జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ దూకుడు
posted on Oct 11, 2012 @ 11:27AM
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ లో ఈడీ చాలా దూకుడుగా వ్యవహిరిస్తోంది. మరిన్ని ఆస్తుల్ని అటాచ్ చేసేందుకు చకచకా మార్గాల్ని సిద్ధం చేస్తోంది. సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగా సమాంతర విచారణ చేపట్టిన ఈడీ తొలివిడతగా కొన్ని ఆస్తుల్ని జప్తు చేసింది. మరో రెండుమూడు వారాల్లో తర్వాతి చార్జ్ షీట్ ని ఆధారం చేసుకుని మరిన్ని ఆస్తుల్ని జప్తు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. జగన్ కంపెనీలకు సంబంధించిన కోట్ల విలువచేసే ఆస్తుల్ని ఈడీ ఈ నెల నాలుగోతేదీన జప్తు చేసింది. రూల్స్ ప్రకారం నెలరోజుల్లోపే జప్తు చేసిన ఆస్తులకు సంబంధించిన వివరాలను ఊటంకిస్తూ కేసు నమోదుచేయాల్సుంటుంది కనుక దానికి సంబంధించిన వ్యవహారాల్లోనూ ఈడీ తొందరపడుతోంది. వాన్‌పిక్ చార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాలను ఇవ్వాల్సిందిగా ఈడీ చేసుకున్న విన్నపాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు మన్నించింది. వాటిని ఇచ్చేందుకు అంగీకరించింది. ఓఎంసీ, ఎమార్, జగతి కేసుల్లో, మనీలాండరింగ్ కేసు, ఫెమా చట్టాల ఉల్లంఘన కేసులపై ఈడీ దృష్టి పెట్టింది. ఆయా కేసుల్లో నిందితులను ప్రశ్నించేందుకు మే నెలలో అనుమతి కోరినపుడు ఈడీకి తాము చెప్పాల్సింది ఏమీ లేదని, తమ వద్ద తగిన సమాచారం కూడా ఏమీ లేదని నిందితులు అభ్యంతరం చెప్పారు. దీనిని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. వారిని ప్రశ్నించేందుకు ఈడీని అనుమతించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు భావిస్తున్నారు.