తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా! తిరుపతిలో ఏం చేయబోతోంది?

తిరుపతి లోక్ సభకు త్వరలో జరగనున్న ఉప ఎన్నిక  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ ఎంపీ మరణంతో జరగబోతున్న ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవచ్చని, బిజెపికి ఆ సీటును ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ హాట్ గా మారింది. నిజంగా టీడీపీ తిరుపతిలో పోటీ చేయకూడదని నిర్ణయించిందా.. బీజేపీకి మద్దతు ఇవ్వబోతుందా అన్న చర్చ రాజకీయ పార్టీలతో పాటు టీడీపీలోనూ జోరుగా జరుగుతోంది. తిరుపతిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పోటీ చేయకపోతే  అది సంచలనమే కాబోతోంది. ఏపీలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది.    తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయకుంటే.. అది ఆ పార్టీ చేసిన పెద్ద తప్పిదమవుతుందనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకుంటే టీడీపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీ నేతలు సైలెంట్ అయి పోయారు. పార్టీలో, ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నేతలు సైతం కనిపించకుండా పోయారు. దశాబ్దాల పాటు మంత్రులు చేసిన సీనియర్లు కూడా ప్రజలకు, టీడీపీ కేడర్ కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఏపీలో టీడీపీ కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదు. అటు బీజేపీ మాత్రం పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అందివచ్చే అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. అలయాలపై దాడులు, టీటీడీ డిక్లరేషన్ వంటి విషయాల్లో దూకుడుగా వెళ్లారు కమలనాధులు. టీడీపీ నేతలు మాత్రం ప్రకటనలు, ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు.    టీడీపీలో నెలకొన్న స్థబ్దతతో  ఏపీలో ప్రస్తుతం రెండే పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబుకు వయసు మీద పడిందనే టాక్ కూడా వినిపిస్తోంది. టీడీపీ నేతలు ఎక్కడున్నారనే  డౌట్స్ కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ పోటీ చేయకపోతే.. ఆ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. తిరుపతి సీటును బీజేపీకి ఆఫర్ చేస్తే.. టీడీపిపై ప్రజల్లో ఉన్న రూమర్ నిజం చేసినట్లు అవుతుందని కొందరు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే టీడీపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా బీజేపీ మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లవచ్చని, టీడీపీని టార్గెట్ చేయవచ్చనే అభిప్రాయం కూడా వస్తుంది.    సహజంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. తిరుపతిలో చనిపోయిన సిట్టింగ్ ఎంపీ వైసీపీ వ్యక్తే. అంటే అక్కడ వైసీపీకి అధికార పార్టీతో పాటు సిట్టింగ్ ఎంపీ చనిపోయిన సానుభూతి కూడా ఉంటుంది. సో .. తిరుపతిలో విపక్ష పార్టీగా ఓడిపోయినా తెలుగుదేశానికి పెద్ద ఇబ్బంది ఉండదు. అధికారంతో పాటు సెంటిమెంట్ తో వైసీపీ గెలిచిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పోటీ చేయకపోతే వైసీపీని ఎదుర్కొనే సత్తా లేక పారిపోయిందనే విమర్శలు టీడీపీకి రావచ్చు. పార్టీకి భవిష్యత్ లో ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. వైసీపీ ఆరోపిస్తున్నట్లే టీడీపీకి భవిష్యత్ లేదనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లే అవకాశం ఉందనే ఆందోళన కొందరు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది.    బీజేపీ బలపడితే ఏపీలో టీడీపీకే ఎక్కువ ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. జాతీయ పార్టీ బలంగా ఉన్న మెజార్టీ రాష్ట్రాల్లో ఒక్క ప్రాంతీయ పార్టీనే నిలదొక్కుకోగలుగుతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ లేదా బీజేపీలో ఏదో ఒకటే బలపడుతోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది కాబట్టి జాతీయ పార్టీగా బీజేపీ బలపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక్క ప్రాంతీయ పార్టీనే స్ట్రాంగ్ గా నిలబడవచ్చు. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీకి ఢోకా ఉండకపోవచ్చు. ఎటొచ్చి బీజేపీ బలపడితే నష్టపోయేది టీడీపీనే. అందుకే టీడీపీని బలహీనపరుస్తూ ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి సపోర్ట్ చేస్తే.. టీడీపీ కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.   సార్వత్రిక ఎన్నికల తర్వాత  బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాబు ఎంతగా ప్రయత్నించినా బీజేపీ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రావడం లేదని కూడా తెలుస్తోంది. అయినా బిజెపి కేంద్ర పెద్దల దృష్టిలో పడేందుకు, అదేపనిగా వారిని పొగుడుతూ లేఖలు రాస్తూ సోషల్ మీడియాలో చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారాలన్నీ తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం నచ్చడం లేదు. ఏపీలో క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్నా, కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, మళ్లీ తప్పనిసరిగా పార్టీకి పునర్వైభవం వస్తుందని నమ్ముతున్నారు. అప్పటి వరకు చంద్రబాబు ఆగలేకపోతే ఎలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. బిజెపిని నమ్ముకోవడం కంటే సొంతంగా పార్టీని పటిష్టం చేసే విషయంపై దృష్టిపెడితే మేలని కొందరు  టిడిపి నాయకులు అధినేతకు సూచనలు చేస్తున్నారు.    తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చివరి వరకు రెండు కండ్ల సిద్ధాంతం వినిపించారు చంద్రబాబు. చివరకు అదే తెలంగాణలో టీడీపీకి శాపంగా మారింది.  బీజేపీ పొత్తు కూడా అక్కడ టీడీపీని దెబ్బ తీసింది.  బిజెపి బలంగా లేకపోయినా వారికి ఎక్కువ సీట్లు ఇవ్వడంతో పార్టీ దెబ్బతిన్నదని తెలంగాణ టీడీపీ నేతలే బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు ఏపీలోనూ అదే సీన్ కనిపిస్తోంది. టీడీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా సోము వీర్రాజు టీమ్ కుట్రలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే ఏపీలోనూ టీడీపీకి తెలంగాణలో ఉన్న పరిస్థితి రావచ్చనే ఆందోళన కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. తిరుపతిలో బీజేపీకి సపోర్ట్ చేస్తే.. అది టీడీపీకి గుది బండగా మారుతుందని,  అలాంటి అవకాశం ఇవ్వొద్దని తమ్ముళ్లు చెబుతున్నారు   అసెంబ్లీలో ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా ఢీలా పడాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు టీడీపీ నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ 24 సీట్లకు పడిపోయినా.. తర్వాత పుంజుకుని అధికారం చేపట్టిందని  గుర్తు చేస్తున్నారు. 1989లో టీడీపీ ఓడిపోయినా.. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష  హోదా కూడా రాకుండా మట్టి కరిపించిందని చెబుతున్నారు. ప్రజా సమస్యలు పోరాడుతూ ఉంటే చాలని, ఏపీలో టీడీపీదే మళ్లీ అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే.. చేజేతులా మరో పార్టీకి బలపడే అవకాశం ఇచ్చినట్లేనని చెబుతున్నారు.   మరోవైపు తిరుపతి ఉప ఎన్నికపై జరుగుతున్న ప్రచారాన్ని కొందరు టీడీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటున్నారు. గతంలోనూ ఇబ్బందులు వచ్చినా పార్టీని బలోపేతం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని, గెలుస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే టీడీపీపై వైసీపీ ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తుందని కూడా కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని చర్చలు, ప్రచారాలు జరుగుతున్నా తిరుపతి ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయం ఏపీ  రాజకీయాల్లో కీలకం కాబోతుందని తెలుస్తోంది. సో.. చంద్రబాబు టీడీపీని ఫణంగా పెట్టేలా తిరుపతిలో బీజేపీకి మద్దతిస్తారా.. లేక బరిలో ఉండి అధికార వైసీపీని ఢీకొడతారా చూడాలి మరీ.

యూపీలో ఆగని అత్యాచారాలు.. సీఎం యోగిని మఠానికి పంపేయాలంటున్నమాయావతి 

దేశ వ్యాప్తంగా యూపీలోని హత్రాస్ ఘటన పై ఒక పక్క నిరసనలు వెల్లువెత్తుతుండగా మరో పక్క అక్కడ హత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క హత్రాస్ ఘటనపై నిరసన వ్యక్తం అవుతున్న సమయంలోనే హత్రాస్ కు 500 కిలోమీటర్ల దూరంలో మరో 22 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరగగా తీవ్రమైన గాయాలతో ఆ యువతి మరణించింది. ఉదయం పనులకు వెళ్తుండగా తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని, ఇంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆ యువతి తల్లి తెలియచేసింది. అయితే చివరకి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిందని.. ఒక రిక్షాలో తన కూతురిని ఇంటికి పంపించారని ఆమె తెలిపింది. నిందితులు ఆమెకు ఇంజక్షన్ ఇచ్చి.. స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశారని ఆమె అన్నారు. అయితే ఇంటికి తిరిగి వచ్చిన తమ కూతురు మాట్లాడలేని, నిలబడలేని స్థితిలో ఉందని ఆ తల్లి చెప్పింది. అంతేకాకుండా తనను రక్షించాలని, చనిపోవడం తనకు ఇష్టం లేదని బాధితురాలు బోరుబోరున విలపించడంతో ఆమెను చికిత్స కోసం తరలిస్తుండగా బలరామ్ పూర్ కు సమీపంలోకి చేరుకోగానే ఆమె మరణించింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో ఒకరు మైనర్ అని తెలుస్తోంది.   ఇది ఇలా ఉండగా రాష్ట్రం లోని బులంద్ షెహర్ లో మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై బాలిక తండ్రి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ పొరుగున ఉండే 20 ఏళ్ల యువకుడు తన 14 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసినట్లు అతను ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆజంగఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో 8 ఏళ్ల వయస్సు గల బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. జియాన్ పూర్ లో బాలిక ఇంటి పక్కనే ఉండే యువకుడు బాలికను తన ఇంటికి తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.   ఇది ఇలా ఉండగా హత్రాస్ దారుణ ఘటనతో పాటు యూపీలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగిపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో యోగి విఫలం అయ్యారని, యోగిని తిరిగి గోరఖ్ పూర్ మఠానికి పంపించాలని మాయావతి ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆయనకు అదీ నచ్చకపోతే.. రామ మందిర నిర్మాణ పనులను అప్పజెప్పాలని పేర్కొన్నారు. మహిళలపై నేరాలు జరగకుండా యూపీలో ఒక్క రోజు కూడా గడవడంలేదని ఆమె మండిపడ్డారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో యోగి విఫలమైతే వెంటనే రాజీనామా చేయాలని మాయావతి డిమాండ్ చేశారు. కనీసం హత్రాస్ ఘటన తర్వాత అయినా, రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గుతాయని తాము బావించామని, కానీ బలరాంపూర్‌లో మరో ఘటన.. బులంద్ షెహర్ లో ఇంకో ఘటన.. ఇలా జరుగుతూనే ఉన్నాయని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో నేరస్థులకు ఫ్రీహ్యాండ్ దొరికిందని మాయవతి ఈ సందర్భంగా మండిపడ్డారు.

జగన్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర కలే

వైసీపీ విధానాలతో అన్నదాతల ఆత్మహత్యల్లో ఆంధ్ర 3 వ స్థానం   వైసీపీ ప్రభుత్వం తీరుపై అమలాపురం టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు అనంతకుమారి ధ్వజం   వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అమలాపురం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ధ్వజమెత్తారు. గురువారం ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆచరణలో ఆ రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని లెక్కలు చెబుతూ వారికి ఆచరణలో  మొండిచెయ్యి చూపుతుందని పేర్కొన్నారు. దేశానికి వెన్నుముక అని చెప్పబడుతున్న రైతుకు ఈ  ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. కరోనా లాక్ డౌన్ లో పంట ఉత్పత్తులు కొనేవారు లేక అయిన కాడికి అమ్ముకునే దుస్థితి తీసుకువచ్చారని, గిట్టుబాటు ధర లభించకపోవడంతో పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకువచ్చారని ఆందోళన వెలుబుచ్చారు. రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు అందించడంలో  విఫలం అయ్యారని పేర్కొన్నారు. గోదావరి జిల్లాల్లో ఇటీవల వరదలు, భారీ వర్షాలకు పంటలు నష్ట పోయినా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. జగన్ వచ్చిన తర్వాత అతివృష్టి అనా వృష్టి తో  అన్నదాతలకు అన్ని కష్టాలే మిగిలాయని ఆందోళన వెలుబుచ్చారు.    ఈ పాలనలో ఏ పంటకు మద్దతు ధర లభించలేదని ధాన్యం, పసుపు, మొక్కజొన్న,కంది, శనగ పంట సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లభించక నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం రైతులకు రూ.1,728 కోట్లు బకాయిలు ఉన్నాయని వీటిని ఎప్పుడు చెల్లిస్తారని ఆమె ప్రశ్నించారు.గతంలో 22 వేలు  ఉన్న మిర్చి ధర 8 వేలకు పడిపోయిందని ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకానికి 1815 ఉండగా రూ.1100 నుంచి 1300 కు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.క్వింటా ధాన్యానికి రైతు 500 నుంచి 700 వరకు నష్టపోయాడని మొక్కజొన్నకు మద్దతు ధర 1760 ఉండగా 1400 కు కొనుగోలు చేశారని వేరుశనగ రూ.5090 ఉండగా రూ.4500 మినుములు 5700 ఉండగా 5000  కొనుగోలు చేశారని తెలిపారు.    జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఆత్మహత్యలతో దేశంలోనే రాష్ట్రం 3 వ స్థానం లో ఉందని, 2018 లో 664 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా  జగన్ అధికారం చేపట్టాక 2019లో  1029 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ ఏడాది  ఇప్పటి వరకు 1200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని  దేశంలోనే అత్యధికంగా రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర కర్ణాటక ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు.బడ్జెట్లో 64.06 లక్షల మందికి రైతు భరోసా పథకం వర్తింప చేస్తామని చెప్పి 45,00,263 మందికి కుదించారన్నారు.15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 1,58,123 మందికి తగ్గించారని ఇది నమ్మక ద్రోహం కాదా? అని ప్రశ్నించారు.సున్నా వడ్డీకి  రైతురుణాలు ఇస్తామని చెప్పి మాట తప్పి మడమ తిప్పారని, 4వేల కోట్లు ఇస్తామని చెప్పి 2019 బడ్జెట్ లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.ఇప్పుడు ఉచిత  వ్యవసాయ విద్యుత్ అని చెబుతూ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు.రేపు వచ్చే బిల్లులతో వారి నెత్తిన భారం మోపడానికి జరుగుతున్న ఎత్తుగడగా అభివర్ణించారు.   టీడీపి హయాంలో వ్యవసాయ రంగ ప్రగతి సాధించిదని ఆమె తెలిపారు. వ్యవసాయానికి బడ్జెట్ టిడిపి ప్రభుత్వం మూడు నాలుగు రెట్లు చేసిందని 2013-14 లో వ్యవసాయానికి బడ్జెట్ 6,128 కోట్లు కాగా టిడిపి ప్రభుత్వం  2018-19 నాటికి రూపాయలు 19,070  కోట్లకు పెంచిందని ప్రకటనలో పేర్కొన్నారు.ఐదేళ్లలో రూపాయలు 81,554 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగిందని రైతులకు రూ. 15,279 కోట్ల మేర రుణ మాఫీ చేశామని వ్యవసాయరంగంలో వృద్ధిరేటు సగటున 11%  సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను చంద్రబాబు నిలబెట్టారని అనంతకుమారి ప్రకటనలో తెలిపారు. 

పాపం.. అధికారాల్లేని మంత్రులు!

పాపం.. అధికారాల్లేని మంత్రులు!   మంత్రి క్యాంపు ఆఫీసు ముందే చెత్తకుప్ప   మంత్రి చెప్పినా వినే దిక్కులేదట   కలెక్టరుకు లేఖ రాసిన మంత్రి మేకపాటి   తెలంగాణలోనూ మంత్రుల పరిస్థితి దయనీయమేనట   ఆంధ్రాలో మంత్రి పదవులు రాలేదని కొద్దికాలం కుమిలిపోయిన సీనియర్లు, ఇప్పుడు ఆ పదవులు రాకపోవడమే మంచిదన్న భావనలో ఉన్నారు. పదవులివ్వకుండా జగనన్న తమ పరువు కాపాడారని సంతోషిస్తున్నారట. నెల్లూరు జిల్లా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పినా చెత్త తొలగించని వైనం చూసి, తమకు పదవులు రాకపోవడమే మంచిదయిందని తమకు తాము ఓదార్చుకుంటున్నారట. అటు పదవులు పొందిన మంత్రులదీ అదే భావన. మునుపటి మాదిరిగా జగనన్నకు, ఇప్పుడు ఎవరినీ ఓదార్చే తీరిక లేకపోవడంతో.. పాపం మంత్రులు తలుపులు వేసుకుని, అద్దం ముందు నిలబడి తమను తామే ఓదార్చుకుంటున్నారట.   అధికారంలోకి వస్తే మంత్రులయి, పెత్తనం సాగించవచ్చని వైసీపీ నేతలు భావించారు. తీరా అధికారంలోకి వచ్చి, పదవులు దక్కించుకున్నా పెత్తనమంతా సీఎంఓదే కావడంతో నిరాశ చెందుతున్నారట. అటు అధికారులూ మాట వినక, ఇటు జనంలో పలుకుబడి పలచనవుతుండటంతో జుత్తుపీక్కోవలసి వస్తోందిట. మంత్రి పదవులు పొందిన వారిని చూసి, ఎమ్మెల్యేలు ఈర్ష్య పడుతుంటే.. ఎమ్మెల్యేల స్వేచ్ఛను చూసి, మంత్రులు ఈర్ష్య పడుతున్న వైచిత్రి కనిపిస్తోంది.   నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి, జగనన్న అత్యంత సన్నిహితుడే. విపక్షంలో ఉండగా, ఆర్ధికంగా నాలుగుచేతులేసిన వారిలో మేకపాటి కుటుంబం కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత, మేకపాటికి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ, పాపం జిల్లాలో ఆయన మాట చివరకు శానిటరీ ఇన్స్‌పెక్టర్ కూడా పట్టించుకోకపోవడం లేదట. దీనితో  మంత్రిని చూసి, సొంత పార్టీ నేతలే జాలిపడాల్సిన దుస్థితి. స్వయంగా మంత్రిగారి క్యాంపు ఆఫీసు వద్దే పేరుకుపోయిన కొండంత చెత్తను తొలగించాలని, మంత్రి గారి ఆఫీసు నుంచి చాలా ఫోన్లు వెళ్లాయట. అయినా ఖాతరు చేసే దిక్కులేదు. దీనితో అగ్గిరాముడయిన మంత్రి, సదరు అధికారికి ఫోన్ చేసి తన వద్దకు హాజరుకావాలని హుకుం వేశారు. ‘అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లు.. ఆ అధికారి మంత్రి కంటే నాలుగాకులు ఎక్కువే చదవడంతో, డోంట్ కేర్ అన్నారు. దానితో కన్నెర్ర చేసిన మంత్రి గారు, ఆ అధికారి సంగతి తేల్చాలని జిల్లా కలెక్టరులకు లేఖ రాశారట. ఒకవేళ కలెక్టర్ మంత్రి గారి మాట విని, సద రు అధికారిపై చర్య తీసుకుంటే మున్సిపల్ ఉద్యోగ సంఘాలు ఊరుకోవు. చర్య తీసుకోకపోతే.. ఇప్పటికే సగం పోయిన మంత్రి పరువు, తర్వాత పూర్తిగా పోవడం ఖాయం. చూడాలి.. కలెక్టరు గారు ఏం చేస్తారో? నిజానికి జగనన్న క్యాబినెట్‌లో.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఒకరిద్దరి మాటనే చెల్లుబాటవుతోంది. మిగిలిన వారి ఈతిబాధతల గురించి, ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిది. వారి శాఖలన్నీ సీఎంఓనే పర్యవేక్షిస్తోంది. మంత్రులకు ‘ఆలోచించుకునే కష్టం’ కూడా కలగనీయడం లేదట. సచివాలయ స్థాయిలో కార్యదర్శి- ముఖ్య కార్యదర్శులు, జిల్లా స్థాయిలో కలెక్టర్లదే హవా. కాంగ్రెస్ హయాంలో ఉత్తరాంధ్రను ఊపేసి, నాటి సీఎం కిరణ్‌కునమార్‌రెడ్డినే ఖాతరు చేయని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితి చూసిన వారు, ఆశ్చర్యపడాల్సి వస్తోంది.   ఇక గతంలో మంత్రులుగా పనిచేసిన వారు ఇప్పుడు స్థితప్రజ్ఞత ప్రదర్శించి, ఎవరి నియోజకవర్గాలకు వారు పరిమితమయ్యారు. అధికారంలోకి వచ్చి 15 నెలలయినా ఇప్పటికీ, క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల పేర్లు చాలామందికి తెలియవంటే  ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. పేరుకు పెద్ద శాఖలు నిర్వహిస్తున్న మంత్రులకూ పెద్దగా అధికారాలు లేవట. పేరుకు చాలా పెద్ద, కీలకమయిన రెవిన్యూ శాఖ మంత్రికి పెద్దగా పవరు లేదట. సరే అప్పటి నిమ్మకాయల చినరాజప్ప- నాయని నరసింహారెడ్డి.. లేకపోతే ఇప్పటి మేకతోటి సుచరిత-మొహమద్ అలీ హోంమంత్రులుగా ఉన్నా, లా అండ్ ఆర్డర్‌తోపాటు... డీఎస్పీ నుంచి సీఐల బదిలీ వరకూ సీఎంలే చూసుకుంటారు.  కాబట్టి, హోంమంత్రుల అధికారాలు-ఆవేదన గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. అయితే... చంద్రబాబును ప్రతీ విషయంలో వ్యతిరేకిస్తూ... తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్న  జగనన్న, ఈ  విషయంలో మాత్రం వారిద్దరి అడుగుజాడల్లో నడుస్తుండటం విశేషం. అప్పుడు బాబు-ఇప్పటికీ కేసీఆర్.. అధికారాన్ని సీఎంఓకే అనుసంధానం  చేశారు. కెఇ కృష్ణమూర్తి లాంటి సీనియరే, ఎమ్మారో-ఆర్డీఓ బదిలీలు మీరే చేసుకోమని సీఎంఓకు దండం పెట్టి వచ్చారు. బాబు తీసుకునే నిర్ణయాలేమిటో, తమ జిల్లా కలెక్టర్లు చెబితే గానీ మంత్రులకు తెలిసేది కాదు.   తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్. తెలంగాణలోనూ హరీష్‌రావు లాంటి వారికి తప్ప, ఎవరికీ అధికారాలు లేవు. అంతా సీఎంఓ ఆదేశాల మేరకే శాఖలు నడుస్తున్నాయి. ఫలానా వారిని నియమించుకునే అధికారం, మంత్రులకు లేదన్నది బహిరంగ రహస్యం. ఒకప్పుడు టీడీపీ-కాంగ్రెస్ ప్రభుత్వాలలో హవా చెలాయించి, జిల్లాల్లో ఏకపాత్రాభినయం చేసిన ప్రముఖులంతా, ఇప్పుడు తమ స్థానమేమిటో గ్రహించి, లౌక్యంగా వెళుతున్న పరిస్థితి. కేటీఆర్, హరీష్ తర్వాత మరొక మంత్రికి పెద్దగా అధికారాలు ఉన్నట్లు కనిపించదు. గతంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి వంటి కొద్దిమంది హవా కనీసం వారి శాఖలోనయినా నడిచేది.   ఆంధ్రాలో జగన్మోహన్‌రెడ్డినయినా, తెలంగాణలో కేసీఆర్‌ను అయినా మంత్రులు కలవాలంటే గగనమే. వాళ్లు పిలిస్తే తప్ప, తమంతట తాము వెళ్లి కలిసే పరిస్థితి లేదు. ఈ విషయంలో చంద్ర బాబు ఎంతో మెరుగని చెబుతుంటారు. వన్ టు వన్ కాకపోయినా, వెళ్లే ముందో-వచ్చే ముందో కనీసం బాబు దగ్గర ధర్మదర్శనం ఉంటుంది. తిరుమల వెంకన్న మాదిరిగా, ఆయన నిలబడితే సందర్శకులు క్యూలు కట్టి, తమ ఈతిబాధలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. బాబు అప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయం చెప్పకపోయినా.. వర్కవుట్  చేద్దాం. చూద్దాం. మాహాడదాం.. అనే మాటలు వినిపిస్తుంటాయి. కానీ కేసీఆర్-జగన్ వద్ద అది కూడా ఉండదన్నది ఆయా పార్టీ వర్గాల్లో బహిరంగంగా వినిపించే వ్యాఖ్య. ఎవరి స్కూలు వారిది మరి! -మార్తి సుబ్రహ్మణ్యం

హైదరాబాద్ 'బాద్' షా ఎవరు?

‘గ్రేటర్’ ఎన్నికల కసరత్తు షురూ   కాంగ్రెస్-బీజేపీ బలమెంత?   టీడీపీని నమ్మని సెటిలర్లు   గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కసరత్తు మొదలయింది. తెలంగాణలో అసెంబ్లీ, మునిసిపల్, జడ్పీ-ఎంపీటీసీ ఎన్నికలన్నీ అయిపోగా, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు మాత్రమే మిగిలిపోయాయి. సమైక్య రాష్ట్రం ఉన్నంత వరకూ.. కార్పొరేషన్‌లో బలంగా ఉన్న బలంగా ఉన్న, టీడీపీ-కాంగ్రెస్ పార్టీలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత బలహీనపడ్డాయి. అయినప్పటికీ నగరంలో సీట్లు సంపాదించుకున్న టీడీపీ, తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో విఫలమయింది. ఫలితంగా నగరం- శివార్లలోని సెటిలర్లు వివిధ కారణాల వల్ల ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి జై కొడుతున్న ఉత్తరాది సెటిలర్లు, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తెలివిగా టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్న పరిస్థితి.   ఇక కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యం వల్ల, అది కూడా చేతులెత్తేసింది. ఈవిధంగా ఒకప్పుడు కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసిన ఈ రెండు పార్టీలను, టీఆర్‌ఎస్ పూర్తిగా వెనక్కినెట్టి, గత ఎన్నికల్లో తొలిసారి కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసింది. వచ్చే ఏడాదితో, పాలకవర్గ పదవీకాలం పూర్తవుతుంది. అయితే, ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్నది టీఆర్‌ఎస్ ఆలోచన. అందుకే ఆ పార్టీలో ఎన్నికల సమరోత్సాహం తొంగిస్తోంది.   ఒకప్పుడు ఖాతా తెరవని టీఆర్‌ఎస్.. మళ్లీ కార్పొరేషన్‌పై రెండోసారి జెండా ఎగురవేయలని పట్టుదలతో ఉంది. ఆ పార్టీ కార్పొరేటర్లపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, విపక్షాల వైఫల్యం వల్ల అది ఎన్నికల్లో ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు. పాతబస్తీలో కాంగ్రెస్ ఇంతవరకూ ప్రత్యామ్నాయంగా ఎదగకపోవడంతో, సహజంగా టీఆర్‌ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీనే అక్కడ మరోసారి  పాగా వేసేలా ఉంది. న్యూసిటీలో కొంతవరకూ సర్కారుపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, కాంగ్రెస్-బీజేపీ-టీడీపీ చీల్చుకునే ఓట్లు, టీఆర్‌ఎస్‌కు లాభించనుంది. నగరంలోని కొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. వారి నియోజకవర్గాల్లో మాత్రమే టీఆర్‌ఎస్ నష్టపోయే అవకాశం ఉంది. అయితే అక్కడ ప్రత్యామ్నాయ పార్టీలు లేకపోయినా, సిట్టింగ్ ఎమ్మెల్యే-కార్పొరేటర్లపై ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందన్నమాట.   ఇక గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన 14, 68,618 ఓట్లను, ఈసారి గణనీయంగా పెంచుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం రంగంలోకి దిగింది. గత ఎన్నికల్లో తెరాసకు 43.85 శాతం ఓట్లు వచ్చాయి. కాగా మజ్లిస్ 5,30,812 ఓట్లతో 15.85 శాతం ఓట్లు, టీడీపీ 4,39,077 ఓట్లతో 13.11 శాతం; బీజేపీ 3,46,253 ఓట్లతో 10.34 శాతం; కాంగ్రెస్ 3,48,388 ఓట్లతో 10.4 శాతం; ఇతరులు 2,27,742 ఓట్లతో 6.5 శాతం ఓట్లు సాధించారు. ప్రధానంగా సెటిలర్లు ఎక్కువగా నివసించే, శివారు నియోజకవర్గాలన్నీ కారెక్కడం విశేషం. ఈసారి కూడా అదే ట్రెండు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.   నిజానికి నగరంలో టీఆర్‌ఎస్, రాజకీయంగా పెద్దగా కార్యక్రమాలు చేసిందేమీ లేదు. ఇప్పటివరకూ కమిటీలు లేవు. అసలు నగర పార్టీకి ఓ ఆఫీసు అంటూ లేకపోవడమే ఆశ్చర్యం. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఆలయ కమిటీలు వేయలేదు. తొలి నుంచీ రాజకీయాల్లో చురుకుగా ఉన్న ఎమ్మెల్యేలు మాత్రమే, స్థానికంగా ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేసుకున్నారు. కానీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రాతినిధ్యం వహించే సికింద్రాబాద్‌లో మాత్రం, ఒక్క నామినేటెడ్ పదవి కూడా భర్తీ చేయలేదు. మొత్తానికి, టీఆర్‌ఎస్‌కు ఒక బాధ్యత-ఒక రాజకీయ వ్యవస్థ అంటూ లేదు. అయినా గత ఉన్నికల్లో కేసీఆర్-కేటీఆర్‌ను చూసే ప్రజలు ఓటు వేసే పరిస్థితి కొనసాగింది.   ఇక భాజపా హడావిడి తప్ప, పార్టీ విస్తరించిన దాఖలాలు లేవు. ఇటీవలే నగర కమిటీని చీల్చి, కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటుచేసి కమిటీలు ప్రకటించారు. దానిపైనా నేతల్లో  తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. హంగామా చేసే నాయకులకు కొదవ లేని నగరంలో, జనం వద్దకు వెళ్లే నాయకులు తగ్గిపోవడం  ఆ పార్టీకి ఆందోళన కలిగించే అంశమే. హిందుత్వ అజెండానే నగరంలో పార్టీని బతికిస్తోంది తప్ప, రాజకీయ పార్టీగా సొంతగా బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు శూన్యం. గతంలో టీడీపీతో కలసి కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌ను సాధించిన బీజేపీ.. గత కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన సీట్లు కేవలం నాలుగే నాలుగంటే! దీన్నిబట్టి నగరంలో బీజేపీ అగ్రనేతలు పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నారో అర్ధమవుతూనే ఉంది.   పట్టుమని పదిమందిని తీసుకురాలేని వారిని రాష్ట్ర-నియోజకవర్గ నాయకులుగా నియమిస్తున్న విధానం, పార్టీకి నష్టంగా పరిణమించింది. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి చుట్టూ తిరిగి పైరవీలు చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ, పార్టీ విస్తృతిపై పెడుతున్న దాఖలాలు లేవంటున్నారు. పెద్ద బొట్లు పెట్టుకుని,  నినాదాలు చేసి.. మీడియాలో షో చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీని విస్తరించాలన్న ఆలోచన ఎవరికీ లేదు. టీడీపీతో పొత్తు ఉన్నప్పుడే, బీజేపీ రాజకీయంగా బలపడిందన్నది చరిత్ర చెబుతోంది. ఈసారి కూడా టీడీపీతో పొత్తు లేనందున, బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుందో చూడాలి.   నగరంపై పట్టు-అవగాహన ఉన్న జీఆర్ కరుణాకర్-చింతల రామచంద్రారెడ్డి-సుభాష్‌చందర్జీ వంటి దూకుడుగా వెళ్లే నేతల సేవలు, ఈ ఎన్నికల్లో వినియోగించుకుంటేనే, పార్టీకి కొద్దిగానయినా పరువు దక్కుతుందన్నది సీనియర్ల సలహా. టీడీపీ-బీజేపీ కలసిపోటీ చేసినప్పుడు.. చింతల రామచంద్రారెడ్డి మొండిపట్టుదల వల్లే, అప్పుడు పార్టీకి అన్ని సీట్లు దక్కాయి. ఆయన వైఖరితో నాటి మంత్రి విజయరామారావు కూడా విసిగిపోవాల్సి వచ్చింది. చింతల వ్యూహం వల్ల.. కార్పొరేషన్‌లో బీజేపీ సంతృప్తికర స్థానాలు సాధించి, సుభాష్‌చందర్జీ డిప్యూటీ మేయర్ కాగలిగారు. ఇప్పుడు కూడా ఆ స్థాయిలో దూకుడుగా వెళితేనే, ఉపయోగమని పార్టీ నేతలు స్పష్టంచేస్తున్నారు. కొత్తగా నియమించిన అధ్యక్షులలో ఆ సత్తా ఉన్న వారెవరూ కనిపించడం లేదంటున్నారు.   ఇక గతంలో కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసిన టీడీపీ పరిస్థితి,  ప్రస్తుతం దయనీయంగా ఉంది. స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే పార్టీని వదిలేశారన్న భావన ఉంది. టీఆర్‌ఎస్‌కు భయపడి, తెలంగాణలో పార్టీని ఆయనే చంపేశారన్న అభిప్రాయం కార్యకర్తల్లో బలంగా ఉంది. తెలంగాణలో బాబు పార్టీని వదిలేయడంతో, దిక్కులేక వివిధ పార్టీల్లో చేరిన వారి పరిస్థితి కూడా, విషాదంగానే ఉంది. బీజేపీ-టీఆర్‌ఎస్-కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు అక్కడ ఎలాంటి గుర్తింపు, ఆదరణ లేదు. తమకే దిక్కులేకపోతే, మీరు వచ్చి ఏం చేస్తారని ఆయా పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. టీడీపీలో ఎంతో గౌరవం పొందిన నేతలు ప్రస్తుతం, ఇతర పార్టీల్లో అనాధల్లా మిగలిన దుస్థితి. అయినా ఆ పరిస్థితిని సద్వినియోగం చేసుకునే నాయకత్వం లేదు.   నగరంలో చివరకు సెటిలర్లు కూడా, టీడీపీని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. సీనియర్ నేత పిన్నమనేని సాయిబాబా, ఏదో ఎదురీది పార్టీ కమిటీలు వేసేందుకు కష్టపడుతున్నారు. ఎన్టీఆర్‌తో కలసి పనిచేసిన అనుభవం ఉన్నందున, అంతో ఇంతో నగరంలో పార్టీ ఉనికి కాపాడగలుగుతున్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు పనిచేసిన వారే, పార్టీలో మిగలడం గమనార్హం. ఇంత క్లిష్ట పరిస్థితిలో టీడీపీ, గతంలో వచ్చిన ఒక్క సీటును దాటుతుందా అన్నది ప్రశ్న.   ఇక కాంగ్రెస్‌ను, నాయకత్వ సమస్య వెన్నాడుతోంది. పిజెఆర్, కోదండరామిరెడ్డి, దానం నగేందర్, పిట్ల కృష్ణ వంటి నాయకులు ఇప్పుడు, భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. ప్రజాదరణ ఉన్న నేతలు  లేకపోవడంతో, నియోజకవర్గాల్లో కార్యకర్తలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇమేజ్ ఉన్న ఒక్క నాయకుడూ ఆ పార్టీకి కరువయ్యారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి వంటి ఫైర్‌బ్రాండ్లు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే తప్ప, కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావడం అనుమానమే. -మార్తి సుబ్రహ్మణ్యం

ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్! ఉద్యోగుల బకాయిలు క్లియర్

తెలంగాణలో తరుచూ ఎన్నికలు వస్తే బాగుండని ప్రజలు, ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎవైనా ఎన్నికలు ఉంటే తప్ప ప్రభుత్వం సమస్యలపై స్పందించడం లేదు. అందుకే ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూసే నిరుద్యోగులు, సమస్యల పరిష్కారానికి తిప్పలు పడుతున్న జనాలు, పెండింగ్ డిమాండ్ల సాధనకు ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వారిది ఇదే అభిప్రాయం. జనాలు అనుకుంటున్నట్లే కేసీఆర్ సర్కార్ పని తీరు కూడా ఉంటోంది. తాజాగా అది మరోసారి నిజమైంది.    తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు ఉద్యోగులే. కొంత కాలంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. నాలుగేండ్లు అవుతున్నా పీఆర్సీ కమిటీ పత్తా లేకుండా పోయింది. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు ప్రహాసనంగా మారాయి. ఉద్యోగ సంఘాలు ఎంతగా మెత్తుకుంటున్నా ప్రభుత్వంలో కదలిక లేదు. ఇక కరోనా సమయంలో ఉద్యోగాల వేతనాల్లో సగం కోత  పెట్టింది సర్కార్. ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించినా.. ఆదాయం లేదనే కారణంతో మూడు నెలల పాటు ఉద్యోగులకు సగం జీతమే ఇచ్చింది. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం మరింత ఎక్కువైంది.   శాసనమండలి ఎన్నికల్లో ఉద్యోగుల తమకు వ్యతిరేకంగా పని చేస్తారనే భయం టీఆర్ఎస్ లో ఉంది. దీంతో దిద్దుబాట చర్యలు చేపట్టింది. కొన్నేళ్లుగా తమ వేతనాల బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఊరటనిచ్చింది. పెన్షనర్లకు 2 విడతల్లో, ఉద్యోగులకు 4 విడతల్లో బకాయిలు చెల్లించనుంది. ఈ మేరకు జీవో రిలీజైంది. పింఛనుదారులకు అక్టోబర్, నవంబర్ లో 2 విడతలుగా బకాయిలు చెల్లిస్తారు. ఇక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బకాయిల్ని అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో 4 విడతలుగా చెల్లించబోతున్నారు. కరోనా సంక్షోభం కారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జీతాలు కట్ చేసింది ప్రభుత్వం.    కరోనా టైమ్ లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రజా ప్రతినిధులకు జీతాల్లో కోత విధించారు కేసీఆర్. పింఛన్లలో కూడా కోత విధించడమేంటంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. హైకోర్టులోనూ విచారణ జరిగింది. అయినా వెనక్కి తగ్గలేదు కేసీఆర్. దీంతో  అరకొర జీతాలతో బండి నెట్టుకొచ్చిన ఉద్యోగులు, పింఛనుదారులు త్వరలోనే ఆ బకాయిల్ని అందుకోబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వల్లే తమ బకాయిలు చెల్లిస్తున్నారని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. పీఆర్సీ ప్రకటించాలంటే మళ్లీ ఎన్నికలు వస్తే బాగుండని చెబుతున్నారు.

కేసీఆర్ మనవడు హిమాన్షు కాలు ఫ్రాక్చర్.. రాత్రంతా హాస్పిటల్ లోనే ఉన్న కేటీఆర్ దంపతులు..! 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుకు కాలికి గాయాలయినట్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి హిమాన్షును చికిత్స కోసం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. నొప్పి కారణంగా నిలబడలేని స్థితిలో ఉన్న హిమాన్షు కు యశోద ఆస్పత్రి వైద్యులు సీటీ స్కాన్‌ చేశారు. తుంటి ప్రాంతంలోను, మోకాలికి ఫ్రాక్చర్‌ అయినట్లుగా గుర్తించి చికిత్స అందిస్తున్నారు. దీంతో మంత్రి కేటీఆర్ దంపతులు రాత్రంతా ఆస్పత్రిలో కుమారుడితో పాటే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే హిమాన్షు నిన్న రాత్రి ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డారని సెక్యూరిటీ సిబ్బంది ద్వారా అందుతున్న సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   గత కొంత కాలంగా హిమాన్షు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆపదలో ఉన్న వారు వైద్య ఖర్చులు, ఇతర ఆర్థిక సాయం కోసం ఎవరైనా ట్విటర్‌లో రిక్వెస్ట్ పెడితే ఆయన వెంటనే స్పందిస్తూ తన వల్ల సాధ్యం అయ్యే సాయం చేస్తున్నారు. దీంతో హిమాన్షును తాతకు దగ్గ మనవడు, తండ్రికి దగ్గ కొడుకు అని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాక మనవడు హిమాన్షు అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ. దీంతో మనవడు గాయపడడంతో సీఎం కేసీఆర్ యశోదా ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి దీని గురించి ఆరాతీసినట్లు సమాచారం.

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ... కొత్త ఈవోగా ఆ అధికారికి ప్రమోషన్.. 

మూడు సంవత్సరాలకు పైగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను అక్కడి నుండి తప్పించి హెల్త్, మెడికల్ మరియు కుటుంబసంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. అయన స్థానంలో ప్రస్తుతం టీటీడీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ఏవీ. ధర్మారెడ్డిని పూర్తిస్థాయిలో ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.    1993 బ్యాచ్‌‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన అనిల్ కుమార్ సింఘాల్‌ను 2017 మే నెలలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టీటీడీ ఈవోగా నియమించింది. అయితే ఆయనను టీటీడీ ఈవోగా నియమించడం పైన అప్పట్లో విమర్శలు వచ్చాయి. అప్పటివరకు సహజంగా తెలుగువారు లేదా దక్షిణాది ఐఏఎస్ అధికారిని మాత్రమే ఆ పదవిలో నియమించేవారు. అయితే మొదటిసారి ఉత్తర భారతదేశానికి చెందిన అధికారిని నియమించడంతో అప్పట్లో తెలుగు ఐఏఎస్ అధికారుల్లో అసంతృప్తి వ్యక్తం అయింది. ఇది ఇలాఉండగా టీటీడీ ఈవో గా సింఘాల్ రెండేళ్ల పదవీకాలం 2019లో ముగియగా.. వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఈవోగా కొనసాగిస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డిని కొద్దీ రోజులలో టీటీడీ ఈవోగా నియమించవచ్చని వార్తలు వస్తున్నాయి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ రేసులో కడియం శ్రీహరి!!

వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ సర్కార్ పై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు వీరే ఉన్నారు. గత ఎన్నికల్లో వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి టీఆర్ఎస్ సులువుగా విజయం సాధించినా ఈసారి ఆ పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే కడియం శ్రీహరి అభ్యర్థిత్వంపై పరిశీలన జరుగుతున్నట్లు చర్చ సాగుతోంది. ప్రత్యర్థి పార్టీలు ఏ నాయకుడిని బరిలోకి దింపినా.. కడియం శ్రీహరి దీటుగా ఎదుర్కోగలరనే నమ్మకంతో టీఆర్‌ఎస్ అధిష్టానం ఉందట.   ఇప్పటికే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంపై కడియం శ్రీహరితో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించగా.. కడియం శ్రీహరి కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. క‌డియం శ్రీహ‌రికి వ‌రంగ‌ల్ జిల్లాతోపాటు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కూడా మంచి ప‌ట్టుంది. దానికి తోడు మచ్చలేని నాయకుడిగా ఆయనకున్న పేరు ఎన్నికల్లో కలిసొస్తుందని టీఆర్ఎస్ భావిస్తోందట. మరి కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న కడియం.. ఎమ్మెల్సీ ఎన్నికలతో మళ్ళీ యాక్టివ్ అవుతారేమో చూడాలి.

భారత్‌ పై ట్రంప్ తీవ్ర ఆరోపణలు!!

భారత్‌ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్‌ ను మిత్ర దేశంగా, ప్రధాని మోదీని మిత్రుడిగా పలుమార్లు అభివర్ణించిన ఆయన.. తాజాగా వాతావరణ కాలుష్యానికి భారత్ కారణం అని, కరోనా మరణాల సంఖ్యపై భారత ప్రభుత్వం ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు.      అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. అధ్యక్షబరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మంగళవారం రోజు తొలి డిబెట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.   డిబెట్‌ లో పలు అంశాలపై ట్రంప్, బైడెన్ వాదించుకున్నారు. కరోనాను కట్టడి చేయడంలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అమెరికాలో 2లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి ట్రంపే కారణం అని బైడెన్ విరుచుకుపడ్డారు. దీనికి బదులిచ్చిన ట్రంప్.. చైనా, రష్యా, భారత్‌ లో కరోనా కారణంగా ఎంత మంది మరణించారో మీకు తెలుసా? అని ప్రశ్నించారు. కరోనా మరణాల పై భారత్ కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదని ట్రంప్ ఆరోపించారు.    ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వాతావరణ మార్పులపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్.. రష్యా, చైనా, భారత్‌ ల వల్లే అత్యధికంగా వాతావరణం కాలుష్యం జరుగుతుందని అన్నారు. ఈ మూడు దేశాలు కాలుష్య కారకాలను తీవ్ర స్థాయిలో గాలిలోకి విడుదల చేస్తున్నాయని ఆరోపించారు.

కనకదుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం.. 

విజయవాడ కనకదుర్గమ్మ గుడి నిత్యం వివాదాలలో నలుగుతూనే ఉంది. కొద్దిరోజుల క్రితం అమ్మ వారి వెండి రధం పై ఉన్న మూడు సింహాలు మాయం కావడంతో తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా గుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు కారులో అక్రమ మద్యం పట్టుబడింది.    విజయవాడ కనకదుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డులో సభ్యురాలుగా జగ్గయ్యపేటకు చెందిన చక్కా వెంకట నాగవరలక్ష్మీ కారులో భారీగా అక్రమ మద్యం రవాణా అవుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట సీతారాంపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పార్క్‌ చేసి ఉంచిన ఏపీ 16 బీవీ 5577 అనే నెంబర్ గల సుజుకి స్విఫ్ట్ కారులో అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకుని దీని పై దర్యాప్తు చేస్తున్నారు.    తాజాగా బయటపడిన ఈ అక్రమ మద్యం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి వరలక్ష్మీ భర్త, అలాగే ఆమె కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పట్టుబడిన మద్యం తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని విలువ సుమారుగా రూ. 40 వేలు ఉంటుందని సమాచారం.

అప్పుల ఊబిలో ఏపీ.. ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పు!!

ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఏడాదిలో చెయ్యాల్సిన అప్పు ఏపీ ప్రభుత్వం ఐదు నెలల్లోనే చేసింది. ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పుగా తీసుకొచ్చినవేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఇవ్వడం చూస్తేనే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం సగం కూడా పూర్తికాకముందే ఏడాది కాలానికి అంచనా వేసిన అప్పు మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఇక రాబోయే రోజుల్లో అప్పులు ఏ స్థాయిలో ఉంటాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది.   ఏపీ ప్రభుత్వం గత ఐదు నెలల్లో వివిధ రూపాల్లో రూ. 84,617.23 కోట్లు సమీకరించగా, అందులో రూ. 47,130.90 కోట్ల రుణాలు ఉన్నాయి. అంటే సమీకరించిన మొత్తంలో 55.7 శాతం అప్పే. అప్పుల రూపంలో ఈ ఏడాది రూ. 48,295.58 కోట్లు తీసుకోనున్నట్టు బడ్జెట్ అంచనాల సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆగస్టు నాటికే ఆ మొత్తాన్ని తీసేసుకున్నట్టు కాగ్ నివేదిక తెలిపింది.   ఈ ఏడాది రూ.18,434.15 కోట్లు రెవిన్యూ లోటు లెక్కేస్తే,  ఇప్పటికే (5 నెలలకు) రూ.38,199.33 కోట్ల రెవిన్యూ లోటు వచ్చింది. కరోనా కాలంలో ఆర్ధిక వ్యవస్థ మందగించటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం పెరిగే మార్గాలు అన్వేషించకుండా, ఇలాగే అప్పులు చేసుకుంటూ వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కాస్తా అప్పులప్రదేశ్ గా మారే అవకాశముంది.

ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు 

సీనియర్ ఐపీఎస్‌ అధికారి వెంకటేశ్వరరావు పిటిషన్‌ను హైకోర్టు ఈరోజు డిస్మిస్‌ చేసింది. ఇజ్రాయెల్ నుండి ఆయుధాలు అక్రమ కొనుగోలు కేసు నమోదుపై తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం కేసు నమోదు చేయడానికి హైకోర్టు ఓ కేసును రిఫరెన్స్ ఇచ్చింది. ఒకవేళ ప్రభుత్వం దాని ప్రకారం కేసు నమోదు చేయకుంటే.. అపుడు కోర్టు ధిక్కరణ కింద పిటిషన్‌ దాఖలు చేయాలని ఏబీకి హైకోర్టు సూచించింది. కేసు నమోదు చేయాలంటే ప్రభుత్వం నిబంధనలను పాటించాలని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ఆ గైడ్‌లెన్స్‌ను ప్రభుత్వం పాటించకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.   గత టీడీపీ ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఆయనపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే కొన్ని రోజుల క్రితం ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ.. వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆయనను విధుల్లోకి తీసుకోవడంతోపాటు సస్పెన్షన్‌ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును కూల్చింది ఎవరు?

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. మసీదు కూల్చివేత కుట్రకాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదని, కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ పేర్కొన్నారు. దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. అయితే కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తీర్పుని స్వాగతిస్తుండగా.. కొందరు మాత్రం అందరూ నిర్దోషులే అయితే బాబ్రీ మసీదు ఎలా కూలింది? అని ప్రశ్నిస్తున్నారు.    బాబ్రీ కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్పందించారు. సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. బాబ్రీ కూల్చివేత చట్ట విరుద్ధమని నవంబర్ 9న సుప్రీం పేర్కొందని, కానీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు అందుకు విరుద్ధంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని రణదీప్ డిమాండ్ చేశారు.   సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్వాగతించారు. అద్వానీ, జోషి, ఉమాభారతితో పాటు నిర్దోషులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం అన్నారు. ఈ తీర్పు ఊహించిందే. ఆ ఎపిసోడ్ ను మనం మరిచిపోవాల్సిందే. బాబ్రీ మసీదు కూల్చివేత జరగకుంటే రామజన్మభూమి భూమిపూజను చూసి ఉండేవారమే కాదు అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.   ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీర్పుపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లు నిర్దోషులుగా ప్రకటించబడ్డారు. న్యాయాన్ని భూస్థాపితం చేశారు.' అని ట్వీట్ చేశారు.   కోర్టు తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతీయ న్యాయవ్యవస్థకు చీకటి రోజు అని అన్నారు. అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును కూల్చింది ఎవరని ప్రశ్నించారు. బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా? అని అసహనం వ్యక్తం చేశారు. మసీదును ఎవరు కూల్చారో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. మసీదును కూల్చండి అని ఉమా భారతి నినాదాలు చేశారని గుర్తుచేశారు. ఈ తీర్పుపై సీబీఐ హైకోర్టుకు వెళ్లాలని ఒవైసీ సూచించారు.    మరోవైపు, తీర్పు వెలువడిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పడు వైరల్ అవుతున్నాయి. గతేడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రగ్యా సింగ్ మాట్లాడుతూ.. "నాడు  బాబ్రీ మసీదును కూల్చివేశా. ఇప్పుడు మళ్లీ అక్కడికి వెళ్లి రామాలయం నిర్మాణంలో పాల్గొంటా. అలా చేయకుండా ఎవరూ మమ్మల్ని అడ్డుకోలేరు" అని వ్యాఖ్యానించారు.  అలాగే, "బాబ్రీ మసీదును కూల్చివేసినందుకు మేమెందుకు బాధ పడాలి? నిజానికి అందుకు మేము గర్వపడుతున్నాం." అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పడు వైరల్ అవుతున్నాయి.

గులాబీ నేతలకు వల.. సంజయ్ యాత్ర.. బీజేపీ గ్రేటర్ ప్లాన్! 

గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ దూకుడు పెంచింది. వీలైనంత త్వరగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరపాలని కేసీఆర్ సర్కార్ ప్లాన్ చేస్తుండగా.. అదే స్థాయిలో కమలం నేతలు స్పీడ్ పెంచారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న బీజేపీ.. గ్రేటర్‌పై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటితేనే.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పట్టు బిగించవచ్చని భావిస్తోంది. అందుకే గ్రేటర్ ఎన్నికల కోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్ లో పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా ఆరు జిల్లాలుగా విభజించి కొత్త అధ్యక్షులను నియమించింది. డివిజన్ల వారీగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని కొత్త అధ్యక్షులను రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆదేశించింది.   గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలను సవాల్ గా తీసుకుంటున్నారు బీజేపీ నేతలు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లుండగా, అందులో బీజేపీకి ప్రస్తుతం నలుగురు కార్పొరేటర్లే ఉన్నారు. ఇప్పుడు 70 సీట్లపై కన్నేసిన కమలం, ఆ సీట్లను గుర్తించి అందులో గెలుపు అవకాశాలపై కసరత్తు చేస్తోంది. గ్రేటర్లో తమకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉండడం మరింత కలిసి వస్తుందనే భావిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఓటర్లు కీలకం కానుండటం, దానికి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడం, ఆయన కేంద్ర మంత్రి హోదాలో ఉండటంతో ఇది తమకు బాగా అనుకూలిస్తుందనే ధీమాలో పార్టీ క్యాడర్ ఉంది.    టిఆర్ఎస్ ఎత్తులను చిత్తు చేస్తూ, ఎప్పటికప్పుడు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు కమలం నేతలు. గ్రేటర్ లో బండి సంజయ్ తన మార్క్ చూపిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ హడావుడి చేస్తున్నారు. దీంతో గ్రేటర్ లో కేటీఆర్ హవా కనిపించకుండా, బిజెపి బలం పెంచుకునేందుకు బండి సంజయ్ ప్లాన్ చేసారు. గ్రేటర్ ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించాలనుకుంటున్నారని తెలిసింది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో కమల దళపతి పర్యటన ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన సర్వే కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం.   గ్రేటర్ పరిధిలో ఉన్న టిఆర్ఎస్ నాయకులు కొంతమంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీజేపీ అంచనా వేస్తోంది. టీఆర్ఎస్ లో పోటీ చేసే అవకాశం దక్కనివారిని, పార్టీ తీరుతో ఆగ్రహంగా ఉన్నవారిని కమలం నేతలు గుర్తిస్తున్నారు. అటువంటి అసంతృప్తులను గుర్తించి బిజెపిలో చేర్చకోవాలని ప్లాన్ చేస్తోంది. ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నాయకులను టిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి తీసుకురావాలనే విధంగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ హైకమాండ్ కూడా ఇందుకు అంగీకరించిందని చెబుతున్నారు. ఇప్పటికే కొంత మంది నేతలు టిఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరందరినీ త్వరలో ఒక వేదిక పైకి తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటారని గ్రేటర్ బీజేపీ నేతలు చెబుతున్నారు.    ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమాలు చేస్తోంది. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండుతో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చి సక్సెస్ అయ్యామని బీజేపీ భావిస్తోంది. గెరిల్లా వ్యూహంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులకు చుక్కలు చూపించారని పార్టీలో టాక్. బీజేపీ చలో అసెంబ్లీ కారణంగానే అసెంబ్లీ సమావేశాలను అనుకున్న దానికంటే ముందుగానే వాయిదా వేశారన్న చర్చ నడుస్తోంది. బండి సంజయ్ దూకుడు గ్రేటర్‌లో బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతోందన్న వాదన వినిపిస్తోంది. గ్రేటర్‌లో బీజేపీకి గతంలో కంటే స్థానాలు పెరుగుతాయని ఇటీవల టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడమే.. హైదరాబాద్‌లో బీజేపీ బలంగా ఉందనటానికి నిదర్శనమని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు.

ఆంధ్రాలో అదుపు లేని ‘పోలీస్‌రాజ్’

మరో వ్యక్తిని ఎత్తుకెళ్లిన తాడేపల్లి పోలీసులు   సవాంగ్‌కు సమస్యలు తెస్తున్న అధికారుల అత్యుత్సాహం   తమ బాసు వరసగా హైకోర్టు మెట్లెక్కి.. న్యాయమూర్తుల వ్యాఖ్యలతో అవమానాలకు గురవుతున్నా, కింది స్థాయి పోలీసులకు అదేమీ పట్టడం లేదు. ఎమ్మెల్యేల దన్నుతో.. స్థానికంగా తమకు ఎదురులేదని చెలరేగిపోతున్న అధికారుల అత్యుత్సాహం, డీజీపీకి చెలగాటంగా మారింది. హెబియస్ కార్పస్ పేరిట మనుషులను మాయం చేస్తున్న అధికారుల అత్యుత్సాహం, పోలీస్ బాసుకు పితలాటకంగా మారింది. సీఐ-ఎస్‌ఐ స్థాయి అధికారులు.. స్థానికంగా కొందరితో కుమ్మక్కయి, వారి ప్రత్యర్ధులను ఎత్తుకొస్తున్న చందం.. పోలీసుశాఖకు నగుబాటుగా మారింది. దీనిపై హైకోర్టు స్వయంగా డీజీపీని కోర్టుకు పిలిచినా, కింది స్థాయి పోలీసుల తీరులో మార్పు కనిపించడం లేదు. చివరకు ‘ఇది ఖాకీస్ట్రోక్రసీ’నా అని కోర్టు ఘాటుగా ప్రశ్నించినా, కింది స్థాయి అధికారుల తీరులో మార్పు రావడం లేదు.   కొన్ని నెలల క్రితం విశాఖపట్నం పోలీసులు.. రెడ్డి గౌతం అనే వ్యక్తిని, ఒక సివిల్ కేసుకు సంబంధించి బెజవాడకు వచ్చి ఎత్తుకెళ్లారు. ఆ సందర్భంలో ఆయన తరఫున వాదించిన లాయర్‌పైనా దాష్టీకం చేశారు. దానిపై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా, డీజీపీ హైకోర్టుకు హాజరుకావలసి వచ్చింది. ఆ కేసుకు సంబంధించి.. తమ బాసు కోర్టుకు హాజరయ్యారన్న విషయం తెలిసినా, స్థానిక పోలీసుల తీరులో ఏమాత్రం మార్పు రాలేదు.   చోడవరం పోలీసస్టేషన్‌లో నివసించే రెడ్డి గోవిందరావు ఇంటిపై, బాకీలకు సంబంధించి కొందరు దాడి చేశారు. అది సీసీ టీవీలోనూ రికార్డయింది.  ఒక ఎస్‌ఐ.. అప్పులిచ్చిన వారితో రాజీ చేసుకోవాలని గోవిందరావుపై ఒత్తిడి చేశారట. సివిల్ కేసు అని తెలిసినా, అది కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిసినా, సెటిల్‌మెంట్ ప్రయత్నాలు చేయడం విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారం మీడియాలో కూడా సంచలనం సృష్టించింది. తన ఇంటిపైకొచ్చి కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ సదరు గోవిందరావు, చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ దిక్కులేదు. దానితో మళ్లీ అదే వ్యక్తులు.. తిరుపతిలోని గోవిందరావు వియ్యంకుడి ఇంటికి వెళ్లి, హడావిడి చేశారన్న ఫిర్యాదు వెళ్లింది. అదే ఫిర్యాదు వచ్చినప్పుడే స్పందించి ఉంటే, ఈ చర్యకు అవకాశం ఉండేది కాదు.   ఆ తర్వాత గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూడా కనిపించడం లేదన్న కేసుకు సంబంధించి, డీజీపీ హైకోర్టు వ్యాఖ్యలకు గురికావలసి వచ్చింది. చివరకు మీకు పనిచేయడం చేతకాకపోతే రాజీనామా చేసి వెళ్లమనే కటువు వ్యాఖ్యలు కూడా న్యామూర్తుల నుంచి వినాల్సి వచ్చింది. ఓ కేసు సందర్భంలో డీజీపీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ కోర్టు ఆవరణలోనే ఉండాల్సి వచ్చింది.   వరసగా, ఇన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నా కిందిస్థాయి పోలీసుల బేఖాతరిజంలో మార్పు కనిపించకపోగా, మరింత రెచ్చిపోవడం దారుణం. ఇవన్నీ.. బాసులకు వ్యవస్థపై పట్టు తప్పుతోందన్న సంకేతాలు వెళ్లేందుకు కారణమవుతున్నాయి. తాజాగా మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన, పోకల వెంకయ్య అనే వ్యక్తిని పోలీసులు బుధవారం తెల్లవారుఝామున, ఎత్తికెళ్లిపోవడం కలకలం సృష్టించింది. ఉదయమే ముగ్గురు పోలీసులు వచ్చి సీఐ అంకమ్మరావు పిలుస్తారని జీబులో తీసుకువెళ్లారు. ఇది మీడియాలో రావడంతో పోలీసు బాస్ మరోసారి తలపట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.   ‘‘మేం మా అన్నయ్య కోసం ఉదయం నుంచీ గాలిస్తున్నాం. తాడేపల్లి సీఐలు అంకమ్మరావు, సుబ్రమణ్యం మమ్మల్ని తరచూ స్టేషన్‌కు పిలిచి వేధిస్తున్నారు. మేం పెట్టిన కేసు వాపసు తీసుకోమని బెదిరిస్తున్నారు. మాదగ్గర తీసుకున్న డబ్బులు ఇప్పించాల్సింది పోయి, మమ్మల్లే వాళ్లకు డబ్బులివ్వలివ్వమని ఒత్తిడి చేస్తున్నారు. సచివాలయంలో పనిచేసే వలేటి రవీంద్ర అనే వ్యక్తి, పోలీసు అధికారులతో కుమ్మక్కయి మమ్మల్ని వేధిస్తున్నారు. ఇక పోలీసుల వేధింపు మేం తట్టుకోలేం. మమ్మల్ని కాపాడకపోతే మాకు ఆత్మహత్యనే గతి’ అని బాధితుడి సోదరుడైన మార్కండేయులు వాపోయారు. అందుకే ప్రముఖ న్యాయవాది ఉమేష్‌చంద్రను ఆశ్రయించి, ఆయన ద్వారా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్లు వెల్లడించారు.   అయినా తెల్లవారుఘామున తమ ఇంటికి రావడానికి మేమేనయినా దొంగలమా? నేరగాళ్లమా అని ఆయన ప్రశ్నించారు. తమపై ఎలాంటి కేసులు లేవని, ఒక సివిల్ కేసులో పోలీసులు తమపై వేధింపులకు పాల్పడటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని డిజిపి సవాంగ్, గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని మార్కండేయులు వాపోయారు. ఆ మేరకు ఆయన విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. -మార్తి సుబ్రహ్మణ్యం

కన్న తల్లికి కూడా దక్కని కడచూపు.. అర్థరాత్రి యూపీ పోలీసులచే గ్యాంగ్ రేప్ బాధితురాలి అంత్యక్రి

2012 లో జరిగిన నిర్భయ ఘటనను తిరిగి గుర్తు చేస్తూ యూపీలో దారుణ అత్యాచారానికి గురై నిన్న మరణించిన యువతి అంత్యక్రియలను నిన్న రాత్రి యూపీ పోలీసులు రహస్యంగా ముగించేశారు. ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కనీసం కన్న తల్లితండ్రులు, కుటుంబ సభ్యులను కూడా అనుమతించకుండా, పోలీసులే ఆమె మృతదేహాన్ని దహనం చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. రెండు వారాల క్రితం సామూహిక అత్యాచారానికి గురైన ఆ యువతి శరీరంలోని పలు ఎముకలు విరిగిపోయి, నాలుక తెగిపోయి, అవయవాలు పనిచేయని స్థితిలో న్యూఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించింది.   ఆ మహిళ కుటుంబ సభ్యులను, బంధువులను ఇళ్లలోంచి బయటకు రాకుండా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి మరీ.. తెల్లవారు జామున 2:30 గంటల సమయంలో ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. నిన్న రాత్రంతా కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకపక్క తల్లి రోదిస్తూ తన కూతురు మృతదేహాన్ని అప్పగించాలని ఎంత మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. అంతేకాకుండా ఆమె చివరి చూపు కోసం కుటుంబ సభ్యులు.. మృతురాలిని తీసుకుని వెళ్తున్న అంబులెన్స్ ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆమె చివరి చూపునకు కూడా అనుమంతించకుండా మహిళ మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకుని వెళ్లారు. దీనికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన మహిళ తండ్రి, సోదరులను యుపీ పోలీసులు స్కార్పియో వాహనంలో తీసుకుని వెళ్లారు. గ్రామంలో మహిళకు సంబంధించిన బంధువులు వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఒక మహిళ ఐతే రోడ్డుపై కూలబడి గుండెలు బాదుకుంటూ ఏడ్వడం కనిపించింది. ఐతే పోలీసులు నిరసనకారులను అడ్డు తొలగించి వాహనాన్ని స్మశాన వాటికకు తీసుకుని వెళ్లిన పోలీసులే తెల్లవారు జామున ఆ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భగా పోలీసులు మానవహారంగా ఏర్పడి మీడియా ప్రతినిధులను, ఆ మహిళ కుటుంబ సభ్యులను, గ్రామస్థులను అడ్డుకున్నారు. చివరకు అక్కడ కేవలం పోలీసులు మాత్రమే మిగిలారు. తెల్లవారితే అక్కడ ఆందోళనలు పెరుగుతాయన్న అనుమానంతో భారీ భద్రత మధ్య అంబులెన్స్ ను నేరుగా శ్మశానానికి తీసుకెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే యూపీ పోలీసుల చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాబ్రీ మసీదు కేసులో సంచలన తీర్పు

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడింది. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ రోజు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రకాదని.. కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ పేర్కొన్నారు. నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేకపోయిందని, దీంతో నిందితులు అందరిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే ఆద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ, కల్యాణ్‌సింగ్ తదితరులు నిర్దోషులుగా తేలారు.   కాగా, 1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అద్వానీ, జోషి వంటి బీజేపీ నేతలతో పాటు సంఘ్‌ పరివార్‌ నేతలు ప్రజలను రెచ్చగొట్టడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపణలు వచ్చాయి.

సోము కాముగా ఉన్నారేంటి? సాయి కోసమేనా.. 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. జాతీయ నాయకురాలికి జాతిని అంటగట్టడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. విజయసాయి వ్యాఖ్యలను పార్టీలకతీతంగా నేతలు ఖండిస్తున్నా.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఇంకా స్పందించ లేదు. తమ పార్టీ జాతీయ నాయకురాలిపై కులం పేరుతో వేరో పార్టీ ఎంపీ నీచంగా కామెంట్ చేస్తే.. పార్టీ బాస్ గా వీర్రాజు మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోము తీరుపై బీజేపీ నేతలే ఆగ్రహంగా ఉన్నారు. కులం పేరుతో చీప్ రాజకీయాలు చేస్తున్నా మాట్లాడకపోవడమేంటనీ మండిపడుతున్నారు.    పురందేశ్వరిపై విజయసాయి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునిల్ దియోదర్ వెంటనే స్పందించారు. విజయసాయికి ఆయన తీవ్ర స్థాయిలో కౌంటరిచ్చారు. కుల, మతాలకు అతీతంగా దేశ నిర్మాణానికి పనిచేసే పార్టీ బీజేపీ అన్న సునీల్.. మీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే కులం పేరుతో దాడి చేస్తారా? అర్హత చూసి ఆమెకు ఇచ్చిన బాధ్యతను కులంతో ముడిపెడతారా? అంటూ ప్రశ్నించారు. అన్ని కులమయం చేసిన వైసీపీ కులాల గురించి మాట్లాడటం ఎబ్బెట్టుగా ఉందని దియోదర్ ట్వీట్ చేశారు. ఫురందేశ్వరికి సునిల్ దియోదర్ ఇచ్చిన సపోర్ట్  స్థానిక నాయకత్వం ఇవ్వకపోవడమేంటనే చర్చ ఏపీలో జరుగుతోంది. సోము వీర్రాజు సైలెంట్ గా ఉండటంపై రకరకాల వాదనలు వస్తున్నాయి. విజయసాయి రెడ్డితో తనకున్న స్నేహ బంధం వల్లే సోము వీర్రాజు  మాట్లాడటం లేదని కొందరు బీజేపీ నేతలే గుసగుసలాడుతున్నారు. మొదటి నుంచి వీర్రాజు వైసీపీకి అనుకూలంగా పనిచేశారని చెబుతున్నారు. బీజేపీ ప్రయోజనాల కంటే వైసీపీ కోసమే ఆయన ఎక్కువ కష్టపడ్డారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు,    పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన పర్చూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా ఆయనింకా ఆ పార్టీలో ఉన్నారు. పురందేశ్వరిని కులం పేరుతో కామెంట్ చేసిన విజయసాయికి వెంకటేశ్వరావుది అదే కులమని తెలియదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దగ్గుబాటికి వైసీపీ టికెట్ ఇచ్చినప్పుడు ఇంపుగా అనిపించిన కులం.. పురందేశ్వరికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాగానే కంపుగా మారిందా విజయసాయి అని నిలదీస్తున్నారు. ఇవేం రాజకీయాలని ఏకి పారేస్తున్నారు. కులం పేరుతో కంపు రాజకీయాలు చేయవద్దని విజయసాయిని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు.    సమాజంలో నైతిక వెలువులు పెరగాలని తిరుమల వెంకన్నను విజయసాయి మొక్కుకున్నారు. దీనిపైనా సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జాతీయ స్థాయిలో కీలక పదవి పొందిన తెలుగింటి ఆడపడుచుపై కులం పేరుతో అభ్యంతరకర పోస్టులు పెట్టడమేనా నైతిక విలువలంటే అని విజయసాయిని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మీకు నచ్చితే ఒకలా.. నచ్చకపోతే మరోలా చూస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాజ్యాంగపరమైన కీలక పదవిలో ఉండి అన్నింటిని కులమయం చేసే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి.. నైతిక విలువల గురించి మాట్లాడటం వినడానికే అసహ్యంగా ఉందంటూ మరి కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.    ఇక ఇప్పటివరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న జీవీఎల్ నరసింహరావు తీరుపైనా ఏపీ కమలనాధులు కస్సుబస్సు మంటున్నారు. ఇంత జరుగుతున్నా జీవీఎల్ ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. చిన్నచిన్న విషయాలపై స్పందించే జీవీఎల్ కు  పురందేశ్వరిపై విజయసాయి చేసిన కామెంట్లు కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు. అమరావతిపై హైకమాండ్ తనకొక్కరికే క్లారిటీ ఇచ్చిందని, ఏపీ నేతలు చెబుతున్నదంతా ఉత్తదేనని ప్రచారం చేసుకున్న జీవీఎల్.. పార్టీ జాతీయ నాయకురాలిని అవమానిస్తున్నా ఎందుకు రియాక్ట్ కాలేదని కమలం నేతలే కడిగి పారేస్తున్నారు. తనను జాతీయ కమిటి నుంచి తప్పించారనే అసంతృప్తితోనే జీవీఎల్ మాట్లాడటం లేదనే చర్చ కూడా జరుగుతోంది. మొదటి నుంచి వైసీపీకి మద్దతుగా ఉన్న జీవీఎల్ వైఖరి మరోసారి స్పష్టమైందని చెబుతున్నారు. ఎన్ని కారణాలున్నా సొంత పార్టీ మహిళా నేతను కించపరిచినా రియాక్ట్ కావకపోవడమేంటనీ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.