వై దిస్ కొలవరి లోకేష్!?
రాష్ట్రంలో ఇప్పుడు యాత్రల సీజన్ జోరుగా నడుస్తోంది. అయితే ఇవి ఎబ్బెట్టు యాత్రలుగా జనంనుంచి నిరాదరణ ఎదుర్కొంటున్నాయి. ప్రజల సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకోవడానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు పాదయాత్ర చేస్తే ఎంత ఎబ్బెట్టుగా వుంటుందో... మన రాష్ట్ర నాయకులు చేస్తున్న పాదయాత్రలు అంతే ఎబ్బెట్టుగా వున్నాయి. అధికార కుర్చీ మొహం ఎరగని రోజుల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారంటే దానికో అర్థం వుంది. కానీ తొమ్మిదేళ్లు అధికారంలో, దాదాపు అంతేకాలం ప్రతిపక్షంలో వున్న చంద్రబాబునాయుడు పాదయాత్ర చేయడంలో అర్థంలేదు. పథకాల అమలుకు సంబంధించి సచివాలయంలో వుండి సమీక్ష చేయడానికి సర్వ సమగ్ర ఏర్పాట్లు వుండి కూడా, అధికార యంత్రాంగంపై అదుపుతప్పిన లోటును కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పల్లెబాట పట్టి వారంలో రెండు మూడు రోజులు అక్కడే గడిపి ‘ఇంటిపోరు’ తప్పించుకుంటున్నారు. తండ్రి తప్పిదాలకు వారసుడైన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సాగించిన పోరుయాత్రలు ఇప్పుడు జైలుయాత్రలుగా రూపాంతరం చెందాయి. రాష్ట్రంలోని మిగతా పార్టీలవి నిరంతర యాత్రలే.
అయితే జగన్ తరఫున ఆయన సోదరి షర్మిల పాదయాత్ర చేపట్టడమే విశేషం. ఆమెను ‘బేబీ షర్మిల’ అని ముద్దుగా పిలుచుకోవడం కద్దు. ఏమీ తెలియని అమాయకురాలు అని అందులో అర్థం వుంది. షర్మిల పాదయాత్ర ఎందుకు ఉద్దేశించినదన్నది చెప్పడం కష్టం. రింగ్ మాస్టర్ జైలులో చాలాకాలంగా వుండడం వల్ల, ఇప్పట్లో బయటికి వస్తాడనే నమ్మకం ఎవరికీ లేనందువల్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయోమయం, అలసత్వం నెలకొన్నాయి. వీటిని పారదోలి మునుపటి ఉత్తేజం అందించడానికి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు శక్తిసామర్ధ్యాలు లేవు. చేతిలో బైబిల్ పట్టుకొని సాగించగలిగిన ప్రచారం, చేయగలిగిన జనాకర్షణకు చాలా పరిమితులు వున్నాయి. జగన్‌కు వున్న జనాకర్షణతో పోల్చితే ఆయన మాతృమూర్తి, స్వయాన వైఎస్ సతీమణి విజయమ్మకు ఆదరణ శూన్యమనే చెప్పాలి. ఈ నేపధ్యంలో ఆకాశంలోంచి ఊడిపడిన ‘ఏంజిల్’ బేబీ షర్మిల! ఆమె ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియదు. కేవలం వైఎస్ కుమార్తెగా ఆమె పాదయాత్ర చేస్తున్నారు. దీనివెనుక రాజకీయ ఉద్దేశాలు, దురుద్దేశాలు ఏమిటో ఎవరికెరుక!?
ఈ నేపథ్యంలో చూస్తే.. చంద్రబాబు అనవసరంగా పాదయాత్ర చేపట్టారు. కొత్తగా ప్రజా సమస్యలు తెలుసుకోవలసింది, పరిష్కార మార్గాలు అన్వేషించవలసింది ఆయనకు ఏమీ లేదు. అనవసరంగా ఈ వయసులో ఆయాసం, అనారోగ్యం తప్ప. ఆయనకు బదులుగా ఆయన కుమారుడు లోకేష్ పాదయాత్రకు పూనుకుని వుంటే అన్ని విధాలుగా ప్రయోజనం వుండేది. యువనాయకుడు కాబట్టి జనంలో కలిసి, వారితో మమేకమైతే అనేక సాధకబాధకాలు తెలుస్తాయి. వాటికి అనుగుణంగా పార్టీ విధానాలు రూపొందుతాయి. లోకేష్ పాదయాత్ర చేస్తే యువతరం అందులో భాగస్వామ్యం అవుతుంది. జగన్‌కు, సోదరి బేబీ షర్మిల యాత్రలకు ధీటుగా వుంటుంది. ఎటొచ్చీ తెలుగుదేశం పార్టీపై ఒక ఆరోపణ వుంది. యువతరానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని. మూడు దశాబ్దాలుగా పాదుకుపోయిన వృద్ధ నాయకత్వమే మండల స్థాయినుంచి కేంద్ర స్థాయి వరకూ వుందని! ఈ ఆరోపణలను పటాపంచలు చేసి యువ నాయకత్వం సారధ్యంలో తెలుగుదేశం నూతన దిశానిర్దేశం చేయబోతోందంటూ ప్రజలకు కొత్త సందేశం ఇవ్వడానికీ వీలుండేది. పైగా షర్మిలలాగా లోకేష్ రాజకీయాలకు కొత్త కాదు. మునుపటి ఎన్నికలప్పుడు పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో కూడా క్రియాశీల పాత్ర పోషించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఈ సంధికాలంలో రైట్‌పర్సన్ లోకేష్ అనడంలో సందేహం లేదు.