ఆన్ లైన్ వెనక గ్రేటర్ ప్లాన్! విపక్ష నేతలే టార్గెటా? అమ్మ కేసీఆర్..
posted on Oct 7, 2020 @ 4:24PM
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో జనాల ఆస్తుల లెక్క తేల్చే పనిలో పడ్డారు అధికారులు. అయితే సరైన మార్గదర్శకాలు లేకుండా హడావుడిగా సర్కార్ ఆదేశాలివ్వడంతో.. ఫీల్డ్ లో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తుల కొలతలపై ప్రభుత్వం దగ్గరే క్లారిటీ లేకపోవడంతో.. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గందరగోళంగా, అయోమయంగా ఉన్న ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను ఇంత హడావుడిగా ఎందుకు చేపట్టారన్న చర్చ జనాల్లో జరుగుతోంది. కొన్నేండ్లుగా కొత్త రెవిన్యూ చట్టం తెస్తామని మాత్రమే ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. కొత్త రెవిన్యూ బిల్లును అసెంబ్లీలో పాస్ కూడా చేయించుకున్నారు. తర్వాత సడెన్ గా ఎవరూ ఊహించని రీతిలో ఆస్తుల ఆన్లై న్ చేపట్టాలని నిర్ణయించారు. అంతే హడావుడిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంతో క్లిష్టమైన ఆస్తుల ఆన్ లైన్ పై కేసీఆర్ కు ఎందుకంత తొందర అన్న విమర్శలు వస్తున్నాయి.
ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ వెనక కేసీఆర్ పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే టార్గెట్ గా ఆయన ఈ ప్రక్రియను చేపట్టారని సమాచారం. గ్రేటర్ ఎన్నికలకు గడువుకన్నా ముందే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికల కసరత్తును కూడా ప్రారంభించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. జీహెచ్ఎంసీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. అధికార పార్టీకి మరింత ప్రాధాన్యం. జీహెచ్ఎంసీ పరిధిలో కోటి జనాభా, దాదాపు 70 లక్షల మంది ఓటర్లున్నారు. అంటే రాష్ట్రం మొత్తం జనాభాలో నాలుగో వంతు మంది ఇక్కడే ఉన్నారు. రాష్ట్రంలోని 25 శాతం మంది ప్రజల తీర్పు గ్రేటర్ లో రాబోతోంది. గ్రేటర్ లో వ్యతిరేక ఫలితాలు వస్తే.. అధికార పార్టీపై రాష్ట్రంలోని మెజార్టీ వర్గం అసంతృప్తిగా ఉన్నట్లే. అది తర్వాత ఆ పార్టీకి గండంగా మారుతుంది. అందుకే బల్దియా ఎన్నికలను సవాల్ తీసుకున్న కేసీఆర్.. ఎలాగైనా మరోసారి పాగా వేసేలా పావులు కదుపుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయబోయే విపక్ష నేతలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను తెరపైకి తెచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేస్తే కోట్ల రూపాయల్లోనే ఖర్చు చేాయాల్సి వస్తోంది. పది నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు కూడా కొందరు వెనుకాడరు. గ్రేటర్ లో పోటీ చేయాలనుకునే అశావాహులు.. ఖర్చు కోసం తమ ఆస్తులను అమ్ముతుంటారు. ప్రతి ఎన్నికల ముందు ఇదే జరుగుతుంది. ఈ విషయం తెలిసిన కేసీఆర్.. తెలివిగా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను తెచ్చారని చెబుతున్నారు. అందరి ఆస్తులు ఆన్ లైన్ చేస్తారు కాబట్టి... ఎవరూ తమ ఆస్తులు అమ్మినా ఇట్టే సర్కార్ కు తెలిసిపోతుంది. దీంతో విపక్ష నేతలెవరు ఆస్తులు అమ్ముతున్నారో తెలుసు కోవచ్చు. తర్వాత వారికి చెక్ పెట్టవచ్చు. తమ దారికి తెచ్చుకోవచ్చు. వినకపోతే అక్రమాస్తులు ఉన్నాయంటూ వేధించవచ్చు. మొత్తంగా తమకు పోటీగా ఉంటారని భావించే నేతలకు ఇలా చెక్ పెట్టవచ్చని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అందుకే గ్రేటర్ ఎన్నికలకు ముందు హఠాత్తుగా ఈ ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చారని విపక్ష పార్టీల నేతలు కూడా ఆరోపిస్తున్నారు.
రెవిన్యూ సంస్కరణలు, కొత్త రెవిన్యూ చట్టం, ఆస్తుల ఆన్ లైన్ విధానాలపై సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వెళుతున్నారనే చర్చ ఐఏఎస్ ల్లో జరుగుతుందని చెబుతున్నారు. వీటిపై ఉన్నతాధికారులతోన సీఎం సమగ్రంగా చర్చిచంలేదని, తన ఆలోచనల ప్రకారమే ఆయన ముందుకు పోతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ చేపట్టబోయే పథకాల గురించి విన్న కొందరు అధికారులు.. సరైన మార్గదర్శకాలు లేకుండా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ చేపడితే చాలా సమస్యలు వస్తాయని సీఎంకు చెప్పాలని చూసినా ఆయన స్పందించలేదట. అందుకే కొందరు సీనియర్ అధికారులు ముందే జాగ్రత పడి బదిలీపై వేరే శాఖలకు వెళ్లినట్లు చెబుతున్నారు. సిన్సియర్ అధికారిగా పేరున్న సీనియర్ ఐఏఎస్ చిరంజీవులు కూడా కేసీఆర్ చేస్తున్న పనులు నచ్చకే వేరే శాఖకు వెళ్లారనే చర్చ తెలంగాణ సచివాలయంలో ఉంది. హడావుడిగా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ చేపడితే సమస్యలు వస్తాయని సహచర అధికారులతో చిరంజీవులు చెప్పినట్లు చెబుతున్నారు.
గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ గా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను కేసీఆర్ చేపట్టారనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. విపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు అస్తవ్యస్థ విధానాలు చేపట్టడమేంటనే ప్రశ్న ప్రజా సంఘాల నుంచి వస్తోంది. ప్రజలకు ఆస్తులంటే సెంటిమెంట్. అలాంటి సున్నితమైన విషయంలో హడావుడిగా ముందుకు పోతే మొదటికే మోసం వస్తుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.