కిరణ్ చాతగానితనంవల్లే రాష్ట్రంలో కరువు : మంత్రి డి.ఎల్
posted on Oct 20, 2012 @ 11:07AM
కిరణ్ పై మంత్రి డిఎల్ ఆరోపణల వర్షాన్ని కురిపిస్తున్నారు. కరువుని ఎదుర్కునే విధానాలు ప్రణాళికల్ని తనతోపాటు మరో ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రికి ఏకరువు పెట్టీపెట్టీ అలసిపోయామని డి.ఎల్ ఆరిపిస్తున్నారు. ఆరునెలలుగా తాము పడ్డ శ్రమ పూర్తిగా వృథా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పాతికేళ్ల రాజకీయ అనుభవం ఉందని, ఏ ఏ రంగాల్ని ఎలా చూసుకోవాలో తెలుసని, కేవలం లక్ష్యంలేని కారణంగానే ముఖ్యమంత్రి కిరణ్ తన మాటల్ని పెడచెవినపెడుతున్నారని డి.ఎల్ మండిపడుతున్నారు. “ నేనెన్నడూ చూడని దుర్భిక్షం రాష్ట్రాన్ని కాటేసింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయ్.. మంచినీళ్లు దొరకడంలేదు. సాగునీరందడంలేదు. వ్యవసాయానికి అన్యాయం జరుగుతోంది. విద్యుత్తు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. జిల్లాకి చెందిన ముగ్గురం మంత్రుల కీలకమైన రంగాలకు ప్రాథాన్యం ఇవ్వాలని కోరుతున్నాం. చాలాసార్లు ఈ విషయాల్ని సీఎంతో చెప్పాం. ఎంతగా వేడుకున్నా మా మాట పట్టించుకున్న పాపాన పోవడంలేదు. “ అంటూ సొంతపార్టీ సర్కారుమీద, ముఖ్యమంత్రి మీద మంత్రి డి.ఎల్ రవీంద్రారెడ్డి విరుచుకుపడ్డారు.