ఔను! తెలంగాణా ఎంపిలు అజిత్‌సింగ్‌ను ఇష్టపడుతున్నారు?
posted on Oct 9, 2012 @ 2:35PM
తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం అంశం ఇప్పట్లో తేలదని అందరికీ అర్థమైంది. అయితే ప్రత్యేక తెలంగాణా సాధన పేరిట ఏర్పాటైన టిఆర్‌ఎస్ ఏమీ సాధించలేకపోవటంతో ఆ ప్రాంతంలో కొత్తదనం కోసం జనం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి అజిత్‌సింగ్ రాష్ట్రీయలోక్‌దళ్‌పార్టీ (ఆర్‌ఎల్‌డి) తెలంగాణాశాఖను ఏర్పాటు చేశారు. దీని నిమిత్తం ఆయన పర్యటనకు వచ్చారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఎంపిలు అజిత్‌సింగ్‌ను కలవటం, పెద్దహడావుడి చేయటం జరిగాయి. దీన్ని బట్టి ఏమి అర్థమవుతోంది? అని పలువురిని ప్రశ్నిస్తే తెలంగాణా కాంగ్రెస్ ఎంపిలు అజిత్‌సింగ్‌ను ఇష్టపడుతున్నారు అని సమాధానం వచ్చింది. నిజం కూడా అదే. ఎందుకంటే ప్రత్యేకతెలంగాణా ఇవ్వటానికి ఇష్టపడని కాంగ్రెస్ ఈ ఎంపిలను పదవి నుంచి తప్పుకోమంటే ప్రత్యామ్నాయంగా అజిత్‌సింగ్‌ను వారు ఎంచుకున్నారు. అజిత్‌సింగ్ వెనుక ఉంటే కనీసం రాష్ట్రీయలోక్‌దళ్‌పార్టీ ఆశ్రయమైనా దక్కుతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి టిఆర్‌ఎస్ అంటే ఇష్టపడని వారందరికీ ఆర్‌ఎల్‌డి పెద్దవేదిక కాబోతుంది. ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే అన్న నినాదంతో ఏర్పాటైన తెలంగాణా జెఎసి కూడా అజిత్‌సింగ్‌కు తమ సహకారాన్ని అందిస్తోంది. టిఆర్‌ఎస్, బిజెపిలతో పాటు ఆర్‌ఎల్‌డిని కూడా వినియోగించుకుంటామని జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. దీంతో అజిత్‌సింగ్ రాకను ఆయన పరోక్షంగా మద్దతిచ్చారు. ఎంపిలతో పాటు పరోక్షంగా మద్దతు ఇచ్చిన కోదండరామ్ అజిత్‌సింగ్‌ను కలిశారు. అసలు విషయాన్ని పరిశీలిస్తే అజిత్‌సింగ్‌కు కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ తెలంగాణా ప్రాంతమని కొత్తవార్తలు వినిపిస్తున్నాయి. తమ పార్టీలో అందరూ బయటికిపోతే తెలంగాణా ప్రాంతంలో 2014లో కొన్ని స్థానాల్లోనైనా విజయం సాధిస్తే ఆర్‌ఎల్‌డి మద్దతు కాంగ్రెస్ మిగుల్చుకునేందుకు ఇదో కొత్తవ్యూహమంటున్నారు. ఇదే నిజమైతే కాంగ్రెస్ అధిష్టానమే ప్రత్యామ్నాయం కోసం ఆర్‌ఎల్‌డిని ప్రోత్సహిస్తోందని చెప్పుకోవాలి. ఏమైనా తెలంగాణా ఎంపిల వైఖరి గురించి పిసిసి నేతలు పెదవి విప్పలేదంటే ఓరకంగా పై విషయం వాస్తవమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.