రక్తి కడుతున్న బాబు ప్రసంగాలు

ఎంఎ పాలిటిక్స్‌ చదివిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన విద్య, వాక్‌పటిమకు పరీక్షపెట్టుకున్నారు. పాదయాత్రల్లో భాగంగా ఆయన ఓసారి టీచర్‌ పాత్ర పోషించారు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మహిళా సాధికారతపై విద్యార్థినులకు ఆసక్తికరంగా బోధించారు.  ఓ టీచర్‌ విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు ఎలా ఎదురు ప్రశ్నలు వేసి చెబుతుంటారో అదే తరహాలో బాబు వ్యవహరించారు. మహిళలు రోజువారీ పడతున్న బాధలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే జరుగుతున్న మార్పులపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు బాబు కృషి చేశారు. ప్రత్యేకించి మహిళలు స్వేచ్ఛగా ఎలా ఎదగాలో కళాశాల విద్యార్థినులే రోల్‌మోడల్‌గా నిలవాలని ఆకాంక్షించారు. ఈ ఆకాంక్ష ఆయన చేసిన ప్రసంగాన్ని రక్తికట్టించింది. ఓ మాజీముఖ్యమంత్రి లెక్చరర్లతో సమానంగా బోధించటం మరిచిపోలేనిదని ఆ కళాశాల ప్రిన్పిపాల్‌ విజయారాణి వ్యాఖ్యానించారు. ఇది చారిత్రకఘట్టంగా విద్యార్థినుల మదిలో నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఉత్సాహంగా...ఉల్లాసంగా....తూ.గో.తెలుగుదేశం?

తెలుగుదేశం పార్టీ ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఈ పార్టీ ప్రారంభసమయంలో ఉన్నంత ఉత్సాహం మళ్లీ ఇప్పుడు పుట్టుకొచ్చింది. వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మాటంటేనే శిలాశాసనంగా భావించి అప్పటి నాయకులు దివంగత లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి సాయంతో జిల్లాను జల్లెడ వేశారు. అదే తరహాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కార్యదర్శి దాట్ల బుచ్చిబాబు తదితరులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కీలకమైన సమస్యలు చర్చించారు. అలానే ఇటీవల సైన్‌ఫ్లూతో బాధపడుతున్న తాళ్లరేవు మండల వాసులకు తెలుగుదేశం నేతలు దగ్గరికి వెళ్లి భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. ప్రత్యేకించి ఈ మండలంలో మాస్క్‌లు ధరించటం ద్వారా సైన్‌ఫ్లూ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చన్న వైద్యుల సూచనలకు దాట్ల గౌరవమిచ్చి దాదాపు రూ.20వేల సొంతడబ్బుతో మాస్క్‌లు తెప్పించి పంపిణీ చేశారు.  దీంతో తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టులున్న తాళ్లరేవు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలకు మంచి స్పందన వస్తోంది. అలానే జిల్లాలోని కీలకమైన సమస్యలున్న ప్రాంతాలకు వెళ్లేందుకు నేతలు సన్నద్ధమయ్యారు. బాబు పాదయాత్రలు వచ్చేలోపు ఉత్సాహంగా కార్యకర్తలందరూ సమస్యలపై నివేదిక రూపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నివేదికను బాబు ముందుంచి ఆ తరువాత జిల్లా యంత్రాంగంతో పోరాటానికి సైతం సై అంటున్నారు. గతంతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ ఇంత స్పీడుగా ఉంటుందని తాము అనుకోలేదని ఇతరపార్టీల నేతలు కితాబులిస్తున్నారు. ఏమైనా బాబు పాదయాత్రలు పార్టీలో అంతర్లీనంగా ఉత్సాహాన్ని నింపింది అని అందరూ అంగీకరిస్తున్నారు.

వైకాపా సమావేశాలపై ‘బాబు’ ముద్ర?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయాత్రలకు వస్తున్న స్పందన ద్వారా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ సమావేశాలను ప్రభావితం చేస్తున్నారు. బాబుకు పెరిగిన ఇమేజ్‌ వైకాపా కార్యకర్తల ద్వారానే అని రాజకీయపరిశీలకులు ఇటీవల తేల్చిన విషయం ‘తెలుగువన్‌.కామ్‌‘ పాఠకులకు తెలిసిందే. గతంలో వైకాపా సమావేశమంటే ఒకటే హడావుడి కనిపించేది. సమావేశానికి పరిశీలకులు, రాష్ట్రనాయకులు రావటం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నంత అంశంగా వైకాపా ద్వితీయశ్రేణి నాయకులు బోలెడు హంగామా చేసేవారు. ఈసారి అసలు ఏ మాత్రం పెద్దగా పబ్లిసిటీ స్టంట్లు లేకుండా జిల్లా సమావేశాలు అయిందనిపించారు. అయితే వైకాపా కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ఆ పార్టీ రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లాల పరిశీలకులు కృషి  చేశారు. దీనిలో భాగంగానే కార్యకర్తలను వారు ప్రత్యేకంగా గౌరవిస్తున్నారు. తమకున్న బలం కార్యకర్తలే అని నేతలు చెప్పుకుంటున్నారు. విఐపిలంటే మీరే అని కూడా నేతలు ప్రశంసిస్తున్నారు. అలానే ద్వితీయశ్రేణి నాయకులను కూడా పొగడ్తలతో నేతలు ముంచెత్తుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం కాకినాడలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పార్టీ పరిశీలకులు భూమానాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు. వీరందరూ షర్మిల పాదయాత్రల సందర్భంగా ఆమెకు స్వాగతం ఎలా ఉండాలి? ఆమె పాదయాత్రకు భంగం కలగకుండా సహకరించాల్సిన తీరు వంటి పలు అంశాలు ఈ సందర్భంగా చర్చించారు. చివరాఖరున సమావేశం ముగిసిన తరువాత బాబు పాదయాత్రల ప్రభావం సమావేశంపై పడిందా? లేదా? అన్న అంశాలపై నాయకులు చర్చలు జరిపారు. ఈ రహస్యచర్చల ద్వారా అంచనాలు వేసుకుని షర్మిల పాదయాత్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి నాయకులు ఒకరినొకరు హెచ్చరించుకున్నారు.

పాండిచేరీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మల్లాడి

  పాండిచేరీ రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు రాజీనామాను పాండిఅసెంబ్లీ స్పీకర్‌ ఆమోదించలేదు. రెండువారాలవుతున్నా ఈ రాజీనామా గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. అసలే యానాంలో చిన్న సమస్య మిగిలి ఉన్నా వదలకుండా పోరాడేతత్వం ఉన్న కృష్ణారావు రాజీనామా ఆమోదిస్తే తమ రాష్ట్ర ప్రభుత్వ మనుగడకే పెద్ద సవాల్‌ తలెత్తగలదని స్పీకర్‌ భావిస్తున్నారు. అందుకే ఆయన రాజీనామా లేఖను చదివినా పక్కనపెట్టేశారు. అయితే యానాంకు సంబంధించిన ఆ ఎనిమిది డిమాండ్ల గురించి మాత్రం అసెంబ్లీలో చర్చిస్తున్నారు. ఆ డిమాండ్లను ఆమోదించి ఆ లేఖను వెనక్కి పంపించేందుకు స్పీకర్‌ ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ఆయన ఎమ్మెల్యే మల్లాడితో టచ్‌లో ఉన్నారట. అంతేకాకుండా మధ్యంతరంగా రాజీనామా చేయటం వల్ల పాలన కుంటుపడుతుందని, తాము సమస్యలు పరిష్కరించేందుకు సహకరించాలని స్పీకర్‌ కోరుతున్నారట. ఏమైనా సమస్యలు పరిష్కారం కోసమే తాను రాజీనామా చేశానని, వాటిని పరిష్కరిస్తే తాను ఎమ్మెల్యేగా కొనసాగేందుకు ఎటువంటి అభ్యంతరమూ ఉండబోదని కృష్ణారావు కూడా స్పష్టం చేశారట. దీంతో వాటిపై కసరత్తులు చేస్తున్నారు. రాజకీయంగా యానాం వంటి చిన్న ప్రాంతాల్లో అభివృద్ధి రాష్ట్రానికే ఆదర్శంగా ఉంటుందని, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా వాసులు తనను మంచినాయకునిగా ఆదరిస్తున్నారని మల్లాడి ఈసందర్భంగా స్పీకర్‌కు తెలిపారు. దీంతో స్పీకర్‌ కూడా రాజీనామా లేఖను సమస్యలు పరిష్కరించాక తిప్పిపంపుతామని మల్లాడికి తెలియజేశారు. ప్రతీచిన్న సమస్యను క్షుణ్ణంగా పరిశీలించే మల్లాడి కూడా స్పీకర్‌ ప్రతిపాదనకు అంగీకరించారు. 30ఏళ్ల మల్లాడి రాజకీయజీవితంలో యానాం అభివృద్ధి ముడిపడి ఉందని పాండిఅసెంబ్లీ గుర్తించినందుకు అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబుతో ఎవరు ఎక్కువ నడిచారు

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ తమ నేతతో ఎవరు ఎక్కువ నడిచేరన్నదే. దీనికి కొలమానం ఏమిటో తెలుసా ఎవరు ఎక్కువ నల్లబడితే వారే ఎక్కువ నడిచినట్లట.  చంద్రబాబు అనంతపురం జిల్లాలో 13 రోజుల పాటు పాదయాత్ర చేశారు. దీన్లో ఎక్కువగా నడిచింది పయ్యావుల కేశవ్. తరువాత చంద్రబాబు  పాదయాత్ర చేస్తూ కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో పల్లె రఘునాథరావు ఉదయం, సాయంత్రం చల్లబడిన తరువాత చంద్రబాబునాయుడుతో అడుగులు కలిపేవారు. ఇంకో విషయమేమంటే ఈయనకు సంబందించిన నియోజక వర్గం చంద్రబాబు రూట్ మ్యాప్ లో లేదు. దాంతో మార్నింగ్, ఈవెనింగ్ వాక్ వెళ్లినట్లు వెళ్లేవారు. వీరిద్దరికంటే  తానే ఎక్కువ దూరం నడిచానని టిడిపి జిల్లా అధ్యకుడు పార్ధసారధి చెప్పుకున్నారు. అలా అయితే ఎందుకు నల్లబడలేదని సహచరులు అడిగిన ప్రశ్నకు "కమిలి నల్లబడిన చర్మం ఊడిపోయి కొత్తచర్మం వచ్చి ప్రెష్ గా ఉన్నా' 'అంటూ చమత్కరించారు.   ఎవరైనా తెల్లబడేందుకు లోషన్లు వాడతారని అయితే తానే పార్టీనాయకునితో ఎక్కువ నడిచానని చెప్పటానికి గానూ కేశవ్ నల్లబడే లోషన్ రాసుకున్నారంటూ పయ్యావులకేశవ్ పై సెటైర్లు కూడా వేశారు పార్థసారథి.

డియల్ రవీంద్ర అవుట్ ... ఆదినారాయణ ఇన్

కడప జిల్లా, జమ్మలమడుగుకు చెందిన ఆదినారాయణ తీరే వేరు. ఈయనకు ముక్కుసూటి మనిషిగా పేరుంది. ఏ పనైనా సాధించేవరకు వెనుకడుగు వేయని నాయకుడిగా ఆయనకు గుర్తింపువుంది. దాంతో ఈయనను మంత్రి పదవి వరించనుంది. ఎమ్మేల్యేగా రెండుసార్లు ఈయన అదే నియోజక వర్గంనుండి గెలిచారు. అయితే కడప జిల్లా నుండి ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఆదినారాయణ వైపు ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నారు.  కడప జిల్లానుండి ప్రాధినిద్యం వహిస్తున్న మంత్రి డిఎల్ రవీంద్రరెడ్డికి ముఖ్యమంత్రికి మధ్య పచ్చగడ్దేస్తే భగ్గుమంటుందని  సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా బాహాటంగానే చెప్పుకుంటారు. పదవి చేపట్టగానే డి.ఎల్. విషయంలో దూకుడు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ విద్యాశాఖను రెండుగా విభజించి రవీంద్రా రెడ్డి అధికారాలను బాగా తగ్గించారు. ఇదే జిల్లాకు చెందిన రామచంద్రయ్య దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఆ శాఖ మీద పట్టులేదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఆదినారాయణకు మంత్రి పదవి ఇస్తే జిల్లాలో పట్టు దొరుకుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా అనుకుంటున్నట్టు సమాచారం.

మంత్రాలకు చింతకాయలు రాలతాయా?

వైసిపి పార్టీ అధ్యకుడు జగన్ జైల్లోనూ,  తల్లి జయమ్మకు ఆర్ధ్రయిటిస్ ఉండటం వల్ల పార్టీ భాధ్యతలను జగన్ సోదరి షర్శిల తీసుకున్నారు. దానిలో భాగంగానే ఆమె ఈనెల 18 నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే తన పాదయాత్రకు స్పెషాలిటీ ఉండాలనే ఉద్దేశ్యంతోనూ, క్యాడర్ కోరిక మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. షర్మిల వెళ్ళిన ప్రతి జిల్లాలోనూ మిగతా పార్టీల నుండి వలసవచ్చే పెద్దనాయకులను తమ పార్టీలోకి తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఇదివరలో చెంచల్ గూడ జైలు కెళ్ళి జగన్ కలసి తరువాత విజయమ్మదగ్గర పార్టీలో చేరేవారు. ఇకపై అలాకాకుండా పాదయాత్ర చేపడుతున్న ప్రాతంలోనే బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజలందరి ముందే తమ పార్టీలోకి ఆహ్వానించాలని వారు యోచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలలో కలకలం పుట్టించాలన్నది  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం.  అదే సమయంలో పార్టీ క్యాడర్లో ఆత్మస్ధయిర్యం పెంచాలని కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా శరీరం కాంగ్రెస్ లోనూ ఆత్మ వైసిపిలోనూ వుండే సబ్బం హరిని పార్టీలోకి తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం.

ప్రభుత్వ పాలనలో పారదర్శకతకు పాతర

పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతామని గప్పాలు కొట్టిన ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పింది. ఇకపై గవర్నమెంట్  జివో లన్నీ రహస్యం. ప్రభుత్వం జారీ చేసిన  ఏ గెజిట్ ఐనా ఇకపై సామాన్యులకు అందుబాటులో ఉండదు. ఎందుకంటె దేనినైనా మీరు అంతర్జాలంలో చూడాలన్నా యూజర్నేమ్, పాస్ వర్డ్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రజలంతా దీన్ని ఇకపై నమోదు చేసుకొని మాత్రమే చూడవలసి ఉంటుంది. దీనిపై ప్రజాసంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  కొత్తగా వచ్చిన మార్పుల గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు కొన్ని స్వచ్చంధ సంస్ధలు రైట్ టు ఇన్ ఫర్ మేషన్ యాక్టుని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

పదమూడేళ్ల బాలికపై బహిరంగ అత్యాచారం

పదమూడేళ్ల బాలికపై ముఫ్పై ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేశాడు. చాక్లెట్లు కొనిస్తానని ఆశపెట్టి తనింటికి పిల్లను తీసుకెళ్లి దారుణంగా చెరిచాడు. పైగా తనలో ఉన్న వికృత మానసిక రూపాన్ని కూడా ప్రదర్శించాడు. బాధితురాలితోపాటు చదువుతున్న మరో నలుగురు పిల్లల్నికూడా తీసుకెళ్లి వాళ్లు చూస్తుండగానే అత్యాచారం జరిపాడు. తను చేస్తున్న వెధవపనిని చూస్తూ ఉండాలని ఆదేశాలు జారీచేశాడు. విజయనగరం జిల్లా తోటపాలెంలో ఈ దారుణం జరిగింది. భార్య ఇంట్లో లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు బాధితురాలి ఒంటిమీద బట్టలన్నీ తీసేసి తన సెల్ ఫోన్ కెమెరాతో ఫోటోలు తీశాడు. పక్కనే ఉన్న మరో నలుగురు బాలికల్నికూడా ఇలాగే ఫోటోలు తీసి, జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ ఫోటోలు అందరికీ పంచుతానని బెదిరించాడు. బాధితురాలితోపాటు ఉన్న పిల్లల్లో పదేళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలు కూడా ఉండడంతో వాళ్లకి నిందితుడి బెదిరింపు అంతగా పట్టలేదు. జరిగిన విషయాన్ని స్కూల్లో టీచర్లకు చెప్పడంతో వాళ్లు తల్లిదండ్రుల్ని పిలిపించారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యం జరిపిన నిందితుడిని దారుణంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

శంకర్రావు లెటర్ హెడ్స్ దొంగతనం నిజమేనా?

డిజిపి దినేష్ రెడ్డిపై కంప్లైంట్ చేస్తూ మాజీమంత్రి లెటర్ హెడ్ లపై యూపీఎస్సీ కి అందిన ఫిర్యాదుల వ్యవహారంలో హైదరాబాద్ ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై డీజీ ర్యాంక్ అధికారి ఉమేష్ కుమార్ అడ్వకేట్ శ్రీపాద్ ప్రభాకర్ ని ప్రశ్నించారు. తన కార్యాలయంనుంచి సంతాకాలు చేసిన లెటర్ హెడ్ లను దొంగింలించారంటూ మాజీ మంత్రి శంకర్రావు పెట్టిన కేసులో ఈ విచారణ జరుగుతోంది. మంత్రి శంకర్రావే తనకు స్వయంగా లెటర్ హెడ్స్ ని ఇచ్చారని న్యాయవాది చెబుతున్నారు. బాలాజీ దర్శన్ లాంటి అవసరాలకోసం కార్యాలయాకొచ్చే వ్యక్తులకు సిఫారసు లేఖలు ఇచ్చేందుకు తాను లెటర్ హెడ్స్ మీద సంతకాలు చేసిపెట్టానని, ఉమేష్ కుమార్ అడ్వకేట్.. తనని కలవడానికొచ్చినప్పుడు తన ఆఫీస్ డ్రానుంచి లెటర్ హెడ్స్ ని దొంగిలించాడని శంకర్రావు చెబుతున్నారు. నిజానిజాల్ని తేల్చేందుకు ఆ లేఖల్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు

25మంది డాక్టర్లపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం

అత్యాశకుపోయిన పాతికమంది డాక్టర్లకు పెద్ద బొక్కే పడింది. తమను తాము ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్లుగా ప్రచారం చేసుకుంటున్న 25మంది డాక్టర్లను మెడికల్ కౌన్సిల్ నుంచి తొలగించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. తమిళనాడుకి చెందిన ఆదిపరాశక్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఫ్యాకల్టీ మెంబర్లుగా పనిచేస్తున్నామని ప్రచారం చేసుకుంటూ ప్రాక్టీస్ ని విపరీతంగా పెంచేసుకుంటున్న ఈ డాక్టర్లమీద కొంత కాలంగా ప్రత్యేక నిఘాని ఏర్పాటుచేయడంతో మోసం బైటపడింది. ఒడిషా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ఈ జలగల్ని వలేసిమరీ పట్టుకున్నారు. ఐదేళ్లవరకూ వీళ్లలో ఎవరూ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేకుండా ఎతిక్స్ కమిటీ నిషేధాన్ని విధించింది.

హైదరాబాద్ యూనివర్సిటీలో తెలంగాణ హవా

హైదరాబాద్ యూనివర్సిటీలోకూడా తెలంగాణ పొగరాజుకుంది. అక్టోబర్ 18న జరగబోయే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలకు తెలంగాణ విద్యార్ధి సంఘం సిద్ధమౌతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మూడు విద్యార్ది సంఘాలు ఏకమై ఎస్ ఎఫ్ ఐ, ఎబివిపి, అంబేత్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. హైదరాబాద్ యూనివర్సిటీలో తెలంగాణ వేడి ఈ మధ్య కాలంలోనే మొదలయ్యిందని విద్యార్ధి సంఘాలు చెబుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రవాదులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్దులు ఏకమై పోటీకి దిగాయని విద్యార్ధి సంఘాలు నేతలు అంటున్నారు. జనరల్ బాడీ మీటింగ్ లో ఓ విద్యార్ది తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడ్డంవల్ల కొంత ఉద్రిక్త పరిస్థితికూడా ఏర్పడినట్టు తెలుస్తోంది. బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్, తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ సంఘాలు తెలంగాణ వాదం గొడుగుకింద పనిచేస్తున్నాయి. తెలంగాణ సంఘాలకు దీటుగా మిగతా విద్యార్ధి సంఘాలుకూడా ఏకమై డెమొక్రటిక్ ఫ్రంట్ కింద ఏర్పడ్డాయి. ఈ సారి ఎన్నికల చాలా వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయని పరిశీలకు గట్టిగా చెబుతున్నారు. ముందెన్నడూ హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్ది సంఘం ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితుల్ని చూడలేదంటున్నారు.

ఈనెల 20 నుండి మిల్లర్ల సమ్మె

రాష్ట్రంలో ఖరీఫ్ సాగు  చేసిన రైతులను ఇంకా సమస్యలు ఛుట్టుముడుతూనే ఉన్నాయి. అనేక వ్యయప్రయాసకోర్చి పంట పండించిన రైతులు ఇప్పుడు మిల్లర్లనుండి  అడ్డంకులను  ఎదురుకుంటున్నారు. ప్రతిసారీ లానే  ఈ ఏడాది వారు కరెంటును సాకుగా తీసుకుంటున్నారు. దీని వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుస్తున్న  ధాన్యం కొనుగోలుకు ఒక ప్రక్క ఇందిరా క్రాంతి పధకం, పౌరసరఫరాల శాఖ, ప్రాధమిక  వ్యవసాయ సహకార సంఘాలు, భారత  ఆహార సంస్ద 1779 కేంద్రాలు సిద్దంగా ఉన్నాయని  ప్రభుత్వం ప్రకటించింది. కానీ మిల్లర్లు మాత్రం కొనుగోలు చేయలేమిని పెరిగిన విద్యుత్ చార్జీల వల్ల మిల్లింగ్ చేయడం కష్టమని తేల్చింది.  ప్రతి ఏడాది ఐకెపి, పౌరసరఫరాల శాఖ, ఎఫ్ సి ఐ  సహకార సొసైటీలు సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లకు అందిస్తారు. వాటిని మిల్లింగ్ చేసి మిల్లర్లు ఎఫ్ సి ఐకి అప్పగిస్తారు. ఇందుకు గానూ ప్రతి క్వింటాలుకు 15 రూపాయలు ఎఫ్ సి ఐకి  మిల్లర్లకు చెల్లిస్తుంది. రాష్ట్రంలో 6 వేల రైస్ మిల్లులుండగా, ఏటా కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తాయి. పెరిగిన విద్యుత్ చార్జీల వల్ల మిల్లింగ్ చేయలేమని, అంతే కాకుండా 60శాతం కంటే ఎక్కువగా విద్యుత్ ను వినియోగించరాదని, ట్రాన్స్ కో మిల్లర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆదేశాలను అతిక్రమిస్తే 10 రెట్లు జరిమానా తప్పదని హెచ్చరించింది. రోజంతా మిల్లింగ్ చేస్తే 2 లకల వరకు విద్యుత్ బిల్లులకు ఖర్చు అవుతుందని అదే పది రెట్లు జరిమానా వేస్తే 12 లకలు చెల్లించాల్సి వస్తుందని, అలాగే నిరంతర కరెంటు లేక పోతే నూకలు వస్తాయని వారు చెబుతున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతులకు  ఇది శరాఘాతంగా తగులుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఇకపై సూఫర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో షాపింగ్ మాల్స్

దూర ప్రాంతాల ప్రయాణాలు ఇకపై బోరుకొట్టవు ఎందుకనుకుంటున్నారా......ఇకపై రైళ్లలో కూడా షాపింగ్ మాల్స్ ఏర్పాటు కానున్నాయి.  మనకు నచ్చిన వస్తువులను కొనుక్కుంటూనో, లేదా మనం వెళ్లే బంధు మిత్రులకో కావల్సిన  గిఫ్టలను హడావుడిగా షాపింగ్ చేసి రైలు ఎక్కకుండా తీరిగ్గా రైళ్లలోనే షాపింగ్ చేసుకోవచ్చు.  ప్రస్తుతానికి ఈ అవశకాశాన్ని శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ప్రవేశ పెడుతున్నారు. తదనంతరం అన్ని రైళ్లలోనూ ప్రవేశ పెట్టాలని రైల్యే శాఖ ప్రయత్నాలు చేస్తుంది. పర్యూఫ్స్, చర్మ ఉత్ఫత్తులు, హాండ్ బ్యాగ్స్ , గడియారాలు, ఆర్నమెంట్ నగలు, బహుమతులు అమ్మే దుకాణాలు రైళ్లలోని ఎక్స్ క్యూటివ్, ఛైర్  క్లాస్ లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  వివిధరకాలయిన చాక్లెట్లను కూడా అందుబాటులో ఉంచుతారు. ప్రయాణీకులు షాపింగ్ మాల్స్ లో   వినియోగించే  తోపుడు బండ్లద్వారా షాపింగ్ చేసుకోవచ్చు.  దీని ద్వారా రైల్వేలకు 12 శాతం లాభాలు వస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

మన్యంలో బాక్సైట్ తవ్వకాలను గవర్నర్ నిలుపుదల చేయాలి

బాక్సైట్ అనుమతులను రద్దు చేయక పోవడం రాజ్యాంగ విరుద్దమని కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ అన్నారు. విశాఖమన్యంలో గిరిజనులకు వ్యతిరేకంగా, పర్యావరణానికి విద్వంసం కలిగిస్తూ జరిపే బాక్సైట్ తవ్వకాల అనుమతులను నిలుపు చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు అమలు చేయక పోతే రాజ్యాంగ విరుద్దమని కేంద్ర గిరిజన, పంచయతీ రాజ్ శాఖ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ అన్నారు. గిరిజనుల హక్కులను కాపాడవలసిన భాద్యత ఆయా రాష్ట్రాల గవర్నర్లపై వుంటుందని ఆయనన అన్నారు. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ తరహా ఉత్తర్యులను ఇచ్చిన ధాఖలాలే లేవని అన్నారు.  విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల అనుమతులను రద్దు చేయాలని ఆరునెలల క్రిందటే రాష్ట్రగవర్నర్  కు లేఖరాసినా స్పందించలేదన్నారు.

ఇంతకీ ఆ ముగ్గురు మంత్రులు పంజాబ్ ఎందుకు వెళ్ళారు

ముగ్గురు మంత్రులు పంజాబ్ వెళ్లారు ఎందుకంటె వరికి మద్దతు ధరలు ఎలానిర్ణయించాలా అని తెలుసుకోవడానికి వెళ్లారు. ఆ మంత్రులు వ్యవసాయ మంత్రి కన్నా లక్మీనారాయణ, రెవెన్యూమంత్రి రఘువీరారెడ్డి, ఫౌరసరఫరాల మంత్రి శ్రీధర్ బాబు వాళ్లంతా దాన్యం మద్దతుధర ఎలా నిర్ణయించాలని తెలుసుకోని వచ్చారు. దీనికి వారు మూడు రోజులు పంజాబ్ లో గడిపారు. పంజాబ్ ఏమన్న అధికార కాంగ్రెస్ దా అంటే అదీకాదు. వరి మన రాష్ట్రానికి కొత్తగా పండించిన పంటా అంటే అదీకాదు. మరి ఎందుకు వెళ్లినట్టూ .....వరినాటటానికి వర్షంలేదు. బోరువేధ్దామంటే కరెంటు ఇవ్వలేదు. ఎరువులకోసం క్యూలో నించుంటే పోలీసుల లాఠీలు రైతులపై విరిగాయి. మొత్తానికి కొన్ని జిల్లాలు క్రాఫ్ హాలిడే ప్రకటించేశారు.సీజన్ అయిపోయేవరకు ముఖ్యమంత్రితో సహా ఎవరూ రైతులకు చేసింది  ఏమీ లేదు.  పరిస్ధితులు అనుకూలించక వేల హెక్టార్ల పొలాలు పంటలు వేయకుండా పడి ఉన్న ఈ సంవత్సరంకి మద్దతు ధర కోసం మాత్రం అద్యయనం చేసివచ్చారా మంత్రివర్యులు. దీంతో సహచర మంత్రులే సెటైర్లు వేస్తూ నవ్వుకుంటున్నారట.

మొబైల్ లే ప్రాణం.....మొబైల్ వల్లే మరణం

మొబైల్ లేందే నిముషం కూడా గడవదు. సెల్ లో ఛార్జింగ్ అయిపోతే ఏంచెయ్యాలో తోచదు. గుడ్మార్నింగ్, నుండి గుడ్ నైట్ వరకు ఎంత సొల్లయినా సెల్ వల్లనే కదా...... తిండి, బట్ట తర్వాత సెల్ తోనే ప్రపంచం అయిపోయింది. ప్రపంచ జనాభా 700 కోట్లయితే దానిలో దాదాపు 600 కోట్లమందికి సెల్ ఫోన్లున్నాయి. చైనాలో 100 కోట్ల సెల్ లతో మొదటి స్ధానంలో ఉంటే ఈ సంవత్సరాంతానికి మనం కూడా 100 కోట్ల సెల్ ఫోన్ల వాడకంతో చైనాను చేరుకుంటాం. సెల్ చేతిలో ఉందంటే అరచేతిలో వైకుంఠం వున్నట్లే. ప్రతి ఏడాది మనదేశంలో సెల్ వాడకం 11 శాతం వరకు పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. 1973కి ముందే పోర్టబుల్ ఫోన్లు ఉన్నప్పటికీ 1990 కిఅందరికి తెలిసింది. మొదట్లో కేవలం డబ్బున్న వారికే పరిమితమైంది. తర్వాతి పరిణామంలో గ్లోబలైజేషన్ పుణ్యమా అని సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చాయి. నిజానికి 1983లోనే కమర్షియల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినా తొంభైయవ దశకంలో అందరికీ అందుబాటులోకి వచ్చాయి. మాట్లాడండి...మాట్లాడుతూనే వుండండి అంటూ సర్వీస్ ప్రొవైడర్లు చెబుతూ చెవూలూదరగొట్టినా.....అరనిముషం కన్నా తక్కువ వ్యవధిలో మాటను కలిపే యంత్రం సెల్ కాకుండా ఇంకేముంటుంది. అయిదారు సంవత్సరాల క్రితం కేవలం మాట్లాడటానికే ఉపయోగపడే మొబైల్ రోజురోజుకీ తన సేవలను పెంచుకుంటూ పోతుంది. ఈరోజు సరిక్రొత్త మోడల్ రేపటికి పాతబడిపోతుంది. ఇప్పుడు సెల్ ఫుల్ జీవితం మన ముందుంది. అంటె గుండె జబ్బులున్న వారికి డాక్టర్ ఎడ్యయిజ్ లతోపాటు, డాక్టర్ వచ్చేవరకు రోగికి సేవలు అందించే సరికొత్త మోడల్స్ మార్కెట్ లోకి రాబోతున్నాయి. సెల్ నుండి వెలువడే తరంగాలకు హాని కలిగించే వైరస్ ను చంపుతాయి.  సెల్ ఈజ్ హెల్ అని పర్యావరణ వేత్తలు పిచ్చుకలు, తేనెటీగలు వీటివల్ల అంతమయ్యాయని, వీటివల్ల  మతిమరుపు, డిప్రషన్ వస్తాయంటున్నారు. కాబట్టి మొబైలే ప్రాణం మొబైల్ వల్లే  మరణం.

బాబుకు నీరాజనం పడుతున్న మేథావులు!

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా దాగుంది. ప్రజలు తమ తరుపున మాట్లాడగలమని భరోసా ఇచ్చేవారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో తన వయస్సును సైతం లెక్కచేయకుండా తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు మీ కోసం వస్తున్నా పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర నిర్ణయం తీసుకోగానే సినీనిర్మాతలు, దర్శకులు, కొందరు విద్యావేత్తలు మద్దతు ప్రకటించారు. పాదయాత్ర ప్రారంభం నుంచి చంద్రబాబు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల అవినీతిని ఎండగడుతూనే వచ్చారు. వీటితో పాటు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీని పిల్లకాంగ్రెస్‌ అని, అవినీతి ఊడ అని, తాజా అవినీతిపుట్టక ఉన్న పార్టీ అని రకరకాలుగా దునుమాడుతూనే వచ్చారు. ఆ పార్టీల్లోని నేతలపై కూడా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి స్పందన రావటం ప్రారంభమైంది. ఇటీవల సిపిఐ చంద్రబాబు యాత్రలో జతకట్టింది. దీని తరువాత బాబు తనయాత్రలో భాగంగా పేదలను, మధ్యతరగతి వర్గాలను దగ్గర తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈయన పాదయాత్ర మరింత ఆకర్షణీయంగా మారింది. అసలు సమస్యలన్నీ ఎదుర్కొనే ఈ రెండింటిపై చంద్రబాబు దృష్టిసారించటం మేథావుల్లో కూడా ఆలోచనలు రగిలిస్తోంది. ఫలితంగా ఒక వర్గమైన ఐటీనిపుణులు బాబు బాహాటంగా తమ మద్దతు, లక్షరూపాయల విరాళం కూడా అందించారు. ఇలా మారుతున్న సమీకరణలు చూస్తుంటే ప్రభుత్వవ్యతిరేకతపై బాబు గురిపెట్టిన బాణం ఆయన్ని అందలం ఎక్కిస్తుందా? ఏమో! ఏమైనా జరగొచ్చంటున్నారు ఐటీనిపుణులు.