ఇంజినీరింగ్ చదువులకు గ్రహణం
posted on Oct 9, 2012 @ 6:42PM
వేలంవెర్రికి వెనకాముందూలేదని వెనకటికొక సామెత.. ఇంజీనిరింగ్ కాలేజీల్ని పెట్టే విషయంలో చాలామంది ఈ సామెతనే అనుసరించారు. రాష్ట్రంలో అసలు చదువంటే ఇంజినీరింగ్ మాత్రమే అన్న ఓ అపోహ కొన్నేళ్లపాటు రాజ్యమేలింది. చదివితే ఇంజినీరింగ్ చదవాలి, చేస్తే సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలి అనే గాలివాటానికి కొట్టుకుపోయిన చాలామంది మంది విద్యార్దులు పోలోమని ఇంజినీరింగ్ చదువులకోసం ఎగబడ్డారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఇంటా బైటా ఉన్న డిమాండ్ కారణంగా అప్పట్లో ఇంజినీరింగ్ చదువులు ఎ వన్ చదువులుగా చెలామణీ అయ్యాయి. డిమాండ్ ని తట్టుకోలేక కొత్త కొత్త కాలేజీలు పుట్టుకొచ్చాయ్. నిజానికి భవిష్యత్ ని అంచనా వేసి ఆచితూచి స్పందించాల్సిన ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులిచ్చేసింది. కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన కాలేజీల్లోంచి వందలు, వేలు, లక్షలకొద్దీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బైటికొచ్చారు. తీరా ఇంజినీరింగ్ పూర్తయ్యాకగానీ అసలు విషయం ఆ కోర్స్ పూర్తి చేసినవాళ్లకు బోధపడలేదు. ఉన్నదాంట్లో సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న ఒద్దికైన కొందరు అభ్యర్ధులు తెలివిగా తక్కువజీతమైనా సరే భద్రత ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వోద్యోగాల్లో చేరిపోయారు. ప్రైవేట్ కోర్సులు చేసి ఇరగదీస్తే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుందనుకుని లక్షలు ఖర్చుపెట్టినవాళ్లు తీరా ఆ కోర్సులు పూర్తయ్యాక మార్కెట్ పరిస్థితిని చూసి చతికిలపడ్డారు. రిసెషన్ పారిపోయిందని కంపెనీలన్నీ పైపైకి చెప్పుకుంటున్నా.. కాస్త ఎక్కువ జీతం తీసుకునే ఉద్యోగుల్ని అవసరాన్నిబట్టి సాగనంపే ప్రయత్నాలు దాదాపుగా అన్ని సంస్థల్లోనూ సాగుతూనే ఉన్నాయ్. కారణాలు ఏవైనా కావొచ్చు.. విషయం మాత్రం ఒక్కటే.. సాగనంపడం.. మంగళం పాడేయడం. ఇంజినీరింగ్ చదువుకున్నోళ్ల పరిస్థితి కాస్త గడ్డుగానే ఉందన్న ప్రచారం ఆనోటా ఈనోటా పాకి చాలామంది చెవుల్లో పడింది. ఇంజినీరింగ్ చదువులకు ఉన్నట్టుండి డిమాండ్ పడిపోయింది. చాలా కాలేజీలు సరైన స్ట్రెంత్ లేక మూతపడే దశకు చేరుకున్నాయి. వంద, నూటయాభై సీట్లుమాత్రమే భర్తీ అయిన కాలేజీలు, సరైన అనుమతులు తీసుకుని తమదగ్గరి చేరిన విద్యార్ధులందరినీ వేరే కాలేజీల్లో కలిపేస్తున్నాయి. ఇప్పటికే రెండొందల ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఎఐసిటీఈకి తామిక కాలేజీలు నడపలేమని లేఖలు పంపించాయ్. మరో 150 కాలేజీలు ఇలాంటి లేఖల్ని తయారు చేసుకునే దశలో ఉన్నాయ్.. పరిస్థితి ఇంత దారుణంగా తయారు కావడానికి కారణం ఎవరన్న ప్రశ్న ఉదయిస్తే.. నూటికి నూరు శాతం ప్రభుత్వం బాధ్యతారాహిత్యమే అన్న సమాధానం గోడక్కొట్టిన బంతిలా తిరిగొస్తుంది. నిజానికి వేలం వెర్రిగా సాగుతున్న కొత్త కాలేజీల పర్వాన్ని ప్రభుత్వం ముందునుంచే అడ్డుకునుంటే ఈ రోజున ఈ పరిస్థితి ఎదురయ్యేదికాదు. విచ్చలవిడిగా అనుమతులిచ్చుకుంటూ పోతే పరిస్థితి ఇలాగే తయారవుతుందన్న కనీసం జ్ఞానం ఏలికలకు లేకపోతే పాయె కనీసం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే కీలకస్థానాల్లో ఉన్న అధికారులకైనా ఉండఖ్కర్లేదా..? కరవమంటే కప్పక్కోపం, విడమమంటే పాముక్కోపం, మధ్యలో మనకెందుకు కళ్లు మూసేసుకుని, మనసు చంపేసుకుని రాజకీయనాయకులు చెప్పినట్టు చేస్తే పోలా అనుకునే అధికారుల బాధ్యతా రాహిత్యం ఇప్పుడు ఇంజినీరింగ్ చదువులకు గ్రహణమై గట్టిగా పట్టింది. పట్టు విడిచే రోజు ఎప్పుడొస్తుందో ఏమోనని కాలేజీల యాజమాన్యాలు ఆశగా ఎదురుచూడ్డంతప్ప ప్రస్తుత పరిస్థితుల్లో చేయగలిగిందికూడా ఏమీ లేదన్న సత్యం, అటు ప్రభుత్వానికీ, అధికారులకూ.. ఇటు కాలేజీల యాజమాన్యాలకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది.