ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. కేంద్రమంత్రి ఏమన్నారంటే?
posted on Oct 6, 2020 @ 4:32PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ నుంచి, తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
దాదాపు రెండు గంటలపాటు సమావేశం జరిగింది. కృష్ణా జలాల వివాదంపై రాష్ట్రాలు గట్టిగా వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. నాలుగు అంశాలను ఏజెండాగా నిర్ణయించినప్పటికీ వాటికి అనుబంధంగా అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిబంధనలను పాటిస్తూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నామని ఏపీ స్పష్టం చేసింది. తాము వాడుకుంటున్నది మిగులు జలాలను మాత్రమేనని, ఇందులో తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఏపీ తన వాదనలు వినిపించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను తమకే అప్పగించాలని తెలంగాణ కోరింది. అయితే, ఆ ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకే అప్పగించాలని ఏపీ సూచించింది.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రెండు రాష్ర్టాలు లేవనెత్తిన అంశాలపై చర్చించినట్టు తెలిపిన ఆయన.. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై కొత్త నిర్మాణాలకు అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌లను సమర్పించాలని ఇరు రాష్ర్టాల సీఎంలను కోరామని షెకావత్ అన్నారు. డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇరు రాష్ర్టాల సీఎంలు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరిందన్న షెకావత్.. ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులు జరగాలని కేసీఆర్ కోరారని అన్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. విభజన చట్టం ప్రకారం అన్ని నిర్ణయాలు తీసుకుంటామని షెకావత్ అన్నారు.