క్విడ్ ప్రోకో-2 మొదలెట్టిన జగన్.. యనమల తీవ్ర విమర్శలు
posted on Oct 7, 2020 @ 1:09PM
ఏపీ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించిన విశాఖలో రూ.120 కోట్లతో అభివృద్ధి చేసిన బేపార్క్ చేతులు మారినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు. 2004-09 మధ్య జగన్ క్విడ్ ప్రోకో-1 చేసారని... ఇప్పుడు క్విడ్ ప్రోకో-2 చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ బినామీ వ్యవహారాలపై అత్యున్నత విచారణ జరపాలని అయన డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా జరుగుతున్న కాకినాడ సెజ్, విశాఖ బేపార్క్ వ్యవహారాల పై తాము కేంద్రానికి ఫిర్యాదు చేసి.. జగన్ క్విడ్‌ప్రోకో గుట్టురట్టు చేస్తామన్నారు. జగన్‌రెడ్డి బినామీ ట్రాన్సాక్షన్స్‌లో మరో లావాదేవీ విశాఖ బేపార్క్ అని యనమల పేర్కొన్నారు. హెటిరో కంపెనీ ముసుగులో విశాఖ బేపార్క్‌ను జగన్ హస్తగతం చేసుకున్నారన్నారు.
రూ.300 కోట్ల విలువైన రుషికొండ భూములను బినామీల పేర్లతో సీఎం జగన్ హస్తగతం చేసుకున్నారని అయన అన్నారు. దాదాపు రూ.120 కోట్లతో అభివృద్ధి చేసిన బేపార్క్ చేతులు మారడం వెనుక హస్తం ఎవరిదని ఈ సందర్భంగా యనమల ప్రశ్నించారు. ఎవరి ఒత్తిళ్ల మేరకు విశాఖ బేపార్క్ మేజర్ వాటాలు హెటిరో పరం అయ్యాయని అయన నిలదీశారు. మొన్న కాకినాడ సెజ్, ఈరోజు విశాఖ బేపార్క్ జగన్ బినామీల పరమైందని అయన ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తే... జగన్ మాత్రం బినామీ వ్యాపారాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. అప్పటి కేసులలో జగన్ సహనిందితులకే... ఇప్పటి పాలనలో మేలు జరుగుతోందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.