ఖమ్మం మైనర్ బాలిక ఘటనపై హెచ్‌ఆర్సీ సీరియస్.. పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారు?
posted on Oct 7, 2020 @ 12:58PM
ఖమ్మం నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముస్తాఫా నగర్‌లోని ఓ సంపన్న కుటుంబంలో 13 ఏళ్ల గిరిజన బాలిక పనిచేస్తోంది. అయితే, కొద్ది రోజుల కిందట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ మైనర్ బాలికపై ఇంటి యజమాని కుమారుడు అత్యాచారయత్నం చేశాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలుతూ ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగెత్తిన బాలికని స్థానికులు చూసి ఆసుపత్రిలో చేర్పించారు. 70 శాతం కాలిన గాయాలతో బాలిక ప్రాణాలతో పోరాడుతోంది.
రెండు వారాల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం ఎవరికైనా చెబితే బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను చంపేస్తామని నిందితుడి కుటుంబం బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు.. డబ్బు ఇప్పించేలా మధ్యవర్తుల ద్వారా బాలిక తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశారని సమాచారం. అయితే, ఈ విషయం స్థానికంగా వెలుగులోకి రావడంతో.. ఎట్టకేలకు బాధితురాలి తల్లిదండ్రులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన సుబ్బారావు కొడుకు మారయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు, ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, ఖమ్మం ఆసుపత్రిలో రెండు వారాల పాటు చికిత్స కొనసాగింది. అయితే, ఆసుపత్రి యాజమాన్యం మాత్రం కనీస సమాచారం ఇవ్వలేదు. డబ్బు కోసం ఆశపడిన డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆమెకు చికిత్స చేసేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో, ఆస్పత్రిపై చర్య తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్య శాఖను జిల్లా పోలీసు యంత్రాంగం కోరింది.
మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ) సీరియస్ అయ్యింది. పలు పత్రికలలో, టీవీ ఛానల్స్‌లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించి, విచారణకు ఆదేశించింది. ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినా పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారని, పోలీసులకు ఆస్పత్రి యాజమాన్యం ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించింది. ఈ ఘటనపై నవంబరు 6లోగా వివరణ ఇవ్వాలంటూ ఖమ్మం సీపీకి హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.
బాలిక కుటుంబసభ్యులను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దోషులను కఠినంగా శిక్షించాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.