స్వార్ధ రాజకీయాలపై బాబు ఆవేదన
posted on Oct 15, 2012 @ 9:54AM
రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. స్నేహాలు చిరకాలం నిలబెట్టుకోవటమూ కష్టమే. కుటుంబాలలో అన్నా చెల్లి వంటి అనుబంధాలు కూడా రాజకీయంలో మనగలగటం కష్టమే. ఎవరి స్థాయి వారు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో రక్తసంబంధీకులు కూడా ప్రత్యర్థులైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదేంటో తెలియదు కానీ, రాజకీయంలోకి వచ్చాక ఎంతమంది మిత్రులను కూడగట్టుకుంటామో అంతమంది శత్రువులూ తయారైపోతారు. అజాతశత్రువుగా రాజకీయంలో నిలవటం ఎవరికీ సాధ్యం కాలేదు. ఈ మాటలు చరిత్రను పరిశీలించిన అనుభవంతో ఎందరో రచయితలు కూడా ఖరారు చేసినవే. కుటుంబాలతో కలిసిపోయిన వారికీ ఇవి వర్తిస్తాయి. ఇటీవల మీకోసం వస్తున్నా పాదయాత్రలో చంద్రబాబునాయుడును పలమనేరుకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఆ సందర్భంగా రాజకీయనాయకునిగా విశేష అనుభవం గడిరచిన చంద్రబాబు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకున్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమర నాథ్ రెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డిలకు తాను ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. అమర నాథ్ రెడ్డి కుటుంబంతో తనకు 30ఏళ్ల అనుబంధమున్నా అతను అలా చేసారేమిటీ అని చంద్రబాబు ఒకసారి గతాన్ని తవ్వుకున్నారు. ఏమైనా ఈ రాజకీయంలో స్వార్థం ఎక్కువ అని, అమర నాథ్ కూడా స్వార్థంతోనే టిడిపిని వదిలేశారని ఓ అభిప్రాయానికి వచ్చారు. ఏమైనా కార్యకర్తలు అలానే ఉన్నారు కాబట్టి అక్కడ పార్టీ అభ్యర్థిని నిలబెడితే ఖచ్చితంగా 50వేల మెజార్టీ వచ్చి తీరుతుందని చంద్రబాబు అంచనా వేశారు.