ప్రభుత్వాన్ని విమర్శించిన మరుసటి రోజే జేసీ దివాకర్ రెడ్డి మైనింగ్ పై కేసు..

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మైనింగ్ విషయంలో తాజాగా ఒక కేసు నమోదైంది. దీనికి సంబంధించి ముచ్చుకోటలో రెండు డోలమైట్ మైనింగ్ క్వారీలను జేసీ దివాకర్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో మైనింగ్ నిర్వహిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి కార్మికుల భద్రతను పట్టించుకోవడం లేదని తెలిపారు. మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో జరగాల్సిన మైనింగ్ పనులు అలా జరగడం లేదని.. దీంతో నిబంధనలు పాటించని మైనింగ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన ఈ రెండు క్వారీల్లో నిబంధనలు ఉల్లంఘన జరిగిందని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అంతేకాకుండా తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వీ రమణారావు వ్యాఖ్యానించారు.   అయితే చాలాకాలం తరువాత నిన్న జేసీ దివాకర్ రెడ్డి గనుల కార్యాలయానికి చేరుకుని కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నియంత పాలన ఇంకా ఎంత కాలం ఉంటుందో చూస్తానని పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తమ గనులకు అనుమతి ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. సున్నపురాయి గనుల లీజు విషయంలో జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొద్దిరోజుల క్రితం వరకు తన సోదరుడిని టార్గెట్ చేసిన ప్రభుత్వం... ఇప్పుడు తనను టార్గెట్ చేస్తోందని  ఆయన ధ్వజమెత్తారు. జేసీ దివాకర్ రెడ్డి అటు ప్రభుత్వం ఇటు అధికారులపై విమర్శలు చేసిన మరుసటి రోజే... ఆయనకు నోటీసులు జారీ కావడం గమనార్హం.

పవన్ 'పవర్' చూపిస్తారా..?

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ ప్రభావమెంత?   ఇంట గెలవలేని పవనన్నయ్యు.. రచ్చ గెలిచే ప్రయుత్నాలు ప్రారంభిస్తున్నారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి, రెండుచోట్లా గుడ్లుతేలేసిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్.. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన పార్టీని బరిలోకి దింపేందుకు సిద్ధవువుతున్నారట. అదీ వార్త. ఆ మేరకు ఆయున 50 డివిజన్లలో పార్టీ కమిటీలు కూడా ప్రకటించేశారు.   నవంబర్-డిసెంబర్‌లో జరిగే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన ఎవ‘రెడీ’గా ఉందట. ఎలాగూ బీజేపీతో పొత్తు ఉన్నందున, జనసేన ఆ పార్టీతో కలిసే పోటీ చేస్తుంది. అయితే, జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో స్పష్టత లేకున్నా, కనీసం 30- 40 స్థానాలు కావాలని పవనన్నయ్యు తమ్ముళ్ళు పట్టుదలతో ఉన్నారు. అదంతా బీజేపీ దయూధర్మాలపైనే ఆదారపడి ఉంటుంది. ప్రస్తుత కరోనా కాలంలో పవనన్నయ్యు ఫాంహౌసులోనే ఉండి, ప్రకటనలతో సందర్భానుసారంగా ట్వీటుతున్నారు. ఏపీకి కూడా వెళ్లడం లేదు. ప్రస్తుతానికి ఆయున కార్యస్థానం హైదరాబాదే.   త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో, జనసేన బరిలోకి దిగాలని నిర్ణయించింది. అంటే ఆ ఎన్నికల ప్రచారంలో పవన్ కూడా దిగుతారన్నమాట. తెలంగాణలో బీజేపీకి, నేమ్-ఫేమ్ ఉన్న పెద్ద స్టార్ క్యాంపెయినర్ లేరు కాబట్టి.. ఉభయులకూ ఇప్పుడు, పవనన్నయ్యే మెగా స్టార్ క్యాంపెయినర్ అన్నవూట. ఎంతలేదన్నా పవన్ సినివూ స్టార్. కాబట్టి ఆయున సభలకు జనాలు బాగానే వస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో జరిగిన పవన్ ఎన్నికల సభలకూ జనం విరగబడ్డారు. తోసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఫ్లెక్సీలు కడుతుండగా అభివూనులు చనిపోయూరు. కానీ.. ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోగా, ఒక్కరు వూత్రమే గెలిచి గట్టెక్కారు. అంటే పవన్ కల్యాణ్ ఇంట ఓడిపోయూరన్న మాట.   ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో పోటీ చేస్తే, పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్న. ఇప్పటివరకూ నగరంలో జనసేనకు బలం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పరిస్థితే, హైదరాబాద్ నగరంలో అగమ్యగోచరంగా ఉంది. మరి కొత్తగా పుట్టిన జనసేన సంగతి ఏమిటన్నది, సహజంగానే తెరపైకొచ్చే సందేహం. నగరంలోని సెటిలర్ల ఓట్లలో సింహభాగం ఓట్లు, జనసేనకు పడతాయున్నది ఆ పార్టీ ఆశలా కనిపిస్తోంది. దానివల్ల టీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదు. ఒకరకంగా మరింత నష్టపోయేది టీడీపీనే. ఎందుకంటే దాని బలం అంతో ఇంతో సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లోనే కాబట్టి! విపక్షాల ఓట్లు ఎంత చీలితే, టీఆర్‌ఎస్‌కు అంత లాభం. అదీ లాజిక్కు!   సెటిలర్లు తాము ఎంతగానో ప్రేమించే టీడీపీనే కాదని, టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నప్పుడు.. అసలు ఉనికి లేని జనసేనకు ఓట్లేస్తారన్నది అనువూనమే. మరోవైపు, పవన్ ప్రచారబరిలో దిగితే,  కాపు-మున్నూరు కాపు ఓట్లు సాధించవచ్చన్న ఆలోచన బీజేపీ-జనసేన నేతల్లో కనిపిస్తోంది. అయితే, ఈ అంచనా కూడా ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి. ఎందుకంటే.. ఏపీలో కాపుల పార్టీగా ముద్రపడిన జనసేన అభ్యర్ధులెవరూ గెలవలేదు. కాపుల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ, పవన్ కూడా విజయం సాధించలేకపోయూరు. కులపిచ్చి బాగా ఉన్న ఆంధ్రాలోనే కాపుల ఓట్లు సాధించలేని జనసేన.. ఎలాంటి కులపిచ్చి లేని హైదరాబాద్ నగరంలో, వేసే కులం కార్డు ఎంతవరకూ ఫలిస్తుందన్నది ప్రశ్న. ఇంట ఓడిన పవనన్నయ్యు, రచ్చ ఎలా గెలుస్తారో చూడాలి! -మార్తి సుబ్రహ్మణ్యం

మహారాజా కళాశాలని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి

విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. మహారాజా కళాశాల చారిత్రక నేపథ్యం ఉన్న విద్యాసంస్థ అన్నారు. వందేళ్ల క్రితమే విశాఖలోనూ విద్యాసదుపాయాలు లేని రోజుల్లో విజయనగరం మహారాజా కళాశాల ప్రముఖ విద్యాకేంద్రంగా బాసిల్లిందని తెలిపారు. వీవీ గిరి వంటి ప్రముఖుడు రాష్ట్రపతి హోదాలో ఆ కళాశాలకు విచ్చేశారని గుర్తుచేశారు.    ఇప్పటి ప్రభుత్వ హయాంలో ఆ కళాశాలని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ కళాశాల పూర్వ విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారన్న ఆయన.. వారు ఇళ్లల్లో కూర్చుని వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలతో సరిపెట్టకుండా, రోడ్లపైకి వచ్చి పోరాడాలని రఘురామకృష్ణరాజు సూచించారు.    "అర్ధరాత్రి ఎవర్నో తీసుకువచ్చి ట్రస్టులో కూర్చోబెట్టి తప్పు చేశారు. మా ప్రభుత్వం ఆ తప్పును సరిదిద్దుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఈ పరిస్థితిని మార్చాల్సింది మహారాజా కళాశాల పూర్వ విద్యార్థులే. ట్రస్ట్ నియామవళి ప్రకారం ఎవరికైతే అర్హత ఉందో, ఆ నిజాయతీపరుడైన ట్రస్టీని మళ్లీ తీసుకువచ్చేవరకు పోరాడండి. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలను, సింహాచలం దేవస్థానంలో జరిగే అన్యాయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. న్యాయం తప్పకుండా జరుగతుంది." అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.   మరోవైపు.. మహారాజా కళాశాల అధ్యాపకులు, పూర్వ అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, మహారాజా కళాశాల పరిరక్షణ సమితి ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. మహారాజా కళాశాల పరిరక్షణకు సమష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా మహారాజా కళాశాల రిటైర్డ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ శివరామమూర్తి మాట్లాడుతూ.. మహారాజా కళాశాలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం అన్యాయమని, ఈ నిర్ణయంతో పేద విద్యార్థులకు విద్య దూరమైనట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు.    మహారాజా కళాశాల పరిరక్షణ కమిటీ చైర్మన్‌ సురేష్‌ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మహారాజా కళాశాలను ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి మహారాజా కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయం.. పోరాటానికి దారితీసే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అత్యాచార కేసుల విచారణ 2 నెలల్లో పూర్తిచేయాలి.. కేంద్రం తాజా మార్గదర్శకాలు 

మహిళలపై జరిగే నేరాల్లో పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విధివిధానాలను అనుసరించాలని తెలిపింది.   ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్ లో 19ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మహిళలపై జరిగే నేరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం విధివిధానాలను విడుదల చేసింది.   మహిళలపై లైంగిక వేధింపుల కేసుల సమాచారం అందిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, పోలీసుస్టేషన్‌ పరిధికి వెలుపల జరిగితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి.. నేరస్థుల్ని అరెస్టు చేసే తీవ్రత గల నేరాల విషయంలో  చర్యలు తీసుకోని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అత్యాచార కేసుల విచారణను రెండు నెలల్లో పూర్తిచేయాలని పేర్కొంది.  

పాతబస్తీలో బతుకమ్మ సందడి! గ్రేటర్ ఎన్నికల ఎఫెక్ట్ 

తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణి ప్రారంభమైంది. గత నాలుగేండ్లుగా దసరా ముందు బతుకమ్మ చీరలను పంచుతున్నారు. అయితే ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో బతుకమ్మ చీరల పంపిణిలో సందడి కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలు ఎక్కువ హడావుడి  చేస్తున్నారు. కరోనా భయపెడుతున్నా పట్టించుకోకుండా అట్టహాసంగా చీరల పంపిణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓల్డ్ సిటీలోనూ జోరుగా చీరల పంపిణి జరుగుతోంది. గతంలో డివిజన్ కు ఒకటి, రెండు చోట్ల మాత్రమే చీరల పంపిణి జరిగేది. కాని ఈసారి కాలనీలు, గల్లీలో సభలు పెట్టి చీరల పంచుతున్నారు నేతలు.  ఓల్డ్ సిటీలో ఎంఐఎం నేతలు కూడా చీరల పంపిణిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనంతటికి త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే కారణమంటున్నారు. బతుకమ్మ చీరల పంపిణిని తమకు అనుకూలంగా మలుచుకుంటా ఎన్నికల ప్రచారం మెదలుపెడుతున్నారు కొందరు నేతలు.            ఓల్డ్ సిటీలో బతుకమ్మ చీరల పంపిణి హడావుడి కనిపించడం కొత్తగా కనిపిస్తోంది. నిజానికి హిందువులు జరుపుకునే దసరా పండగ సందర్భంగా పంచే బతుకమ్మ చీరలను వేరే మతస్తులకు ఇవ్వడంపై మొదటి నుంచి ఆరోపణలున్నాయి. రంజాన్ , క్రిస్టమస్ సమయంలో ఆయా వర్గాల వారీకే దుస్తులు పంపిణి చేస్తున్నారని, దసరాకు మాత్రం అన్ని వర్గాల వారికి ఇవ్వడమేంటనీ కొందరు ప్రశ్నించారు. అయినా కేసీఆర్ సర్కార్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. ప్రతి ఏటా దసరా ముందు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులుగా ఉన్న మహిళలందరికి చీరను కానుకగా ఇస్తోంది. గత నాలుగేండ్లుగా చీరల పంపిణి జరుగుతున్నా... ఓల్డ్ సిటీలో పెద్ద హడావుడి ఉండేది కాదు. పాతబస్తీలో పట్టున్న ఎంఐఎం నేతలు చీరల పంపిణిని పెద్దగా పట్టించుకునే వారు కాదు.    ఈసారి మాత్రం గతానికి భిన్నంగా ఓల్డ్ సిటీలో కొత్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంఐఎం ప్రజా ప్రతినిధులు, నేతలు బతుకమ్మ చీరల పంపిణిలో జోరుగా పాల్గొంటున్నారు.గల్లీ గల్లీకి సభలు ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నారు. ఎెంఐఎం పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలు కూడా బతుకమ్మ చీరల పంపిణిలో పాల్గొంటుండటం చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ ఎన్నికల కోసమే వీరంతా చీరల పంపిణిలో పాల్గొంటున్నారనే చర్చ పాతబస్తీలో జరుగుతోంది. ఓల్డ్ సిటీలో ఎక్కువగా పేదలు ఉంటారు. వారికి సర్కార్ ఇచ్చే  బతుకమ్మ చీరను పెద్ద కానుకగా భావిస్తారు. ఇదే సెంటిమెంట్ ను తమకు ప్రయోజనం కలిగేలా నేతలు మలుచుకుంటున్నారు. చీరలు పంపిణి చేస్తూ.. లబ్దిదారుల ఓట్లను తమకు మద్దతుగా  మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.    గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో ఓల్డ్ సిటీలో ఈసారి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఓ వర్గం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓల్డ్ సిటీలో సరికొత్త దృశ్యాలు కనిపించేలా ఉన్నాయి. ఎంతకైనా ఎన్నికల కోసం పార్టీలు ఏమైనా చేస్తాయనడానికి, నేతలు తమకు నచ్చని పనులు కూడా చేస్తారన్నదానికి హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిణామాలే ఉదాహరణగా నిలుస్తాయని మరికొందరు చెబుతున్నారు.

వేల కోట్లు లూటీ చేసి, చిప్పకూడు తిన్న జగన్ గారిది విజన్ అంటారా.. బుద్ధా ఫైర్

ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన తీవ్ర విమర్శలతో మొదలైన ఈ ఫైట్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ తో మరింత వేడెక్కింది. ముందుగా విజయసాయిరెడ్డి బాబును టార్గెట్ చేస్తూ.. "రాజధాని ఇటుకల కోసం స్కూలు పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ? రియల్ ఎస్టేట్ భూముల విలువ పెంచుకునేందుకు పసివాళ్లని కూడా వదల్లేదు కదా? మీరు వాళ్ల జేబులు ఖాళీ చేస్తే, ఇప్పుడు అదే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు జగన్ గారు.. తేడా తెలుస్తోందా?" అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.   అంతేకాకుండా "పోలవరం యాత్రలకు చంద్రబాబు చేసిన ఖర్చు 400 కోట్లు, దొంగ దీక్షలకు మరో 300 కోట్ల రూపాయలు ఊదేశాడు. జగన్ గారు 43 లక్షల మంది విద్యార్థులకు బ్యాగు, నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బూట్లు, సాక్స్, బెల్ట్ తో కూడిన కిట్ ఇవ్వడానికి చేసిన ఖర్చు 650 కోట్ల రూపాయలు. ఏది విజన్ ? ఏది దుబారా?" అని విజయసాయిరెడ్డి చంద్రబాబును నిలదీశారు.   అయితే విజయసాయిరెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.. "43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి,16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి గారిని విజన్ ఉన్న నాయకుడు అంటారా?" అంటూ ట్విట్టర్ వేదికగా విజయ్ సాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా "పోలవరం యాత్రకు ధనం వృధా చేసి ఉంటే మీ సైకో బ్యాచ్ ఊరుకుంటుందా? పోలవరం అనేది 7 దశాబ్దాల రాష్ట్ర ప్రజల కల. 70 శాతం చంద్రబాబు గారు పూర్తి చేసారు కాబట్టి, కల సాకారం అవుతున్న దృశ్యాన్ని ప్రజలకు చూపించారు. మీ లాగా ఢిల్లీ వాళ్లకు 'ఫుట్ మసాజ్' చేయకుండా, రాష్ట్ర సమస్యల పై కేంద్రంతో పోరాడారు. ఖర్చుల్లో తేడా ఉంటే, ఏమి పీక్కుంటావో పీక్కో" అంటూ మండిపడ్డారు.   అసలు "స్కూల్ పిల్లలు వేసుకునే బెల్ట్ కి,సాక్స్ లకు కూడా వైకాపా రంగులు వేసుకునే నువ్వు దుబారా గురించి మాట్లాడుతున్నావా? అంటూ విజయ్ సాయి రెడ్డిని ఎద్దేవా చేశారు. 4 వేల కోట్ల తో పంచాయతీలకు వైకాపా రంగుల దుబారా మర్చిపోయావా? తాడేపల్లి ఇంటి కోసం రూ.16 కోట్లు, నాయన సమాధి కోసం రూ.27 కోట్లు, చచ్చు సలహాలు ఇచ్చే సలహాదారులకు 60 కోట్లు, సిబిఐ కోర్టుకు వెళ్లడానికి ప్రతీ వారం 60 లక్షలు, మీ కక్షలు తీర్చుకోవటానికి లాయర్ల ఫీజులంటూ వందల కోట్లు, మీ అవినీతి పత్రికకు వందల కోట్లు, మీరు చేసే వేల కోట్ల దందాలు మొత్తం లెక్క తీస్తే, 10 పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చని" అన్నారు.   ఇదే అంశం పై స్పందించిన టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు "పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టడానికి చంద్రబాబు అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని పీకేసిన జగన్ రెడ్డి రంగులు వేయడానికి... తీయడానికి 4000 కోట్లు తగులబెట్టారు. మేం పేదల కడుపు చూస్తాం. మీరు రంగుల లోకంలో విహరిస్తారు" అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

గుడ్ న్యూస్.. కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్ 

మనదేశంలో కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న సమయంలో క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ కు చెందిన ఫార్మా కంపెనీ భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కు భార‌త ఔష‌ధ నియంత్ర సంస్థ (డీసీజీఐ) అనుమ‌తి ఇచ్చింది. మొద‌టి రెండు ద‌శ‌ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కు సంబంధించిన ప్రాథ‌మిక స‌మాచారాన్ని అంచ‌నా వేసిన డీసీజీఐ నిపుణుల క‌మిటీ… వ్యాక్సిన్ తో ఎటువంటి ఇబ్బందులు లేవ‌ని దృవీక‌రించి, వ్యాక్సిన్ ట్రయల్స్ లో కీల‌క‌మైన మూడో ద‌శ ట్రయల్స్ ‌కు ఓకే చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ రెండో దశలోని భద్రత, ఇమ్యునోజెనిసిటి డేటా ఆధారంగా తగిన మోతాదులో మూడో దశ ట్రయల్స్ ప్రారంభించాలని ఎస్​ఈసీ తెలిపింది.

ఇక్కడ ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందే: ఆర్ఎస్ఎస్ చీఫ్

ఇండియాలో ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఓ హిందీ మ్యాగజైన్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మనదేశ సంస్కృతిపై దాడి జరిగిన ప్రతిసారీ అన్ని మతాల ప్రజలు కలిసి ఒకటిగా నిలబడి దేశాన్ని రక్షించుకున్నారని అయన ప్రశంసించారు. అంతేకాకుండా ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతగా ముస్లింలు ఇక్కడ సంతోషంగా ఉన్నారని అయన అన్నారు. పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఇతర మతాల వారికి ఎటువంటి హక్కులు ఉండవని అయన అన్నారు. గతంలో మేవార్‌ రాజు మహారాణా ప్రతాప్‌ సైన్యంలో అనేక మంది ముస్లింలు మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ కి వ్యతిరేకంగా పోరాడారని భగవత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.   అయితే ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలని మన రాజ్యాంగం చెప్పలేదని.. అయితే, ఇకపై ఎవరైనా ఇక్కడ ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని అయన తేల్చి చెప్పారు. ఈ దేశంలో ముస్లింలకు కూడా ప్రత్యేకంగా చోటు కల్పించామని, ఇది భారతదేశ స్వభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. తమ స్వార్థ ప్రయోజనాలకు దెబ్బ తగిలిన వారే దురభిమానాన్ని, వేర్పాటువాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని భగవత్ మండిపడ్డారు.

ప్రత్యక్ష ఎన్నికకు ఫికరెందుకు?

అన్నీ అనుకూల అంశాలే   ‘మేయర్’పై టీఆర్‌ఎస్ వెనుకడుగు ఎందుకు?   చేతిలో అధికారం.. ప్రజల దన్ను.. సెటిలర్ల సపోర్టు.. ఇన్ని అంశాలు సానుకూలంగా కనిపిస్తున్నా.. ప్రత్యక్ష ఎన్నికలకు, టీఆర్‌ఎస్ సర్కారు వెనుకడుగు వేయడమే ఆశ్చర్యం. గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో పోటీ ఇచ్చిన టీడీపీ కనుమరుగయిపోగా, కాంగ్రెస్ బలం అంతంత మాత్రంగానే ఉంది. ఇక బీజేపీ బలం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాగూ పాతబస్తీలో మజ్లిస్ దన్ను ఉండనే ఉంది. అయినా మేయర్ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగేందుకు, కేసీఆర్ సర్కారు భయపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.   నవంబర్-డిసెంబర్‌లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగనుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. నగరంలో ఒక్క బీజేపీ స్థానం తప్ప, మిగిలిన  అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్-మజ్లిస్ శాసనసభ్య్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మజ్లిస్ ఎలాగూ తెరాసకు మిత్రపక్షమే. గతంలో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో, టీడీపీ దాదాపు రెండవ స్థానంలో నిలిచింది. అయితే, చంద్రబాబు నాయుడు ఓటుకునోటు కేసు కారణంగా.. కేసీఆర్ సర్కారుకు భయపడో-రాజీ కుదిరిన మేరకో, పదేళ్ల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నుంచి, విజయవాడకు పారిపోయారన్న అభిప్రాయం సెటిలర్లలో బలంగా ఏర్పడింది. అందుకే తన రక్షణ కోసం వెళ్లిన టీడీపీని కాదని, స్థానిక పార్టీ అయిన టీఆర్‌ఎస్‌కే సెటిలర్లు తమ రక్షణ కోణంలో జైకొట్టారు. అదీ అసలు రహస్యం.   టీఆర్‌ఎస్ కూడా గత ఎన్నికల్లో, సెటిలర్లకు కార్పొరేటర్ల సీట్లు ఇచ్చింది. ఎన్నికల్లో సెటిలర్లు అదే సంప్రదాయం, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాటించారు. మొత్తంగా సెటిలర్లు భయానికో-ప్రేమకో-ప్రత్యామ్నాయం లేకనో- టీడీపీ అధినేత ఆంధ్రాకు పారిపోవడం వల్లనో- అనివార్య పరిస్థితిలోనో, తెరాసకు మద్దతునిస్తున్నారన్నది నిర్వివాదం. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెరాస అధికారంలోకి వచ్చినప్పటికీ, ఇప్పటి వరకూ ఒక్క సెటిలర్‌పై ఎక్కడా దాడి జరిగిన దాఖలాలు లేవు. పైగా తెలంగాణ లో సాగునీటి ప్రాజెక్టుల సహా, అనేక పనులన్నీ సింహభాగం ఆంధ్రా కాంట్రాక్టర్లే చేస్తున్నారు. బహుశా తెరాసపై వ్యతిరేకత లేకపోవడానికి ఇదీ ఒక కారణం కావ చ్చు.   గతంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు.. 14,68,618 ఓట్లు, 43.85 శాతం ఓట్లు సాధించి 100 సీట్లు సాధించింది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి, సనత్‌నగర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, జూబ్ళీహిల్స్ నియోజకవర్గాల్లో,  మెజారిటీ డివిజన్లు టీఆర్‌ఎస్ ఖాతాలోకే వెళ్లాయి. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఈ నియోజకవర్గాల్లో సెటిలర్లంతా కారు ఎక్కడం చూస్తే... రాజధాని నగరంలో సెటిలర్లంతా తెరాసకే జై కొడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఉత్తరాది- సీమాంధ్ర సెటిలర్లు జాతీయ కోణంలో ఓటేశారు. ఫలితంగా బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి విజయం సాధించగలిగారు.   కానీ అదే సెటిలర్లు, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం.. స్థానిక పరిస్థితుల దృష్ట్యా, టీఆర్‌ఎస్‌కే జై కొట్టడం ప్రస్తావనార్హం. గుజరాతీ-రాజస్థానీలు ఎక్కువగా నివసించే సనత్‌నగర్‌లో.. అసెంబ్లీకి తలసాని శ్రీనివాసయాదవ్‌కి ఓటేసిన ఉత్తరాది ఓటర్లు, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కిషన్‌రెడ్డిని గెలిపించడం విశేషం. అటు పాతబస్తీలోని ఉత్తరాది వారు కూడా ఇదే సూత్రం అవలంబించారు. లేకపోతే అసెంబ్లీలలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ, ఏకంగా ఎంపీ సీటు గెవలవడం అసాధ్యం.   మరి నగరంలో ఇంత తిరుగులేని బలం ఉన్న టీఆర్‌ఎస్.. గ్రేటర్ ఎన్నికల్లో పరోక్ష పద్ధతిలో, మేయర్ ఎన్నిక నిర్వహించడమే ఆశ్చర్యం. ఎంసీహెచ్‌గా ఉన్న కార్పొరేషన్‌లో దశాబ్దాల పాటు, మేయర్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలోనే జరిగాయి. కానీ చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు మాత్రం, మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నికలే నిర్వహించి రికార్డు సృష్టించారు.   ఆ ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. నేరుగా ఎన్నికయిన మేయర్ రికార్డు ఇప్పటికీ , ఆయన పేరిటనే ఉంది. ఒకవేళ రేపు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే, తీగల కృష్ణారెడ్డి అభ్యర్ధి అయితే, తిరిగి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. మళ్లీ తర్వాత జరిగిన ఎన్నికల్లో, పరోక్ష పద్దతిలోనే మేయర్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ, ఇప్పుడు నగరంలో టీఆర్‌ఎస్‌కు అనేక కోణాల్లో బలం- సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతుండటమే ఆశ్చర్యం. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, ప్రజలు  అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితి ఉండదన్న లాజిక్కును, కేసీఆర్ ఎలా విస్మరించారో అర్ధం కావడం లేదంటున్నారు.   ఈ విషయంలో విపక్షాలు సైతం కేసీఆర్ సర్కారుకు సవాల్ విసురుతున్నారు. నిజంగా కేసీఆర్‌కు గ్రేటర్‌పై పట్టు-పలుబడి ఉంటే ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో... గెలిచిన ఇతర పార్టీ కార్పొరేటర్లను కరీంనగర్‌లో మాదిరిగా, కొనుగొలు చేసి అధికారం సాధించవచ్చన్న ముందుచూపుతోనే, మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శిస్తున్నారు.  -మార్తి సుబ్రహ్మణ్యం

ఉద్యోగులను పులులుగా మార్చకండి! కేసీఆర్ పై TNGO నేత హాట్ కామెంట్స్ 

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు TNGO రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్. తెలంగాణ పాలనలో కుడితిలో పడ్డ ఎలుకల్లా ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారిందన్నారు. ఏ ఒక్క ఉద్యోగి ముఖంలో నవ్వు లేదన్నారు మామిండ్ల రాజేందర్. తెలంగాణ వచ్చాక నష్టపోయింది ప్రభుత్వ ఉద్యోగులేనని చెప్పారు. పీఆర్సీ కమిటీ ఉద్యోగుల కాళ్లు కట్టేసిందన్నారు. వరంగల్ లో జరిగిన TNGO సమావేశంలో రాజేందర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.    ప్రభుత్వ ఉద్యోగులను ఇంట్లో పిల్లుల మాదిరి ఉంచడమే ప్రభుత్వానికి మంచిదని.. పులులను చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలతో  నామమాత్ర చర్చలే జరుపుతున్నారని రాజేందర్ తేల్చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు వినతి పత్రాల దగ్గరే ఉంటే.. ఆంధ్రాలో మాత్రం స్పీడుగా జీవో వరకు వెళుతోందన్నారు రాజేందర్.    కండువాల్లేని టీఆరెఎస్ కార్యకర్తలా పని చేశామన్నారు మామిడ్ల రాజేందర్. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ పార్టీ కార్యకర్తల్లా ఉద్యోగులు పని చేస్తారని చెప్పారు. జిందాబాద్.. ముర్ధాబద్ అంటే పనులు కావన్న రాజేందర్..  ఆర్టీసి సమ్మె మాదిరి ఆగమాగం చేయబోమని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు చేపించాలని ఉద్యోగులకు సూచించారు. TNGO నాయకునికి టికెట్ అడిగితే తప్పేంటన్నారు. కారం రవీందర్ మరో బాధ్యతలతో మన ముందుకు వస్తారని నమ్మకం ఉందని వరంగల్ ఉద్యోగులతో చెప్పారు మామిండ్ల రాజేందర్.

ఏపీలో కొత్తగా 5,145 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా విజృంభణ మునుపటితో పోలిస్తే తగ్గింది. గత కొద్దిరోజులుగా తక్కువ సంఖ్యలోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో గడచిన 24 గంటల్లో 70,521 శాంపిల్స్ పరీక్షించగా 5,145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 862 మందికి, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 139 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 7,44,864కి చేరింది. గత 24 గంటల్లో 31 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,159కి చేరింది. ఇప్పటివరకు 6,91,040 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 47,665 యాక్టివ్ కేసులున్నాయి.

ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 12కి వాయిదా

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 12కు కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 12 నుంచి రోజువారీ విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది.   ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను సత్వరమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులపై కోర్టులు విచారణ ప్రారంభించాయి.   ఈ నేపథ్యంలోనే ఓటుకు నోటు కేసు వ్యవహారంపై ఏసీబీ కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కాగా, ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు సెబాస్టియన్, ఉదయసింహ తదితరులు నిందితులుగా ఉన్నారు.   ఈ కేసులో ఆడియో టేపుల విషయంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) రిపోర్టు కీలక ఆధారంగా భావిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఇప్పటికే 960 పేజీలతో కూడిన చార్జిషీటు దాఖలు చేసింది. స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడిదన్నది ఈ కేసులో కీలక అంశం.    2015లో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి విజయం కోసం అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను నగదుతో ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో రేవంత్ అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇప్పుడు ఈ కేసు విచారం ప్రారంభం కావడంతో.. దీనిపై కోర్టు ఏం తీర్పు ఇస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.

ఏపీలో అన్‌లాక్‌ 5.0 గైడ్‌లైన్స్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానున్న కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా తాజా మార్గదర్శకాలు వెల్లడించింది. సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. మాస్క్‌ లేకుంటే షాపింగ్ మాల్స్‌, సినిమా హాల్స్‌లో ప్రవేశం నిరాకరించాలని తెలిపింది. విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద శానిటైజర్లు తప్పనిసరి. మాస్కు లేనివారికి ప్రవేశం నిషేధం. సినిమా థియేటర్లలో మాస్కు ధరించటం, శానిటైజేషన్, భౌతిక దూరానికి సంబంధించి ప్రచార ప్రకటనలు వేయాలి. రద్దీగా ఉండే ప్రదేశాల్లో విధిగా భౌతికదూరం పాటించాలి. కోవిడ్ నిబంధనల అమలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి. ప్రార్థనా మందిరాల్లో కరోనా నివారణ చర్యలు తీసుకోవాలి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మైకుల ద్వారా మాస్కు ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవటం, భౌతిక దూరం పాటించటం వంటి వాటిపై మైకుల ద్వారా ప్రచారం. స్కూళ్లు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లో కేంద్రం మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి. పాఠశాలల్లో ప్రతి పీరియడ్ తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు శానిటైజేషన్ చేసుకోవాలి.

మాకు సన్మానం చేస్తున్నవారికి త్వరలో రెట్టింపు సన్మానం.. జేసీ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి జగన్ సర్కార్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తాడిపత్రి గనుల శాఖ కార్యాలయానికి దివాకరరెడ్డి వచ్చారు. అయితే జేసీ వచ్చిన సమయానికి ఆఫీసులో గనుల శాఖ ఏడీ లేకపోవడంతో జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. తాను వస్తున్నట్టు తెలుసుకుని ఏడీ పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. తాను మళ్లీ సోమవారం వస్తానని అయన స్పష్టం చేశారు.   అయితే చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన.. అధికార పార్టీపై, అలాగే అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం తన కుటుంబంతో దూరంగా ఉంటున్నానని.. తనకు లైవ్ లీ హుడ్ జరగడమే కష్టంగా ఉందని అయన చెప్పుకొచ్చారు. తన భార్య, చెల్లి పేరుతో గనులు ఉన్నాయని.. అయితే ఆ గనులను శోధించడానికి కొన్ని వాహనాల్లో 50 నుంచి 60 మంది వచ్చారు. వారిని చూసి ఇంతకీ వీళ్లెవరబ్బా..? అని అనుకున్నానని జేసీ అన్నారు.   "వైజాగ్ నుంచి నక్సలైట్లు ఏమైనా గనులకు వచ్చారా..? లేక పోలీసులు.. నక్సలైట్ల కోసం గాలిస్తున్నారేమో అనుకున్నానని అన్నారు. అదే ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు ఇతర నేతలకు కూడా గనులున్నా.. నా భార్య పేరుతో ఉన్న గనులను మాత్రమే పరిశీలించారు. వ్యక్తిగతంగా నా కుటుంబంపై కక్ష సాధించేందుకే ఆ అధికారులు ఇదంతా చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నా కుటుంబాన్ని అన్ని రకాల బాధలకు గురిచేసింది. ఏమీ లేకుండానే ఎస్సీ, ఎస్టీ యాక్ట్ పెట్టి నా బ్రదర్‌ను లోపల వేశారు. ఈ కేసులన్నీ కేవలం కక్ష సాధింపులో భాగమే" అని జేసీ దివాకరరెడ్డి తెలిపారు.   "ఇప్పటి వరకూ జగన్ సర్కార్.. దివాకరరెడ్డిని టచ్ చేయలేకపోయింది. బహుశా నేనెప్పుడూ జగన్‌ను.. మా వాడు.. మా వాడు అంటున్నా కదా. ఆ సంబంధంతోనే ఏమీ చేయలేదు. అయితే తాజాగా గనులను క్లోజ్ చేసేందుకు వారు స్కెచ్ వేస్తున్నారు. ఈ గనులు తప్ప నాకు ఇతర ఆస్తిపాస్తులేమీ లేవు. అందులో వచ్చే ఆదాయంతోనే అన్నం వండుకుని తింటున్నాము. అది కూడా లేకుండా మాడ్చి చంపడానికే చూస్తున్నారు. కొద్ది రోజుల్లోనే మైనింగ్ కూడా లేకుండా చేయాలనే సంకల్పంతో వాళ్ళు ఉన్నారు." అని జేసీ తెలిపారు.   "నా భార్యకు పెరాలసిస్ వచ్చి.. ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గనుల పర్మిట్ల కోసం మరోసారి వస్తాను. ఇక్కడే కూర్చుంటా.. మైనింగ్‌కు పర్మిట్ ఇవ్వకుంటే అన్నం లేకుండా మాడి పైకి పోతాం. దాంతో వాళ్ల కోరిక కూడా నెరవేరుతుంది. ఇక్కడే కూర్చుని నిరాహారదీక్ష చేస్తా. సోమవారం కూడా గనుల శాఖ ఏడీ గారు దొంగ క్యాంపుకు పోతే పోనీ ఏం చేస్తారు. నాకు సత్కారం చేయడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. ఇటువంటి ఎన్నో సత్కారాలు అనుభవించిన పెద్దవాణ్ని. అందరికీ చెబుతున్నా.. ఇపుడు మీరు నాకు సత్కారం చేస్తారు. అందుకు రెట్టింపు సత్కారం మీకు కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది. అపుడు నాకు సత్కారం చేసే పెద్దవాళ్లకు సత్కారం చేసి మా రుణం తీర్చుకుంటాం.. ఇంతకంటే ఘనమైన సత్కారం తీర్చుకోకతప్పదు" అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.   గనుల శాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన సమయంలో పోలీసుల వయ్వహారించిన తీరు పట్ల అయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలం మారుతోందని, జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. పోలీసులు ట్రాన్సఫర్లకు బయపడి ఊడిగం చేస్తున్నారని, పోలీసులు ఇలా బానిసల్లా ఎందుకు బతుకుతున్నారో అర్థంకావడంలేదని అయన అన్నారు. "మా ప్రభుత్వం వస్తే... మేం కాదు, మా కార్యకర్తలే మీ సంగతి చూసుకుంటారు. చాలా తొందర్లోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వస్తుంది... అప్పుడు వచ్చే పాలకులు ఇప్పటివాళ్లకన్నా నాలుగింతలు దుర్మార్గులు వస్తారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి?" అని అయన ప్రశ్నించారు. మీరంతా ఓ నియంత చెప్పినట్టు చేస్తున్నారు, ఆ నియంత ఎంతకాలం ఉంటాడో తెలుసా? ముస్సోలిని, హిట్లర్ వంటి మహామహులైన నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు మాకు సన్మానం చేసిన అధికారులు త్వరలో అంతకు రెట్టింపు సన్మానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అయన అన్నారు.

జ‌గ‌న్ గేమ్ ప్లాన్‌!?

అన‌గ‌న‌గా ఒక కూట‌మి. పెద్ద కూట‌మి. అధికార కూట‌మి. అయినా ఒక‌రిద్ద‌రు ఒక‌రిత‌ర్వాత మ‌రొక‌రు నిష్ర్క‌మించారు. అయినా కూట‌మి కంగారు ప‌డ‌లేదు. నింపాదిగా న‌డుస్తున్న‌ది. కొత్త‌గా ఎవ‌ర్న‌యినా చేర్చుకోవాల‌నుకుంటే అది కూట‌మి నిర్ణ‌యించుకుంటేనే అవుతుంది. అధికార కూట‌మి కాబ‌ట్టి అందులో చేరాల‌ని ఆశించేవాళ్లు మిక్కిలిగానే ఉంటారు. కాని అది చేరాల‌నుకునేవారి ఇష్టాయిష్టాల మీద ఉండ‌దు. కూట‌మి ఆలోచ‌న‌ను బ‌ట్టి ఉంటుంది. తాజాగా ఒక ప్రాంతీయ పార్టీ అందులో భాగ‌స్వామి కావాల‌ని అనుకుంటున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. మ‌రి ఈ క‌థ కంచికి ఎలా చేరుతుంది?   నిజానికి ఇది అన‌గ‌న‌గా ఒక క‌థ కాదు. ఆ కూట‌మి మ‌రేదో కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే. ఆ ప్రాంతీయ పార్టీ వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైసీపీ. ఈ వారం ఆరంభంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని క‌లిసిన‌ప్ప‌టి నుంచి ఈ ప్ర‌చారం మ‌రింత ఊపందుకుంది. దీన్ని కేవ‌లం ప్ర‌చారం అని కొట్టేయ‌డానిక్కూడా త‌గిన ఆధారాల్లేవు. ఎందుకంటే..ఆయ‌నంత ఆగ‌మేఘాల మీద ఢిల్లీ వెళ్లాల్సివ‌చ్చింది. ప్ర‌ధాన‌మంత్రి కోరుకున్నారు కాబ‌ట్టి జ‌గ‌న్ అలా హ‌ఠాత్తుగా ఒక్క రోజు ముంద‌స్తు స‌మాచారంతో వెళ్ల‌గ‌లిగారు. అదేరోజు మ‌ధ్యాహ్నం రెండు తెలుగు రాష్ట్రాల జ‌ల వివాదం మీద అపెక్సు కౌన్సిల్ స‌మావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఉభ‌య రాష్ట్రాల సీఎంలు వారివారి రాజ‌ధాని న‌గ‌రాల నుంచి, కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి షెకావ‌త్ ఢిల్లీ నుంచి వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో చ‌ర్చ‌లు జ‌ర‌పాల్సి ఉంది. తీరా ప్ర‌ధానితో భేటీ కార‌ణంగా ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీలో త‌న నివాసం నుంచి వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన్నారు. దీన్నిబ‌ట్టి ప్ర‌ధానితో భేటీలో ఒక మ‌ర్మం ఉంద‌న్న ఊహాగానాల‌కు బ‌లం చేకూరుతున్న‌ట్టే భావించాలి.    ఆ అత్య‌వ‌స‌ర స‌మావేశం ఎవ‌రి ప్రోద్బ‌లం మీద జ‌రిగింద‌న్న‌ది ఒక అంశం. అపెక్సు కౌన్సిల్ స‌మావేశానికి రెండు రోజుల ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రికి ఒక సుదీర్ఘ లేఖ రాశారు. అదంతా స‌హ‌జంగానే తెలంగాణ వాద‌న‌కు బ‌లం చేకూర్చే విధంగా ఉంది. ఆత‌ర్వాతే జ‌గ‌న్‌-మోడీ భేటీ ఖ‌రారైంది. అంటే..అపెక్సు కౌన్సిల్ భేటీకి ముందుగానే జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీని క‌లిసి జ‌ల వివాదంలో ఆంధ్రా వాద‌న‌ను బ‌లంగా వినిపించి అపెక్సు కౌన్సిల్ స‌మావేశంలో త‌మ వాద‌న‌కు మార్గం సుగ‌మం చేసుకోవాల‌నుకున్నారా? అందుకోసం పీఎంఓ ద్వారా ప్ర‌ధాని అపాయింట్‌మెంట్ తీసుకున్నారా? ఇదీ ఒక అంశ‌మే. కేసీఆర్ లేఖ‌కు మోడీతో భేటీ ఒక స‌మాధాన‌మ‌న్న మాట‌! అయితే ఏపీలో ఉన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ఈ వాద‌నేదీ బ‌లంగా చ‌ర్చ‌కు నోచుకోలేదు. కేవ‌లం ఎన్డీయేలో చేరే విష‌య‌మై చ‌ర్చ‌ల‌కు పిలిచిన‌ట్టుగానే ఎక్కువ ప్ర‌చారానికి నోచుకుంది. అయితే ఆ భేటీ అయ్యాక ఏవైపు నుంచీ అందుకు సంబంధించిన స‌మాచార‌మేదీ అధికారికంగా గాని, విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ‌న్న‌ట్టు గాని బైటికి రాలేదు. దీన్నిబ‌ట్టి అస‌లు ఈ అంశంలో ఎన్డీయే అభిప్రాయ‌మేమిటి అన్న సందేహాలు తెర‌మీదికొచ్చాయి.    ఎన్డీయే నుంచి ఈమ‌ధ్యే శిరోమ‌ణి అకాలీద‌ళ్ వైదొలిగిన మాట నిజ‌మే. అంత‌మాత్రాన ఇప్ప‌టికిప్పుడు ఆ శూన్యాన్ని భ‌ర్తీ చేసుకోవాల‌న్న ఆదుర్దా ఆ కూట‌మికేమీ లేదు. అలాంటి వాతావ‌ర‌ణం కూడా క‌నిపించ‌డం లేదు. కాని వైసీపీకి ఎన్డీయే నుంచి సిగ్న‌ల్ అందుతున్న‌ట్టు అంటున్నారు.వైసీపీ మాత్రం ప్ర‌త్యేక హోదా ఇస్తేనే చేర‌తామ‌ని ప్ర‌ధానితో భేటీలో కూడా చెప్పిన‌ట్టు ఒక ప్ర‌చారం జ‌రిగింది. అందుకు ఎన్డీయే నుంచి..హోదా ఇవ్వ‌లేము గ‌న‌క‌..అందుకు త‌గిన‌ట్టు ప్యాకేజీ ఇస్తామ‌ని రాయ‌బారాలు సాగుతున్న‌ట్టు మ‌రొక క‌థ‌నం. అస‌లీ క‌థ‌నాలు అటు ఎన్డీయేతో గాని, ఇటు వైసీపీతో గాని సంబంధం లేకుండానే న‌డుస్తున్నాయా అన్న అనుమానాలూ క‌లుగుతున్నాయి. ఎందుకంటే ఒక‌వేళ ఎన్డీయేలో చేరాల‌నుకునే ఏ పార్టీ అయినా..మోడీ ముందు, అమిత్ షా ముందు ష‌ర‌తులు పెట్టేంత వాతావ‌ర‌ణం ఉందా? ఆ ప‌రిస్థితి ఏ ప్రాంతీయ పార్టీకైనా ఉందా? ఇలాంటి సంద‌ర్భాల్లో ఉభ‌యుల ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా ఒప్పందాలు కుద‌ర‌డం స‌హ‌జ‌మే. ఇరువైపులా వ‌త్తిళ్లు ఉన్న‌ప్పుడే ఇలాంటివి జ‌రిగే వీలుంది. వైసీపీ ష‌ర‌తులు పెట్ట‌డం..ఎన్డీయే వాటిమీద బేర‌సారాలు ఆడ‌టం..ప్ర‌స్తుత రాజ‌కీయ వాతావ‌ర‌ణానికి పొస‌గ‌ని అంశాలుగా క‌నిపిస్తున్నాయి. రాజ్య‌స‌భ‌లో ఎన్డీయేకి బ‌లం త‌క్కువ‌గా ఉంది కాబ‌ట్టి, బిల్లుల విష‌యంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు భాగ‌స్వాముల్ని చేర్చుకోవ‌చ్చున‌న్న ఒక‌ప్ప‌టి వాద‌న‌లకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. మొన్నీమ‌ధ్యే చూశాం. క‌రోనా నేప‌థ్యంలో అర‌కొర స‌భ్యుల మ‌ధ్య వ్య‌వ‌సాయ బిల్లుల్ని ప్ర‌భుత్వం క‌నీస లాంఛ‌నాలైనా పాటించ‌కుండా ఆమోదింప‌చేసుకోవ‌డాన్ని క‌ళ్లారా చూశాక కూడా రాజ్య‌స‌భ‌లో బ‌లం కోసం కొత్త‌వారిని కూట‌మిలో చేర్చుకోవ‌డంలాంటిది జ‌రుగుతుంద‌ని భావించ‌గ‌ల‌మా? ఏతావాతా అలాంటి ప్ర‌తిపాద‌నేదైనా ఉంటే..అది వ‌చ్చే అసెంబ్లీ..పార్ల‌మెంటు ఎన్నిక‌ల కోస‌మే అవుతుంది త‌ప్ప వేరే కార‌ణాల కోసం మాత్రం కాదు.    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీని ఇంకా ఇంకా బ‌ల‌హీన‌ప‌రిచి, క‌నుమ‌రుగు చేస్తేనే అటు బీజేపీకి గాని, ఇటు వైసీపీకి గాని ప్ర‌శాంత‌త ఉండ‌ద‌న్న‌ది నిజం. ఇక్క‌డ ఈ ఇద్ద‌రి ఉమ్మ‌డి శ‌త్రువు తెలుగుదేశంగా భావిస్తున్నంత కాలం ఈ ఇరువురి మ‌ధ్య నెయ్యం గురించి ఇలాంటి ఊహాగానాలు వ‌స్తూనే ఉంటాయి. కాని బీజేపీకి తెలుగుదేశంతో పాటు వైసీపీ కూడా టార్గెట్ అయి, ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని బీజేపీ నిర్ణ‌యించుకుంటే ప‌రిస్తితి వేరేగా ఉంటుంది. మ‌రి ఈ విష‌యం తేలేదెప్పుడు? ప‌్ర‌స్తుతం బీజేపీ బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల మీద త‌న శ‌క్తియుక్తులు కేంద్రీక‌రించింది. అక్క‌డ స‌రికొత్త రాజ‌కీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది. ప‌రిస్థితి అనుకూలించ‌క‌పోతే..అనువు గాని చోట అధికుల‌మ‌న‌రాదు అన్న సామెత‌కు అనుగుణంగా నితీష్ కుమార్‌తో క‌ల‌సి న‌డ‌వ‌డ‌మే..ఆయ‌న్ని ముఖ్య‌మంత్రిగా అంగీక‌రించ‌డ‌మే. కాదంటే..అంకెల్లో ఆశాజ‌న‌క‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డితే..తానే అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డం..ఇదీ బీజేపీ వ్యూహం. ఇందుకు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు బీజేపీ అడుగుల్లో అడుగేస్తూ స‌హ‌క‌రిస్తున్నాడు. ఎన్నిక‌లైపోయి, ఫ‌లితాలొచ్చి, ప్ర‌భుత్వ‌మెవ‌రిదో తేలాక ఏపీలో ప‌రిస్థితి మీద బీజేపీ మ‌రింత శ్ర‌ద్ధ పెడుతుంది. ఎన్డీయే కూట‌మిలోకి వైసీపీని ఆహ్వానించేదీ లేనిదీ తెలిసేది అప్పుడే! -రాజా రామ్మోహ‌న్ రాయ్

త్వరలో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వ్యాపారాలు పేరిట బ్యాంకుల నుంచి రుణం తీసుకుని రూ.826.17 కోట్ల మేర దారి మళ్లించారన్న ఆరోపణలపై సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. అయితే, ఈ అంశంపై రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఎంపీగా అనర్హుడ్ని చేయలేని వైసీపీ నేతలు ఇలాంటి చవకబారు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.    తాను బ్యాంకులకు రూ.23 వేల కోట్లు ఎగవేశానంటూ రాయడం ద్వారా ఓ పత్రిక విశ్వసనీయత పాతాళానికి పడిపోయిందని విమర్శించారు. బ్యాంకుల నుంచి మేం తీసుకున్న రుణం రూ.4 వేల కోట్ల లోపే ఉంటుందన్నారు. అందులో రూ.2 వేల కోట్లు ఇంకా బ్యాంకు ఖాతాల్లోనే ఉన్నాయని తెలిపారు. అక్టోబరు 6న తనపై కేసు నమోదైందని చెప్పిన ఆయన.. అదే రోజున సీఎం జగన్ ప్రధాని మోదీని కలవడం, పీఎన్ బీ బ్యాంకు చైర్మన్ ను కలవడం అనుమానాలు కలిగిస్తోంది అన్నారు.    తమ వ్యాపారాల్లో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెబుతానని తెలిపారు. తనపై సీబీఐ కేసు వేయించేలా చేసింది సీఎం జగన్ కార్యాలయ ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాష్ అని ఆరోపించారు. కేంద్ర ఆర్థికశాఖలో ప్రవీణ్ ప్రకాష్ బ్యాచ్ మేట్ ఉన్నారని, ఆయన ద్వారానే ఈ కేసు వేయించారని పేర్కొన్నారు.   వాళ్లపై రూ.43 వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఉండడంతో తనపై రూ.23 వేల కోట్లు అని ఆరోపణలు చేశారనుకుంటున్నానని ఎద్దేవా చేశారు. అవాస్తవాలతో కథనాలు రాసిన వారిపై కేసులు వేద్దామని మా లాయర్లు చెబుతున్నారు కానీ, మరో మూడ్నాలుగు నెలల్లో జైలుకు వెళ్లే వారిపై మరో కేసు వేయడం ఎందుకుని ఆగిపోయాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగతి పబ్లికేషన్ కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యనించారు.

వైఎస్ జగన్‌ కేసుల విచారణ 12కి వాయిదా

హైదరాబాద్‌ లోని సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ ఈ నెల 12 కి వాయిదా పడింది. అలాగే, హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసులను నవంబరు 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.   ఈ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం విచారణ జరిగేది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులు, మాజీలకు సంబంధించిన కేసులను సత్వర విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని సూచించింది. దీంతో ఈ కేసు విచారణ ఇక నుండి రోజువారీ సాగనుంది. ఈ నేపథ్యంలో కేసు విచారణను సీబీఐ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.    జగన్‌, విజయసాయిరెడ్డి, ఇతర నిందితులు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా.. వాటిని కోర్టు అంగీకరించింది. కరోనా నేపథ్యంలో.. కోర్టు హాలులో ఎక్కువమంది న్యాయవాదులు, నిందితులు ఉండటం ఇబ్బందిగా ఉండటంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టాలని, జగన్‌ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. తాము కూడా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.    జగన్‌ కేసులో నాలుగు ఛార్జిషీట్లకు సంబంధించి హైకోర్టులో స్టే ఉంది. స్టే ఉన్న కేసులను నవంబర్‌ 9 కి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది. ఇతర కేసుల విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.   కాగా, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను సత్వర విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో జగన్ కి ఇబ్బంది తలెత్తే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హెటిరో, అరబిందోలకు భూకేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నాఇండియా, దాల్మియా, భారతి సిమెంట్స్‌కు లీజులు, వాన్‌ పిక్‌ కు భూకేటాయింపులతో పాటు ఎమ్మార్‌ వ్యవహారంపై నమోదు చేసిన ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి. ఈ కేసులలో సత్వర విచారణ జరిగి ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.

దిశా చట్టం నిద్రపోతోందా సీఎం గారూ.. లోకేష్ ఫైర్

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేసారు. ఏపీలో బాలికలు, మహిళల పై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అయన మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని శిక్షించకుండా, రాజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. అసలు "దిశ చట్టం నిద్రపోతుందా వైఎస్ జగన్ గారు? తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యింది. చిన్నారిని చిదిమేసిన మృగాడు సత్యనారాయణ రెడ్డిని కఠినంగా శిక్షించాల్సింది పోయి, స్థానిక వైకాపా నేతలు రాజీ కుదిర్చే ప్రయత్నం చెయ్యడం దారుణం" అని నారా లోకేశ్ అన్నారు. అంతేకాకుండా "చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా? 21 రోజుల్లో న్యాయం ఎక్కడ ? ప్రచార ఆర్భాటంతో మొట్ట మొదటి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన జిల్లాలోనే ఘోరాలు జరుగుతుంటే ఇక మిగిలిన చోట్ల ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది" అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

తెలంగాణకు బాక్సులు.. ఏపీలో లోకల్ ఫైట్ ఇప్పట్లో లేనట్టే!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగడం కష్టమే. లోకల్ బాడీ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి తెప్పించిన బ్యాలెట్ బాక్సులు తిరిగి వెళుతున్నాయి. డిసెంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరపాలని భావిస్తున్న తెలంగాణ ఎన్నికల సంఘం.. గతంలో ఏపీకి ఇచ్చిన బ్యాలెట్ బాక్సులను తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో ఏపీ ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులను తెలంగాణకు పంపించేస్తున్నారు.    ఆంధ్రప్రదేశ్ లో మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. బ్యాలెట్ పద్దతిలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల పోలింగ్ కోసం తెలంగాణ నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పించారు. తెలంగాణ‌లోని వివిధ జిల్లాల నుండి 30వేల బ్యాలెట్ బాక్సుల‌ను తీసుకొచ్చారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడినా.. బ్యాలెట్ బాక్సులు ఏపీలోనే ఉండిపోయాయి. తెలంగాణ అధికారులు కోరడంతో ఇప్పుడు వాటిని తిరిగి పంపిస్తున్నారు. ఇప్పటికే ఏడు జిల్లాల్లో భద్రపరిచిన 17 వేల 366 బ్యాలెట్ బాక్స్‌లు రిటర్న్ పంపించారు.  మిగిలిన 12,366 బ్యాలెట్ బాక్సుల‌ను కూడా హైదరాబాద్ పంపించేందుకు ఏపీ ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో అన్ని బ్యాలెట్ బాక్సులు పంపించనున్నారు.    గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నిర్వహించే బ్యాలెట్ బాక్సులు.. ఫలితాల తర్వాత కొన్ని నెలల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. దీంతో ఇప్పట్లో బ్యాలెట్ బాక్సులు తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావడం సాధ్యం కాదు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జరపాలంటే బ్యాలెట్ బాక్సులు అవసరం. ఇందుకోసం తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఇంకా ఎన్నికల అధికారులు మొదలు పెట్టలేదు. ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేసినా.. బాక్సులు తెచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ లెక్కన ఇప్పట్లో స్థానిక  సంస్థల ఎన్నికలను ఏపీలో నిర్వహించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   బీహార్ అసెంబ్లీతో పాటు దేశంలో ఖాళీగా ఉన్న పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు నవంబర్ లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఏపీలోనూ వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను డిసెంబర్ లో నిర్వహించాలని జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్నికల కోసం తెప్పించిన బ్యాలెట్ బాక్సులను తిరిగి తెలంగాణకు పంపించడంతో.. ప్రభుత్వం భావిస్తున్న డిసెంబర్ లో స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహించడం దాదాపు అసాధ్యమని ఎన్నికల వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే.. ఇతర రాష్ట్రాల నుంచి ఆగమేఘాల మీద బ్యాలెట్ బాక్సులు తెప్పించాల్సి ఉంటుంది. ఏపీ ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ టర్మ్ వచ్చే ఏప్రిల్ తో ముగియనుంది. అప్పటివరకు ఎన్నికలు జరగపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.