బాబు పాదయాత్రలకు ఉలిక్కిపడుతున్న వైకాపా?
posted on Oct 9, 2012 @ 12:12PM
తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు సాగిస్తున్న మీ కోసం వస్తున్నా పాదయాత్రలకు మంచిస్పందన లభిస్తోంది. బాబు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదరణ వస్తోందని తెలుగుదేశం శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ పాదయాత్రలకు ఉలిక్కిపడుతోంది. ప్రత్యేకించి ఈ పార్టీకి కీలకమైన రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి స్పందన రావటం వైకాపాకు అస్సలు మింగుడుపడటం లేదు. పైగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చెంచల్‌గూడా జైలులో ఉన్నారు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా నిరాకరించటంతో మరో ఆర్నెళ్లు ఆయన కోసమే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఈలోపు క్యాడర్‌ను కట్టడి చేయటం కష్టమని వైకాపా నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే అత్యవసర సమావేశం కూడా అయ్యారు. ఈ సమావేశంలో తమ క్యాడర్‌ను ఎలా నిలబెట్టుకోవాలనే అంశంపై చర్చించారు. ఇటీవల వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి రాష్ట్రంలో తాను పర్యటించినప్పుడు త్వరలో జగన్ వచ్చి మిమ్మల్ని కలుస్తాడని చెప్పారు. ఎంత ఆలస్యమైనా సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ సంపాదించేయగలమన్న ధీమాతోనే ఆమె ఆ మాట ఇచ్చారు. కానీ, పరిస్థితి తారుమారు అయింది. సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వటానికి నిరాకరించటంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు జారుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరంతా 2014కు వైకాపా అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో పార్టీలో చేరినవారే. అలానే కొన్నాళ్లు కేసు నడిచినా జగన్ బయటికి వచ్చి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సొమ్ము బయటపెడతారని కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నమ్మారు. అనుకోకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఈ కేసు దర్యాప్తుతో పాటు అక్రమం అని తేలిన ఆస్తులను సీజ్ చేయటం ప్రారంభించింది.
దానితో పాటు సుప్రీంకోర్టు కూడా సిబిఐను 2013మార్చిలోపు జగన్ కేసును పూర్తిస్థాయి విచారణ చేయమని ఆదేశించింది. ఈ ఆదేశం అందుకున్న సిబిఐ సిబ్బంది కొరతను ఢల్లీిలో తమ విభాగం సహాయంతో తీర్చుకుని సూట్‌కేసు కంపెనీలపై నిఘా పెట్టింది. దీంతో ఈ కంపెనీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా సిబిఐకు లభ్యమవుతాయన్న నమ్మకం రాష్ట్రవ్యాప్తంగా పెరిగింది. దీంతో అరదండాలు, సీజ్‌లు పూర్తయ్యాటప్పటికి వైకాపాకు ఉన్న ఆస్తి హారతి కర్పూరం అవుతుందని మేథావులు సైతం తేలుస్తున్నారు. అప్పుడు తిరిగి పాతస్థితికి వచ్చిన జగన్ ఏమీ చేయలేరని కూడా వైకాపాలో ఉన్న నేతలు, కార్యకర్తలూ కూడా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి వెనక్కి వెళదామంటే కాంగ్రెస్ మొహం చూడటానికి కార్యకర్తలు ఇష్టపడటం లేదు. ఎందుకంటే జగన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రుల అవినీతి రచ్చ రచ్చ అవుతోంది. ఈ దశలో ఆశావహంగా తెలుగుదేశం పార్టీ ఒక్కటే వైకాపా కార్యకర్తలను ఆకట్టుకుంటోంది. పైగా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన పార్టీని పటిష్టం చేసుకునేందుకు పాదయాత్రలు చేయటం వల్ల గ్రామాల్లో కేడర్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలానే ప్రభుత్వ వ్యతిరేకత బాబుకు బాగా ఉపయోగపడగలదని మీడియా కూడా విశ్లేషిస్తోంది. ఈ నేపథ్యంలో మరో గత్యంతరం లేక తెలుగుదేశం పార్టీ వైపు వైకాపా కార్యకర్తలు దృష్టి సారిస్తున్నారు. ద్వితీయశ్రేణి నేతలు కూడా బాబుకు వస్తున్న స్పందనను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చివరికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే 2014 ఎన్నికల్లో పోటీ పడతాయన్న మాట నిజం కాబోతోందని రాజకీయపరిశీలకులు ప్రస్తుత పరిస్థితిని బట్టి స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ వైకాపాగా ఆ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ సమయానికి నేతలు మాత్రమే మిగులుతారని కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు బలంగా నమ్ముతున్నారు. మునిగిపోయే ఓడ నుంచి అధికారంలోకి వచ్చే అవకాశమున్న టిడిపికి వచ్చేయండని అన్ని జిల్లాల్లోని తెలుగుదేశం పార్టీ నేతలు ఆహ్వానం పలుకుతున్నారు. దీంతోతమ వంతు ఎప్పుడు వస్తే అప్పుడు పార్టీ మార్పును ప్రకటించేయవచ్చని ఎదురుచూస్తున్నారు. వైకాపా నేతలు మాత్రం వలసల నివారణకు గట్టిగానే కసరత్తులు చేస్తున్నారు. కార్యకర్తలకు నేతలు టచ్‌లో ఉండాలని వైకాపా ముఖ్యనేతలు వైవిసుబ్బారెడ్డి, మైసూరారెడ్డి తదితరులు కోరుతున్నారు. తక్షణం ఏదో ఒక కార్యక్రమం చేయకపోతే తమ భవిష్యత్తు అగమ్యగోచరమవుతుందన్న పరిశీలకుల సూచనలకు తలగ్గిన ముఖ్యనేతలు మళ్లీ ఓదార్పు యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. నిన్నటిదాకా జగన్ ఈ యాత్రలు చేస్తే ఇకపై విజయమ్మ దాన్ని కొనసాగించాలని, ఇడుపులపాయ నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్రలకు ఆమెను సన్నద్ధం చేయాలని వైకాపా సమావేశంలో సూచనలు వచ్చాయట. దీనిపై విజయమ్మ, జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.