ఆ పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతా.. మాజీ మంత్రి తీవ్ర హెచ్చరిక
posted on Oct 6, 2020 @ 6:17PM
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ ను టీడీపీ అధిష్టానం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అయన మొట్టమొదటి సారిగా కొవ్వూరు వెళుతూ జవహర్ ర్యాలీ నిర్వహించి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని స్థానిక పోలీసులు కేసులు పెట్టారు. తాజాగా దీనిపై స్పందించిన మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు పోలీసుల తీరుపై మండిపడ్డారు. "తనపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల పై ప్రైవేట్ కేసు పెడతా. పోలీస్ రాజ్యం ఎక్కువ కాలం సాగదని తెలుసుకోండి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఖాకీలు గుర్తుంచుకుంటే మంచిది. తప్పుడు కేసులు పెట్టి.. తనను వేధించిన సీఐ, ఎస్సైలపై ప్రైవేట్ కేసు పెట్టి కోర్టుకి లాగుతా. తనపై కేసులు పెట్టిన ఇదే పోలీసులు.. సీఎం జగన్, బియ్యపు మదుసూధన్ రెడ్డి, రోజాలపై ఎందుకు కేసులు పెట్టలేదు? అసలు డీజీపీ, కొవ్వూరు సీఐ మూర్తి, ఎస్సై వెంకటరమణల వైఖరి చూస్తుంటే.. వీరంతా వైసీపీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసేలా ఉన్నారు". అని జవహర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.