తలలు పట్టుకున్న తెలంగాణ నాయకులు

  అమ్మ ఊరించి ఊరించి ఇప్పుడు కాదు పొమ్మంటూ తేల్చేసింది. అన్న అన్ని రోజులు ఢిల్లీలో ఉండి ఏమి చేసాడో చెప్పమంటే ఉలకడు ...పలకడు. అన్ని దారులూ మూసుకు పోతున్నాయి తెలంగాణ నాయకులుకు. అన్ని అస్త్రాలు ఉపయోగించారు. తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలో తెలియక నేతలు తికమక పడుతున్నారు. రానురాను తెలంగాణ నాయకుల మీద, ఆఖరుకు ఛానల్స్ మీద కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం మింగుడు పడని విషయం. ఒకవైపు కేంద్రం కనుసన్నలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్న రాష్ట్రప్రభుత్వం నిన్న మొన్నటి వరకు అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ అని చెప్పిన అధినాయకత్వం హఠాత్తుగా మార్చిన రాజకీయాలతో ప్రజలకు ఏం చెప్పాలో తెలియని పరిస్దితుల్లో తెలంగాణ నాయకులు ఉన్నారు. పొనీ తెలంగాణ వాదులందరినీ ఆయా పార్టీలకు రాజీనామా చేయమన్నా ప్రయోజనం ఏముంటుందని నాయకులు వాపోతున్నారు. అదే విధంగా ప్రజల వద్దకు వెళ్లి ఏం చెప్పి ఓట్లను అడగగలమని  వారు మధన పడుతున్నారు. ఎంత మంది మంత్రులు, ఎమ్మేల్యేలు పార్టీలు వీడి బయటకు వచ్చి తెలంగాణకోసం పోరాటతారనేది కూడా సందేహం గానే వుంది. తెలంగాణ వాదానికి బలం చేకూర్చే కాంగ్రెస్ ఎంపీలయిన  వివేక్, వినోద్ లు తండ్రి వెంకటస్వామి దగ్గరనుండి కాంగ్రెస్ వాదులుగా ప్రసిద్ది. తెలంగాణ కోసం పార్టీని విడనాడుతారనుకోవడం అసంమజసం. అలాగే రాహుల్ గాంధీకి మిత్రుడిగా విలాసిల్లుతున్న మధుయాష్కీ. ఎమ్మేల్యే రాజయ్య సిఎం కిరణ్ కుమార్ కు విధేయత కలిగిన వాడు, కోమటి రెడ్డి బ్రదర్స్ గోడ మీద పిల్లులుగా పేరుంది. ఇక మిగిలింది పొన్నం ప్రభాకర్, కె కేశవరావు వీరిరువురి వల్ల ఒరిగేదేముంటుందని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.అటు అధిష్టాన్ని ఒప్పించలేక  ఇటు ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూడకుండా...........

అవ్వడానికి పల్లెటూరి వారే అయినా విజ్జత, వివేకం చూపారు ఈ గ్రామస్తులు. ప్రకాశం జిల్లా అక్కచెరువుపాలెం కు చెందిన  ఈ గ్రామస్తులు ఎడతెగని కరెంటు కోతలతో సతమత మయ్యారు. దాంతో పరిష్కారం కోసం పరిశ్రమించి అతి తేలికలో సమస్యను దూరం చేసుకున్నారు. పగలంతా పొలాల్లో పని చేసుకొనే వీరు సాయంత్రం విశ్రాంతి తీసుకునే సమయంలో కరెంటులేక బాధపడేవారు. అయితే వీరంతా కలసి ఇప్పుడు గ్రామంలోని అన్ని ఇళ్లకు సోలార్ కరెంటును ఉత్పత్తి చేసే ప్యానల్స్ ను అమర్చుకున్నరు. దీనికి గానూ వారు ప్రతి ఇంటికీ 3 వేల రూపాయలు ఖర్చుపెట్టారు. బ్యాంకులు మరో 27 వేలు అప్పుగా ఇచ్చాయి. దీనివల్ల 4 బల్బులు, రెండు ఫ్యాన్లు ప్రతి ఇంటిలోనూ పని చేస్తున్నాయి. ఇప్పుడు  గ్రామం అంతా వెలుగులుతో విలసిల్లుతుంది.  కరెంటు వెలుగులో భోజనం చేస్తున్నామని, ఫ్యాన్లు వేసుకొని హాయిగా నిద్రపోతున్నామని ఇది తెల్లవారే లేచి పొలంపనులు, పశువుల పనులు చేసుకుంటానికి బాగా ఉపయోగంగా వుంటుందని ఆ గ్రామస్తులు చెబుతున్నారు.

ఈ కిషోర్.... మరో సత్యంరామలింగరాజు

  పట్టణాలలో ప్రజలనెత్తిని శఠగోపం పెట్టటం మామూలు అయ్యింది. విజయవాడలో సూటింగ్స్, షర్టింగ్స్ కు పేరెన్నికగన్న యాక్స్ ఎన్ యాక్స్ టైలర్స్ కు అధినేత అయిన యర్రంశెట్టి వాలేశ్వరరావు పెద్దకుమారుడు కిషోర్, కోడలు నాగమణి  6.60 కోట్లకు దివాలా తీసినట్లు గురువారం  నగరంలోని రెండో అదనపు సీనియర్ జడ్జి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జడ్జి విక్టర్ ఇమ్మాన్యుయేల్ విచారణకు స్వీకరించారు. ఈ వార్త ఛానల్స్ లో ప్రసారం కాగానే భాధితులు షోరూం కు పరుగులు తీసారు. యాక్స్ ఎన్ యాక్స్ టైలర్స్ గా ప్రసిద్ది చెందిన వాలేశ్వరరావుకి గతంలో నటదిగ్గజాలయిన ఎన్టీరామారావుకి, నాగేశ్వరరావుకి కాస్ట్యూమ్  డిజైనర్ గా వ్యవహిరించారు. యాభై పదులు దాటిన వారు హీరోగా వేయటానికి గానూ సరికొత్త డిజైన్లతో వారిని మెప్పించారు. బెల్ బాటమ్ ఫ్యాంటు తో పాటు పెద్ద కాలర్లు ఉన్న షర్టులతో వారిని యంగ్ హీరోలుగా గుర్తింపు తెచ్చిన పేరు వుంది. డ్రైవర్ రాముడు, అడవిరాముడు, వేటగాడు తదితర సినిమాల కాస్ట్యూమ్స్  వాలేశ్వరరావు చేతిలో రూపుదిద్దుకొని ప్రేకకులను మెప్పించినవే.  గతంలో  తన తండ్రికి ఉన్న ఈ పేరును అడ్డం పెట్టుకొని వాలేశ్వరరావు కుమారుడు,కోడలు అప్పు తెచ్చినట్లు తెలుస్తుంది. కరక్టుగా సత్యం రామలింగరాజు అస్తుల జప్తు చేయటానికి కోర్టునండి అనుమతిలభించిన రోజునే ఈ సంఘటన జరగటం మూలంగా ప్రజలు వ్యాపార వర్గాలు కోర్టులో ఐపి పెట్టటం అంత తేలికయిన వ్యవహారం కాదని, దర్యాప్తు సంస్థలు, కోర్టులు చట్టాలను కఠినతరంగా అమలు చేసి అక్రమార్కులకు బుద్ది చెబుతున్నారని అంటున్నారు. ఆరన్నర కోట్లకు దివాళా తీసినట్టు చూపి కేవలం బ్యాంకులో 15 వేలవరకు ఉందంటే ఎలా నమ్ముతారని దేని మీద పెట్టుబడి పెట్టి నష్టపోయారూ ...ఎందుకు నష్టపోయారో కూడా రుజువు చేసుకోవలసి వుంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు.

కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే

కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే అనే రాజకీయ విశ్లేషకులు రాజనీతికోవిదులే కాదు సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు అనుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ కామన్వెల్త్ 2 జి, కోల్ కుంభకోణంలో తంటాలు పడుతుంటే కొత్తగా పార్టీ నాయకురాలి  అల్లుడైన రాబర్ట వాద్రా అకస్మాత్ గా మల్టీ బిలియనీర్ ఎలా అయ్యారో కేజ్రీవాల్ గుట్టు విప్పేసారు. దాంతో కాంగ్రెస్ అష్టకష్టాలు పడుతుంది. పోనీ బిజెపి కి ఈసారి ఓట్లేద్దామనుకుంటే కర్నాటక అసెంబ్లీలోకరువు గురించి చర్చలు జరుగుతుంటే సదరు బిజెపి సభ్యులు సెల్ ఫోన్లలో బ్లూ ఫిలింలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ విలేకరులకు దొరికి పోయారు. దేశం అంతటా  పెద్ద దూమారం లేసింది.  అయినా సదరు సభ్యులను పార్టీనుండి సస్పెండ్ చేయలేదు. మైనింగ్ మాఫియా డాన్ అయిన గాలిజనార్ధన్ కర్నాటకలో బిజెపికి 50 సీట్లు గెలిపించి పెట్టారు. ప్రస్తుతానికి ఆయన చెంచల్ గూడ జైల్లో ఉన్నారు. అలాగే కేజ్రీవాల్ తాజాగా చేసిన ఆరోపణలు కూడా ప్రజల్ని తెల్లబొయేలా చేసింది. గడ్గారీ మహారాష్ట్ర గవర్నమెంటునుండి అధికంగా సంపాదించిన ఆరున్నర ఎకరాల భూములు చట్టబద్దంగా వచ్చాయని అరుణ్ జైట్లీ చెప్పటం నిజమే కావచ్చు. కానీ అవకాశం వచ్చిందికదా అని తీసుకోవడం కరెక్టు కాదుకదా... అవన్నీ పనికి రాని భూములని బిజెపి నేతలు చెబుతున్నా దాంట్లో చెరకు పంట పండించడంతో ఆవాదన కరెక్టు కాదని తెలుస్తుంది. కుంభకోణాల్లో మునిగిని యుపిఎ 2 రాజీనామా చేయాలని పార్లమెంటును బిజెపి కుదిపేస్తే, అవినీతి పరులు రాజకీయాలనుండి వైదొలగాలని కర్నాటకలో  సోనియా కోరారు. దేశానికి చెందిన రెండు జాతీయ పార్టీలు బురదలో మునిగిపోయి సోనియా చెబుతున్నట్లు ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరికి ఓటేయాలో తెలియడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోనే అతిపెద్ద జప్తు

సత్యం కుంభకోణం కేసు దేశాన్ని దిమ్మర పోయేట్లుగా చేసింది. తప్పుడు లెక్కలతో భ్యాంకు నుండి 2000 కోట్లు అప్పు తెచ్చారని, వాటిని కుటుంబ సభ్యుల ఖాతాలో ఉంచారని సిబిఐ చెబుతుంది.   మహేంద్రాసత్యం ఖాతాలలోని 822 కోట్లనగదును ఎన్ ఫోర్సమెంట్ డైరెక్టరేట్  గురువారం జప్తు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను జప్తు చేయటం దేశంలో ఇదే ప్రధమం. అలాగే రెండు నెలల క్రితం రామలింగరాజుకు చెందిన 120 కోట్ల విలువైన ఆస్తులకు అటాచ్ మెంట్ సిబిఐ కోర్టుకు అనుమతినిచ్చింది. ఈ తీర్పుతో అక్రమార్జనుల గుండెల్లో గుబులు పెడుతుంది. ఇప్పుడు కోర్టులు అత్యంత ధైర్యం ప్రదర్శించాయి. ఇదే విధంగా దేశం మొత్తం మీద జరిపితే ఇంకెంత మొత్తం వస్తుందో అని ప్రజలు నోరెళ్ల బెడుతున్నారు. సత్యం నాగరాజు, కుటుంబసభ్యులందరికీ కలిపి 1063 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది. వీటన్నిటికి కలిపి అటాచ్ మెంటుకు కోర్టు సిబిఐ కి అనుమతి ఇచ్చింది.  సత్యం రామలింగరాజుకు ఆంధ్రప్రదేశ్ పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో ఆయనకు, కుటుంబసభ్యులకు ఆస్తులున్నట్లు సిబి ఐ గుర్తించింది.

చీమలేటిపల్లెకి గబ్బిలాలే వరం

  గబ్బిలాలు ఎంత ఎక్కువ తిరిగితే అంత అభివృద్ధి జరుగుతుందని ప్రకాశం జిల్లా చీమలేటిపల్లె వాసులంటున్నారు. గబ్బిలాలు ఉండటం వల్ల చీమలబెడద, దోమల బెడద, పంటపై చీడపీడల బెడద వంటివి లేవని ఆ గ్రామస్తులు అంటున్నారు.  ప్రత్యేకించి గబ్బిలాలు తమ గ్రామానికి పట్టిన అదృష్టంగా కూడా వీరు చెప్పుకుంటున్నారు. ఇటీవల కాలుష్యం వల్ల గబ్బిలాలు తగ్గుతున్నాయి వీరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటిదాకా తమను  ఈ గబ్బిలాలు తపస్సు పక్షుల్లా కాపాడాయని వీరు చెబతున్నారు. తమ పంటదిగుబడి పెరగటానికి కూడా గబ్బిలాలే కారణమని వీరు స్పష్టం చేస్తున్నారు. పదేళ్ల క్రితం లక్షల సంఖ్యలో ఉన్న గబ్బిలాలు ఇప్పుడు వేల సంఖ్యకు పడిపోయాయంటున్నారు. అయితే తాజాగా పక్షవాతాన్ని నయం చేయడానికి పనికొచ్చే మందుని గబ్బిలాలతో తయారుచేయొచ్చంటూ వాటిని పట్టుకోవడానికొచ్చిన వేటగాళ్లని గ్రామస్తులు తరిమికొట్టారు. జీవవైవిధ్యానికి గబ్బిలాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని, ఎవరైనా గబ్బిలాల సంఖ్య పెంచే సూత్రం చెబితే తాము అనుసరిస్తామని  ఈ గ్రామస్తులు అంటున్నారు.

ప్రపంచబ్యాంకు రుణాల్లో నెంబర్వన్ భారత్

  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోకి అత్యధిక రుణాలు పొందిన దేశంగా భారత్‌కు ప్రపంచబ్యాంకు గుర్తింపు ఇచ్చింది. దేశప్రధానిగా పీవి నర్సింహరావు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రపంచబ్యాంకు రుణాలు తీసుకున్న ప్రముఖుల్లో అగ్రస్థానాల్లో నిలిచారు. అప్పటి పిఎం, సిఎంల ఈ ఖ్యాతి ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ దక్షిణాసియా ప్రాంతంలో అప్పుచేయడంలో మన దేశం నెంబర్ వన్ స్థానంలోనే ఉంది. ఒక్క జాతీయ గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టుకు 500 మిలియన్‌ యుఎస్‌ డాలర్లు, వాటర్‌షెడ్‌ ప్రాజెక్టుకు రూ.250మిలియన్‌ డాలర్లు  ప్రపంచబ్యాంకు నుంచి అప్పుతీసుకున్నాం. ఈ విషయాన్ని ప్రపంచబ్యాంకు సౌత్‌ఆసియా రీజియన్‌ డైరెక్టర్‌ జాన్‌ హెచ్‌ స్టెయిన్‌ ధృవీకరించారు.

బాక్సైట్ గనులపై గిరిజనులు పోరుకు స్పందన

  తమ ప్రాంతంలో బాక్సైట్‌ గనులపై పోరు సలిపేందుకు శ్రీకాకుళం, విశాఖ జిల్లాల గిరిజనులు సిద్ధంగానే ఉన్నారు. వీరు తమ ప్రయోజనాలను కాపాడుకోలేని స్థితిలో ఉన్నారని అన్ని పార్టీల నాయకులు గమనించారు. అయితే కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ వీరితో పాటు తాను చేయికలిపారు. గిరిజనుల హక్కులను కాలరాసే ఏ నిబంధనా అమలు చేయటానికి తాను అంగీకరించబోనని మంత్రి హామీ ఇస్తున్నారు. అంతే కాకుండా బాక్సైట్‌గనుల తవ్వకాలను మంత్రి స్వయంగా ఎదుర్కొంటున్నారు. తాజా కేంద్ర మంత్రి జైరాం రమేష్‌తో కిశోర్‌ చంద్రదేవ్‌ దీనిపై మాట్లాడుతూ గిరిజనుల గ్రామాల్లో సభలు జరిగాక ఆ సభలో ఆమోదం పొందినప్పుడే పారిశ్రామిక అవసరాలకు భూములు సేకరించాలన్నారు. దీనికి మంత్రి రమేష్‌ కూడా స్పందించి గిరిజనులకు హానికారకంగా ఉండే ఏ అంశాలు తామూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. కిశోర్‌ సూచనల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు అనుకూలమైన అంశాలపైనే దృష్టిసారిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

రసాయనపరిశ్రమలపై పర్యవేక్షణ ఏదీ?

  రాష్ట్రంలోని రసాయనపరిశ్రమలపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడుతోంది. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి.  కనీస భద్రతాచర్యలు తీసుకోవటం లేదు. దీంతో కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. యాజమాన్యం కూలీ ఇస్తోంది కదా! అని తాము పనిలో చేరితే తిరిగి వెళ్లేంత వరకూ తమ కుటుంబాలవారు ఎదురుచూస్తున్నారని వారు వాపోతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సమీపంలోని పలుప్రాంతాల్లో ఈ రసాయనపరిశ్రమలున్నాయి. అలానే వరంగల్‌జిల్లాలోనూ, కరీంనగర్‌ జిల్లాలోనూ ఈ పరిశ్రమలున్నాయి. అలానే నల్గండ జిల్లాలోని భువనగిరి పారిశ్రామికవాడలోనూ ఒక పరిశ్రమ ఉంది. త్రిశూల రసాయనిక పరిశ్రమలో కార్మికులు డబ్బాలో రసాయనాలు నింపుతుండగా అగ్ని ప్రమాదం సంభవించింది.  దీంతో పరిశ్రమలో భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపకసబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. కార్మికులు అప్రమత్తంగా ఉండటం వల్ల ఈ తాజా ప్రమాదం వల్ల ఎటువంటి చేదుఘటనలు నమోదు కాలేదు. తగిన రక్షణ చర్యలు యాజమాన్యాలు పాటించకపోతే ఎటువంటి దారుణస్థితి ఎదుర్కొవలసి వస్తుందో ఈ రసాయనికపరిశ్రమలో ప్రమాదం హెచ్చరిస్తోంది. ఈ పరిశ్రమ యాజమాన్యం, కార్మికులు అప్రమత్తంగా మెలగాలని సమీపవాసులు కోరుతున్నారు.  

ఒబామాకి వణుకు పుట్టిస్తున్న రోమ్మీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల రసవత్తరంగా సాగుతున్నాయ్. రెండో బహిరంగ ముఖాముఖి చర్చ తర్వాత రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి మిట్ రోమ్మి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. రోమ్మీకి 51 శాతం ఓటర్లు మద్దతు తెలిపారు. ఒబామాకి 45శాతం ఓటర్ల మద్దతుమాత్రమే లభించింది. ఒబామాపై రోమ్మీ ఆరుపాంయిట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఫ్లోరిడాలో సోమవారంనాడు మూడో ముఖాముఖి చర్చ జరగబోతోంది. జాతి అంశం ఈ ఎన్నికల్లో కీలక భూమికను పోషిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. విస్కాన్సిస్ లో రోమ్నీ పరిస్థితి కాస్తంత మెరుగుపడింది. ఒబామాకి కేవలం ఒక్క శాతం ఓట్లుమాత్రం ఇక్కడ అధికంగా లభించాయి. ఓవరాల్ గా ఒబామాకి 49 శాతం ఓట్లు, రోమ్నీకి 48 శాతం ఓట్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంనుంచి ఇద్దరూ లేక ముగ్గురు.

రాష్ట్రంనుండి కేంద్రక్యాబినేట్ కు ఇద్దరు లేక ముగ్గుర్ని తీసుకుంటారని తెలుస్తుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనుండి ముగ్గురిని తీసుకుంటారని అందులో భాగంగా కోస్తాంద్రప్రాంతం నుండి చిరంజీవికి ఖరారయినట్లే, ఆ మేరకు చిరంజీవికి అధిష్టానం సంకేతాలు పంపారు. రాష్ట్రవర్గాలు  కూడా దీన్ని బలపరుస్తున్నాయి. రాయలసీమనుండి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, అనంతపురం ఎంపి అనంత వెంకటరామిరెడ్డి పోటీ పడుతున్నారు. అయితే నిజాయితే పరుడిగా ప్రజల్లో పట్టున్న నాయకుడిగా సూర్యప్రకాశ్ కే ఎక్కువ అవకాశం ఉందని తెలుసింది. ఇక తెలంగాణ నాయకులుగా రేణుకా చౌధరి, సర్వే సత్యన్నారాయణ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పదవులక కోసం నాయకులు ప్రాంతాల్ని, కులాలని బయటకు తెచ్చారు. ఢిల్లీలో వీరంతా లాబీలు చేస్తున్నారు.  క్యాబినెట్ విస్తరణ శుక్ర లేదా శని వారాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. దసరా ఉత్సవాలను రాష్ట్రపతి పశ్చిమ బెంగాల్ లోని తన స్వస్థలంలో జరుపుకోతలపెట్టినందున దసరాకంటే ముందుగానే క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు.

అవన్నీ ఉత్తుత్తి మాటలే

భారత్ జీవవైవిద్యం గురించి చెబుతున్నవన్నీ ఉత్తుత్తి మాటలే అని చెప్పేమాటలకు అవలంభిస్తున్న పద్దతులకు మద్య చాలా అంతరం ఉందని  దేశం లోని పేరెన్నికగన్న స్వచ్చంధ సంస్ధలు చెబుతున్నాయి. మేధావుల ప్రసంగాలకు, అమలుకు మద్య పొంతన ఉండటం లేదని వారు చెబుతున్నారు. మనిషి భూమికి చెందుతాడా భూమి మనిషికి చెందుతుందా అని ప్రశ్నించుకుంటే మనిషే భూమికి చెందుతాడని కాని మనిషి భూమిని, దానిలోని సహజసిద్దమయిన సంపదను దోచుకుంటున్నాడని వారు ఆగ్రహిస్తున్నారు. ఇదివరలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక అభివద్దినే లక్యంగా చూపుతూ గిరిజన హక్కుల్ని వారు కాలరాస్తున్నారని ఆదివాసీలకు మనుగడ లేకుండా చూస్తున్నారని ప్రముఖ స్వచ్చంధ సంస్ధలు అభిప్రాయపడ్డాయి. గనుల తవ్వకం, డ్యామ్ లు, విద్యుత్ కేంద్రాలు,పోర్టులు, పరిశ్రమలు నిర్మాణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణానికి దానిపై నివసించే ప్రజలకు వారి హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయన్నారు.  జీవవిద్యంసానికి స్వస్తి చెప్పి, ఆర్దిక విధానాలను తిరగరాస్తే తప్ప భారత్ హామీలు అమలయ్యే పరిస్థితి ఉంటుందని అప్పుడే హైదరాబాద్ లో  నిర్వహిస్తున్న జీవవైవిద్య సదస్సుకు ప్రాధాన్యత సంతరించుకుంటుందని వారు తెలిపారు.

మొదటి సంతకం రైతుల రుణాల మాఫీకే

అరవైమూడు ఏళ్ల వయస్సులో కూడా రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్రచేస్తూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అధిగమిస్తున్న చంద్రబాబు అధికారం చెపట్టిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేసే ఫైల్ మీద ముందు సంతకం చేస్తానని తెలిపారు. అలాగే మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని, నిత్యవసర సరుకుల ధరలకు కళ్ళెం వేస్తానని చెప్పారు. అంతే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం సబ్సిడీని తగ్గించి ఇస్తున్న గ్యాస్ సిలిండర్లను 6 నుండి 10 కి పెంచుతామని అన్నారు.  అర్హులైన నిరుద్యోగులందరికీ నెలకు 1000 రూపాయలు నిరుద్యోగ భతి చెల్లిస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని వాగ్ధానం చేశారు. మాదిగల రిజర్వేషన్ కూడా తమ ఎజెండాలో ఉన్నట్లు  చంద్రబాబు తెలిపారు. వాల్మీకులను యస్టీ జాబితాలో చేరుస్తామని, వడ్డెర్లకోసం 10 వేల కోట్లు కెటాయిస్తామని పాదయాత్రలో ప్రకటించారు.

రుషికొండ బీచ్ లో గల్లంతైన ఆరుగురు విద్యార్ధులు

  విశాఖ రుషికొండ బీచ్ లో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్ధులు కెరటాల్లోపడి సముద్రంలో కొట్టుకుపోయారు. అమావాస్య దాటిన మర్నాడు సముద్రంలో పోటు ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలీక ఎంజాయ్ చేద్దామని బీచ్ కెళ్లిన విద్యార్ధులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మెరైన్ పోలీస్టేషన్ టవర్ కి కూతవేటు దూరంలో ఈ ఘోరం జరిగింది. గల్లంతైన విద్యార్ధులంతా గీతమ్స్ విద్యాసంస్థలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్ధులే. హటాత్తుగా కెరటాలపాలై కొట్టుకుపోతూ కేకలుపెట్టిన విద్యార్ధుల్ని కాపాడేందుకు స్థానిక మత్స్యకారులు ప్రయత్నించారు. కానీ.. కేవలం ఒక్క విద్యార్ధి ప్రాణాలు మాత్రం దక్కాయి. బీచ్ లో గల్లంతైన విద్యార్ధులంతా గీతమ్స్ లో ఇంజినీరింగ్ తొలి సంవత్సరం చదువుతున్నారు. క్లాసులు పూర్తయ్యాక సముద్రం దగ్గరికెళ్లి ఆనందిద్దామనుకున్న పిల్లల జీవితాలతోపాటు వాళ్ల కుటుంబాల్లోకూడా చెరగని విషాదం అలముకుంది.

తూ.గో.లో కోట్లాది రూపాయల గంజాయిసాగు?

తూర్పుగోదావరి జిల్లా గంజాయిసాగులో కోట్లాది రూపాయల స్థాయికి చేరుకుంది. పోలీసుల సహాయంతో ఇక్కడ అక్రమంగా ఈ సాగు జరుగుతోందన్న ఆరోపణలకు ఇటీవల ఆధారాలు మరిన్ని లభ్యమవుతున్నాయి. ఒకేసారి రమారమీ కోటిరూపాయలు విలువ చేసే సరుకు ఇక్కడి దాడుల్లో పట్టుబడుతోంది. స్మగ్లర్లు కూడా యధేశ్ఛగా సరుకు తరలించేందుకు భారీవాహనాలను ఉపయోగిస్తున్నారు. గంజాయి వాసన వల్ల దాన్ని గుర్తించి అబ్కారీశాఖ దాడులు చేస్తోంది. తాజాగా గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో అబ్కారీశాఖ చేసిన దాడిలో రూ.70లక్షల విలువైన గంజాయి దొరికింది.  అయితే అసలు స్మగ్లర్లు మాత్రం దొరకలేదు. ఈ వాహనంతో పాటు వెళుతున్న ఓ ముగ్గురిని అబ్కారీ శాఖ అదుపులోకి తీసుకుంది. ఇటీవల జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ (ఎస్పీ)కి, ఏజెన్సీ ప్రాంత డిఎస్పీ నవీన్‌కుమార్‌కు మధ్య ఈ గంజాయిసాగు విషయంలోనే వివాదం జరిగింది. ఆ వివాద సమయంలో కోట్లాది రూపాయల విలువైన గంజాయిసాగు ఇక్కడ జరుగుతోందని డిఎస్పీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఆరోపించినట్లే తాజాగా రూ.70లక్షల విలువైన సరుకు దొరికింది. ఇంకా విలువైన సరుకు రవాణాకు సిద్ధంగా ఉందని సమాచారం వస్తోంది. రాష్ట్రస్థాయిలో ఈ సాగుపై దృష్టిసారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

విష జ్వరాలతో వణుకుతున్న ఏజెన్సీలు

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలన్నీ జ్వరాలతో వణుకుతున్నాయి. ఈ ఏజెన్సీప్రాంత గిరిజనుల ఆరోగ్య సేవ కోసం నియమించిన సిబ్బంది మాత్రం అరకొరసేవలు మాత్రమే చేస్తున్నారు. అసలు ఈ జ్వరాలు ఎందువల్ల వచ్చిందో గుర్తించటానికి చేసే పరీక్షలతోనే సిబ్బంది కాలక్షేపం చేస్తున్నారు. వ్యాధిని నిర్ధారించే అవకాశమే తమకు లేనట్లు వ్యవహరిస్తున్నారు. అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ర్యాపిడ్‌టెస్ట్‌ల్లో అసలు జ్వరం దేని వల్ల వచ్చిందో తెలుసుకునేందుకు వైద్యులు ప్రయత్నించారు. ఈలోపు జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది.  ఏదో ఒక విధంగా ఈ జ్వరాల నుంచి గిరిజనులను రక్షించేందుకు కనీసం ఆహారభద్రత పాటించినా కొంత వరకూ మేలు జరిగేదని సీనియర్‌ వైద్యులంటున్నారు. విషయం తేలేటప్పటికి మృతి చెందేంత దారుణమైన పరిస్థితులు ఎదురవకుండా స్పందించాలని వారు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది తమ ఉద్యోగ ప్రాంతంలోనే నివశించకపోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిరదని కొందరు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, ఖమ్మం, అదిలాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితిపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

విమర్శల పాలౌతున్న తెలంగాణ ఐకాస

తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర డిమాండుతో వెలుగులోకి వచ్చిన ఐకాస(ఐక్యకార్యచరణ సమితి) రెచ్చిపోతోంది. తెలంగాణాకు సంపూర్ణ మద్దతు ప్రకటించలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దిష్టిబమ్మ దగ్దం చేయబోయింది. దీన్ని ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి అడ్డుకున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఐకాస కార్యకర్తలు ఎమ్మెల్యే వర్గీయులపై దాడి చేశారు. వారు కూడా ఎదురుతిరగడంతో కొంత సేపు మహబూబ్‌నగర్‌జిల్లా మల్టకల్‌లో ఉద్రిక్తవాతావరణం చోటు చేసుకుంది. వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగి వివాదం తారాస్థాయికి చేరుతుందని అందరూ ఆందోళన చెందే సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రెండు గ్రూపులను తిప్పిపంపించారు. ఐకాస ఇటీవల తెలంగాణామార్చ్‌ తరువాత తమ బలం పెరిగిందని విర్రవీగుతోంది. ప్రత్యేకించి దాడులకు కూడా సిద్ధమవుతోంది.  సమైక్యాంధ్రావాదులంటే ఐకాస కయ్యానికి కాలుదువ్వుతోందని ఇటీవల పలుసంఘటనలు నిరూపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణా ప్రాంతంలో ఐకాస బెదిరింపులకు కూడా సిద్ధమవుతోంది. తాజాగా తెలుగుదేశం, ఐకాస మధ్య తలెత్తిన ఈ విభేదంలో తప్పుపట్టాలంటే ఐకాసను అందరూ వేలెత్తిచూపుతున్నారు.  

వందేళ్లకు సరిపోయే నిల్వలుంటే దిగుమతి ఎందుకు?

మరో వందేళ్లపాటు వినియోగించుకోవటానికి సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర బొగ్గుగనుల సహాయ మంత్రి ప్రతీక్‌ ప్రకాశ్‌ బాపు పాటిల్‌ అన్నారు. ఆయన రాష్ట్రంలో కీలకమైన సింగరేణి బొగ్గుగనులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం డిమాండు ఎక్కువగా ఉన్నందున విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటామన్నారు. నిల్వలు ఉన్నప్పుడు దిగుమతి ఎందుకు? డిమాండు ఎంత ఎక్కువ ఉన్నా నిల్వలో కరిగిన విలువకు సరిపడే బొగ్గు సేకరించగలిగితే సరిపోతుంది కదా! అసలు ఎందుకు సింగరేణి పరిశ్రమ ఇతర రాష్ట్రాల్లో బొగ్గు సేకరించేందుకు అనుమతి ఇవ్వలేదో ఆయన చెప్పలేదు. తాజాగా సింగరేణి ధరఖాస్తులను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏమైనా బొగ్గు ఉత్పత్తిని పెంచుతామని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్తు ఉత్పత్తిని కూడా ఈ బొగ్గుద్వారానే పెంచుతామని కూడా మంత్రి స్పష్టం చేశారు. 2009లో బొగ్గుగనుల కేటాయింపుపై విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు.

విగ్రహాల తయారీలో మంత్రి శ్రీధర్‌బాబు బిజీయా?

రాష్ట్రానికి మంత్రైనా ఓ తల్లికి, తండ్రికి కొడుకే. అలానే ఓ నియోజకవర్గానికి శాసనసభ్యుడే. ఈ రెండు వాక్యాలకు సంబంధించిన వివాదంలో మంత్రి శ్రీధర్‌బాబు ఇరుక్కున్నారు. ఆయన తన తండ్రి విగ్రహాలకు ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గంలో అభివృద్థిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు మిన్నంటుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఇంకా బస్సులు తిరగని ప్రాంతాలెన్నో ఉన్నాయన్నది పరిశీలనలో తేలిన అంశం. అలానే నియోజకవర్గంలో అభివృద్థి చెందాల్సిన ప్రాంతాలూ ఎక్కువగానే ఉన్నాయి. ఓ శాసనసభ్యుడనే విషయం మరిచిపోయి మంత్రి శ్రీధర్‌బాబు తన తండ్రి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తే ఎలా అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌ పుట్టా మధు ప్రశ్నిస్తున్నారు.  గుక్కెడు నీరు దొరకని పల్లెలను మంత్రి పట్టించుకోవాలని ఆయన కోరుతున్నారు.