ఓట్ల కోసం హక్కులు తాకట్టు? ఇద్దరు సీఎంల సెంటిమెంట్ రాజకీయాలు!
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేస్తున్నారా? సెంటిమెంట్ రగిలిస్తూ ఓట్లు దండుకునేందుకు రాష్ట్రాల హక్కులను తాకట్టు పెడుతున్నారా ? జల వివాదాలపై ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ముఖ్యమంత్రుల తీరుతో ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి.ప్రాజెక్టులపై ఉన్న అభ్యంతరాలపై కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సింది పోయి.. కేంద్రానికి పెత్తనం అప్పగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకాలం కలిసిమెలిసి ఉన్నామని చెప్పుకున్న కేసీఆర్, జగన్ లు.. జల అంశాలపై ఎందుకు మాట్లాడుకోవడం లేదనే చర్చ జనాల్లో సాగుతోంది.
కృష్ణా, గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులన్నింటినీ ఆ రెండు బోర్డుల పరిధిలోకి తీసుకొస్తామని కేంద్రం స్పష్టం చేసింది. త్వరలోనే గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపింది. అంటే ప్రాజెక్టులను పరోక్షంగా కేంద్రమే కంట్రోల్’ చేస్తుంది. ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కూడా ఆదేశించింది. డీపీఆర్‌లను సమర్పించడమంటే.. ఈ ప్రాజెక్టులన్నీ కొత్తవేనని అంగీకరించడమే. కేంద్రం తాజా ఆదేశాలపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. సొంత ప్రయోజనాల కోసం ఇద్దరు సీఎంలు.. గోదావరి, కృష్ణా ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టారనే ఆందోళన అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. నదీ జలాల విషయంలో రాష్ట్రాలకే పూర్తి హక్కు ఉంటుందని, దాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టడం.. రెండు రాష్ట్రాలకూ మంచిది కాదని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.
బేసిన్లు, భేషజాలూ లేవు. కలిసి మెలిసి ఉందాం. నీళ్లు పంచుకుందాంమన్నకేసీఆర్ ఇప్పుడు ఆంధ్రా ప్రాజెక్టులపై ఎందుకు కస్సుమంటున్నారన్నది చర్చగా మారింది. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హాజరై... గోదావరికి పూజ చేసిన జగన్... తెలంగాణ ప్రాజెక్టుకు అనుమతులెక్కడున్నాయని ప్రశ్నించడంపై అనుమానాలు వస్తున్నాయి. కలిసి మెలిసి సాగిన ఇద్దరు బ్రదర్స్ నీళ్లపై నిప్పులు కురిపించుకోవడం కొందరికి వింతగానే కనిపిస్తోంది. అయితే ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమే ఇద్దరు సీఎంలు చేస్తున్న డ్రామాగా చెబుతున్నారు. అంతర్గతంగా స్నేహంగా ఉంటూ బయటికి మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లుగా ప్రచారం చేసుకుంటాన్నారని చెబుతున్నారు. నీరంటే జనాలకు సెంటిమెంట్. నీటి కోసం పోరాడే నేతలను హీరోగా చూస్తుంటారు. తెలంగాణ ఉద్యమంలోనూ, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కేసీఆర్.. జలాలనే ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. అందుకే జల వివావాన్ని, జనాల్లో సెంటిమెంట్ ను రగిలిస్తూ.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తన మిత్రుడైన జగన్ కూడా ఇదే రకంగా వేళ్లేలా కేసీఆర్ సెట్ రైట్ చేశారని చెబుతున్నారు.
జల వివాదాలు సున్నితమైనవి. నీటిపై హక్కును వదులుకునేందుకు ఏ రాష్ట్రమూ సిద్ధపడదు. నదీ జలాల విషయంలో రాష్ట్రాలకే పూర్తి హక్కు ఉంటుంది. కేంద్రానికి ఎలాంటి పెత్తనం ఉండదు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే నదీ జలాల వివాదాల పరిష్కారం, కేటాయింపులపై ట్రైబ్యునల్ ఆదేశాలే ఫైనల్. అందుకే జల వివాదాలు దశాబ్దాలపాటు సాగుతూనే ఉంటాయి. తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం ఇంకా తేలలేదు. ఒక రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టుపై పక్క రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం కామన్. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు పరస్పరం చర్చించుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ.. మధ్యేమార్గంగా ముందుకు సాగుతుంటారు. అనుమతులన్నీ వచ్చాకే ప్రాజెక్టులు కట్టాలనేది కేవలం కాగితాలకే పరిమితమైన రూల్. అభ్యంతరాలు ఉన్నా, అనుమతులు రాకున్నా ప్రాజెక్టులూ కడుతూనే ఉంటారు. 75 శాతానికిపైగా పూర్తయిన పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికీ అనేక అనుమతులు రావాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ పై ఛత్తీస్ గఢ్, ఒడిసా రాష్ట్రాల అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా పోలవరం ప్రాజెక్టు ఆగలేదు. ఎన్టీఆర్ మొదలుపెట్టిన తెలుగుగంగ ప్రాజెక్టుకు ఇప్పటికీ పర్యావరణ అనుమతులు రాలేదు. అయినా ప్రాజెక్టు పూర్తయింది. వంశధార ప్రాజెక్టుపై ఒడిసా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీనిపై చర్చలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణమూ కొనసాగుతోంది.
గతంలో ఆలమట్టి డ్యామ్ ఎత్తుపై తలెత్తిన వివాదాన్ని ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చలతోనే పరిష్కరించుకున్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నర్మదా సరోవర్ ప్రాజెక్టుకూ పూర్తిస్థాయిలో అనుమతులు లభించలేదు. అయినా... దాని నిర్మాణం పూర్తి చేసి, జాతికి అంకితం చేసేశారు. అభ్యంతరాలు, అనుమతుల పేరిట ఏ రాష్ట్రమూ తమ ప్రాజెక్టులను ఆపడంలేదు. అలాగని వాటిని కేంద్రం చేతుల్లో కూడా పెట్టడంలేదు. దేశంలో మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులపై కేంద్రం ఆధిపత్యం చెలాయించే అవకాశం కలుగుతోంది. దీని పరిణామాలు భవిష్యత్తులో కనిపిస్తాయని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. జగన్, కేసీఆర్ ల రాజకీయ ఎజెండా వల్లే ఇది జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి.
మొత్తానికి నదీ జలాల అంశంలో వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పెత్తనం కేంద్రానికి ఇవ్వడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ ప్రయోజనాలు, ఓట్ల కోసం... రాష్ట్రాల హక్కులను హరిస్తూ ఇద్దరూ ముఖ్యమంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని సాగునీటి రంగ నిపుణులు, మేథావులు చెబుతున్నారు. రాష్ట్రాల విశేషాధికారాన్ని జారవిడుచుకుంటున్నారని ఆక్షేపిస్తున్నారు.