బెంగాలీ కవి సునీల్ గంగోపాధ్యాయ మృతి

  బెంగాలీ సాహిత్యానికి పెద్దదిక్కుగా ఉన్న కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు సునీల్ గంగోపాధ్యాయ గుండె పోటుతో కన్నుమూశారు. బెంగాలీ సాహిత్యంపై చెరగని ముద్రవేసిన ఆయన ఐదు తరాల బెంగాలీ రచయితలకు వారధిగా నిలిచారు.  కవిత, కథ, నాటకం లాంటి వివిథ రకాల ప్రక్రియల్లో తనదైన ముద్రని చూపించారు. గంగోపాధ్యాయ రచనల్ని కథావస్తువులుగా తీసుకుని కొన్ని సినిమాలు కూడా తీశారు. 2008 నుంచి కేంద్ర సాహిత్య అకాడమీకి సునీల్.. అధ్యక్షుడిగా కొనసాగుతూవచ్చారు. తూర్పు బెంగాల్ లోని ఫరీదా పూర్ లో 1934 సెప్టెంబర్ ఏడో తేదీన సునీల్ జన్మించారు. కోల్ కతాలోని డమ్ డమ్ మోతీజీల్ కాలేజీ, సురేంద్రనాథ్ కాలేజీ, సిటీ కాలేజీల్లో విద్యాభ్యాసం చేశారు. కలకత్త విశ్వవిద్యాలయంలో బెంగాల్ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. చాలా కొద్ది కాలంలోనే శక్తిమంతమైన కవిగా, రచయితగా, నవలాకారుడిగా, నాటకకర్తగా గుర్తింపు పొందారు. కవితా ప్రక్రియ అంటే సునీల్ గంగోపాధ్యాయకి ప్రాణం. క్రిత్తిబాస్ అనే పత్రికను స్థాపించి కొత్త రచయితల్ని బాగా ప్రోత్సహించారు సునీల్ గంగోపాధ్యాయ. 1985లో  సెయ్ సమయ్ నవలకు సాహిత్య అకాడెమీ అవార్డ్ ని అందుకున్నారు.

మోడల్ బిదుషిని దారుణంగా హత్య చేశారా?

  ముంబైలో మోడల్ బిదుషి మరణం కలకలం రేపింది. ఆమె భర్త ఇంటికొచ్చి చూసేసరికి బిదుషి నెత్తుడి మడుగులో పడుతుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభంలేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. ఒడిషాకి చెందిన బిదుషి చెన్నైలోమోడల్ గా పనిచేస్తూ అవకాశమొచ్చినప్పుడల్లా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ పాత్రల్నికూడా పోషించేది. దక్షిణాదిలో కొన్ని సినిమాల్లో తరచూ కనిపించిందికూడా.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఖేదర్ తో ప్రేమాయణం బిదుషి జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది. మూడేళ్లక్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ముంబైలో కాపురం పెట్టింది. పరిసరాలను, ప్రాథమిక ఆధారాల్ని బట్టి బిదుషి షుగర్ వ్యాధి కారణంగా ప్రమాదవశాత్తూ చనిపోయిందని మొదట కేసు నమోదుచేశారు. ఆమె ఒంటిపై గాయాలున్న విషయం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలడంతో దాన్ని మర్డర్ కేసుగా మార్చారు. బిదుషి చనిపోయిన రోజున ఆమె సెల్ ఫోన్ కి 100 మిస్డ్ కాల్స్, 200 ఎస్మెమ్మెస్ లు వచ్చాయ్. గుర్తు తెలియని వ్యక్తులు బిదుషిని రేప్ చేసి చంపేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. అపార్ట్ మెంట్ సీసీ టీవీ ఫుట్టేజ్ ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

అమెరికాలో దొరకని చిన్నారి శాన్వీ ఆచూకీ!

  అమెరికాలోని పెన్సిల్వేనియాలో ప్రకాశం జిల్లాకి చెందిన ఓ మహిళను దారుణంగా చంపేశారు. ఆమె చేతిలో ఉన్న పసిపాపాయి శాన్విని ఎత్తుకుపోయారు. ఎవరు చేశారో తెలీదు. ఎందుకు చేశారో తెలీదు. శాన్వి తండ్రికి మాత్రం గుండె తరుక్కుపోతోంది. ఓ వైపు తల్లిని దారుణంగా చంపేశారు. మరోవైపు ప్రాణానికి ప్రాణమైన పదినెలల చిన్నతల్లిని ఎత్తుకుపోయారు. అప్పర్ మేరియన్ టౌన్ షిప్ లో ఉంటున్న ఈ కుటుంబం చాలాకాలంగా అక్కడ్నుంచి వెళ్లిపోవాలనుకుంటూనే తాత్సారం చేసింది. నిర్ణయం తీసుకునేలోగానే ఘోరం జరిగిపోయింది. అక్టోబర్ 22వ తేదీన ఇంట్లోకి చొరబడి నాయనమ్మని కాల్చేపారేసి చిన్నారి పాపని ఎత్తుకెళ్లారు. ఉదయం తొమ్మిది గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంటలోపు హత్య జరిగిఉంటుందని ప్రాథమిక ఆధారాల్నిబట్టి అనుమానిస్తున్నారు. తన బిడ్డని తనకు క్షేమంగా అప్పగిస్తే మొత్తం ఆస్తి రాసియ్యమన్నా రాసిచ్చేస్తానంటూ పాపాయి తండ్రి శివ వెన్నా కిడ్నాపర్లను ప్రాధేయపడుతున్నారు. ఇప్పటివరకూ పాప ఆచూకీ తెలియక పోవడంతో శాన్వి తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. దుండగుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న సత్యవతి మృతికి తానా సంతాపం తెలిపింది. హత్య, కిడ్నాప్ మిస్టరీల్ని ఛేదించేందుకు గట్టిగా ప్రయత్నించాలని కోరుతూ అమెరికాలోని భారత రాయబారికి లేఖ రాసింది.

చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి, 28 న మంత్రివర్గ విస్తరణ

  రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ఈ సారి కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఛాన్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాల అంచనా. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసినరోజునే ఈ డీల్ జరిగుంటుందని పార్టీలో సీనియర్ నేతలు అంటున్నారు. చిరుకి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సహాయ మంత్రి పదవిని కట్టబెట్టాలని యూపీఏ అధ్యక్షురాలు సోనియా, మన్మోహన్ సింగ్ గట్టిగా ఆలోచిస్తున్నట్ట సమాచారం. రేణుక చౌదరి, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావులకు కూడా ఈ సారి కేంద్ర క్యాబినెట్ లో బెర్త్ దక్కే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయని రాజవర్గాల అంచనా. తెలంగాణ ప్రాంతం నుంచి విహెచ్, సర్వేసత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి బరిలో ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ కుర్చీలపై ఆశలుపెట్టుకున్న కావూరి, రాయపాటి, కోట్ల.. విస్తృత స్థాయిలో ఢిల్లీ లో లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.

హీరో ఉదయ్ కిరణ్ పెళ్ళి ముచ్చట్లు

  తెలుగు హీరో ఉదయ్ కిరణ్, నిషితల వివాహ వేడుక అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో నిరాడంబరంగా జరిగింది. బుధవారం అనగా 4.26 గంటలకు జరిగే ఉదయ్‌కిరణ్ వివాహం సందర్భంగా మంగళవారం పెళ్లివారంతా రత్నగిరికి చేరుకున్నారు. వివాహ వేడుకను నిరాడంబరంగా కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల వరకూ స్నాతకం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి పది గంటల నుంచి పెళ్లివేడుక ప్రారంభమైంది. ఉదయ్‌కిరణ్, విషితలను వధూవరులను చేసి వారిచే వరపూజ చేసే కార్యక్రమాన్ని పండితులు నిర్వహించారు. సినీ హీరో అల్లరి నరేష్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.      

యడ్యూరప్ప కొత్త పార్టీ పనులు విజయదశమినుంచే ప్రారంభం

  కొత్తపార్టీ పెట్టుకోవాలని నిర్ణయించుకున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బిజెపి గుడ్ బై కొట్టేశారు. తనకి బిజెపితో సంబంధాలు తెగిపోయాయని, కొత్త పార్టీకి ప్రజలు మద్దతివ్వాలని ఆయన కర్నాటక వాసులకు విజ్ఞప్తి చేశారు.  బిజెపికి ఇంకా రాజీనామా సమర్పించని యడ్యూరప్ప విజయదశమి సందర్భంగా తన కొత్త పార్టీ ఏర్పాట్లను లాంఛనంగా మొదలుపెట్టేశారు. డిసెంబర్ పదో తేదీలోగా పార్టీ అధ్యక్షుడికి తన రాజీనామా లేఖని పంపుతానని యడ్యూరప్ప చెబుతున్నారు. తనకి పార్టీతో ఏమాత్రం పడడం లేదని, పడనప్పుడు వేరు కుంపటి పెట్టుకోవడంలో ఉన్న సంతోషం మరి దేంట్లోనూ ఉండదని యడ్డీ వ్యాఖ్యానించారు. స్కామ్ లో ఇరుక్కుని ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్న యడ్యూరప్ప ఆరు నెలలు తిరిగేలోగా మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటానని కలలుగన్నారు. కానీ.. పార్టీ అధిష్ఠానం ఆయనకు మొండిచేయి చూపించింది. అలిగి అటకెక్కిన యడ్డీ తనకికి మళ్లీ ఛాన్స్ దక్కే అవకాశం లేదని గ్రహించి, కొత్త కుంపటి పెట్టుకోవాలన్న బలమైన ఆలోచనని ముందుకు తీసుకొచ్చారు. యడ్యూరప్ప కర్నాటక బిజెపి అధికార పీఠాన్ని కోరుతున్నారు. దాన్ని యడ్డీకి ఇస్తే ప్రజల్లో చెడ్డపేరొస్తుందని పార్టీ భావిస్తోంది. రెండు పక్షాలకూ మధ్య లంగరు కుదరని పరిస్థితుల్లో యడ్యూరప్ప తనదారి తను చూసుకున్నారు.

తమిళ యువ నటి శుభ పుతెలా మృతి

    తమిళ యువనటి శుభ పుతెలా (21) కన్నుమూసింది. శుభ పచ్చ కామెర్లు, కిడ్నీ వ్యాధి బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మరణించారు. గత మూడు నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు ఇటీవల పచ్చకామెర్ల వ్యాధి సోకిందని, ఆరోగ్యం మెరుగుపడినట్లే కనిపించిందని అనుకోకుండా కోమాలోకి జారుకున్నారని వైద్యులు వెల్లడించారు. ‘మాలై పోజుదీన్ మయాకథిలే’ చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు. తెలుగు హీరో రామ్ సరసన ‘ఒంగోలు గిత్త’ చిత్రంలో నటించేందుకు ఆమె అంగీకరించింది. గుంటూరులో కొన్నిరోజుల షూటింగ్ అనంతరం అనారోగ్య కారణాలతో తప్పుకుంది. 2010 లో మిస్ సౌత్ ఇండియా టైటిల్ని గెలుచుకు౦ది. ఈమె జ్యూవెలరీ, టెక్స్‌టైల్స్ తదితర వాటికి మోడల్‌గా వ్యవహరించింది.

చంద్రబాబుకి చిన్న మెదడు చిట్లిందన్న గట్టు

  జైల్లో జగన్ సెల్ ఫోన్ వాడుతున్నారంటూ టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. లేని పోని ఆరోపణలు చేస్తూ జనంలో పబ్లిసిటీ పెంచుకునేందుకు యనమల రామకృష్ణుడు లాంటి నేతలు చేస్తున్న ఆరోపణలకు జనం సరైన బుద్ధి చెబుతారని ఆ పార్టీనేత గట్టు రామచంద్రరావు హెచ్చరించారు. గతంలో వై.ఎస్ ని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఆయన బాటలోనే నడుస్తూ పాదయాత్ర చేయడం, వై.ఎస్ ఇచ్చిన వరాల్నే మళ్లీ ప్రజలకు ఆశచూపడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబుకి చిన్న మెదడు చిట్లిపోయింది కనుకే వై.ఎస్ ని కాపీ కొడుతున్నారంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సినిమా డైరెక్టర్ల డైరెక్షన్ లో సాగుతున్న చంద్రబాబు పాదయాత్రకి ఎంత ప్రజాదరణ ఉందో, షర్మిల చేస్తున్న పాదయాత్రకి ఎంత ప్రజాదరణ ఉందో టిడిపి నేతలు ఇప్పటికైనా తెలుసుకోవాలని వైకాపా నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గట్టు రామచంద్రరావుకి బుద్ధి చెప్పి తీరాలంటూ తెలుగు దేశం నేతలు మండిపడుతున్నారు. త్వరలోనే ఎవరి సంగతి ఏంటో ప్రజలే తేల్చేస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జగన్ సెల్ ఫోన్ నెంబర్ కోసం నేతల ఆరాటం

  చంచల్ గూడ జైల్లో వైకాపా అధ్యక్షుడు జగన్ రాజభోగాలు అనుభవిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ తెలుగుదేశంపార్టీ డిజిపికి ఓ లేఖ రాసింది. జైల్లో జగన్ ని ఎవరుపడితేవాళ్లు ఎప్పుడు పడితే అప్పుడు కలుసుకుంటున్నారని, ఆయన ఓ సెల్ ఫోన్ కూడా మెయిన్ టెయిన్ చేస్తున్నారని ఆరోపించింది. టిడిపి చేసిన ఆరోపణలుకూడా పరోక్షంగా జగన్ కి కలిసొచ్చేలా కనిపిస్తున్నాయ్. ఎందుకంటే వైకాపాలోకి జంప్ చేయాలనుకునేనేతలు ఇప్పుడు జగన్ ఫోన్ నెంబర్ ని వెతికిపట్టే పనిలోపడ్డారు. ఇప్పుడా దానికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఎవరైనా జగన్ సెల్ ఫోన్ నెంబర్ ని ఇవ్వగలిగితే లక్షలు కుమ్మరించడానికి నేతలు సిద్ధంగా ఉన్నారు. నేరుగా జైలుకెళ్లి మాట్లాడి అన్ పాపులర్ అవ్వడంకంటే సెల్ ఫోన్ లో మాట్లాడేస్తేపోలా? అన్న ఆలోచనతో నేతలు తారా స్థాయిలో జగన్ ఫోన్ నెంబర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు జగన్ కి పూర్తి స్థాయిలో ఇలా కలిసొస్తున్నాయని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.

గంగతో రాంబాబు సినిమాతో పూరీకి భారీ లాభం

  ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ కొత్త సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు రాజకీయవర్గాల్లో తీవ్రస్థాయిలో కలకలం రేపింది. పూరీ ఉద్దేశపూర్వకంగా వై.ఎస్ ని నెత్తికెత్తుకుని, మిగతా పార్టీల నేతల్ని అవమానించారంటూ చాలా పెద్ద ఎత్తున రగడ జరుగుతోంది. తెలంగాణ ని అవమానించే రీతిలో ఉన్న డైలాగ్స్ ని తొలగించాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ లబ్ధికోసమే పూరీ ఈ సినిమాని తీశారంటూ చాలామంది తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పూరీ జగన్ పార్టీలో చేరబోతున్నారని, అనకాపల్లి లోక్ సభ స్థానానికి బరిలో నిలబడాలనుకుంటున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. పూరీ సోదరుడు గణేష్.. ఇప్పటికే వైకాపాలో యాక్టివ్ పార్ట్ పోషిస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా విజయలక్ష్మి, షర్మిల పూరీ ఇంట్లోనే బసచేయడం మరో సంచలనం. వాళ్లిలా తనింటికి రావాడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ట్వీట్ చేసి తన ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నాడు పూరీ.. వై.ఎస్ మీద అభిమానాన్ని చాటుకోవడానికే సినిమాలో ముఖ్యమంత్రికి పంచెకట్టుని సెట్ చేశారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయ్.

ఒబామాకి భారీ మద్దతు, రోమ్నీకి తగ్గిన ఆదరణ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగుతున్నా కాస్తంత ఎక్కువ మద్దతు ఒబామా వైపే కనపడుతోంది. ఆఖరి ముఖాముఖీ చర్చ ముగిసిన తర్వాత సిఎన్ ఎన్ జరిపిన సర్వేలో ఒబామాకి 53శాతం ఓట్లురాగా రోమ్నీకి 40 శాతం ఓట్లు పోలయ్యాయి. మరో ఛానెల్ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలోకూడా రోమ్నీకి చాలా తక్కువశాతం మద్దతు లభించింది. మూడో ముఖాముఖీ చర్చని చూసిన తర్వాత కచ్చితంగా ఒబామాకే ఓటు వేయాలన్న కోరిక గట్టిగా కలుగుతోందని అమెరికన్లు చెబుతున్నారు. మరోసారి ఛాన్సిస్తే అమెరికన్ల భవిష్యత్తుని సుందరంగా తీర్చిదిద్దుతానని ఒబామా గట్టిగా చెబుతున్న మాటలు అమెరికన్ల హృదయాలకు బాగా హత్తుకుంటున్నాయ్.

జైలునుంచే జగన్ మంత్రాంగం

  జగన్ జైలునుంచే యధేచ్ఛగా పాలిటిక్స్ నడుపుతున్నాడంటూ టిడిపి ఆరోపిస్తోంది. ఎవరుపడితే వాళ్లు, ఎప్పుడు పడితే అప్పుడు నేరుగా జైలుకెళ్లి జగన్ తో మంతనాలు జరుపుతున్నారని, జైలు అధికారులు రాజలాంఛనాలు కల్పిస్తూ పూర్తిగా సహకరిస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు. జైల్లో జగన్ కి పూర్తి స్థాయిలో సెల్ ఫోన్ సౌకర్యం కల్పించినట్టు గట్టిగా చెప్పగలమని ఆ పార్టీనేత యనమల రామకృష్ణుడు ఆరోపిస్తున్నారు. దీనిపై ఫిర్యాదుచేస్తూ డిజిపికి లేఖకూడా రాశారు. జైల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ జగన్ ని ఎవరెవరు కలుస్తున్నారో ఎందుకు రికార్డ్ చేయడంలేదంటూ యనమల.. అధికారుల్ని ప్రశ్నించారు. షర్మిల పాదయాత్రనికూడా జగన్ జైలునుంచే పర్యవేక్షిస్తున్నాడని యనమల ఆరోపించారు.

ఆర్మీ లెక్కల్లో భారీ అవకతవకలు

రక్షణశాఖ అంతర్గత ఆడిట్ లో ఆర్మీ.. ఇష్టంవచ్చినట్టుగా ప్రజాధనాన్ని దుబారా చేసినట్టు బయటపడింది. కేవలం మూడేళ్లలో వందకోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వెలుగుచూసింది. ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ సహా ఆరుగురు కీలక ఉన్నతాధికారులు ప్రజాధనాన్ని దుబారా చేసినట్లు ఆడిట్‌లో వెల్లడైంది. 2009 - 2011 మధ్య ఆర్మీకి అవసరమైన పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేయడంలో వీళ్లు నిబంధనల్ని ఉల్లంఘించారని ఆడిట్ లో తేలింది. కంప్ట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ ఆడిట్ నివేదికల ప్రకారం బిక్రమ్‌సింగ్ , ఇతర ఆర్మీ అధికారులు ఈస్టర్న్, నార్తర్న్ ఆర్మీ కమాండ్లకు నేతృత్వం వహిస్తున్నప్పుడు పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా చైనాకి చెందిన కమ్యూనికేషన్ పరికరాలను, ఇతర సామగ్రిని భారీ ధరలకు కొనుగోలు చేయడం ద్వారా ప్రజాధనాన్ని దుబారా చేసినట్లు వెల్లడైంది. ఆర్మీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ కాస్త గట్టిగానే స్పందించారు. రక్షణ శాఖ అనుమతి లేనిదే కమాండర్లు కొనుగోళ్లు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు.

దీపం పథకానికి ఊరట

  కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ఎత్తేసింది. దాని ప్రభావం దీపం పథకంకింద సిలిండర్లు పొందినవాళ్లపై కూడా పడింది. ఈ సబ్సిడీభారాన్ని కొంతవరకూ భరించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. కేంద్రం సబ్సిడీపై సంవత్సరానికి కేవలం ఆరు సిలిండర్లుమాత్రమే ఇకపై ఇస్తుంది. దీనికి తోడుగా మరో మూడు సిలిండర్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ నాలుగోతేదీనుంచి మార్చ్ 31వ తేదీవరకూ అందరికీ మూడు సిలిండర్లుమాత్రమే వస్తే దీపం పథకం లబ్ధిదారులకు మాత్రం ఆరు సిలిండర్లు వస్తాయి. మామూలు వినియోగదారులతో పోలిస్తే దీపం పథకం లబ్ధిదారులకు డబుల్ బొనాంజా అన్నమాట.  

కసబ్ కి ఉరే సరన్న షిండే

ముంబైపై ఉగ్రవాదుల దాడిలో పట్టుబడ్డ పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ తనకి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశాడు. ముంబై దాడిలో నిర్దాక్షిణ్యంగా భారతీయ పౌరుల్ని కాల్చి చంపిన కసబ్ కి ఉరే సరైన శిక్షని కేంద్ర హోం శాఖ అభిప్రాయపడుతోంది. తాను చెప్పదలచుకున్న విషయాన్ని నేరుగా రాష్ట్రపతికి లేఖలో పంపారు కేంద్ర హోంమంత్రి సుసీల్ కుమార్ షిండే. కసబ్ క్షమాభిక్ష పిటిషన్ ని హోంశాఖ రాష్ట్రపతికి పంపించింది. మామూలుగా క్షమాభిక్ష తిరస్కరణ పిటిషన్ ని రాష్ట్ర పతికి పంపడానికి హోంశాఖ కాస్తోకూస్తో సమయం తీసుకుంటుంది. కానీ కసబ్ విషయంలో మాత్రం అలాంటి జాప్యం అనవసరమని షిండే భావించారు. మహారాష్ట్ర గవర్నర్ నోట్ రాయగానే వెంటనే కసబ్ క్షమాభిక్ష పిటిషన్ ని అనుమతించరాదని కోరుతూ ఫైల్ ని రాష్ట్రపతికి పంపించారు. 166మందిని చంపి, 300 మందిని గాయపరిచిన ముంబై ఉగ్రదాడికేసులో కసబ్ కి సుప్రీంకోర్ట్ ఉరిశిక్షని ఖరారు చేసింది.

గడ్కరీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

బిజెపి జాతీయ అధ్యక్షుడు గడ్కరీ మెడకు స్కామ్ ల ఉచ్చు గట్టిగా బిగుసుకుంటోంది. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై శోధించి ఆధారాలు సాధించిన మీడియా.. గడ్కరీ కంపెనీల వ్యవహారాన్ని బైటపెట్టడంతో ఇప్పుడు యూపీఏ నేతలు చెలరేగి అస్త్రాల్ని సంధిస్తున్నారు. గడ్కరీ ఆధ్వర్యంలోని పూర్తి పవర్ అండ్ షుగర్స్ లిమిటెడ్ కి నిధులు ఎక్కడినుంచొచ్చాయో తేల్చమంటూ యూపీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తుందని కార్పొరేట్ వ్యవహారాల మంత్రి వీరప్పమొయిలీ చెప్పారు. వెబ్ సైట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా చూపిస్తూ గడ్కరీ మోసాలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కార్యాలయంతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దిగ్విజయ్ సింగ్ ప్రథానికి ఓ లేఖకూడా రాశారు. ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవినుంచి తప్పుకోవడం మంచిదని బిజెపి ఎంపి రామ్ జెత్మలానీ గడ్కరీకి సలహా ఇచ్చారు. గడ్కరీ ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసిన రోజుల్లో పూర్తిలో భారీ స్థాయిలో పెట్టుబడులుపెట్టిన ఐడియల్ రోడ్ బిల్డర్స్ గ్రూప్ చాలా కాంట్రాక్టుల్ని సొంతం చేసుకుంది. గడ్కరీమాత్రం తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టిపారేస్తున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్నారు.

రెండు గ్యాస్ కనెక్షన్లిస్తారట

  ఒక ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే.. ఇది చాలాకాలంగా స్ట్రిక్ట్ గా అమలౌతున్న లేదా చమురు కంపెనీలు గట్టిగా అమలు చేయాలని చూస్తున్న పాలసీ.. ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలుంటే పరిస్థితేంటి అని చాలామంది చాలాకాలంగా ఆవేదన చెందుతున్నారు. ఒకే కుటుంబంలో తల్లీతండ్రీ, పెళ్లైన కొడుకూ కోడలూ విడివిడిగా ఉంటున్నా రెండు కనెక్షన్లు ఇవ్వలేమని గ్యాస్ కంపెనీలు తేల్చి చెప్పాయి. కేంద్ర తీసుకున్న కొత్త నిర్ణయంవల్ల చాలామందికి వంటగ్యాస్ అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. కచ్చితంగా గ్యాస్ కావాలంటే అయినవాళ్లని వదులుకుని మరో చోట వేరే కాపురం పెట్టక తప్పనిపరిస్థితి. ఇకపై అలాంటి భయాలేవీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చమురు కంపెనీలు మార్కెటింగ్ శాఖలు సామాన్యులకు చిన్నపాటి భరోసా ఇస్తున్నాయి. ఒకే ఇంట్లో రెండు వంటగదుల్ని చూపిస్తే రెండు కనెక్షన్లకు ఢోకా లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయ్. ఇది నిజంగా నిజమైతే బాగుండని లక్షలాది కుటుంబాలు కోరుకుంటున్నాయ్. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే ఒకే ఇంట్లో ఉంటున్న రెండు కుటుంబాలకు రెండు కనెక్షన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ రావొచ్చని అధికారులు చెబుతున్నారు. కాకపోతే రెండు వంటగదుల్ని తప్పని సరిగా చూపించాలన్న నిబంధనను మాత్రం కచ్చితంగా పాటించి తీరాలట.

పట్టాలు తప్పిన కావేరీ ఎక్స్ ప్రెస్

  రైలు మెల్లగా పోతోందిలే అనుకుని అంతా హాయిగా పడుకున్నారు. పెద్ద కుదుపు.. ప్రయాణికులు ఉలిక్కిపడి లేచారు.. కన్నుపొడుచుకున్నా కనిపించని చీకటి.. ఏం జరిగిందో తెలీడం లేదు.. ప్రయాణికులంతా అయోమయంలో పడిపోయారు.. అర్థరాత్రి వేళ ఈ అవస్థ ఏంటి దేవుడా.. అని చాలామంది భయపడిపోయారు కూడా.. అసలెక్కడున్నారోకూడా తెలియని స్థితి.. ఎవరైనా ఆదుకోవడానికొస్తారోరారో కూడా తెలీని పరిస్థితి.. సిబ్బంది వచ్చి చెప్పాక కానీ తెలియలేదు.. రైలు పట్టాలు తప్పిందని.. విషయం తెలిశాక ఒక్కసారి గుండె ఝల్లుమంది.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరు దగ్గర కావేరీ ఎక్స్ ప్రెస్ తెల్లవారుజామున పట్టాలు తప్పింది. కొండ చరియలు విరిగిపడడంవల్లే ఇలా జరిగిందని టెక్నికల్ టీమ్ చెబుతున్నారు. ఇంకో ఆందోళనకరమైన విషయం ఏంటంటే రైలు పట్టాలు తప్పినచోట ఓ వైపున కొండ, మరో వైపున లోయ ఉన్నాయ్. ప్రయాణికుల అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది.. లేకుంటే అటు కొండకి ఢీకొట్టినా, ఇటు లోయలోకి జారిపోయినా ప్రాణ నష్టం వందల్లోనే ఉండేది.. కొండచరియ విరిగిపడ్డప్పుడు డ్రైవర్ శ్రీరామ్ చాకచక్యంగా బ్రేకులు వేయడంవల్ల పెను ముప్పు తప్పింది.

మక్కాలో చెలరేగిన మంటలు

  మక్కాలోని ఓ తొమ్మిదంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయ్. మక్కా యాత్రకోసం వెళ్లి ఆ భవంతిలో బసచేసిన యాత్రికులకు తీవ్రగాయాలయ్యాయ్. నాలుగో అంతస్తులో చెలరేగిన మంటలు క్షణాల్లో భవంతిని ఆక్రమించుకున్నాయ్. హుటాహుటిన పరిగెత్తుకొచ్చిన రెస్క్యూటీమ్ యాత్రికుల్ని ప్రమాదంనుంచి కాపాడింది.. దాదాపు పదిహేనుమందికి తీవ్రగాయాలైనట్టు సౌదీ వార్త సంస్థ ప్రకటించింది. గాయాలబారినపడి ఆసుపత్రి పాలైనవారిలో భారతీయ యాత్రికులుకూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకూ అధికారికి సమాచారమేమీ లేదు. సౌదీ అధికారులు కూడా గాయపడ్డవాళ్లంతా మారిషస్ కి చెందిన యాత్రీకులని చెబుతున్నారు. ఘటనపై అక్కడి ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.