల్లో చెలరేగిన సైనా

  డెన్మార్క్ ఓపెన్ ఫైనల్లో సైనా నెహ్వాల్ చెలరేగిపోయింది. ఈ ఏడాదిలో నాలుగో టైటిల్ సొంతంచేసుకుంది. మూడోసీడ్ సైనా 21-17, 21- 8తో డెన్మార్క్‌కు చెందిన ఆరోసీడ్ జూలియన్ షెంక్‌ను వరుస గేముల్లో చిత్తుచేసి విజేతగా నిలిచింది. ఈ విజయంతో రూ.16.15 లక్షల ప్రైజ్‌మనీని సైనా దక్కించుకుంది. 35 నిమిషాల్లోనే ముగిసిన ఈ ఏకపక్ష పోరులో తన ట్రేడ్‌మార్క్ క్రాస్ కోర్టు షాట్లు, స్మాష్‌లు, క్లియర్ విన్నర్లతో షెంక్‌ను షేక్ చేసింది. తొలిగేమ్‌లో కొద్దిగా ప్రతిఘటించిన షెంక్ రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. పదే పదే తప్పులు చేయడంతో సైనా ముందంజ వేసింది. షెంక్‌కు తేరుకునే అవకాశమివ్వకుండా విజయం దిశగా దూసుకెళ్లింది.

చిరంజీవికి కాంగ్రెస్ లో ప్రాధాన్యత లేదు: రామచంద్రయ్య

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య అన్నారు. సంప్రదాయ ఓటు బ్యాంక్‌ను కాంగ్రెస్ కోల్పోతుందని. పోయిన ఓటు బ్యాంక్‌ను తిరిగి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మంత్రి చెప్పారు. కాంగ్రెస్‌ను బలపరిచేందుకే ప్రజారాజ్యం పార్టీని (పీఆర్పీ) విలీనం చేయడం జరిగిందని, చిరు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంలేదని, తమను కలుపుకుని పోవాలని, తమ నాయకుడు చిరంజీవి బలపడితే కాంగ్రెస్ బలపడుతుందని మంత్రి సూచించారు. పార్టీలో చిరంజీవిని బలహీనపరిచే ప్రయత్నాలు జరిగితే కాంగ్రెస్సే నష్టపోతుందని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. చిరంజీవికి రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉందన్నారు.