ప్రజా ప్రతినిధుల ఇళ్లలో దొంగ గ్యాస్ కనెక్షన్ల మాటేమిటీ?
posted on Oct 15, 2012 @ 10:03AM
‘ఒక కుటుంబానికి ఒక గ్యాస్‌కనెక్షనే ఉండాలి. అంతకు మించి ఉంటే గ్యాస్‌కనెక్షను రద్దు చేస్తాం..’ ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న ప్రకటన ఇది. దీన్ని మీడియాలోనూ ఎక్కువగా ప్రయార్టీ కూడా ఇచ్చారు. దీంతో పాటు తాజాగా కొన్ని కనెక్షన్లు రద్దు చేశామని కంపెనీలు చేసిన ప్రకటనలకు జాగా ఇచ్చారు. ఇళ్లపై గ్యాస్ కంపెనీల తాలుకూ అధికారులు, సివిల్‌సప్లయ్ అధికారులు దాడులు చేసి మరీ కనెక్షన్లు రద్దు చేస్తున్నారు కదా! ఈ దాడుల్లో ఒక్క పెద్ద ఇంటి ఓనరు పేరు వినబడిరడిందా? కనీసం ఛోటా నాయకుడి పేరైనా బయటకు వచ్చిందా? పోనీ గుసగుసగా ఉన్నతాధికారి ఇంట్లో ఉన్న కనెక్షన్ల లెక్కలు వినిపించాయా? ఎందుకని అలా జరగలేదు? పోనీలే అనుకుంటే మన శాసనకర్తలైన సభ్యుల ఇళ్లలో సోదాలు జరిగాయని సమాచారం ఉందా? అదీ కూడా లేదు అంటే కంపెనీల ప్రతినిధులకు పైవారంటే బిజినెస్‌మెన్ సినిమాలో మహేష్‌బాబు చూపిన వేలేనన్న మాట. సివిల్‌సప్లయ్ అధికారులకు అయితే ఎకరాలు తడిసిపోతాయి మళ్లీ ఇళ్లకు ముడుపులూ చేరవని భయం. అందుకే అసలు పెద్దల జోలికి పోకుండా నామమాత్రం నిబంధనలు సరిపెడుతుంటారు. గొర్రెలను వెదుక్కుని మరీ దాడులు చేస్తుంటారు. చట్టానికి అందరూ సమానమైతే ముందు గవర్నర్, తరువాత సిఎం, ఆ తరువాత ప్రతిపక్షనాయకులు, శాసనసభ్యులు, ఎంపీలు, స్థానిక ప్రతినిధులు ఇళ్లల్లో సివిల్ సప్లయ్ కుటుంబానికి ఒక కనెక్షన్ ఉందని లెక్కతేల్చి ప్రజల్లోకి వెళితే అప్పుడు ఆ నిబంధనలపై గౌరవం ఉంటుంది. అలా కాకుండా ముందు బడుగు, బలహీన, మధ్యతరగతి బలిపశువులను లెక్కల ప్రకారం ఎంచుకోవటం గ్యాస్‌కంపెనీలకు అలవాటైపోయింది. ప్రజాప్రతినిధుల ఇళ్లను విస్మరిస్తున్న కంపెనీలపై ప్రజాప్రయోజనాల వాజ్యం వేస్తేనే కానీ, గ్యాస్ కంపెనీల అసలు పనితీరు బయటపడదు. తనకు ఇవ్వాలనుకున్నప్పుడు విపరీతంగా కనెక్షన్లు ఇచ్చేసి ఇప్పుడు నియంత్రించేస్తానంటే ఎలా? నిజంగా అవసరం తీరని మధ్యతరగతి ప్రజలను బలిగొనడమేనా పాలసీ అంటే? ఏమైనా ప్రజాప్రతినిధుల ఇళ్లలో దొంగకనెక్షన్ల మాటేమిటీ? చట్టం వారి చుట్టమా? అన్నది ప్రభుత్వం, గ్యాస్‌కంపెనీలు, సివిల్‌సప్లయ్ అధికారులు సమిష్టిగా తేల్చాలని రాష్ట్రప్రజలు కోరుతున్నారు.