బీజేపీ నేతల టార్గెట్ మన్మోహన్
posted on Oct 9, 2012 @ 3:15PM
ప్రథాని మన్మోహన్ సింగ్ హైదరాబాదొస్తున్నారు. జీవవైవిధ్య సదస్సులో పాల్గొనేందుకు ఆయన రాష్ట్ర రాజధానికి ప్రయాణం కడుతున్నారు. మన్మోహన్ సింగ్ ని ఇరకాటంలో పెట్టేందుకు, నిరసన తెలిపేందుకు విపక్షాలకు మరో వంక దొరికింది. రెండుసార్లు కేంద్రంలో ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి రాష్ట్రాన్నే పావుగా ఉపయోగించుకున్న మన్మోహన్ సర్కారు రాష్ట్రానికి ఒరగబెట్టిందేదీలేదంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న సదస్సుకు హాజరౌతున్న ప్రథానికి అడ్డుకుంటే రాష్ట్రం పరువుపోయినట్టేనన్న భావనకూడా ప్రతిపక్షనేతల్లో వ్యక్తమవుతోంది. అందుకే ప్రథానిని అడ్డుకోకుండా ఏ ఇందిరా పార్క్ దగ్గరో ఓ ధర్నా జరిపి, దాని గురించి సమాచారాన్ని మన్మోహన్ జీ చెవిలో పడేసే ప్రయత్నం గట్టిగా చేస్తామని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెబుతున్నారు. కర్రా విరక్కూడదు, పామూ చావాలి అన్న పద్ధతిలో రాష్ట్ర బిజేపీ నేతలు మన్మోహన్ సర్కారు పనితీరుని ఏకిపారేయాలని నిర్ణయించుకున్నారు.