అరుణ మాట...ఎంపిల గుండెల్లో తూట...
posted on Oct 15, 2012 @ 10:08AM
ఒక్కొక్కరి కవితల్లో పదాల పొందిక చదివేవారి కళ్లలో జీర తెప్పించి ఆవేశాన్ని రగులుస్తుంది. ఒక్కొక్కరి ప్రసంగం వెంటనే లేచి అన్యాయం చేసిన వారిని కాల్చి బూడిద చేయాలనిపిస్తుంది. ఈ రెండిరటిలోనూ భావుకత, ఆవేశం నరనరాల్లోకి జీర్ణించేలా ప్రభావం ఉంటుంది. అంతటి ప్రతిభ ఓ కవికి, ఒక ప్రసంగీకుడికి తరువాత రాజకీయనాయకులకు మాత్రమే ఉంటుంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రి డికే అరుణ మాటల తూటాలు పేల్చటంలో మహాదిట్ట. ఈమె మాట వదిలినప్పుడు ఒక్కోసారి ఎదుటివారు తట్టుకోలేరు. తాజాగా విశాఖజిల్లాలో ఒక సభలో అరుణ మాటలకు సభమధ్యలోనే ఓ ప్రతినిధి అలిగి వెళ్లిపోయారు. ఆ ఘటన తరువాత ఆమె పెద్దగా నోటికి అంతటి పని చెప్పలేదు. తాజాగా తెలంగాణాప్రాంత ఎంపిలందరూ ఖాళీగా ఉండే నేతలతో కలిసి సరదాగా, కొంచెం వ్యంగం కూడా వ్యక్తీకరిస్తూ తెలంగాణా ప్రాంత మంత్రులందరూ రాజీనామా చేయాలని కోరారు. అసలే ఈ ఎంపిలు నియోజకవర్గంలో అభివృద్థి మరిచిపోయి చాలాకాలం అయిందని మంత్రుల చుట్టూ బాధితులు తిరుగుతుంటే....పని చేస్తున్న మంత్రులను రాజీనామా చేయమనటం ‘కూసే.....’ అన్న చందంగా ఉంది. ఇప్పటిదాకా ఎన్ని ప్రకటనలకూ స్పందించని మంత్రి డికే అరుణకు కోపం వచ్చింది. తెలంగాణా కోసం రాజీనామాలు చేయాల్సింది మంత్రులు కాదు ఎంపీలు అని ఆమె గుర్తు చేశారు. కేంద్రంలో ఉన్న సమస్యను రాష్ట్రం నెత్తిన రుద్దేందుకు చూస్తున్న ఎంపీలు తెలంగాణా ప్రాంత అభివృద్థి కుంటుపడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఆమె వదిలిన ఈ తూటాలు తగులుతాయో లేదో?