షర్మిల ఓదార్పుయాత్ర? లక్ష్యం చంద్రబాబేనా?
posted on Oct 9, 2012 @ 2:16PM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల ఇకపై 2500కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు. ఆమె యాత్ర ఓదార్పుయాత్ర అని కాసేపు, జనచైతన్యయాత్ర అని మరికాసేపు వైకాపా నేతలు అంటున్నారు. అయితే అంతిమలక్ష్యం మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీ కోసం వస్తున్న యాత్రకు ప్రత్యామ్నాయం. బాబు యాత్రల ద్వారా రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగితే తమ పార్టీకి భవిష్యత్తు ఉండదన్న భయంతోనే వైకాపా ఈ యాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకించి చంద్రబాబు తన యాత్రలో స్పందన భారీగా ఉంటుందని ఊహించకుండానే యాత్ర మొదలుపెట్టారు. ఈ వందకిలోమీటర్ల దూరం నడిచేటప్పటికే స్పందన భారీస్థాయిలో కనిపిస్తోంది. దీని వల్ల వైకాపా ఇప్పుడు డిఫెన్సులో పడింది. ఏ జనబలం చూసుకుని తాము ఇంతకాలం కాంగ్రెస్‌పై పెత్తనం చేసేందుకు ప్రయత్నించామో అది దెబ్బతింటుందనే భయంతోనే ఈ యాత్రను ఆ పార్టీ డిజైన్ చేసింది. సుమారు 2,500కిలోమీటర్ల పాదయాత్ర వల్ల ఇప్పుడు పెద్దగా ఒనగూరే ప్రయోజనమేముంటుందనేది ఒకసారి పరిశీలించాలి. జగన్ యాత్రలు ఆగిపోవటం వల్ల జనంలో ఉన్న సానుభూతి కొంత వరకూ తగ్గింది. ఉప ఎన్నికల్లో ప్రభావం చూపిన సానుభూతి మళ్లీ అవకాశం వచ్చినప్పుడు కూడగట్టుకోవచ్చు అనుకుంటే బాబు పాదయాత్రలకు స్పందన పెరిగింది. తటస్తులు బయటకు రావటం ప్రారంభించారు. ఈ తటస్థులను చూసుకునే జగన్ ధీమాగా ఉండేవారు. ఇప్పుడు బాబు పాదయాత్రలో ఎక్కువమంది తటస్తులున్నారని నివేదికలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత, లంచగొండితనం, అవినీతి వంటి అంశాలు తటస్థులను ఏదో ఒక పార్టీవైపు నడుపుతాయి. అటువంటి తటస్థులను ఇప్పుడు చంద్రబాబు వైపు చూస్తున్నారని ఓ రహస్యనివేదిక వైకాపాకు అందింది. దీంతో తమకు బలం అనుకున్న తటస్థులు, కార్యకర్తలు చంద్రబాబువైపు మారిపోకుండా ముందస్తు చర్యలు అవసరమని వైకాపా గుర్తించింది.
ఈ నేపథ్యంలోనే జగన్ రావటం లేదని వెనక్కి వెళ్లిన తటస్థులను, కార్యకర్తలను షర్మిల ఆకట్టుకోగలరని వైకాపానేతలు ఆశిస్తున్నారు. అందుకే ఈ యాత్రల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ యాత్రలే కనుక సక్సెస్ అయితే వైకాపాకు ఆదరణ పెరుగుతుంది. ఒకవేళ కాకపోతే వైకాపాపై తగ్గిన నమ్మకం ఎంతో తేల్చుకోవచ్చు. అందుకని ముందుగా ఓదార్పు యాత్ర కింద షర్మిలను పంపిద్దామనుకున్నారు. ఒకవేళ ఉపఎన్నికల్లో మాదిరి షర్మిల ఆవేశపూరిత ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటే జనచైతన్యయాత్ర అవుతుందని వైకాపానేతలు అనుకుంటున్నారు. అయితే పార్టీ పరిస్థితి, నిజమైన స్పందన ఎటు ఉంది తేల్చుకోవాలంటే షర్మిల యాత్రే కీలకం అన్న నిర్ణయానికి మాత్రం రాజకీయపరిశీలకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పరిణతి చెందిన పార్టీలతో సమానంగా తమ పరిస్థితిని అంచనా వేసుకోవటం వైకాపా తీసుకున్న చురుకైనచర్య అని అభివర్ణిస్తున్నారు. అయితే చంద్రబాబు యాత్రపై షర్మిల ప్రభావం ఎంతమాత్రం కనిపించదని అంచనా వేస్తున్నారు.