హథ్రాస్ ఘటనలో మరో మలుపు.. అందుకే అర్ధరాత్రి అంత్యక్రియలు
posted on Oct 6, 2020 @ 3:55PM
శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్న సమాచారం వల్లే హథ్రాస్ మృతురాలి అంత్యక్రియులను రాత్రికి రాత్రి జరపాల్సి వచ్చిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక అఫిడవిట్ ను సుప్రీంకోర్టుకి సమర్పించింది. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రాత్రికి రాత్రి అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుందని, అది కూడా బాధితురాలి కుటుంబ సభ్యుల సమ్మతితో, వారి సమక్షంలోనే అంత్యక్రియలు నిర్వహించిందని ఆ అఫిడవిట్‌లో పేర్కొంది.
హథ్రాస్ ఘటనపై చిత్తశుద్ధితో దర్యాప్తు చేస్తున్నప్పటికీ తమను అప్రతిష్ట పాలుచేసే లక్ష్యంతో కొన్ని పార్టీలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని యూపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ఘటనను కుల, మత పరమైన రంగు పులిమే అవకాశాలున్నాయన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు జిల్లా యంత్రాంగం రాత్రికి రాత్రి అంత్యక్రియలు పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వివరించింది. రెండు కులాలకు చెందిన వ్యక్తులతో కలిసి వివిధ రాజకీయల పార్టీల నేతలు, మీడియా సిబ్బంది సహా వేలాది మంది మరుసటి రోజు ఉదయం గ్రామానికి చేరనున్నారనే సమాచారం కూడా అందినట్టు తెలిపింది. బాధితురాలి మృతి, పోస్ట్ మార్టం జరిగి అప్పటికే 20 గంటలు అయిందని, మరుసటి రోజు ఉదయం అంత్రక్రియలు నిర్వహిస్తే పెద్దఎత్తున హింస జరిగే అవకాశం ఉందని గ్రహించిన జిల్లా యంత్రాగం, అదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఒప్పించినట్టు అఫిడవిట్‌లో వివరించింది.
హథ్రాస్ మృతురాలి అంత్యక్రియులను కుటుంబ సభ్యుల సమ్మతితోనే నిర్వహించామని యూపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. కుటుంబసభ్యుల వ్యాఖ్యల మాత్రం మరోలా ఉన్నాయి. ఇటీవల మృతురాలి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. అర్థరాత్రి దహనం చేసిన మృతదేహం తన సోదరిదో కాదో తెలియదని, ఒకవేళ తన మృతదేహమే అయితే అలా అర్థరాత్రి రహస్యంగా అంత్యక్రియలు ఎందుకు చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ, యూపీ ప్రభుత్వం కుటుంబ సభ్యుల సమ్మతితోనే అంత్యక్రియలు నిర్వహించామని అఫిడవిట్‌లో పేర్కొంది. ఇప్పటికే ఈ ఘటనపై అక్కడి పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నవేళ.. ఈ తాజా అఫిడవిట్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.