సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందా?

ప్రభుత్వ నిర్వహణలో లాభాల బాట పట్టే పరిశ్రమల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఇటువంటి తరుణంలోనూ సింగరేణి పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశావహంగా నిలుస్తోంది. ప్రతీఏడాది లాభాలబాట పట్టి క్రమశిక్షణకు పెద్ద నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని గమనించి 1999`2000లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్మికులకు లాభాల వాటాను ప్రకటించారు. వచ్చిన లాభంలో కొంత కార్మికులకు చేరే ఈ అవకాశం (అప్పటి నుంచి సుమారు 12ఏళ్లుగా) కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కొనసాగించటం పట్ల ఎందరో అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 17శాతం లాభాల వాటాను కార్మికులకు ప్రకటించింది. అయితే కార్మికులు ఈ ఏడాది వాటా బాగా పెరుగుతుందని ఆశించారు.  కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికల్లో సిఐటియు అయితే 25శాతం లాభాలవాటా సాధిస్తానని హామీ ఇచ్చింది. ఇటు ఐఎన్‌టియుసి, సిఐటియు రెండు యూనియన్లూ ప్రభుత్వంతో ఒప్పందాల్లో ఘనమైన పాత్ర పోషించేవి. ఆ రెండు యూనియన్లలో ఏ ఒక్క సంఘం గెలిచినా వాటా పెరిగి ఉండేదని కార్మికులు అనుకుంటున్నారు. తెలంగాణాప్రాంతీయ సంఘానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్ల టిబీజికేఎస్‌ గుర్తింపు సంఘంగా గెలుపొందింది. తాము మళ్లీ అదనపు వాటా కోసం పోరాడతామని ఆ యూనియన్‌ నాయకులు చెప్పారు.

తెలంగాణా జర్నలిస్టులపై కక్ష ఎందుకు?

దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా కవరేజీకి వెళ్లిన తెలంగాణా విలేకరులను, నమస్తే తెలంగాణా విలేకరులను పోలీసులు ఎందుకు అనుమతించలేదు? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం అయి ఉంటే సమాచారశాఖ ద్వారా తెలియజేయాలి కానీ, పోలీసులు ఎందుకు ప్రత్యక్షజోక్యం చేసుకున్నారు? మనపత్రిక, మన ఆత్మగౌరవం నినాదంతో ‘నమస్తే తెలంగాణా’ తెలంగాణా ప్రాంతంలో ఓ కీలక భూమిక నిర్వహిస్తోంది. అటుతెలంగాణా ఉద్యమంలోని అన్ని అంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాలకు ఆ పత్రికలో చోటు కల్పించింది. అటువంటప్పుడు కత్తి మీద సాములాంటి జర్నలిస్టులను పోలీసులు, ప్రభుత్వాలు సరైన కోణంలో ఎందుకు చూడటం లేదు? దీంతో తెలంగాణా జర్నలిస్టులను వేరుగా చూసే పని పోలీసులది కాదు కదా! అలా ఎందుకు చూశారు? దీని వెనుక ఉన్న పాత్రధారులను బయటపెట్టాలని ఆ పత్రిక జర్నలిస్టులు బ్లాక్‌డేను పాటించారు. తమ వెబ్‌సైట్‌లో కూడా నల్లరంగును ప్రదర్శించటం ద్వారా నిరసన వ్యక్తం చేశారు.  జాతీయ, అంతర్జాతీయ మీడియా ఈ నిరసనకు సంఫీుభావం ప్రకటించింది.  సచివాలయం 'సి' బ్లాకు వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గన్న కొందరు పాత్రికేయులను పోలీసులు అరెస్టు కూడా చేశారు.  ఈ ఘటనపై విచారణ జరిపిస్తానని సమాచార శాఖామంత్రి డికె అరుణ తెలిపారు.

కేసిఆర్‌ ఢల్లీ లాబియింగ్‌పై హారీష్‌కు అనుమానాలు

  ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇప్పట్లో తేలే అంశంలా కనిపించటం లేదు.  కేవలం టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ మినహా మిగిలిన వారెవరూ ప్రత్యేకతెలంగాణాకు అనుకూలంగా మాట్లాడటం లేదు. ఇప్పటి దాకా కేసిఆర్‌ తాను చర్చలు జరిపామని చెబుతున్న ఎఐసిసి నేత వాయలార్‌ రవి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌ వంటి ప్రముఖులు కూడా తెలంగాణాకు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా, తెలంగాణాను వ్యతిరేకిస్తూ వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఆజాద్‌ అయితే నేరుగా సిఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. వాయలార్‌ రవి తన మాటల్లో ప్రత్యేకతెలంగాణాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలా ఉంటే కేసిఆర్‌ కాంగ్రెస్‌ లాబీని నమ్ముతున్నారు. కేసిఆర్‌ మేనల్లుడు హరీశ్‌రావు మాత్రం తనకేమీ పట్టదన్నట్లు కాంగ్రెస్‌ను దునుదుమలాడున్నాడు. కేసిఆర్‌ ఢల్లీ లాబీయింగు హరిశ్‌రావు కూడా నమ్మడం లేదు. దీంతో ఒకవైపు కాంగ్రెస్‌ అధిష్టానంలోని నేతలు కూడా కేసిఆర్‌ సహన్ని పరీక్షిస్తున్నారు. తాజాగా జెఎసి బృందం కూడా ప్రత్యేక తెలంగాణాపై పెదవి విరిచింది. లాబీయింగ్‌పై కేసిఆర్‌కు ఉన్న నమ్మకం దృష్ట్యా అలా మాట్లాడుతున్నారని సర్దుకుంది.  

నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు కష్టకాలమే

  వచ్చే నెల్లో నామినేటెడ్‌ పదవులు ఇచ్చేస్తామని పది నెలల నుంచి నెట్టుకొస్తున్న రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రధాని సాయంతో ఈ విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. అధిష్టానం దృష్టిలో నామినేటెడ్‌ పదవుల భర్తీ ఉందన్న విషయాన్ని జీవవైవిధ్య సదస్సు కోసం హైదరాబాద్‌ వచ్చిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్వయంగా సిఎంకు చెప్పారు. దీంతో వేడి మీద ఉండగానే పనులు చక్కబెట్టుకోవాలన్న సామెత చందంగా సిఎం హుటాహుటిన ఢల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఎఐసిసి ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంధీతోనూ, ఇతర నాయకులతోనూ ఈ నామినేటెడ్‌ పదవులపై చర్చిస్తారు. ప్రత్యేకించి ఎన్నికల్లో నామినేటెడ్‌ పదవుల అవసరం తెలియజేసేందుకు సిఎం స్వయంగా రూపొందించుకున్న ఒక డిజైన్‌ను కూడా కాంగ్రెస్‌ అధిష్టానంకు చూపనున్నారు. ఈ డిజైన్‌ ఆధారంగా వివరణ ఇస్తే అధిష్టానం ఖచ్చితంగా తన అభిప్రాయంతో ఏకీభవిస్తుందని సిఎం భావిస్తున్నారు. అందుకే ఆయన ఇంకా తెలివిగా ఓ కొత్త ఎత్తుగడ కూడా వేశారు. కేంద్ర మంత్రుల గురించి తనతో చర్చించేటప్పుడు రాష్ట్రం నుంచి ఎవరైనా వస్తే వారి ద్వారా కూడా నామినేటెడ్‌ పదవుల అవసరాన్ని చెప్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇకనైనా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయకపోతే నాయకలను, కార్యకర్తలను కట్టడి చేయడం కష్టమని ఆయన అధిష్టానానికి గట్టిగా చెప్పినట్లు తెలిసింది.  ఇప్పటిదాకా  కాంగ్రెస్‌ అధిష్టానం నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందని  సిఎం ఆశిస్తున్నారు. ఏమైనా ఢల్లీలో ఈ నామినేటెడ్‌ పోస్టులపై ఒక ఖచ్చితమైన హామీ పొందాలని సిఎం పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు.

రాహుల్‌ లిస్టులో చిరంజీవి పేరు?

  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చలు జరపటం వల్ల కేంద్ర మంత్రివర్గ విస్తరణ రోజుల్లో ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సన్నాహాలు పూర్తి అయ్యాయని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పటి వరకూ కేంద్ర మంత్రి పదవుల రేసులో ఉన్న వారు తిరిగి ఢల్లీలో లాబియింగ్‌ కోసం ఫోనులు చేస్తున్నారు. అయితే యువనేతలకే ఎక్కువ మంత్రి పదవులు దక్కే అవకాశముందని తెలుస్తోంది. వృద్దులు రేసులో ఉన్నా ఎఐసిసి ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంధీ దృష్టిలోనూ ఉండాలి. లేకపోతే వారికి పదవి దక్కే అవకాశముండదు. ప్రత్యేకించి రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఈసారి తనకు పదవి దక్కవచ్చని భావిస్తున్నారు. అయితే సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో ఈయనకు విభేదాలు ఉండటం వల్ల విహెచ్‌ లాబీయింగ్‌ ఎంత బలమైనదైనా ఆయన్ని మినహాయించే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. అందరిలోకి ఇటీవల మౌనం వహించిన రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి పదవి దక్కే అవకాశముంది. ఆయనపై సిఎం కూడా పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదు కాబట్టి ఈయనకు మంత్రి పదవి లభిస్తుందని భావిస్తున్నారు. చిత్రమేమిటంటే రాహుల్‌గాంధీ తయారు చేసిన లిస్టులో  కూడా చిరంజీవి పేరుందని సమాచారం.  అలానే రాష్ట్రం నుంచి ఎంపి కావూరి సాంబశివరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, సర్వే సత్యన్నారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికైనా మంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. ఒక్క కులం పరంగా మంత్రి పదవులు కనుక ఇస్తే విహెచ్‌ బిసి కాబట్టి ఆయనకు అవకాశం లభించవచ్చు. లేకపోతే మిగిలిన వారికి ఇచ్చే ప్రాధాన్యత ఆయనకు దక్కకపోవచ్చని, సిఎం లాబీయింగ్‌ ముందు విహెచ్‌ వెనుకబడే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఏమైనా ఢల్లీ వెళ్లిన సిఎం కిరణ్‌ కేంద్ర మంత్రిపదవులపై రాహుల్‌తో చర్చించే అవకాశముందని సమాచారం. రాహుల్‌గాంధీ ఇష్టప్రకారమే మంత్రిపదవులు ఇస్తున్నందున పూర్తిస్థాయిలో ఫలానావారికి వస్తుందని చెప్పటం కష్టంగా ఉందని రాజకీయపరిశీలకులు సైతం భావిస్తున్నారు. ప్రత్యేకించి ఈ నెల 20వతేదీలోపు మంత్రిపదవుల పంపకం పూర్తికావొచ్చని భావిస్తున్నారు.

హత్యతో ఉనికి చాటుకుంటున్న ‘వార్‌’?

రాజకీయనాయకుల హత్యల ద్వారా తమ ఉనికిని చాటుకోవటం పీపుల్స్‌వార్‌ గ్రూపు నక్సలైట్లకు అలవాటైపోయింది.  తమ ప్రభావిత ప్రాంతాల్లోనూ వార్‌ ఇటువంటి తెగింపు హత్యలకు సిద్ధమవుతుంది. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా, ఖమ్మం, విశాఖ, వరంగల్‌, కృష్ణా, ప్రకాశం, మహబూబ్‌నగర్‌ జిల్లాలు వార్‌ ప్రభావిత ఏజెన్సీలుగా గుర్తింపునందుకున్నాయి. ఒకవైపు ఛత్తీస్‌ఘడ్‌, మరోవైపు ఒరిస్సా సరిహద్దులు కూడా వార్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వార్‌ తన బలాన్ని పెంచుకోవాల్సి వచ్చినప్పుడు గిరిజనులను ఆకర్షిస్తోంది. అభివృద్థి, ఉద్యోగం ద్వారా గిరిజనులను వార్‌కు దూరం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎస్‌టి సబ్‌ప్లాన్‌ ఏరియా డిక్లరేషను ప్రకటించటం వెనుక గిరిజనయువతను మావోయిజం వైపు మళ్లకుండా చూడాలనే ఉద్దేశ్యం కనిపిస్తోంది. అయితే గిరిజనులు మాత్రం ఒకవైపు వార్‌ను, మరోవైపు పోలీసులను భరిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా నలిగిపోతున్నారు. ఈ అమాయక గిరిజనుల్లో 14 నుంచి 18ఏళ్లలోపు గిరిజనులను వార్‌ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. వారికి ఆయుధాలు ఉపయోగించటంలో శిక్షణ ఇస్తోంది. ఈ శిక్షణ తరువాత కొంతకాలం అన్నలుగా చెలామణి అయి యువకులు పోలీసుల ముందు లంగిపోయినా వారి జీవనోపాధికి లక్షల్లో పారితోషికం లభిస్తోంది. ఇలా వార్‌ నుంచి బయటకు వచ్చిన వారు స్థిరపడిపోతున్నారు. దీనికి గిరిజనకుటుంబాలు ఆకర్షితులవుతున్నారు. అందుకే కొంచెం సాహసించి వార్‌బాట పడుతున్నారు. అయితే వార్‌ తన ఉనికి చాటుకోవాల్సి వచ్చినప్పుడు గిరిజన ప్రతినిధులను కూడా హత్య చేయటానికి వెనుకాడటం లేదు. దీంతో గిరిజన సంఘాలు ఒక్కోసారి వార్‌ను తప్పుపడుతున్నాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీ నేతలను వార్‌ విరోధులుగా భావిస్తున్నది. దీనికి కారణం ఒకటి ఆ పార్టీ అధికారంలో ఉండటం. రెండోది కాంగ్రెస్‌ నేతలు భూఆక్రమణలకు పాల్పడటం. ఈ రెండు అంశాల ఆధారంగానే వార్‌ కాంగ్రెస్‌నేతలను హత్య చేస్తోంది. ప్రత్యేకించి రెండో అంశం ఆధారంగా ఖమ్మం జిల్లాలో వార్‌ తన ఉనికిని చాటుకుంది. పాల్వంచ మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామ కాంగ్రెస్‌ నేత కల్లెం వెంకటరెడ్డి(45)ని ఆరుగురు సాయుధ మావోయిస్టులు తుపాకీలతో కాల్చి హత్య చేశారు. ఆనవాయితీ ప్రకారం మావోయిస్టు కొత్తగూడెం ఏరియా కార్యదర్శి భద్రు పేరిట మావోయిస్టులు లేఖ వదిలివెళ్లారు. అర్ధరాత్రి జరిగిన ఈ హత్యతో రెడ్డిగూడెం గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. అలానే ఖమ్మం జిల్లాలో ఈ హత్య గురించి తీవ్రస్థాయి చర్చలకు తావిచ్చింది.

బల ప్రదర్శనకు సిద్దమవుతున్న మాజీమంత్రి సంగీత

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు మాజీ మంత్రి సంగీతం వెంకటరెడ్డి(చిన్నకాపు) సిద్దంగా ఉన్నారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున షర్మిల చేసే పాదయాత్ర సమయంలో ఈయన చేరిక ఉండవచ్చని అంచనాలు ఎక్కువయ్యాయి. ఇప్పటి దాకా రాజకీయంగా స్తబ్దుగా ఉన్న సంగీతం తన నిర్ణయాన్ని ఖాయపర్చుకున్నారు. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఈ విషయమై వెంకటరెడ్డి కబురుపెట్టారు.  తాను పార్టీలో చేరాక ఆలమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సంగీతం ఆశిస్తున్నారు. తన అంతరంగాన్ని ఆయన ఎప్పుడో బయటపెట్టారని తెలుస్తోంది. అయితే తన బలాన్ని, బలగాన్ని ప్రదర్శించేందుకు సైతం సంగీతం సిద్ధంగా ఉన్నారట. అందువల్ల ఆయన చేరిక తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కీలకమని భావిస్తున్నారు. సంగీతం కనుక చేరితే కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైకాపాకు వలసలు భారీగా పెరుగుతాయని వైకాపా ఓ అంచనాకు వచ్చింది. అయితే అధినేత జగన్మోహనరెడ్డి మరింత కాలం  జైలులో ఉంటే   వైకాపా కార్యకర్తలు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల వైపు చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందువల్ల మరికొంత కాలం వేచి చూస్తే మంచిదని వెంకటరెడ్డి సన్నిహితులు ఆయనపై వత్తిడి తెస్తున్నారు

వాద్రా తడాఖా – హర్యానా ఐఎఎస్ బదిలీ

  సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా భూకుంభకోణానికి సంబంధించిన కేసులో విచారణకు ఆదేశించిన ఐఎఎస్ అధికారి అశోక్ ఖేమ్కాని హర్యానా ప్రభుత్వం బదిలీ చేసింది. వాద్రా డీల్స్ ని రద్దు చేసిన నేరానికి నిజాయతీపరుడైన ప్రభుత్వాధికారికి దక్కిన గౌరవమిదని మీడియా దుమ్మెత్తిపోస్తోంది. నిబంధనల్ని పూర్తిగా తుంగలో తొక్కిన హర్యానా సర్కారు అడ్డగోలుగా ఖేమ్మా సీటుని మార్చేసింది. డిఎల్ ఎఫ్ తో వాద్రా ఒప్పందాన్ని తప్పుపట్టి దాన్ని రద్దు చేయడం ఖేమ్మా చేసిన నేరం.  గడచిన 19 సంవత్సరాల్లో ఖేమ్మా 46 సార్లు బదిలీ అయ్యారు. నిజాయతీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకు ఖేమ్కాకి దక్కిన బహుమానమిదే. భారత్ లో నిజాయతీపరులైన ఆఫీసర్లకు ఏమేరకు గౌరవమర్యాదలు దక్కుతాయో ఖేమ్మాని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

తెలంగాణపై వాయలార్ వివాదాస్పద వ్యాఖ్యలు

  “ప్రపంచంలో తెలంగాణ ఒక్కటే సమస్యా?”  అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వాయలార్ రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ సమస్యకి పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో తాను చెప్పలేనని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం ప్రస్తుతం చర్చల దశలో ఉందని, దానిగురించి ప్రత్యేకంగా వ్యాఖ్యానించడానికేమీ లేదని అన్నారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తూ తెలంగాణ ఒక్కటే ప్రపంచానికంతటికీ సమస్య అన్నట్టుగా వ్యవహరించడం సరికాదంటూ వాయలార్ రవి మండిపడ్డారు. అనవసరంగా తనని ఇబ్బందిపెట్టే ప్రశ్నలు వేసి వివాదాల్లోకి లాగొద్దంటూ మీడియాపై కూసంత అసహనాన్నికూడా వ్యక్చం చేశారు.

కేంద్రంలో పదవుల పందేరంపై ఆశలు

  ఎప్పుడెప్పుడు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందోనని ఆశగా చూస్తున్న రాష్టనాయకులకు విజయదశమికి ముందే ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలవడం ద్వారా  ఆంద్రప్రదేశ్ కు ఎంతవరకూ అవకాశం ఇస్తారోనని అధికార కాంగ్రెస్ వర్గాలు బలాబలాలు అంచనా వేస్తున్నారు, ప్రత్యర్ధిపార్టీలన్నీ బిసి , ఎస్టీ, ఎస్సీ లను కలుపుకుంటూ దూసుకై పోతుంటే తాము మాత్రం వెనుకబడి పోయామని అధికార కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే ఈ సారి అయినా బిసిలకు కేంద్రంలో స్థానం ఇవ్వాలని బిసి సంఘాలు కోరుతున్నాయి. అందుకు గానూ చిరంజీవిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన పల్లంరాజు ఇప్పటికే కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నారు. కమ్మ వర్గానికి చెందిన కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావులు ఎప్పటినుండో తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తమకు ప్రాధాన్యత నివ్వడంలేదని విసుగు చెందుతున్నారు. అంతే కాక తమ వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని కూడా వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ వర్గానికి చెందిన దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. వెనుకబడిన వర్గాలను అన్ని పార్టీలు కలుపుకు పోతున్నాయని వైసిపి ని  ధైర్యంగా ఎదుర్కొనే శక్తి తనకే ఉందని భావిస్తున్న హనుమంతరావు చెబుతున్నారు. సోనియా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం, వారికి ఆయనపై వారికి  ఉన్న విశ్వాసం తో పాటు తెలంగాణాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వవలసి ఉంటుందని అందువల్ల కూడా రేస్ లో  హనుమంతు ముందున్నారని తెలుస్తుంది. కర్నూల్నుండి  ఎంపి కోట్ల సూర్య భాస్కరరెడ్డి పేరుకూడా ప్రముఖంగా వినిపిస్తుంది. వైయస్ జగన్ని కర్నుల్  ఓదార్పు యాత్రకు రానివ్వకుండా అడ్డుకుంటంతో  అధిష్టానం మదిలో చోటు సంపాదించారు. యస్సీ వర్గనికి చెందిన పనబాక లక్మీ పనితీరుపై నాయకత్వం అసంతప్తిగా ఉన్నారని తెలుస్తుంది. అందువల్ల ఆమె స్దానంలో ఎంపీ సర్వే సత్యన్నారాయణకు అవకాశం కల్పించే వీలుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణవాదం, పార్టీ ప్రయోజనాలను గుర్తుంచుకొని ఇంతవరకు ఒక్కసారి కూడా మాదిగలకు కేంద్రపదవి ఇవ్వక పోవడం ఇంకా తెలుగుదేశం పార్టీ మాదిగలకు దగ్గరవడం వల్లకూడా దాన్ని అడ్డుకోవడానికి గానూ సర్వేకు మంత్రి పదవి దక్కవచ్చునంటున్నారు.

రాష్ట్రాన్ని లూటీ చేశారన్న చంద్రబాబు

  మంత్రులంతా అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్నారని, అవినీతి, ల్యాండ్ మాఫియా, రౌడీయిజం, గుండా యిజం పెరిగిపోయారని  చంద్రబాబునాయుడు తనపాద యాత్రలో పేర్కోన్నారు.  పన్నుల మీద పన్నులు వేసి సామాన్య మద్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన ఆరోపించారు. అసమర్ద రాకస ప్రభుత్వం మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని ధరలను అదుపు చేయవలసిని నేతలంతా పదవులను కాపాడుకునేందుకు ఢిల్లీలో మకాంపెట్టారని తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు అన్నారు.  వర్షాకాలంలో కూడా కరెంటు కోతలతో జనాలను చీకట్లో ఉంచితే రానున్న ఎండాకాలంలో పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.  అధికార ప్రభుత్వం పేద, బడుగు, బలహీన, ముస్లిం , మైనారిటీ, చేనేత వర్గాలనే కాకుండా రైతులకు కూడా తీరని అన్యాయం జరిగిందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అసంబద్ద, దధ్దమ్మ రాక్షస ప్రభుత్వం అని చంద్రబాబు దుయ్యబట్టారు.

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలకు డిమాండ్

పాత రోజులు గుర్తుకు వచ్చేలా రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు మంచి రోజులు వచ్చాయి. కాలేజీల ఫీజు గొడవలతో, ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీల హవా పూర్తిగా తగ్గినట్లే కనిపిస్తుంది. ఇంజనీరింగ్ ఫార్మసీలలో ఉద్యోగ అవకాశాలు అంతకంతకు తక్కువ కావడం, ఆంద్ర ప్రదేశ్ ,తమిళనాడుల్లోని  ఇంజనీరింగ్ కాలేజీల నుండి బయటికి వచ్చినవారు కేవలం 20 శాతం మంది మాత్రమే ఉద్యోగ అర్హతలతో బయటికి వస్తున్నారని మంత్రులు, రాజ్యసభ్యులు ప్రకటించడంతో ప్రజలకు వాటిపై భ్రమలు తొలిగాయనే చెప్పవచ్చు, 2,100 కాలేజీలు  డిగ్రీ కోర్సులయిన బిఎ, బికాం, బియస్సీ కలిపి 1,90370 సీట్లు పూర్తయ్యాయి. కామర్స్ మేనేజ్మెంటు సీట్లు మరో 1,37,649 సీట్లు ఫిల్ అయ్యాయి. ఇదివరకటి కంటె కామర్స్ కు క్రేజ్ పెరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 15 శాతం ఎక్కువ మందితో కళాశాలలు నిండాయని విశ్వవిద్వాలయాలు చెబుతున్నాయి.  గతంలో చదువంటే ఇంజనీరింగ్ అనీ, లేదా ఫార్మసీ అను కన్నవారంతా ఇప్పుడు కళ్లు తెరిచాయని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.

కాకినాడ కన్నబాబు కు అమెరికా ఆహ్వానం

కాకినాడ రూరల్ ఎమ్మేల్యే కన్నబాబును అమెరికాలోని ప్రజాస్వామ్య తీరుతెన్నులను పరిశీలించేందుకు రమ్మంటూ ఆహ్వానం వచ్చింది. దేశ వ్యాప్తంగా 4 రాష్టాలనుండి ఇందులో పాల్గొనడానికి గానూ వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి కన్నబాబు ఒక్కరే ఎంపిక కావడం విశేషం. ఈనెల 19 నుండి 10 నవంబరువరకు  అక్కడి  రాజకీయనాయకులతో, అధికారులతోనూ వారు చర్చలు జరుపుతారు. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణ, వ్యవస్ధ , ఎన్నికల సరళి, ఎన్నికల నియమావళికి చెందిన తీరుతెన్నులపై పరిశీలన జరుపుతారు. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఫార్టీ ప్రచార పోకడలను కూలంకుషంగా అవగతం చేసుకుంటారు.  రాజకీయ పార్టీల పాత్ర , మీడియాపాత్ర, ప్రభుత్వ ఫ్రాధాన్యం, సమాజంలో వ్యవస్ధ మూలాల తీరుతెన్నులపైనే కాకుండా  అక్కడ రాజకీయ వాతావరణంపై ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించేందుకే  అమెరికా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.

పరుగుపందెంలో గెలిచి జీవితం లో ఓడిన అభాగ్యుడు

సామాన్య జీవితం అతనిది తల్లిదండ్రులు పేదవారు. దాంతో ఎలాగైనా మెరుగైన జీవితం కావాలనుకున్నాడు. దాంతో సౌత్ సెంట్రల్ రైల్యేలో ఉద్యోగం కోసం ఎంతో శ్రమ కోర్చి వ్యయ ప్రయాసలతో  శ్రీకాకుళం లోని పాతపట్నం మండలంలోని  చిన్న పల్లెనుండి వచ్చిఅన్ని టెస్టులను గెలచి చివరిగా  1,500 మీటర్ల దూరాన్ని ఇచ్చిన గడువులో పరుగెత్తి తన సత్తాచాటుకున్నాడు. జీవితంలో ఇక ఓటమే లేదనుకుని సహచరులందరితో సంతోషాన్ని పంచుకున్నాడు. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే ఊపిరి పీల్చుకోవడం కష్టమై ఆసుపత్రికి తీసుకెళుతుండగానే చనిపోయిన అభాగ్యుడు కొరిచెడ ఫల్గుణరావు. ఇలాంటి మరణం ఫల్గుణరావుతోనే మొదలవ్వలేదు. ఏ పరుగుపందెం జరిగినా ఎక్కడ కానిస్టేబుల్ లేదా   ఛెందిన పరుగు పందేలు జరిగినా ఎంతో మంది దిగువ మద్యతరగతి యువకులు మరణించడం మామూలయిపోయింది. దీన్ని ప్రశ్నించే వారే లేరు. చాలీ చాలని కూలీలతో సరైన పోషకాహారం లేక, సుదూర ప్రాంతాలనుండి ముందేవచ్చి పేవ్ మెంట్ల  మీద పడుకొని దోమలతో చలితో సహజీ వనం చేసి నిద్రలేని రాత్రుళ్లు గడిపి తెల్లారే లేచి ఏ రోడ్ సైడ్ బండిమీద టిఫిన్ చేశామనిపించి పరుగుపందెంలో ప్రాణాలు పోగుట్టుకున్నవారు ఎందరో.........దీనికి భాద్యులెవరు  చెట్టంత ఎదిగిన కొడుకు చేతికందివస్తాడనుకుంటే శాశ్వతంగా దూరమై కుమిలిపోతున్న తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెబుతారు పాలకులు, అధికారులు, నిర్లక్ష్యానికి పరాకాష్టకు ఇది అద్దం పట్టండం లేదా సరైన సదుపాయాలు లేకుండా పోటీలు పెట్టి , వస్తున్న అభ్యర్ధులకు కనీసం టెంట్ సదుపాయాలు కూడా లేకుండా ప్రాణాలతో చెలగాటం ఆడే అధికారుల్ని ఉపేకించకూడదని ఇప్పటికైనా ప్రజాసంఘాలు, మేధావులు మేల్కొనాలని ఫల్గుణరావు కుటుంబసభ్యులు, బంధు మిత్రులు కోరుకుంటున్నారు. ,

సబ్బం కన్నా ముందే ద్వారంపూడి?

విశాఖ జిల్లాకు వెళ్లాలంటే తూర్పుగోదావరి జిల్లా దాటాలి కదా! అంటే అనకాపల్లి ఎంపి సబ్బం హరి కన్నా ముందు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వైఎస్‌ఆర్‌సిపి బాధ్యతలు చేపడతారు. పైకి చెబుతూనే సబ్బం హరి కాంగ్రెస్‌తో కాలక్షేపం చేస్తున్నారు. ద్వారంపూడి అయితే ఏకంగా కాపురమే చేసేస్తున్నారు. తాను పచ్చికాంగ్రెస్‌ వాదిని అన్నట్లుగా కాంగ్రెస్‌ పార్టీతో పూర్తిస్థాయి సవాసం చేస్తున్న ద్వారంపూడి ఇక పూర్తి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మారతారు. షర్మిల సమక్షంలో ద్వారంపూడి చేరిక ఉండవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. సిబిఐ కేసు ప్రారంభించిన వెంటనే మద్దతు ప్రకటించిన చంద్రశేఖరరెడ్డి, జగన్మోహనరెడ్డిని కలిసి తాను కాంగ్రెస్‌ను వదిలేశానని చెప్పారు. కానీ, అధికారికంగా ఎమ్మెల్యే అవటం వల్ల ఇప్పటి దాకా కాంగ్రెస్‌ మంత్రులతో సర్దుకుంటున్నారు. మంత్రులు పురమాయించే పనులు చేస్తూ తనకు అవసరమైన పనులు ప్రభుత్వంతో చేయించుకుంటూ చంద్రశేఖరరెడ్డి కాలక్షేపం చేశారు. షర్మిల పాదయాత్రల సమయంలో పూర్తి బాధ్యతలు తీసుకున్న తరువాత మాత్రం జనంలో తిరగాలని ద్వారంపూడి నిర్ణయించుకున్నారు. అందుకని షర్మిల పాదయాత్రల సమాచారం తెలుసుకుని ద్వారంపూడి ఆమె రాకకోసం ఎదురుచూస్తున్నారు.

ఆధార్‌ అందేదెప్పుడు ?

ఆధార్‌ ఉంటే అన్ని ఉన్నట్లే అని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ ప్రకటనల పరంపర రాష్ట్రంలో కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలో ఆధార్‌కేంద్రాలకు భారీ స్పందన వచ్చింది. దీంతో దేశంలోనే అత్యధిక ఆధార్‌కార్డుల వివరాలు నమోదు చేసుకున్న జిల్లాగా దీనికి పేరు వచ్చింది. ఈ మేరకు ప్రశాంసాపత్రాలు కూడా అందించారు. అయితే ఈ జిల్లాలో ఇంకా కార్డులు రాలేదని అన్ని ప్రాంతాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ నగరంలో 16 నుంచి 25శాతంలోపు వారికి మాత్రమే కార్డులు అందాయి. అలానే రాజమండ్రి నగరంలో 20శాతం, అమలాపురం పట్టణంలో 18శాతం కార్డులు అందజేశారు. మిగిలిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కార్డులు అందని వారి సంఖ్య కోకొల్లలు. ఫొటోలు తీసుకుని నమోదు ప్రక్రియ పూర్తి చేసిన 45రోజుల్లోపు కార్డులు మీ ఇళ్లకు చేరుతాయని ఆధార్‌సిబ్బంది సమాచారం ఇస్తుంటారు. ఈ కార్డులు రాలేదన్న విషయం తెలుసుకుని వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. మా కార్డులు ఎప్పుడు ఇస్తారని రెవెన్యూ అధికారులపై గ్రామీణులు విరుచుకుపడుతున్నారు. అసలు ఫొటోలు తీయించుకోవటంలో శ్రద్ధ చూపించి కార్డులు మంజూరు చేయకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.

మళ్ళీ వీధివీధినా బెల్ట్‌ షాపులు

రాష్ట్రప్రభుత్వం కొత్త ఎక్సయిజ్‌ విధానం కింద లాటరీలో మద్యం దుకాణం పొందేందుకు ఎవరూ ముందుకురాకపోవటంతో వదిలేస్తే అక్కడ బెల్టుషాపు వ్యాపారం జోరుమీదుంది. పైగా ఎక్సయిజ్‌ సిబ్బంది ఆ పరిసరాలకే పోవటం లేదు. అంటే ఆమ్యామ్యాల బాపతు అన్నమాట. రాష్ట్రంలోని కీలకమైన నగర శివార్లలో మద్యం దుకాణాలకు పెద్దగా స్పందన రాలేదు. దీంతో ఎక్సయిజ్‌ శాఖ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ(ఎపిబిపిఎల్‌) దుకాణాలను నెలకొల్పింది. కొన్ని షాపుల ప్రతిపాదనలే రద్దు చేసుకుంది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. మద్యం దుకాణ ప్రతిపాదన విరమించుకుంటే సరిహద్దుల్లోని రెండు గ్రామాల దుకాణదారులు ఒక ఒప్పందానికి వచ్చి బెల్టుషాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోసారి ఒక బెల్టుషాపునే రెండు దుకాణాల వారూ నిర్వహిస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడి, అప్పనపల్లి గ్రామాల మధ్య ఉన్న పెదపట్నంలంక. ఈ గ్రామంలో బెల్టుషాపు ప్రతిపాదన ఎక్సయిజ్‌ విరమించుకుంటే ఇక్కడ బెల్టుషాపు జోరుగా వ్యాపారం చేస్తోంది. ఇక లూజు విక్రయాల్లో ఈ బెల్టుషాపు తరువాతే ఏ దుకాణమైనా అని చెప్పాలి. అమలాపురం డివిజన్‌లో ఇంత బహిరంగంగా వ్యాపారం చేస్తున్నా ఎక్సయిజ్‌ ఎందుకు స్పందించటం లేదు? అధికారులకు మట్టేశాయా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టరు నీతూ కుమారి ప్రసాద్‌కు దీనిపై ఫిర్యాదు చేయాలని పెదపట్నంలంక గ్రామీణులు సిద్ధం అయ్యారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు ఇప్పటికే బెల్టుషాపుల వ్యాపారంలో అగ్రస్థానంలో ఉన్నాయని సమాచారం అందుతోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుల్లో లూజ్‌ విక్రయాలు నెంబర్‌`1లా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మద్యం అక్రమవ్యాపారానికి తెరలేచింది. చర్యలు మాత్రం ఎక్కడా తీసుకోవటం లేదు.

ప్రభుత్వ ముసుగులో ప్రై‘వేటు’ సేవలు?

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు ప్రై‘వేటు’ ఆసుపత్రులు నడుపుతున్నారు. కొందరు వైద్యులు అనధికారికంగా ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులను దారి మళ్లించి తమ ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నారు. గుర్రం గుడ్డిదైతే...అన్న చందంగా అధికారులు అసమర్థతను వీరు ఆసరా చేసుకుని తమ నర్సింగ్‌హోమ్‌ల్లో రోగుల సంఖ్య పెంచుకుంటున్నారు. జిల్లా కలెక్టరు నీతుకుమారి ప్రసాద్‌ ఛైర్మనుగా ఉన్న ఈ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పేదలకు సేవలందించటం మాటెలా ఉన్నా భయభ్రాంతులకు గురి చేస్తోందని రోగుల బంధువులు వాపోతున్నారు. ప్రత్యేకించి తమ ఆసుపత్రిలో చేర్పించుకునేందుకు ఓ పిల్లల డాక్టర్‌ లేని రోగాలను అంటగడుతున్నాడు. డెంగ్యూ వ్యాధి లేకపోయినా సరే! పిల్లలను తన సొంత ఆసుపత్రికి షిఫ్ట్‌ చేయించి ప్రాణదాతగా పేరుగడించేందుకు తెరతీశారు. వాస్తవానికి డెంగ్యూ నిర్ధారణకు ఎలీషా(ఎంజైమ్‌ లింక్డ్‌ ఎమ్యూన్‌ సార్బంట్‌) టెస్ట్‌ చేయించాల్సి ఉంటే ఆ డాక్టర్‌ ఆర్‌డిటి (రాపిడ్‌ డయగ్నోస్టిక్‌ టెస్ట్‌) కిట్‌ ద్వారా వ్యాధిని నిర్ధారించారు. ఈ వైద్యుని మోసాన్ని గుర్తించలేని రోగుల బంధువు(పేద)లు తమ ఒంటిపై ఉన్న బంగారాన్ని అమ్మేసి పిల్లలకు వైద్యం చేయిస్తున్నారు. అలానే కొందరైతే అప్పులు చేసి తీసుకువచ్చి తమ పిల్లలకు చికిత్స చేయిస్తున్నారు. బంధువుల బలహీనతలతో వ్యాపారం చేసుకునే ఇటువంటి ప్రభుత్వవైద్యులు ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు. వీరి గురించి మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా అసమర్ధ యంత్రాంగం ఏమీ చేయలేకపోతోంది. పిల్లల వైద్యుడితో పాటు ఇక్కడ కిడ్నీ, హార్ట్‌, నేత్ర, ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు కూడా ప్రైవేటు సేవలు పెంచుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

బొగ్గుపాలౌతున్న అడవవి బిడ్డల బ్రతుకులు

అటవీప్రాంతంలో బొగ్గుగనుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వటం ఒకవైపు పర్యావరణానికి, మరోవైపు అటవీప్రాంత పరిరక్షణకు చేటు తెచ్చిపెట్టింది. బొగ్గు కోసం నిరుపేద అడవిబిడ్డల బతుకులను ఎరగావేసిన ఘనత కూడా కేంద్రప్రభుత్వానికే దక్కింది. దేశంలో 13బొగ్గుగనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1.1మిలియన్‌ హెక్టార్ల అటవీప్రాంతానికి ఈ గనుల వల్ల తీవ్రనష్టం జరుగుతోంది. ఈ మొత్తం గనుల్లో జరుగుతున్న దోపిడీ కూడా మాటల్లో చెప్పలేం. ఒక్క మహన్‌బ్లాకులోనే 14వేల మందికిపైగా గిరిజనులు తమ సాంప్రదాయక ఇళ్లను కోల్పోయారు.  ఈ బొగ్గుగనుల కోసం అటవీప్రాంతం చుట్టూ కంచె వేస్తున్నారు. గిరిజనులను అడవిలోపలికి వెళ్లటానికి కంపెనీలు అనుమతి ఇవ్వటం లేదు. దీంతో వీరు తమ సహజసిద్ధమైన జీవనవిధానాన్ని కోల్పోయారు. ఎప్పుడూ ఆడుతూ తుళ్లుతూ తిరగాల్సిన గిరిజనబాలలు నిరాశగా గనుల కంపెనీల చేష్టలకు తలొగ్గుతూ బాల్యాన్ని సైతం కోల్పోతున్నారు. ఈ గనుల వల్ల పర్యావరణానికి ప్రమాదమని ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కేంద్రం స్పందించలేదని పర్యావరణవేత్త ఆశిష్‌కోఠారి చెప్పారు. గిరిజనుల హక్కులకు భంగం కలిగించే కేంద్రం చర్యలను ఆయన ఖండించారు.