యంగ్ బాబు @ 60
posted on Oct 14, 2012 @ 10:43AM
చంద్రబాబు నాయుడు పాదయాత్ర “వస్తున్నా మీకోసం” విజయవంతంగా సాగుతోంది. ప్రజల ఇబ్బందులు, సాధకబాధకాల్ని తెలుసుకుంటూ బాబు ముందుకు దూసుకుపోతున్నారు. ఆదివారం సాయంత్రానికి వందకిలోమీటర్ల యాత్రని చంద్రబాబు పూర్తి చేశారు. చంద్రబాబు నడకతీరుని వేగాన్ని చుట్టూ ఉన్నవాళ్లు అందుకోలేకపోతున్నారు. గతంలోకూడా చంద్రబాబు రెండున్నర గంటల్లో తిరుమలకొండ ఎక్కేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత మెట్లదారిలో కొండెక్కిన చిరంజీవి ఆపసోపాలుపడ్డ విషయంకూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి అరవైఏళ్లు దాటిన చంద్రబాబు ఇంత కష్టతరమైన విషయాన్ని భుజాలకెత్తుకోవడం అంత సమంజసం కాదేమో అన్న అనుమానాలుకూడా వ్యక్తమయ్యాయి. లేనిపోని ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయేమోనన్న భయం అభిమానుల్లో వ్యక్తమయ్యింది. కానీ.. పార్టీని బలోపేతం చేసేందుకు, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చంద్రబాబు పాదయాత్రని చేపట్టితీరాలని నిర్ణయించారు. వయస్సుని లెక్కచేయకుండా చంద్రబాబు పాదయాత్రలో దూసుకుపోతున్న తీరునిచూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అరవైఏళ్ల వయసులోకూడా యంగ్ బాయ్ లా చంద్రబాబు దూసుకుపోవడం వెనకున్న అసలు కారణం ఆయన తన ఆరోగ్యంమీద ప్రత్యేక మైన శ్రద్ధ చూపించడం, రెగ్యులర్ గా యోగా చేయడం, ఆహారపు అలవాట్లు, ఆలోచనా సరళేనని బాబుని దగ్గరగా ఎరిగున్నవాళ్లు చెబుతున్నారు.