కరవర పెడుతున్న బాబు ఆరోగ్యం
posted on Oct 13, 2012 @ 10:27AM
62ఏళ్ల వయస్సు. ఓ రిటైర్మెంట్ జీవితం. ఆ తరుణంలో రోజుకు 20కిలోమీటర్లు నడవగలరా? కష్టమే అని ఒప్పుకోవాల్సిందే! నిజంగానే వైద్యశాస్త్రపరంగా ఆరోగ్యవంతమైన మనిషి కూడా ఒక వయస్సు వచ్చాక లొంగకతప్పదని తేలుస్తోంది. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు ఓ పెద్ద సహసం చేసినట్లే. ఆయన తన 62 ఏళ్ల వయస్సులో ఒకవైపు ఆరోగ్యం, మరోవైపు 117రోజుల మీకోసం వస్తున్నా పాదయాత్ర రెండు పెనుసవాళ్లుగా మారాయి. ఒకవైపు బాబును కంటి ఇన్‌ఫెక్షన్ బాధిస్తోంది. దీనికి తోడు రేణుమాకులపల్లి గ్రామంలో వికలాంగులతో మాట్లాడుతూ సొమ్మసిల్లారు. అలానే కండరాలు పట్టేయడంతో చాలాసేపు ఇబ్బంది పడ్డారు. అలానే గతంతో పోల్చుకుంటూ చంద్రబాబు నడకవేగం కూడా తగ్గింది. పైగా, బాబు బాగా అలసటగా కనిపిస్తున్నారు. వైద్యుని సలహాల మేరకు కొంత విశ్రాంతి తరువాత బాబు మళ్లీ పాదయాత్ర కొనసాగించారు. ఇప్పటికే 200కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన బాబు తన ఆరోగ్యం సంగతెలా ఉన్నా ముందున్న లక్ష్యం పూర్తి చేస్తానంటున్నారు. అలానే తమకు మద్దతు పలికిన సిపిఐ నేతలను ఆయన సాదరంగా ఆహ్వానించారు.