కేజ్రీవాల్ తను హిట్లర్ ననుకుంటున్నారు : దిగ్విజయ్ సింగ్
posted on Oct 20, 2012 @ 11:33AM
కేజ్రీవాల్ హిట్లల్ లా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేజ్రీవాల్ కి సామాజిక పోరాటం చేస్తున్న కార్యకర్తగా పేరుండేదని, ఇప్పుడు పూర్తిగా స్వలాభంకోసం పాకులాడుతున్న వ్యక్తిగా ముద్రపడిపోయిందని తీవ్రంగా విమర్శించారు. “పౌర సమాజ ఉద్యమంలో మీ మాజీ సహచరుడు ఐఎఎస్ వై.పి.సింగ్ మిమ్మల్ని హిట్లర్ గా పేర్కొన్నాడు. ఆ పోలిక సబబే అనిపిస్తోంది.” అంటూ దిగ్విజయ్ కేజ్రీవాల్ కి ఓ లేఖ కూడా రాశారు. అరుణ్ రాయ్ తో , కిరణ్ బేడీతో, అన్నా హజారేతో తెగతెంపులు చేసుకున్నప్పుడే కేజ్రీవాల్ మీద స్వార్ధపరుడనే మచ్చపడిపోయిందని, జనం అంతా గమనిస్తూనే ఉన్నారని దిగ్విజయ్ ఆ లేఖలో వ్యాఖ్యలు చేశారు. జాతీయ సలహామండలిలో సభ్యుడి పదవికి తన పేరు సిఫారసు చేయమని కేజ్రీవాల్ తనని కోరారని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. జన్ లోక్ పాల్ విషయంలో అన్నా హజారేనికూడా తనదారిలోకి తెచ్చుకునేందుకు కేజ్రీవాల్ విశ్వప్రయత్నం చేశారని కామెంట్ చేశారు దిగ్విజయ్..