విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ రాజీనామా

  విదేశాంగశాఖ మంత్రి ఎస్.ఎమ్. కృష్ణ తమ పదవికి శుక్రవారం సాయంత్రం రాజీనామా చేసినట్లు తెలియవచ్చింది. కేంద్ర మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణకు రెండు రోజులు ముందే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఎస్ఎం కృష్ణ స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వడంతో పాటు, అతనికి కర్నాటక కాంగ్రెసు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి. అందుకే అతను లావోస్‌లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నప్పటికీ దానిని రద్దు చేసుకొని రాజీనామాను సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ భేటీ కానుంది. ఈ సమయంలో మరికొందరు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

శాన్వి ఆచూకి తెలిపితే 50 వేల డాలర్లు

  కింగ్ ఆఫ్ పర్షియాలో గత సోమవారం దుండగుల చేతిలో హత్యకు గురైన ప్రకాశం జిల్లా కుడుముల కుంట్ల వాసి సత్యవతమ్మ (61)కు తానా, టీఏజీడీవీ నివాళి అర్పించాయి. ఆ రోజు జరిగిన దుర్ఘటనలో సత్యవతమ్మ ప్రాణాలు వదలగా ఆమె మనవరాలు శివప్రసాద్ రెడ్డి, లతల పదినెలల కుమార్తె శాన్వి వెన్నను దుండగులు అపహరించారు. సత్యవతమ్మ ఆరు నెలల క్రితమే కింగ్ ఆఫ్ పర్షియాలోని కొడుకు శివప్రసాద్ ఇంటికి వచ్చింది. మానవీయ దృక్పథంతో తన కూతురిని అప్పగించాలని శివప్రసాద్ రెడ్డి కోరుతున్నారు. ఎఫ్ బీఐ, స్థానిక పోలీసులు సాన్వి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన తెలుగువారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో వెన్న కుటుంబానికి భరోసానిచ్చేందుకు తానా.. కింగ్ ఆఫ్ పర్షియాలోని అప్పర్ మెరియన్ టౌన్ షిప్ బిల్డింగ్ లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ఈ కేసుకు సంబంధించిన సమాచారం అందించిన వారికి 50 వేల వేల డాలర్లు బహుమతి ఇస్తామని ప్రకటించారు. 

అఫ్గాన్‌ ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతి

  బక్రీద్‌కు ముందు ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబుల్‌లో ఉగ్రవాదులు ఆత్మహుతి దాడి చేశారు. మజీద్‌లో ఈ దాడి జరగడంతో దాదాపు 30 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అఫ్గానిస్తాన్‌లోని ఫార్యాబ్ ప్రొవిన్స్‌లో గల మయ్మానా నగరంలో ఈ దాడి జరిగింది. సెలవుల సందర్భంగా భక్తులు ప్రార్థనలు చేయడానికి పెద్ద యెత్తున గుమికూడారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారని ప్రొవిన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి అహ్మద్ జావేద్ బైదర్ చెప్పారు. ఉగ్రవాది పోలీసు యూనిఫాంలో వచ్చి తనను పేల్చేసుకున్నాడని చెబుతున్నారు. ఈ దాడి వెనక తాలిబాన్ హస్తం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. భక్తులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఫర్యాబ్ పోలీసు చీఫ్ ఉగ్రవాదుల లక్ష్యమని తెలుస్తోంది. అయితే, ఆయన పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. పోలీసు చీఫ్ వాహనంలో ఎక్కుతుండా ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. భద్రతా బలగాలను లక్ష్యంగా కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది.

తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదు: చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తమ వైఖరిని ఎప్పుడో తెలియజేశామని, తాను ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం ఇంతవరకు ఎందుకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ పార్టీ కుట్రపన్నుతోందని, అందులో భాగంగానే టీఆర్ఎస్, వైఎస్సార్ పార్టీలను కలుపుకునేందుకు యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రజత్ గుప్తాకు రెండేళ్ల జైలుశిక్ష

  గోల్డ్ మాన్ శాచ్ సహా పలు అంతర్జాతీయ సంస్థల్లో కీలక పదవులు నిర్వహించిన భారత సంతతికి చెందిన వాల్ స్ట్రీట్ దిగ్గజం రజత్ గుప్తాకి అమెరికా ఫెడరల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 5 మిలియన్ అమెరికా డాలర్ల జరిమానాను విధించింది. ఈ తీర్పుతో రజత్ గుప్తా పూర్తిగా చతికిలపడిపోయారు. జీవితకాలంపాటు నిర్మించుకుంటూ వచ్చిన సామ్రాజ్యం కుప్పకూలిందని, తన ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిందని రజత్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. మాన్‌హట్టన్‌లోని ఫెడరల్ కోర్టు రజత్ గుప్తాను దోషిగా తేల్చింది. ఈ కేసులో ఇప్పటికే హెడ్జే ఫండ్ వ్యవస్థాపకుడు రాజ్ రాజరత్నం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మాజీ మెక్‌కెన్సీ అధిపతిపై భరారా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఆరోపణలు చేసిన ఏడాది తర్వాత రజత్ గుప్తాకు జైలు శిక్ష పడింది. తనపై ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన తర్వాత రజత్ గుప్తా ఎఫ్‌బిఐ ముందు లొంగిపోయారు. గుప్తా గోల్డ్‌మాన్ సాచ్స్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ బోర్డు సీట్లను సాధించే స్థాయికి ఎదిగారు.

అంబానీ అపర కుబేరుడు

  ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన భారతీయుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ వరుసగా ఐదోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. పోర్బ్స్ పత్రిక రూపొందించిన సంపన్నులైన భారతీయుల జాబితాలో ముకేష్ అంబానీని మళ్ళీ మొదటి స్థానం వరించింది. ఏడాది కాలంలో 160 కోట్ల డాలర్లు సంపద కరిగిపోయినప్పటికి ముఖేష్ చేతినుంచి తొలిస్థానం మాత్రం చేజారలేదు. ఈ జాబితాలో రెండో స్థానంలో లక్ష్మి మిట్టల్, మూడోస్థానంలో అజీజ్ ప్రేమ్ జీ, నాల్గో స్థానంలో టాటా గ్రూప్ కి చెందిన పల్లో౦జీ మిస్త్రే, ఐదో స్థానంలో దిలీప్ శంఘ్వీ ఉన్నారు. 900 కోట్ల డాలర్లుతో ఆది గాద్రెజ్ అండ్ ఫ్యామిలి ఆరోస్థానం, 820 కోట్ల డాలర్లుతో సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలి ఏడో స్థానం, 810 కోట్ల డాలర్లుతో శశి అండ్ రవి రుజ ఎనిమిదో స్థానం, 800 కోట్ల డాలర్లుతో హిందూజా బ్రదర్స్ తొమ్మిదో స్థానం, కుమార్ బిర్లా 780 కోట్ల డాలర్లుతో పదో స్థానాన్ని దక్కించుకున్నారు. కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ అధినేత విజయమాల్యా ఈ జాబితాలో సోదిలో లేకుండా పోయారు.. కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ నష్టాలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపడంవల్ల మాల్యా ఫోర్బ్స్ జాబితాలో 49వ స్థానం నుంచి 73వ స్థానానికి జారిపోయారు.

కాశ్మీర్ లో విజయవాడ విద్యార్థి మృతి

విజయవాడ నుంచి జమ్మూకాశ్మీర్‌కు విహారయాత్రకు వెళ్లిన ఓ విద్యార్థి కాశ్మీర్‌లోని కుప్వారా వద్ద గుర్రంపై స్వారీ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. విజయవాడ పీబీ సిద్ధార్థ పబ్లిక్ స్కూలులోని విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఈనెల 17న విహారయాత్రకు జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్ ప్రాంతానికి తీసుకొని వెళ్ళింది. శ్రీనగర్ నుంచి కుప్వారా ప్రాంతానికి విద్యార్ధులు గుర్రాలపై స్వారీ చేసేందుకు వెళ్ళారు. హేమంత్ ఎక్కి స్వారీ చేస్తున్న గుర్రం అదుపు తప్పి ప్రమాదవశాత్తు మంచుగడ్డలపై జారిపడి ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. హేమంత్ బంధువులకు పాఠశాల యాజమాన్యం ఈ సమాచారాన్ని అందజేసింది. శ్రీనగర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్నినగరానికి తీసుకురానున్నట్టు చెప్పారు.

జీ టీవీ పై జిందాల్ స్టింగ్ ఆపరేషన్

  కోల్ గేట్ స్కామ్ వివరాల్ని బైటపెట్టకుండా ఉండేందుకు జిందాల్ కంపెనీని జీటీవీ వంద కోట్లు డిమాండ్ చేసిందట. జిందాల్ ఈ విషయాన్ని స్వయంగా బైటపెట్టారు. జీ టీవీ బ్లాక్ మెయిల్ ప్రహసనాన్ని రికార్డ్ చేసిన టేపుల్ని విడుదల చేసిన జిందాల్ ప్రముఖ చానెల్ మీదు దుమ్మెత్తి పోస్తున్నారు. మరో వైపు జీటీవీ మాత్రం తాము డబ్బడగలేదని, తెలిసిన వివరాల్ని బైటపెట్టకుండా ఉండేందుకు వంద కోట్ల రూపాయలు లంచంమిస్తామంటూ జిందాల్ ప్రతినిధులు తమని సంప్రదించారని చెప్పుకుంటోంది. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అన్నది నిలకడమీద తేలాల్సిందే. కానీ.. జిందాల్ చెబుతున్నది గనక నిజమైతే.. మీడియాపైనే స్టింగ్ ఆపరేషన్ చేసిన ఘనతని ఆ కంపెనీ దక్కించుకున్నట్టే..  జిందాల్ ప్రతినిధులకూ, జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరి, బిజినెస్ ఎడిటర్ సమీర్ అహ్లూవాలియాలకూ మధ్య జరిగిన సంభాషణల్ని రికార్డ్ చేసిన జిందాల్ కంపెనీ ప్రతినిధులు.. వాటిని మీడియాకి విడుదల చేశారు.

ఇంటర్ విద్యార్ధినిని రేప్ చేసిన డాక్టర్

  ఢిల్లీ పహర్ గంజ్ లో ఈ దారుణం జరిగింది. విదేశాల్లో వైద్య విద్యకి సంబంధించిన సీటిప్పిస్తానంటూ అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఓ డాక్టర్ బాధితురాలికి మాయమాటలు చెప్పాడు. నిజమేనని నమ్మింది.  కాన్సొలేట్ అధికారిని కలవడానికి వెళ్దామని చెప్పి ఓ హోటల్ కి తీసుకెళ్లాడు. అదేమని అడిగితే కాన్సులేట్ అధికారులు బైట కలవరు, పెద్దపెద్ద హూటళ్లలోనే వాళ్లతో మాట్లాడాలి అని చెప్పాడు. తను నిజమేనని నమ్మేసింది. కాన్సులేట్ అధికారిని కలిసొస్తానని ఇంట్లో చెప్పి డాక్టర్ తో వెళ్లింది. పథకం ప్రకారం బాధితురాలిని వంచించిన డాక్టర్.. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఆమె స్పృహకోల్పోగానే అత్యాచారం జరిపాడు. మెలకువ వచ్చిన తర్వాత.. ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ బెదిరించాడు. బెదిరిపోయి ఇంటికెళ్లిన పిల్ల వాలకాన్ని చూసి తల్లికి అనుమానమొచ్చింది. అక్కున జేర్చుకుని అడిగితే బిడ్డ భోరుమంది. తమకు జరిగిన అన్యాయం గురించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

పాలగుమ్మి విశ్వనాధం కన్నుమూత

  లలిత సంగీత మధురిమల్ని ఆలిండియా రేడియో ద్వారా అశేష సంగీత అభిమానులకు అందించిన సంగీతవేత్త పాలగుమ్మి విశ్వనాధం కన్నుమూశారు. హైదరాబాద్  దోమల్ గూడలోని తన కూతురు శ్వేత నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. పాలగుమ్మి వయసు 93 సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా వయసుపరంగా వచ్చిన అస్వస్థతతో బాధపడుతున్నారు. ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజుకి స్వయానా సోదరుడు. 15 వేల పాటలకు పైగా లలిత సంగీతాన్ని అందించిన ప్రజ్ఞాశాలి పాలగుమ్మి విశ్వనాథం. 1919లో తూ.గో జిల్లా తిరుపతిపురంలో జన్మించారు. సంగీత భూషణ మర్లా సత్యనారాయణమూర్తి దగ్గర కర్నాటక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి దగ్గర వీణా వాదనలో శిక్షణ పొందారు. మద్రాసులో సంగీత కళానిధి ఎస్. రామనాథం దగ్గర శిష్యరికం చేశారు. 1954లో ఆలిండియా రేడియో హైదరాబాద్ లో చేరి వేలాది గేయాలకు బాణీలను అందించారు. “అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా” అనే చిన్నికన్నయ్య గీతం పాలగుమ్మి పేరు చెప్పగానే లలిత సంగీతాభిమానులకు ఠక్కున గుర్తొచ్చే గీతం. ఈ పాటను వింటుంటే కన్నయ్య కళ్లముందే కనపడుతున్నాడా అన్నంతగా వినేవాళ్లు తాదాత్మ్యం చెందుతారని సంగీత అభిమానులు చెప్పుకుంటారు.

శంకర్రావుకి బైపాస్ సర్జరీ

  గ్రీన్ ఫీల్డ్ భూముల వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే శంకర్రావుకి హైదరాబాద్ లో ని కేర్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. శంకర్రావుని ప్రశ్నించేందుకు కోర్టు పోలీసులకు అనుమతిచ్చింది. సహకరించకపోతే అరెస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ వారెంట్ కూడా జారీ అయ్యింది. వారెంట్ జారీ అయిన తర్వాత శంకర్రావు హటాత్తుగా మాయమయ్యారు. నాలుగురోజులపాటు ఆచూకీ తెలియలేదు. సడెన్ గా తాను శని సింగణాపూర్ లో ఉన్నానని, నాలుగు రోజుల్లో వస్తానని కుటుంబానికి తెలియజేశారు. హైదరాబాద్ వచ్చీ రాగానే నన్ను అరెస్ట్ చేస్తారా.. దమ్ముంటే చేయండి.. అంటూ తీవ్రస్థాయిలో ఆవేశపడుతూ డిజిపి కార్యాలయం ముందు బైఠాయించారు. బ్లడ్ ప్రెజర్ విపరీతంగా పెరిగిపోవడంతో సొమ్మసిల్లి పడిపోయిన శంకర్రావుని కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఆఖరికి బైపాస్ సర్జరీ చేసేవరకూ పరిస్థితి వెళ్లింది.

పాదయాత్రలో పాల్గొనడం లేదు: బాలకృష్ణ

  మహబూబ్ నగర్ జిల్లాలోని అమరావాయిలో చంద్రబాబును హీరో నందమూరి బాలకృష్ణ కలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పాదయాత్రలో తాను పాల్గొనడం లేదని, భవిష్యత్తులో పాల్గొనే విషయం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. బాబు పాదయాత్ర స్వలాభానికి కాదని, ప్రజల కోసమేనని అన్నారు. పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. చంద్రబాబు పాదయాత్ర విజయవంతం కావాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని బాలకృష్ణ స్థానికంగా ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు భారీ పాదయాత్ర చేస్తున్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారని, కాళ్ల నొప్పులు తదితర చిన్న నొప్పులు వచ్చినప్పటికీ యాత్రను సమర్థవంతంగా చేస్తున్నారన్నారు.

జగన్ కి చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్

  కేంద్ర క్యాబినెట్ విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయ్. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల లాబీయింగ్ జోరుగా సాగుతోంది. బెర్త్ కావాలనుకున్నవాళ్ల నేరుగా ఢిల్లీలో మకాం పెట్టి పైరవీలు చేసుకుంటున్నారు. మొదట్నుంచీ చిరంజీవి పేరు వినిపిస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంతంనుంచి ఓ వ్యక్తికి క్యాబినెట్ లో చోటు కల్పిస్తే ఉద్యమం ఉద్ధృతి కొంత తగ్గుతుందన్న ఆలోచనతో సర్వే సత్యనారాయణ పేరు పరిశీలనలోకొచ్చింది. ఎవరూ ఊహించడానిక్కూడా వీల్లేని విధంగా మరో వ్యక్తి పేరు తెరమీదికి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి వెంటనే ఢిల్లీకి రమ్మని అధిష్ఠానంనుంచి పిలుపొచ్చింది. అంతేకాదు.. ఢిల్లీలో తమకి అందుబాటులో ఉండమని కూడా అధిష్ఠానం ఆదేశం. రాయలసీమలో బలమైన ప్రాబల్యం ఉన్న రెడ్లని తమవైపుకి తిప్పుకోవాలంటే యాంటీ వై.ఎస్ గ్రూప్ లో కాస్తో కూస్తో జనంలో పట్టున్న నేత అవసరం. సూర్యప్రకాశ్ రెడ్డిని పైకి లాక్కొస్తే యాంటీ జగన్ వేవ్ కూడా కలిసొస్తుందన్న కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహం.  ముందునుంచీ కోట్ల కుంటుబానికీ, వై.ఎస్ కుటుంబానికీ మధ్య ఉన్న వైరాన్ని క్యాష్ చేసుకో గలిగితే రాయలసీమలో యాంటీ జగన్ గ్రూప్ కి చెందిన ఓ వ్యక్తి తమ చేతిలో ఉంటాడన్నది అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తోందని పార్టీలో సీనియర్లు అనుకుంటున్నారు.

అవును వాళ్లిద్దరూ కొట్టుకుంటున్నారు : బొత్స

  ముఖ్యమంత్రికీ, ఉప ముఖ్యమంత్రికీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోందన్న వార్తల్ని పిసిసి అధ్యక్షుడు తెలివిగా ధృవీకరించారు. మీడియాలో వస్తున్న వార్తల్ని చూసి తాను ఆ విషయం గురించి తెలుసుకున్నానంటూనే ఇద్దరిమధ్యా విభేదాలున్నాయన్న విషయాన్ని బైటపెట్టారు బొత్స. సింగూరు నీళ్ల విషయంలో ఇద్దరికీ మధ్య తలెత్తిన విభేధాలు తారాస్థాయికి చేరినట్టు సమాచారం. దామోదర్ తండ్రి పేరిట ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడానికి మంత్రి సుదర్శన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు దాన్ని ఖండించకుండా ముఖ్యమంత్రి .. సుదర్శన్ రెడ్డికే వత్తాసు పలకడం డెప్యూటీ సీఎంకి ఏమాత్రం రుచించలేదు. అప్పట్నుంచీ ఇద్దరి మధ్యా విభేధాలు బలం పుంజుకుంటూ వచ్చాయ్. చివరికి తన తండ్రి పేరు తీసేసినా ఫర్వాలేదు కానీ.. ఎత్తి పోతల పథకాన్ని మాత్రం ముందుకుతీసుకెళ్లాలని ఉపముఖ్యమంత్రి కోరినప్పటికీ సీఎం సానుకూలంగా స్పందించకపోవడం గమనార్హమైన విషయమని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన రాయబారంకూడా విఫలమైనట్టు తెలుస్తోంది.

రక్తసిక్తమైన దేవరగట్టు, స్వామి కోసం బన్నీ ఫైట్

  దేవరగట్టు మరోసారి రక్తసిక్తమైంది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో బన్ని ఉత్సవంలో భాగంగా జరిగిన కర్రల సమరంలో చాలా మంది గాయపడ్డారు. ప్రతిఏటా విజయదశమి పర్వదినాన ఈ సంప్రదాయం కొనసాగుతోంది. రెండు గంటల పాటు పరిసర గ్రామాల ప్రజలు కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. స్వామివారిని తీసుకు వెళ్లేందుకు ఇరువర్గాలు కర్రలతో బన్నీ ఫైట్ చేశాయి. ఈ దాడిలో సుమారు డెబ్బై మందికి పైగా గాయాలపాలయ్యారు. తలలు పగిలాయి. తీవ్ర గాయాలై తలలు పగిలినప్పటికీ ఇరు గ్రామాల ప్రజలు మళ్లీ బన్నీ ఫైట్‌లో పాలు పంచుకున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ భక్తుల హింసాత్మక ధోరణిని మాత్రం అడ్డుకోలేకపోయారు. దీనిపై పలు సంఘాలు కూడా స్వామి వారి భక్తులలో చైతన్యం తీసుకు వచ్చే కార్యక్రమాలు కొన్నేళ్లుగా చేపడుతున్నారు. కానీ అవి ఫలించడం లేదు.

హైదరాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సన్ టీవీ గ్రూప్

  హైదరాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీని సన్ టీవీ గ్రూప్ 850 కోట్లకు బిడ్డింగ్ వేసి దక్కించుకుంది. సంవత్సరానికి రూ. 85 కోట్ల చొప్పున మొత్తం 10 ఏళ్లపాటు కాలానికి గాను 850 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించి సన్ గ్రూప్ జట్టును సొంతం చేసుకుంది. డెక్కన్ చార్జర్స్ అనుభవం నేపథ్యంలో నిబంధనలు కఠినతరం చేసి బీసీసీఐ బిడ్డింగ్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గడువు ముగిసింది. చివరకు హైదరాబాద్ జట్టును సన్ గ్రూప్ దక్కించుకున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. హైదరాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం రెండు కంపెనీలు పోటీపడ్డాయి. ఒకటి పీవీపి కాగా రెండోది సన్ టీవి. పీవీపి ఏడాదికి రూ. 75 కోట్ల చొప్పున బిడ్డింగ్ వేయగా సన్ నెట్వర్క్ ఏడాదికి రూ. 85 కోట్లు చొప్పున మొత్తం రూ. 850 కోట్లకు వేసింది. దీంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ టీవీ గ్రూప్ కి దక్కింది.