బాబు భవిష్యత్‌కు బంగారుబాట !
posted on Oct 9, 2012 @ 2:28PM
రాజకీయాలు అనగానే ప్రజాసేవ అన్న మాట వినిపిస్తుంది. ఈ మాట అన్ననేతలు నిజంగానే ప్రజాసేవ చేస్తున్నారా? లేదా? అన్న విషయం మాత్రం పక్కన పెడితే ప్రజల్లో ఉన్న వారికే ఆదరణ లభిస్తుందని చెప్పాలి. గత ఉపఎన్నికల ఫలితాలు ప్రజల బలం ఏమిటో తెలియజేశాయి. అందుకని ప్రజల దగ్గరికి వెళ్లటానికి ముందు అధికారపార్టీ కాంగ్రెస్ ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని చేపట్టింది. అలానే ఎటువంటి చిన్న అభివృద్థి కార్యక్రమం ఏర్పాటు చేసినా కాంగ్రెస్ పెద్దలు క్యూలు కడుతూ మరీ ప్రజల ముందుకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే తమ భవిష్యత్తు ప్రజల చేతిలో ఉందన్న విషయం ఆలస్యంగా గుర్తించినా కాంగ్రెస్ కార్యక్రమాల ప్రణాళిక నిరంతరంగానే ఉంది. ఇక ప్రతిపక్షపార్టీగా పేరొందిన తెలుగుదేశం పార్టీ కూడా ఇటీవల ప్రజలను దగ్గర చేసుకోవాలని గుర్తించింది. అందుకే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మీకోసం వస్తున్నా పాదయాత్రలను నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రల ద్వారా ఆయన ఇప్పటికే పలురకాల అంశాలపై అథ్యయనం చేస్తున్నారు. అలానే ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న సమస్యలపై అప్పటికప్పుడే తన స్పందనను తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బాబు పాదయాత్రలకు బలమైన స్పందన తీసుకువస్తోంది. ఈయన ముందుగా ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన రావటం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయవిశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. తెలుగుదేశం పార్టీపై ఎటువంటి సానుభూతి చూపకుండా ప్రజలు ఓ మంచి నాయకుడిని ఆదరించినట్లు ఉండటం ఈ యాత్ర ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 62ఏళ్ల వయస్సులోనూ పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని బాబు ప్రయత్నించటాన్ని పలువురు అభినందిస్తున్నారు. అంతేకాకుండా స్వాగతిస్తున్నారు కూడా. ఎప్పుడు రాయలసీమ వెళ్లినా చంద్రబాబు ముందుగా కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్షనిజం గురించి ప్రస్తావించేవారు. అయితే ఈసారి ఆయన తన ప్రసంగంలో దీనికి ప్రాధాన్యత ఇవ్వకుండా స్థానికంగా ఎదురవుతున్న సవాళ్లు తెలుసుకోవటం రైతులను ఆకట్టుకుంది. అలానే వ్యాపారుల నష్టాలను అడిగి తెలుసుకోవటం వారికి ఆసక్తిని రేపింది. ఇలా తనదైన శైలిని కొంత మార్చుకుంటూ చంద్రబాబు యాత్ర ముందుకు సాగుతోంది. ఇదంతా చూస్తుంటే ఈ యాత్ర బాబు భవిష్యత్‌కు బంగారు బాట కాగలదని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.
ఇక నిన్నటి దాకా కొత్తపార్టీ అనిపించుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కూడా తమకున్న జనబలాన్ని నిలబెట్టుకోవాలని ప్రజల ముందుకు బయలుదేరింది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి తనకు బదులుగా సోదరి షర్మిలను పంపించేందుకు అనుమతించటంతో ఈ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. చంద్రబాబు మాదిరి సుదీర్ఘయాత్ర కాకుండా 2,500కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్ర ద్వారా జగన్ గతంలో నింపిన ఉత్సాహాన్ని మళ్లీ రేకెత్తించాలని వైకాపా ఆశపడుతోంది. అయితే జగన్ చంచల్‌గూడా జైలులో ఉండటం, ఇడి ఆయన ఆస్తుల సీజ్‌పై దృష్టి సారించటం కూడా స్పందన తగ్గటానికి కారణమవ్వొచ్చని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కార్యకర్తలను కాపాడుకోవటమే ఈ పార్టీ ప్రధానలక్ష్యం. ఇలా రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు ప్రజల ముందు తిరుగుతుంటే భారతీయజనతాపార్టీ మాత్రం రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునే చిన్న ప్రయత్నం కూడా చేయటం లేదు. ప్రత్యేకతెలంగాణాకు మద్దతు ఇచ్చినందుకు ఆ పార్టీ తెలంగాణాకే పరిమితం కావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నాలు కూడా ఈ పార్టీ చేయటం లేదు. ఇక కమ్యూనిస్టుపార్టీలు ప్రస్తుతం ఉద్యోగసంబంధిత అంశాలపైనే దృష్టిసారిస్తున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి రాజకీయపట్టు సాధించే దృష్టి ఈ రెండు పార్టీలకు లేకపోవటంతో ఇవి ప్రజలతో మమేకం కాకపోయినా వీటి గురించి చర్చించే వారే పెద్దగా ఉండకపోవచ్చు.