గన్నవరంలో ఉద్రిక్తత.. వల్లభనేని వంశీ, దుట్టా వర్గీయుల మధ్య ఘర్షణ

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి స్థానిక వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వంశీ.. ఇప్పుడు వైసీపీ గూటికి రావడాన్ని దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో అప్పటినుంచి వైసీపీ నేతలు, వంశీ మధ్య వరుసగా వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు అటు వంశీ.. ఇటు దుట్టా, యార్లగడ్డ ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేని, ఇంచార్జ్ ని తానేనని వంశీ ప్రకటించుకోగా.. దుట్టా, యార్లగడ్డ వర్గాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అంతేకాదు, ఒకసారి వంశీ-యార్లగడ్డ వర్గీయుల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. తాజాగా మరోసారి గన్నవరం వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. వంశీ-దుట్టా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.   గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం కాకులపాడులో శనివారం నాడు రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వివాదం నెలకొంది. వల్లభనేని, దుట్టా ఎదుటే ఇరు వర్గీయులు బాహా బాహికి దిగారు. ఇరువర్గీయుల మధ్య మాటామాట పెరగడంతో అది కాస్త రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. దీంతో కాకులపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని సమాచారం. వరుస వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

పోలీసు అధికారుల పేరుతో ఫేస్ బుక్ లో మోసాలు.. ఒక మైనర్ తో సహా నలుగురి అరెస్ట్ 

గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొంత మంది పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లతో వారి ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న కొంత మంది స్నేహితులకు మెసేజ్ చేసి డబ్బులు పంపమని మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణాలో ఐపీఎస్ అధికారులైన ఏడీజీ స్వాతి లక్రా, నల్గొండ ఎస్పీ రంగనాథ్ పేరుతొ ఇటువంటి నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ల తో చేసిన మోసం కూడా కొద్ది రోజుల క్రితం బయటపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ పోలీసులు దీని పై దృష్టి పెట్టి ఇన్వెస్టిగేట్ చేయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దీనికి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నలుగురు సైబర్ నేరగాళ్ళను అరెస్ట్ చేసిన పోలీసులు వారు చెప్పిన వివరాలు తెలుసుకుని షాక్ కు గురయ్యారు. ఆ వివరాల ప్రకారం దేశంలోని తెలంగాణతో పాటు ఏపీ, కర్నాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 350 మంది పోలీస్ అధికారుల ఫేస్ బుక్ నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసినట్లుగా గుర్తించడం జరిగిందని పోలీసులు తెలిపారు.   ఈ నేరగాళ్లు పోలీస్ అధికారుల నకిలీ అకౌంట్లుతో పాటు పలు సైబర్ నేరాలకు పాల్పడినట్లుగా పోలీసులు కనుగొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ కేసులో మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ముస్తఖీమ్ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాం ఖాన్ లను అరెస్ట్ చేసినట్లు నల్గొండ ఎస్పీ రంగనాధ్ తెలిపారు. వీరిలో మనీష్ మైనర్ బాలుడని ఆయన తెలిపారు. వీరంతా సాధారణంగా స్థానికంగా రోడ్ల మీద వెళ్లే వారిని బెదిరించి డబ్బులు లూటీ చేయడంతో పాటుగా ఓఎల్‌ఎక్స్‌ లో ఆర్మీకి చెందిన వాహనాలు, ఇతర వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి బ్యాంక్ అకౌంట్లు, గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకోవడం లాంటి సైబర్ మోసాలకు పాల్పడే వారని తెలిపారు.   అయితే  లాక్ డౌన్ మొదలైన తరువాత రోడ్లపై వాహనాలు సరిగా నడవకపోవడంతో పాటు, ఓఎల్‌ఎక్స్ లో కొనుగోళ్లు జరిపే ప్రజలకు అవగాహన పెరగడం.. అలాగే ఓఎల్‌ఎక్స్ ద్వారా ప్రజల కొనుగోళ్లు తగ్గిపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా సులభంగా డబ్బు సంపాదించాలని అలోచించి మొబైల్ ఫోన్, లాప్ టాప్ ల ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారుల ఫేస్ బుక్ అకౌంట్లను టార్గెట్ చేసుకొని, వారి పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి, వారి ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడంతో పాటు కొందరిని మెసెంజర్ ద్వారా అత్యవసరం ఉందని మెసేజ్ పంపి ఫోన్ పే ద్వారా డబ్బులను పంపించమని మెసేజులు పంపి మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించారు.   ఈ నేరస్తులు ఉపయోగిస్తున్న పలు రాష్ట్రాలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులు వీరు తమ నేరాలకు వాడుతున్నారని, ఇతర వ్యక్తుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అపరిచిత వ్యక్తుల నుండి 3000 రూపాయలకు వాటిని కొనుగోలు చేసి ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ నేరస్తులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 81 మంది పోలీస్ అధికారుల పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు సృష్టించారని ఎస్పీ రంగనాధ్ తెలిపారు. ప్రస్తుత కరోనా సమయంలో వీరిని పట్టుకోవడానికి తాము చాలా శ్రమించాల్సి వచ్చిందని అయినప్పటికి ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తెలంగాణ పోలీసుల ప్రతిష్ట నిలిపే విధంగా సమర్ధవంతంగా వ్యవహరించి తమ బృందం రాజస్ధాన్ వరకు వెళ్లడం జరిగిందన్నారు.   మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలా ఫేస్ బుక్ అడ్డాగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను నల్లగొండ పోలీస్ బృందం పట్టుకుందని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. అయితే దీనిపై మరింత లోతైన విచారణ కొనసాగిస్తూ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ పోలీసులు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారన్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు చాలా అప్రమత్రంగా ఉండాలని, దీనిపై సరైన అవగాహన పెంచుకోవడం ద్వారా మోసపోకుండా జాగ్రత్త పడాలని అయన ప్రజలకు సూచించారు.

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మరో సంచలనం

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. నయీం కేసులో 25 మంది పోలీసులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) క్లీన్‌చిట్ ఇచ్చింది. నయీంతో సంబంధాలున్నట్లు 25 మంది పోలీసులు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ 25 మంది పోలీసులపై ల్యాండ్ సెటిల్‌మెంట్లు, బెదిరింపుల ఆరోపణలున్నాయి. అయితే, 25 మంది పోలీస్ అధికారులపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించని కారణంగా వారందరికీ సిట్ అధికారులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఈ మేరకు 25 పోలీసు అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌ రాసిన లేఖకు సిట్ చీఫ్ నాగిరెడ్డి శనివారం సమాధానమిచ్చారు.   కాగా, నయీం కేసులో సిట్ 175కి పైగా చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. ఇందులో 130కి పైగా కేసుల్లో పోలీసులతో పాటు 8మంది ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నట్టు పేర్కొంది. ఇందులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలతో పాటు ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. తాజాగా వీరందరికి సిట్ క్లీన్‌చిట్ ఇచ్చింది.    మరోవైపు నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌ గవర్నర్‌ కు లేఖ రాసింది. ఈ కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నయీం ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న వివరాలను ఇప్పటివరకు ఇవ్వలేదని, నాలుగేళ్లుగా కేసును సిట్ దర్యాప్తు చేస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నేరస్తులకు శిక్ష పడాలంటే ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌ కోరింది.

హత్రాస్ వెళ్లేందుకు రాహుల్‌, ప్రియాంకకు అనుమతి

హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎట్టకేలకు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీకి అనుమతి లభించింది. అయితే వీరితో పాటు మరో ముగ్గురికి మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు. హత్రాస్ లో 144 సెక్షన్ అమలులో ఉందని, అందుకే ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చామని పోలీసులు తెలిపారు.   ప్రస్తుతం రాహుల్‌, ప్రియాంక నొయిడా టోల్‌ ప్లాజా వద్దకు చేరుకున్నారు. ప్రియాంక వాహనాన్ని నడుపుతున్నారు. మరోవైపు రాహుల్, ప్రియాంక బయల్దేరిన నేపథ్యంలో వారి వెంట కార్యకర్తలు కూడా తరలివచ్చారు. అయితే కార్యకర్తలందర్నీ ఢిల్లీ టోల్‌ గేట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.    కాగా, మొన్న రాహుల్ గాంధీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున హత్రాస్ వెళ్లేందుకు ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. కానీ, 144 సెక్షన్ ఉండటంతో పోలీసులు అనుమతించలేదు. పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో రాహుల్ కింద కూడా పడ్డారు. దీంతో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్ మరోసారి హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు సిద్దమయ్యారు. అంతేకాదు, బాధితులను పరామర్శించి తీరుతామని, తమను ఏ శక్తి అడ్డుకోలేదని రాహుల్ ట్వీట్ చేసి మరీ బయలుదేరారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. రాహుల్, ప్రియాంకతో పాటుగా మరో ముగ్గురిని హత్రాస్ వెళ్లేందుకు పోలీసులు అనుమతించారని సమాచారం.   మరోవైపు, హత్రాస్ ఘటన వెలుగుచూసిన ఐదు రోజుల తర్వాత శనివారం అక్కడికి మీడియాను కూడా అనుమతించిన సంగతి తెలిసిందే.

నేనేంటో విజయసాయికి తెలియదు.. ఈ తప్పు ఎందుకు చేశానా అని బాధపడే స్థాయికి తీసుకెళ్తా

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను అక్రమ కట్టడమని ఆరోపిస్తూ జీవీఎంసీ అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది లీగల్‌ గా వెళ్లేంత పెద్ద అంశం కాదని, 24 గంటల్లో ఈ సమస్యను క్లోజ్ చేస్తానని చెప్పారు. తనకున్న ఆస్తులు పబ్లిక్ డొమైన్‌లో ఉంటాయన్న ఆయన.. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తానేంటో సీఎం జగన్‌కు తెలుసునని అన్నారు.    ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సబ్బం హరి నిప్పులు చెరిగారు. బహుషా విజయసాయికి తన గురించి ఇంకా తెలియదనుకుంటానని అన్నారు. విశాఖలో కూర్చొని విశాఖలో డ్యాన్స్ చేద్దామకుంటున్నారని.. ఆయన డ్యాన్స్ ని కట్టిస్తానని అన్నారు. తన గురించి తెలియక ఏదో చేద్దామనుకుంటున్నారని.. ఇలాంటి తప్పు ఎందుకు చేశానా? అని బాధ పడే స్థాయికి తీసుకెళ్తానని సబ్బం హరి అన్నారు.   మరోవైపు, సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చివేయడంపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. "తెలుగుదేశం నేత సబ్బం హరిగారి ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏమిటీ సైకోయిజం?" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.     "ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యులు ఎంత ప్రమాదకర పాలనలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఈ కక్షపూరిత రాజకీయాలు చేసేది అసమర్థులు తప్ప సమర్థులు కాదు" అని చంద్రబాబు విమర్శించారు.  

భారత్ లో ఇప్పటికే లక్ష మందిని బలి తీసుకున్న కరోనా..

భారత్ లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటలలో కొత్తగా 79,476 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 64,73,545 కి చేరింది. ఇదే సమయంలో నిన్న కరోనాతో పోరాడి 1069 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,00,846కి చేరింది. ప్రస్తుతం మన దేశంలో మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది.. 2.97 శాతంగా ఉంది. ఇది ఇలా ఉండగా భారత్ లో నిన్న 75,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 54,27,706కి చేరింది. దీంతో మన దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 83.8 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 9,44,996 ఉన్నాయి.   ప్రస్తుతం ప్రపంచం మొత్తం నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అంతేకాకుండా మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాటి స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి.

సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేసిన జీవీఎంసీ అధికారులు.. ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి

విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వద్ద ఈ తెల్లవారుజామున ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీని, ఆనుకుని ఉన్న టాయిలెట్ రూమ్స్ ను ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే జీవీఎంసీ అధికారులు జేసీబీలతో కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. అయితే ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులుపై మండిపడ్డారు. ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు అధికారులు నిరాకరించడంతో సబ్బం హరి నిరసనకు దిగారు.

చంద్రబాబును బండబూతులు తిట్టిన మరో మంత్రి.. బాబంటే భయమా లేక... 

టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసిపి నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం సహజమే. అయితే ఒకరిద్దరు మంత్రులు మాత్రం అభ్యంతరకర భాషను ఉపయోగించడం కూడా చూసాం. అయితే తాజాగా సౌమ్యుడిగా పేరు ఉన్న ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ సభ్యత మరచి చంద్రబాబు పై నోరు పారేసుకున్నారు. మంత్రి హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన ఒక బహిరంగ సభలో, మైకు పట్టుకుని మరీ పచ్చి బూతు మాట్లాడారు. అంతేకాకుండా "రాసుకోండి! మరేం పర్లేదు" అంటూ అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులకు సలహా కూడా ఇచ్చారు.   తాజాగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పరిధిలోని దేశవానిపేటలో సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేస్తూ.. పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘అమరావతి రైతులను రెచ్చగొట్టి, ఉద్యమం నడపడానికి పెయిడ్‌ వర్కర్స్‌ను పెడుతున్నారు. మంచి టీ షర్టు, దాని మీద టర్కీ టవల్‌ వేసుకుని మరీ రైతులకు అన్యాయం చేస్తున్నాడంటాడు ----కొడుకు’’ అని ఒక బూతు మాట ప్రయోగించారు. అంతేకాకుండా మీడియా వారిని చూసి నవ్వుతూ... "రాసుకోండి. నా మాటలు మొత్తం రాసుకోండి ఫర్వాలేదు. ఎంత నిగ్రహించుకున్నా ఆ మాటలు వచ్చేస్తున్నాయ్‌’’ అని అన్నారు. "అమరావతిలోనే రాజధాని ఉండాలి. విశాఖలో వద్దు" అనే అజెండాతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రలో పోటీకి రావాలని, తాను కూడా పదవికి రాజీనామా చేసి అయన పై బరిలోకి దిగుతానని కృష్ణ దాస్ సవాల్‌ విసిరారు. ఇంతకూ మంత్రి గారి తాజా ప్రేలాపనలు, వచ్చే ఎన్నికలలో బాబుని ఫేస్ చేయాలంటే భయంతో చేసినవా.. లేక రెండున్నర ఏళ్ల తరువాత సీఎం జగన్ చేసే సమీక్షలో.. ఉంటుందో ఊడుతుందో తెలియని మంత్రి పదవి గురించో అని రాజకీయ విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్ మామగారైన డాక్టర్ గంగిరెడ్డి మృతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జగన్ మామగారు, ఆయన భార్య భారతి తండ్రి అయిన ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయన శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. పేదల వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న గంగిరెడ్డి 2001-2005 మధ్య పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. హైదరాబాద్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం పులివెందులకు తీసుకురానున్నారు. ఇప్పటికే సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి తాడేపల్లి నుంచి పులివెందులకు బయలుదేరారు. సీఎం జగన్ ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరనున్నారు. 

పాలిటిక్స్ కు రాజ్ భవన్ అడ్డా కాదు.. గవర్నర్ తమిళిసై ఆగ్రహం 

తెలంగాణ రాజ్ భవన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దీ రోజులుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ ను తాము అపాయింట్ మెంట్ కోరగా.. ఆమె అపాయింట్ మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందిస్తూ రాజకీయాలు చేయడానికి రాజ్ భవన్ అడ్డా కాదని తీవ్రంగా వ్యాఖ్యానించారు.   కరోనా కారణంగా తాను ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. గత నాలుగు నెలలుగా రాజ్ భవన్ ఇదే విధానాన్నిఅవలంబిస్తోందని ఆమె తెలిపారు. రాజ్ భవన్ ఎపుడూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని ఆమె అన్నారు. అంతేకాకుండా రాజ్ భవన్ తలుపులు అందరి కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికలలో వైసీపీకి వచ్చేది 5 సీట్లేనట.. టీడీపీ నేత లాజిక్ అదిరింది..

ఏపీలో గత ఎన్నికలలో టీడీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి షాక్ ఇస్తున్నారు. ముందుగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ కు జై కొట్టగా ఆ తరువాత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. సీఎం జగన్ చెంతకు చేరిన ఈ ఎమ్మెల్యేలంతా డైరెక్టుగా వైసీపీ కండువా కప్పుకోకుండా బయటి నుంచి ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వీరిలో కొంత మంది తమ వారసులకు సీఎం జగన్ తో వైసిపి కండువా కప్పించి ఆ పార్టీలోకి పంపి తమ పైన అనర్హత వేటు పడకుండా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. తాజాగా మరో మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా తన కుమారుడిని వైసీపీ గూటికి చేర్చడం ద్వారా అయన కూడా సీఎం జగన్ కు జై కొట్టేందుకు సిద్ధమయ్యారు.   ఈ నేపథ్యంలో ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం ఐదు సీట్లే వస్తాయని అయన తన తాజా ట్వీట్ లో జోస్యం చెప్పారు. అంతేకాకుండా దీని వెనుక ఉన్న లాజిక్ ను కూడా అయన వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఐతే దీని వల్లే.. దేవుడి స్క్రిప్ట్ ప్రకారం.. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లే వచ్చాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు మార్లు ఎద్దేవా చేసిన సంగతి గుర్తు చేస్తూ బుద్దా వెంకన్నకూడా ఇప్పుడు ఇదే లాజిక్‌ను వైసీపీకి అప్లై చేస్తూ కామెంట్స్ చేసారు.   తాజాగా టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను వైసీపీ లాగేసుకుందని.. ఈ నేపథ్యంలో వైసీపీ లాజిక్ ప్రకారం చుస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఐదు సీట్లే వస్తాయని వెంకన్న ట్వీట్ చేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలను కొన్నామని విజయసాయిరెడ్డి చెబుతున్నారని.. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే కరోనా ప్రభావంతో మైండ్ దెబ్బతిన్నట్లుగా అనిపిస్తోందని వెంకన్న ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాతే, వైసీపీలోకి రావాలని గతంలో విజయసాయిరెడ్డి అన్నారని.. మరి రాజీనామా చెయ్యకుండానే వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలను ఎంత పెట్టి కొన్నారో చెప్పాలని బుద్ధా వెంకన్నడిమాండ్ చేశారు.

ఆన్ లైన్ తో ఆస్తి తగాదాలు.. కుటుంబాల్లో చిచ్చు! ధరణికో దండం?

ప్రజల ఆస్తుల వివరాల నమోదు కార్యక్రమం చేపట్టింది తెలంగాణ సర్కార్.  ఈ నెల 5వ తేదీకి వివరాల సేకరణ, ఆన్​లైన్​ అప్​లోడ్​ పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్, పంచాయతీ డిపార్ట్​మెంట్ల స్టాఫ్.. క్షేత్రస్థాయిలో పర్యటించి ఆస్తులు, ఆధార్, ఫోన్​నంబర్, ఇతర వివరాలను సేకరిస్తున్నారు. ఈ డేటా అంతటినీ సర్కారు రూపొందించిన యాప్ లో అప్​లోడ్​ చేస్తున్నారు. అయితే ఫీల్డ్ లో అధికారులకు  కొత్త సమస్యలు వస్తున్నాయి. ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియతో ఉమ్మడి కుటుంబాల్లో  తగాదాలు వస్తున్నాయి. ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు సోదరులు ఉంటే ఒకరికి తెలియకుండా మరొకరు తమ పేరున ఆస్తుల వివరాలు నమోదు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ఆస్తిపై తమకే హక్కు ఉందని, తమ పేరుతోనే నమోదు చేయాలని గొడవలు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఆస్తుల కోసం అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కొట్టుకునే పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. నమోదు చేసిన ఆస్తుల వివరాలపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పీలు చేసుకునే చాన్స్ లేకపోవడంతో ఈ సమస్య వస్తుందంటున్నారు సీనియర్ అధికారులు.     నాన్ అగ్రికల్చర్ ఆస్తుల లెక్కింపు కోసం వెళ్తే.. ఊర్లలో ఎవరూ అందుబాటులో ఉండట్లేదు. అంతా వ్యవసాయ పనులకు పోతున్నరు. ఇండ్లకు వెళితే దొంగల్లా చూస్తున్నరు. 15, 20 ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నరు, ఆసరా పెన్షన్లు ఆపుతరా, ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తరా అని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారని అధికారులు చెబుతున్నారు. సెల్​ సిగ్నల్​ సరిగా లేక, ఇంటర్నెట్​ సరిగా రాక, సర్వర్​ బిజీ రావడం వంటి వాటితో ఆన్​లైన్​లో వివరాల నమోదు కష్టమవుతోందని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల హడావుడితో రోజుకు 70 ఇండ్ల వివరాలు సేకరించాలని మున్సిపల్, పంచాయతీ స్టాఫ్​ కు ఉన్నతాధికారులు టార్గెట్ పెట్టారు. స్టాఫ్​ టైం తక్కువగా ఉండటంతో పూర్తి సమాచారాన్ని నమోదు చేయలేకపోతున్నారు. పనిపూర్తి చేయాలనే తొందరతో కొందరు తప్పుడు సమాచారాన్ని అప్ లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.   పంచాయతీలలో ఆన్​లైన్ చేసేందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని ప్రభుత్వం చెప్పింది. కానిఫీల్డ్ లో అంతా రివర్స నడుస్తోంది. ఆస్తుల ఆన్​లైన్​ కార్యక్రమం కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది. గుడిసెలు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఆన్​లైన్​లోకి ఎక్కించాలంటే పైసలు ఇవ్వాలంటూ డబ్బు వసూలు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని పూడూరులో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అనధికారిక గుడిసెను ఆన్​లైన్​చేయడానికి ఆఫీసర్లు రూ. 2,300 వసూలు చేశారు. గుడిసెకు ఇంటి పన్ను కట్టినట్లు రూ. 300కు రసీదు ఇచ్చారు. రెండు వేల రూపాయలకు ఎలాంటి రసీదు ఇవ్వకుండా డబ్బులు తీసుకొని ఇంటికి పంపారు. ఇలా గ్రామంలో దాదాపు 80 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి రూ.  రెండు వేల నుంచి మూడు వేల వరకు వసూలు చేశారు. రాష్ట్రమంతా ఇలాంటి పరిస్థితే ఉందన్న చర్చ జరుగుతోంది. సర్కార్ అనాలోచిత, హడావుడి నిర్ణయాల వల్లే ప్రజలు నష్టపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.   ప్రజల ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ అంత ఈజీ కాదని.. దసరాలోపు వివరాలను అప్​లోడ్​ చేయడం కష్టమేనని ఆఫీసర్లు అంటున్నారు. రోజుకు 60, 70 ఇండ్ల డేటా ఎట్లా తీసుకోగలమని, హడావుడిగా వివరాల నమోదు వల్ల కొత్త సమస్యలు వస్తాయని అంటున్నారు. ఉన్నతాధికారులు మధ్యాహ్నం కల్లా వివరాలు అందచేయాలని ఫోన్లు చేస్తున్నరు. ఊర్లలో సెల్ సిగ్నల్ ఉండటం లేదు. యాప్ సర్వర్ బిజీ అని వస్తోంది. ఓపెన్ కావడం లేదు. రోజుకు 70 ఇండ్ల ఆస్తులు లెక్కకట్టాలంటే అసాధ్యం. ఇన్ని ఇబ్బందులు ఉంటే ఎలా చేస్తారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే తీరును చూస్తుంటే.. దసరా పండుగ రోజున ప్రారంభించే ధరణి పోర్టల్ పాక్షిక సమాచారంతోనే అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది.   మరోవైపు ధరణి పోర్టల్​లో ఎక్కని భూములన్నీ మిగులు భూముల కిందే లెక్క అన్న మంత్రి గంగుల కమలాకర్ కామెంట్లు కలకలం రేపుతున్నాయి. పోర్టల్​లో ఒక్కసారి ఆస్తులు నమోదై లాక్  అయితే ఎవ్వరేం చేయలేరన్న మంత్రి.. నిర్బంధంగా ప్రజల ఇళ్ల స్థలాలు, సాగు భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆస్తుల డేటా ఎంట్రీలో తప్పులు వస్తే ఆఫీసర్లదే బాధ్యత అని హెచ్చరించారు. గంగుల వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామాల్లో చాలా ఇండ్లకు ఎలాంటి డాక్యుమెంట్లు ఉండవు. కొందరు కాగితాలు గత్రా లేకుండా ఇతరుల ఇండ్లు కొంటుంటారు. ఇప్పుడు వారంతా ఆందోళనకు గురవుతున్నారు. తమ ఇండ్లకు ఇప్పుడు డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం ఉంటున్న ఇల్లు తమది కాకుండా పోతుందా అన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది.   మొత్తానికి అనాలోచితంగా,హడావుడిగా సీఎం కేసీఆర్ తీసుకున్న ఆస్తుల ఆన్ లైన్ నిర్ణయం అయోమయంగా మారింది. ఆస్తుల సేకరణలో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత కాలం ఉమ్మడిగా ఉన్న కుటుంబాలు.. కేసీఆర్ నిర్ణయం వల్ల గొడవలు పడి రోడ్డున పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.  ప్రభుత్వం హడావుడి చేయకుండా.. నమోదు చేసిన ఆస్తుల వివరాలపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పీలు చేసుకునే చాన్స్ ఇవ్వాలని సీనియర్ అధికారులు సూచిస్తున్నారు.

ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్.. మరో నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయన భార్య మెలానియా ట్రంప్‌ కు తాజాగా కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాము హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నామని ట్రంప్ ట్వీట్ చేశారు.    ట్రంప్ ప్రధాన సలహాదారు హోప్ హిక్స్ ‌కు కరోనా పాజిటివ్ వచ్చిన కొన్ని గంటల్లోనే.. అధ్యక్ష దంపతులకు కూడా కరోనా నిర్ధారణ అయింది. అధ్యక్షుడు ట్రంప్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటే హోప్ హిక్స్ ఉంటారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్‌తో పాటు తరచుగా ఆమె ప్రయాణాలు చేస్తుంటారు. హోప్ హిక్స్ ‌తో కలిసి ఇటీవలే ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె నుంచే ట్రంప్‌కు వైరస్ సంక్రమించి ఉంటుందని వైట్ హౌస్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేశారు.    అమెరికా ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న ప్రస్తుత సమయంలో ట్రంప్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండి మాస్క్ ధరించడానికి నిరాకరిస్తున్న ట్రంప్ కు కరోనా సోకడం పై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

హైకోర్టు తీర్పులపై వైసీపీ నేత సెన్సేషనల్ కామెంట్స్...

ఏపీలోని జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల పై ఇటు హైకోర్టు.. అటు సుప్రీం కోర్టు వరుసగా అక్షింతలు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ హైకోర్టు తీరును తప్పుబట్టారు. పరిపాలన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం మంచిది కాదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు వాటి పరిధిలో అవి పని చేసుకుంటే మంచిదన్నారు. గత కొద్ది రోజులుగా హైకోర్టు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బాదేస్తోందన్నారు. రోజువారీ జరిగే పరిపాలన వ్యవహారాలలో కోర్టులు జోక్యం చేసుకుంటే ఇక ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత అంశాల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని, అయితే రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు తెలుసునని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ సందర్భంగా అన్నారు.

విజయవాడలో పోలీసు కస్టడీలో ఉన్న దళిత యువకుడి మృతి..

విజయవాడలో పోలీసు కస్టడీలో ఉన్న ఒక దళిత యువకుడి మృతి తీవ్ర కలకలం రేపుతోంది. మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) గత నెల 17న విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో ఆర్టీసీ కార్గో వాహనంలో తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. చేపలకు ఆహారంగా ఉపయోగించే ఫీడ్ మధ్య‌లో మద్యం సీసాలను పెట్టి గుప్తా అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వీటిని విజయవాడకు పార్సిల్ చేసినట్టు ఎస్ఈబీ పోలీసులు గుర్తించారు. దీనిపై విజయవాడ పటమట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.   దీనికి సంబంధించి కృష్ణలంక పెద్దవారి వీధికి చెందిన కారు డ్రైవర్ అయిన డి.అజయ్ (26) మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తున్నట్టు గుర్తించారు. అజయ్‌ తల్లి నాగమల్లేశ్వరమ్మతో కలిసి నివసిస్తున్నాడు. తల్లి సమీపాన ఉన్న చర్చిలో వాచ్‌మన్‌గా పనిచేస్తోంది. ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న అజయ్‌, మొగల్రాజపురానికి చెందిన అతడి స్నేహితుడు సాయికిరణ్‌లను నిన్న మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో వారిని ఎస్‌ఈబీ కార్యాలయం నుంచి  పటమట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తనకు ఛాతీలో నొప్పిగా ఉందని, ఊపిరి ఆడడం లేదని, ఒళ్లు చల్లబడుతోందని అజయ్ పోలీసులకు చెప్పాడు. దీంతో వెంటనే అతడిని దగ్గరలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలు పెట్టడంతో అతడు చనిపోయాడని అజయ్ బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. అజయ్ మృతికి నిరసనగా దళిత సంఘాల నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అయితే ఇది లాక్‌పడెత్‌ కాదని, అనారోగ్య కారణాలతో అజయ్‌ చనిపోయాడని పోలీసులు చెపుతున్నారు. అతడిని ప్రశ్నిస్తుండగా చెమటలు పట్టి ఫిట్స్‌ వచ్చాయని, ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడని చెబుతున్నారు. అజయ్‌ అనారోగ్యంతో చనిపోయాడని, ఒకవేళ పోలీసులు కొట్టడం వల్లే చనిపోతే పోస్టుమార్టం రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. తనకు ఉన్న ఒక్క ఆధారమైన కొడుకు చనిపోవడంతో అజయ్‌ తల్లి తల్లడిల్లుతోంది.

దుబ్బాకలో టీజేఎస్.. మండలికి కాంగ్రెస్! కొత్త ఫార్మూలా? 

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ లో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై పీసీసీ నేతలు తీవ్రంగా మంతనాలు సాగిస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ పోటీ చేస్తుండటంతో అక్కడ ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ లో భిన్న వాదనలు వస్తున్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో ఉంది టీజేఎస్. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేశారు కోదండరామ్. ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్ సర్కార్ పై పోరాడుతున్నారు. మండలి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన కోదండరామ్.. తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరారు. దీంతో కోదండకు మద్దతుపై కాంగ్రెస్ లో క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది.    కోదండరామ్‌కు మద్దతు ఇచ్చే విషయంపై పార్టీ పెద్దలు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఆశావహులంతా ఆయనకు మద్దతు ఇవ్వకుండా సొంతంగా పోటీ చేయాలని టీపీసీసీ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి తరఫున పోటీ చేసిన తెలంగాణ జనసమితి కనీస ప్రభావాన్ని చూపలేకపోయిందనీ.. పోటీచేసిన అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారట. అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారట. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌కు ఇదే విషయాన్ని స్పష్టం చేశారట. దుబ్బాక ఉపఎన్నికల్లో టీజేఎస్‌కు మద్దతు ఇచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ సహాయం కోరాలని మరికొందరు ప్రతిపాదించినట్లు సమాచారం.  దీంతో కోదందరామ్‌కు మద్దతు ఇచ్చే విషయంపై సబ్‌కమిటీని ఏర్పాటుచేసి ఆ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.    మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌లో పోటీదారుల సంఖ్య భారీగా ఉంది.మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి స్థానానికి 29 మంది, నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి 25మంది అశావహులు దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీమంత్రి జీవన్ రెడ్డి గెలవడంతో గ్రాడ్యుయేట్ స్థానాల్లో పోటీకి నేతలు ఆసక్తి చూపుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. యువత, ఉద్యోగులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉండటంతో కష్టపడితే ఈజీ గెలవొచ్చన్న అభిప్రాయంతో ఉన్నారు. సొంతంగానే పోటీచేయాలని డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తుండటంతో పీసీసీ పెద్దలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.     మరోవైపు సబ్ కమిటీ పేరుతో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌కు షాక్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవసరమైతే కోదండరామ్‌నే కాంగ్రెస్ పక్షాన పోటీకి ఒప్పించాలని, అందుకు అంగీకరించని పక్షంలో స్వతహాగా పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఫైనల్‌ చేయాలని టీపీసీసీ పెద్దలు నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బాబు..బహు జాగు బాసూ!

అధినేత సాగతీతే అసలు సమస్య   తెలంగాణలో మాయమవుతున్న తెలుగుదేశం   రమణపై తమ్ముళ్ల తిరుగుబాటు   తొలగించకపోతే ఆఫీసులో ధర్నాకు సిద్ధం                  తెలంగాణ లో పుట్టిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా మాయం కానుందా? అగ్రనేతలు నిష్క్రమించగా.. మిగిలిన నాయకులు, కార్యకర్తలను కూడా కాపాడుకునే సత్తా పార్టీ అధినేత చంద్రబాబులో పోయిందా? అధ్యక్షుడు రమణను మార్చాలని ఏళ్ల నుంచి వినిపిస్తున్న డిమాండును పట్టించుకోని, బాబు సాగతీత- నాన్చుడు ధోరణే అసలు సమస్యనా? రమణను తొలగించకపోతే, తెలంగాణ తమ్ముళ్లు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారా? ఆఫీసులోని అన్న విగ్రహం వద్దనే ధర్నాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా?.. తాజాగా జరుగుతున్న పరిణామాలు దీనికి అవుననే సమాధానమిస్తున్నాయి.   తత్వం బోధపడినా అనుభవం కాని చంద్రబాబు నాన్చుడు వైఖరి, ఇప్పటికే  తెలంగాణలో టీడీపీ కొంప ముంచగా.. అది మరింత ముదురిన ఫలితంగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో కొంపకొల్లేరయ్యే ప్రమాదం తలెత్తింది. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అసమర్థ నాయకత్వానికి, దన్నుగా నిలిచిన చంద్రబాబు అందుకు త్వరలో మూల్యం చెల్లించుకోనున్నారు. రమణను మార్చాలని తెలంగాణ తమ్ముళ్లు ఎన్నిసార్లు కోరినా బాబు,  ‘చూద్దాం.. మాహాడతాం’ అనే పడికట్టు పదాలు తప్ప, అంతర్గత  సమస్యపై దృష్టి సారించిన దాఖలాలు లేవు.   ఉమ్మడి రాష్ట్రం విడిపోయి, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ ఇప్పటివరకూ రమణ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన హయాంలో జరిగిన ఏ ఒక్క ఎన్నికలోనూ పార్టీ బతికి బట్టకట్టింది లేదు. రమణ నియంతృత్వ వైఖరి వల్లే.. గతంలో గ్రేటర్ హైదరాబాద్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిందన్న విమర్శలున్నాయి. రమణ ఒంటెత్తు పోకడల వల్ల.. అప్పట్లో ఎంపీగా ఉన్న గరికపాటి మోహన్‌రావు సహా, సీనియర్లంతా పార్టీని వీడారన్న ఆరోపణలూ లేకపోలేదు. గత గ్రేటర్ ఎన్నికలతోపాటు, అసెంబ్లీ ఎన్నికల టికెట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా మూటకట్టుకున్నారు. ఇన్ని వైఫల్యాలు మూటగట్టుకున్నా.. రమణను మార్చకపోవడం చంద్రబాబు లోపమేనని, ఆయన నిరాసక్తత- సాగతీతే పార్టీకి అసలు సమస్య అని సీనియర్లు కుండబద్దలు కొడుతున్నారు. రమణను ఎందుకు కొనసాగిస్తున్నారో, ఆయనపై బాబుకు ఎందుకంత అభిమానమో అర్ధం కావడం లేదంటున్నారు.   కాగా, ఈనెల 27న టీడీపీ ఏపీ-తెలంగాణ-జాతీయ కమిటీలు ప్రకటిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానికి ముందే, తెలంగాణ రాష్ట్ర -జిల్లా నాయకులు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. రమణను మార్చాలని రాష్ట్ర కమిటీలో ముగ్గురు మినహా, మిగిలిన నేతలంతా బాబుకు లేఖాస్త్రం సంధించడం సంచలనం సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితం పార్టీ ఆఫీసులోనే భేటీ అయిన, పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు..  రమణను మార్చాలని, ఆయన తమకు పోటీగా జిల్లాల్లో నేతలను ప్రోత్సహిస్తున్నారని, కోర్ కమిటీలో అనామకులకు స్థానం కల్పిస్తున్నారని బాబుకు లేఖ రాయాలని నిర్ణయించారు. తెలుగుమహిళా అధ్యక్షురాలు జోత్స్నను కోర్ కమిటీ మీటింగుకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.   అయితే, ఆ సమావేశం వివరాలు తెలుసుకున్న రమణ, హటాత్తుగా అక్కడికి వెళ్లారట. నా అనుమతి లేకుండా ఇక్కడ మీటింగు ఎలా పెడతారని గుడ్లు ఉరిమారట. ఇష్టం ఉన్న వాళ్లు ఉండండి. లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోండని గద్దించారట. ఆ తర్వాత మరోమారు భేటీ అయిన తమ్ముళ్లు, రమణను మార్చకపోతే పార్టీ ఆఫీసులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. బాబుకు ఆరకంగా లేఖాస్త్రం సంధించిన వారిలో, 14 మంది జిల్లా పార్టీ అధ్యక్షులున్నట్లు సమాచారం. కాగా పార్టీ ఆఫీసులో ముగ్గురు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి.   కాగా త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో.. సీపీఐ-సీపీఎం సహా ఇతర పార్టీలతో పొత్తు కోసం, రమణ చేస్తున్న ప్రయత్నాలపై హైదరాబాద్ నేతలు విరుచుకుపడతున్నారు. గతంలో కూడా రమణ అసమర్ధ నాయకత్వం వల్లనే హైదరాబాద్‌లో పార్టీ ఓడిందని, ఇప్పుడు మళ్లీ పొత్తుల పేరుతో ఆయన పార్టీని ముంచే ప్రయత్నాలు చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. అసలు హైదరాబాద్ పార్టీ వ్యవహారాల్లో, రమణ జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.   ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, దానిని వెంటనే పరిష్కరించకుండా.. అది విపత్తుగా మారేంతవరకూ, నాన్చుడు ధోరణి ప్రదర్శించే చంద్రబాబు వైఫల్యమే, ఈ దుస్థితికి కారణమని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ‘రమణ స్థానంలో సారు దగ్గర ఉండే మాణిక్యాన్ని పెట్టినా బాగా నడుపుతారన్న’ వ్యంగ్యోక్తులు, పార్టీ ఆఫీసులో బహిరంగంగానే వినిపిస్తుంటాయి. పార్టీ నేతలకే తెలిసిన ఈ సత్యం, ఇప్పటిదాకా  బాబుకు తెలియకపోవడమే ఆశ్చర్యమంటున్నారు. పార్టీ అధినేతగా బాబు ఎవరికీ భరోసా ఇవ్వలేకపోతున్నారని, అందుకే అగ్రనేతలంతా ఎవరి దారి వారు చూసుకున్నారని ఓ సీనియర్‌నేత వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు భయపడి, తెలంగాణలో పార్టీని విడిచిపెట్టారన్న చర్చకు, బాబు ఇప్పటివరకూ తన పనితీరు ద్వారా తెరదించలేకపోయారు. అయినప్పటికీ,  ఉన్నంతలో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు కూడా.. బాబు చేస్తున్న జాగుకు విసిగి, పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని చేదు అనుభవాలెదురవుతున్నా, బాబు ఇంకా అదే నాన్చుడు ప్రపంచంలో జీవించడం ఏమిటో? -మార్తి సుబ్రహ్మణ్యం

జగన్ ప్రభుత్వానికి హైకోర్టు స్ట్రాంగ్ కౌంటర్.. నమ్మకం లేకపోతే కోర్టునే మూసేయండి

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హైకోర్టును అపకీర్తి పాలు చేసేలా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అభ్యంతరకర పోస్టులపై తాజాగా జగన్ సర్కార్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసినా వారిపై ఎటువంటి చర్యలు లేవంటూ హైకోర్టులో అప్పటి రిజస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన వ్యాజ్యం నిన్న విచారణకు రాగా ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అసలు కుట్రలో భాగంగానే హైకోర్టుపై సోషల్‌ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనుమానం వ్యక్తం చేసింది. ఇతరుల ప్రభావం లేకుండా ఎవరూ న్యాయమూర్తులను దూషించరని... దీని వెనుక ఉన్న కుట్రను తప్పకుండా తేల్చుతామని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని సహించబోమని హెచ్చరించింది.   న్యాయవ్యవస్థపై నమ్మకం లేనివారు పార్లమెంటుకు వెళ్లి హైకోర్టును మూసేయాలని కోరడం మంచిదని ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు... రాష్ట్రంలో చట్టబద్ధ పాలన (రూల్‌ ఆఫ్‌ లా) అనేది ఉందా? అని నిలదీసింది. "రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా సరిగా అమలు కావడంలేదు. చట్టబద్ధ పాలన జరగకపోతే... మేమే ఇతర నిబంధనల ప్రకారం అధికారాన్ని ఉపయోగిస్తాం" అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. న్యాయమూర్తులనే అవమానపరుస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తారా.. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "‘ప్రజాస్వామ్యం మూడు స్తంభాలపై ఆధారపడి ఉంది. న్యాయం అనే స్తంభం బలహీనమైతే అది అంతర్యుద్ధానికి (సివిల్‌ వార్‌) దారి తీస్తుంది" అని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. "న్యాయ వ్యవస్థపై నమ్మకం లేని రోజున ప్రతి ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. వ్యవస్థను రక్షించాల్సిన అవసరం అందరిపైనా ఉంది" అని తెలిపింది. ఇదే సందర్భంలో "మీది ధనిక రాష్ట్రం కదా! సుప్రీంకోర్టుకు వెళ్లి... సీనియర్‌ లాయర్లను నియమించుకోవచ్చు" అని నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేసింది.   న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా హైకోర్టే పిటిషన్‌ దాఖలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి అభ్యంతరకర పోస్ట్‌లను అనుమతించరాదని సోషల్ మీడియా సంస్థలకు సూచించింది. కోర్టుల పై అభ్యంతరకర కామెంట్ల పై తగిన చర్యలు తీసుకోవాలని, పోస్టింగులకు సంబంధించి సామాజిక మాధ్యమ సంస్థలు స్వీయ క్రమబద్ధీకరణ పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యర్థించారు. సామాజిక మాధ్యమాల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సజన్‌ పూవయ్య, ముకుల్‌ రోహత్గీ తదితరులు హాజరై.. ఆయా సోషల్ మీడియా సంస్థల తరఫున కౌంటర్లు దాఖలు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను పెంపొందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని సాల్వే, సజన్‌ పూవయ్య కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ కేసులకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ను పరిశీలించేందుకు తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ

ఇదో బీజేపీ-వైసీపీ ఫ్రెండ్లీ ఫైట్   నానిపై వేటేసి కమలాన్ని విరబూయిస్తారా?   టీడీపీ స్థానం ఆక్రమించే వ్యూహమేనా?   భాజపాకు దారిస్తున్న వైకాపా సర్కార్? ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య పొత్తులుంటాయి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో పీటముడి పడుతుంది. దానితో రెండు పార్టీలూ అభ్యర్ధులను బరిలోకి దించుతాయి. మిగిలిన చోటంతా కలసి పనిచేస్తే, అక్కడ మాత్రం విడిగా పోరాడుతుంటాయి. అంటే కలి‘విడి’ కదనమన్నమాట! ఇదేం విచిత్రమని అడిగితే,  అది ‘ఫ్రెండ్లీఫైట్’ అని నిర్వచిస్తారు. ఇది ఎన్నికల సమయంలో ఎప్పుడూ చూసే చిత్రమే. వామపక్షాలది మరో గమ్మత్తు. ఎన్నికల్లో తమది అవగాహనే తప్ప, పొత్తులు కావని సూత్రీక రిస్తుంటారు. అదో విచిత్రం!  ఇంచుమించు అలాంటి చిత్ర విచిత్రాలే, ఏపీ రాజకీయాల్లో వైకాపా-భాజపా మధ్య కనిపిస్తున్నాయి. ఢిల్లీలో అపూర్వ సహోదరుల్లా కలసిమెలసి ఉన్న ఈ రెండు పార్టీలూ, ఏపీ గల్లీలో మాత్రం కొట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. పార్లమెంటులో కవలల మాదిరిగా కలసి ఉన్న ఆ రెండు పార్టీలూ, గల్లీలో మాత్రం కీచులాడుకుంటున్నాయి. ఇదోరకం ఫ్రెండ్లీఫైటా? లేక వామపక్షాల మాటల ప్రకారం అవగాహనా రాజకీయమా? అన్నదే ప్రశ్న.   నువ్వు నన్ను కొట్టినట్లు నటించు-నేను ఏడ్చినట్లు నటిస్తానన్నట్లుంది.. ఏపీలో వైకాపా-భాజపా, సమర-సరస రాజకీయం. ఇటీవలి కాలంలో హిందూ ఆలయాల కేంద్రంగా జరుగుతున్న పరిణామాలతో.. ఉనికి చాటుకోవాలని తాపత్రయపడుతున్న కమలదళాలకు, జగనన్న సర్కారు ‘తెరవెనుక ప్రోత్సాహం’ ఇతోధికంగానే కనిపిస్తోంది. అంటే.. బీజేపీ నేతల గృహనిర్బంధాలు, అరెస్టులు, బీజేపీ నేతలపై ఎదురుదాడి వంటి కార్యక్రమాలతో, వైసీపీ సర్కారు చేతనయింత మేరకు బీజేపీని క్రేన్లతో పైకి లాగే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తూనే ఉంది. అంటే బీజేపీకి దారి సుగమం చేసినట్టయితే, ఆ దారిలో ఇప్పటికే నిలబడి ఉన్న తెలుగుదేశం రథాన్ని, వెనుకనెట్టివేయవచ్చని ఇరు పార్టీల అవగాహన కావచ్చు. నిజానికి కమలనాధుల ఆశ కూడా అదే. ముందు టీడీపీని నిర్వీర్యం చేసి, ఆ స్థానంలో తాను జెండా ఎగురవేయాలి.  ఆ తర్వాత ఎలాగూ జగనన్న కేసుల జుట్టు, తమ చేతిలోనే ఉంది కాబట్టి ఆయన సంగతి, ఎన్నికలప్పుడు చూడవచ్చన్నది కమలదళాల కల- కోరిక!  ఏపీ రాజకీ యాలు- బీజేపీ నేతల ప్రకటనలు చూసిన, మెడమీద తల ఉన్న ఎవరికయినా కలిగే అభిప్రాయమే ఇది.   తాజాగా ‘తెలుగుభాష-సాంస్కృతిక శాఖ’ మంత్రి కొడాలి నాని చేసిన ప్రకటనను, సాధారణ దృష్టితో చూడలేము. ఆయన ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శలు గురిపెట్టారు. ‘‘జగన్ భార్యతో సహా బ్రహోత్సవాలకు రావాలంటున్న బీజేపీ వాళ్లు, ముందు మోదీని వెళ్లి ఓసారి సతీసమేతంగా  భూమిపూజ చేసిన తర్వాత ఇతరులకు చెప్పమనండి. మోదీ గారు ఏ భార్యను తీసుకెళతారండి’’ అని నాని చేసిన వ్యాఖ్యను,  ఆషామాషీ గా చూడలేం కదా? ఆయన చేసిన ఈ వ్యాఖ్య దుమారం రేపింది. అది జాతీయ మీడియాలో కూడా హల్‌చల్ చేసింది. జగన్ ఢిల్లీ వెళ్లి, కేంద్ర పెద్దలందరినీ కలసి వచ్చిన రోజునే, సహచర మంత్రి నాని ఏకంగా ప్రధానిపైనే మాటల దాడి చేయడం, అయినా జగన్ మౌనంగా ఉన్నారంటే దాని సంకేతామిటన్నది సుస్పష్టం. ఈలోగా నాని మాటలపై కమలదళం యాగీ మొదలుపెట్టింది. ధర్నాలకు పిలుపునిచ్చింది. ఇదే నాని మొన్నామధ్య.. కమలాన్ని కరోనా వైరస్‌తో పోల్చినప్పుడే గమ్మున కూర్చున్న కమలదళాలు, ఇప్పుడు మోదీని విమర్శిస్తే మాత్రం రోడ్డెక్కేస్తున్నాయి. అంటే పార్టీ కంటే ప్రధానికే విలువన్నమాట! సరే అది వారి అంతర్గత వ్యవహారమనుకోండి. నాని వ్యాఖ్యలపై కమలదళాలు, నింగీ నేలను ఏకం చేసేంత హడావిడి చేస్తున్నాయి. దీన్ని ఒక జాతీయ అంశంగా మార్చే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.   ఆ ప్రకారంగా.. భాజపేయుల ఆందోళనలో, ‘లక్షలాది’ మంది కార్యకర్తలు అరెస్టవడం, ఫలితంగా  దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేయడం, దీనికి జగనన్న స్పందించి.. నానిని మంత్రివర్గం నుంచి తొలగించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. అప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి సాధ్యం కానిది, బీజేపీ సులభంగా సాధించిందన్న కొత్త ప్రచారానికీ తెరలేపవచ్చు. ఈ పరిణామాల ఫలితంగా.. ఏపీలో అసలైన ప్రతిపక్షం టీడీపీ కాదు, భాజపానే అన్న అభిప్రాయం కలిగించడం రెండో అంకమైనా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. పనిలో పనిగా.. డిక్లరేషన్‌పై అవాకులు చవాకులూ పేలిన కొడాలి నానిని, మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని తమ విజయంగా, ముఖ్యంగా హిందువుల విజయంగానూ ప్రచారం చేసుకునేందుకు, రంగం సిద్ధం చేసుకుంటారన్న అనుమానాలూ లేకపోలేదు.   మామూలుగా అయితే.. ఈపాటికే నానిపై వేటు వేయాల్సి ఉంది. కానీ జగనన్న ఇంకా జాగు చేస్తున్నారంటే, అందులో అనేక మతలబులు ఉన్నాయనుకోవచ్చు. నానిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగిస్తే.. భాజపాతో ఉన్న దోస్తీ కారణంగానే తొలగించారని, అది వారిద్దరి మ్యాచ్ ఫిక్సింగుకు నిదర్శనమన్న అపప్రద ఎదుర్కోవలసి వస్తుంది. అదే ఆయనను కొనసాగిస్తే, మోదీని ఎదిరించి నిలిచారన్న భావన తాత్కాలికంగానయినా ఏర్పడుతుంది. మరి అదే నిజమయితే.. పార్లమెంటులో అన్ని బిల్లులకూ వైకాపా మద్దతునివ్వడం, తాజాగా ఆగమేఘాలపై కేంద్ర పెద్దలకు వెళ్లి కలవడంలో, మతలబేమిటన్న ప్రశ్నలూ తెరపైకి రాక తప్పవు.   మొన్నామధ్య బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పోయిన,  మూడు సింహాల కథనే తీసుకుందాం. అవి మాయమయ్యాయన్న వార్తతో మీడియా అక్కడకు వెళ్లింది. రథం ముసుగు తీసి చూపాలని  కోరినా ఈఓ కుదరదు పొమ్మన్నారు. అదే అక్కడికి వచ్చిన,  కమలదళపతి సోము వీర్రాజు ఆదేశించిన వెంటనే ముసుగు తీసి చూపడం ఆశ్చర్యం. డి క్లరేషన్‌పై సంతకం వివాదం ముదురుపాకాన పడి, మంత్రి నాని వ్యాఖ్యలపై హిందూ సమాజం మండిపడింది. ఆ సమయంలో మంత్రిపై విరుచుకుపడాల్సిన అదే భాజపా దళపతి..  ‘‘తమ్ముడికి పాపం తెలియక మాట్లాడుతున్నాడు. ఆలయ సంప్రదాయాలు మార్చడం సాధ్యం కాద’‘ని సాత్వీకంగా చెప్పడమే ఆశ్చర్యం.   గత ఎన్నికల ముందు మోదీపై,  బాబు కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కుటుంబం లేని మోదీకి, తల్లి-భార్యను కూడా పట్టించుకోని మోదీకి కుటుంబ విలువలేం తెలుస్తాయని బాబు విమర్శించారు. దానితో కమలదళాలు బాబుపై మూకుమ్మడి దాడి చేశాయి.  ఇప్పుడు నాని కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. కాకపోతే కాస్తంత కూల్‌గా విమర్శించారు. కానీ ఇప్పుడు మాత్రం, ఆ స్థాయి దాడి కనిపించకపోవడమే ఆశ్చర్యం. అన్నట్లు.. మోదీపై మాట తూలిన మంత్రి గారి వ్యాఖ్యలపై, చాలాకాలం తర్వాత ఏపీకి చెందిన యుపి ఎంపి జీవీఎల్ స్పందించారు. దేవాలయాలపై దాడులు, తిరుమల వ్యవహారంపై యాగీ అవుతున్నా వినిపించని ఆయన స్వరం, ఎట్టకేలకు నాని పుణ్యమా అని వినిపించింది.    -మార్తి సుబ్రహ్మణ్యం