సీఎం జగన్ పై పోటీ చేసి గెలుస్తా.. మీకు దమ్ముందా.. రఘురామరాజు సంచలన కామెంట్స్ 

వైసీపీకి కంట్లో నలుసుగా తయారైన రెబల్ ఎంపీ రఘురామరాజు మరోసారి సొంత పార్టీ పై అలాగే సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేసారు. తాజాగా సీఎం జగన్ కు నేరుగా సవాల్ విసురుతూ.. "అమరావతి రాజధాని అంటూ రిఫరెండంగా ఎన్నికలకు వెళ్తే సీఎం వైఎస్ జగన్‌ పైనే 2 లక్షల మెజార్టీతో నేను గెలుస్తాను. దమ్ముంటే సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలి. ఇది నేను అతిశయోక్తితో చెబుతున్నది కాదు. త్వరలో నాపై అనర్హత వేటు వేయిస్తామని తమ మీడియాలో పిచ్చి రాతలు రాయిస్తున్నారు. ఎవరు ఎవరిని తొలగిస్తారో త్వరలోనే తెలుస్తుంది. పదవి నుంచి తొలగించడమంటే అది పూర్తిగా వేరుగా ఉంటుంది. దాని సంగతి ప్రజలే చూస్తారు. అయినా నన్ను ఎవరూ తొలగించలేరు. దీనిపై వారికి (వైసీపీ పెద్దలకు) సవాల్ విసురుతున్నాను" అని రఘురాజు అన్నారు .   ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న రఘురాజును తప్పించారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశం పై తాజాగా స్పందించిన అయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ.. తనను ఎవరూ తొలగించలేదని.. తొలగించలేరు కూడా అంటూ వ్యాఖ్యానించారు. దీని పై మరింత వివరణ ఇస్తూ.. "మూడు నెలల క్రితమే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి నన్ను తొలగించాలని వైసీపీ ఎంపీలు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. అది ఒక ఏడాది పదవి అని.. అయితే మధ్యలో తొలగించడం కుదరదని స్పీకర్ అప్పుడే చెప్పారు. తాజాగా నా పదవి కాలం అయిపోయింది కాబట్టి.. దానిని మా పార్టీకే చెందిన బాలశౌరికి ఇవ్వాలని వైసిపి లెటర్ ఇచ్చింది. ఇప్పటివరకు రెడ్డి సామజిక వర్గానికి పదవులు ఇవ్వడం అయిపోయింది దీంతో. ఆయన మతానికి చెందిన వారికి ఆ పదవి ఇచ్చారు. బాలశౌరికి ఆ పదవి ముష్టి వేసారు. ఈ విషయం తెలియని వైసీపీ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటోంది" అని ఎంపీ రఘురాజు అన్నారు.

దుబ్బాకలో రేవంత్ జోరు.. అధికార పార్టీలో గుబులు!!

కాంగ్రెస్ పార్టీ అనగానే మొదటగా గుర్తొచ్చేది అంతర్గత కుమ్ములాటలు. నాయకుల మధ్య సఖ్యత చాలా తక్కువ. ఎవరికి వారు తామే తోపు, వేరే నాయకుడు చెప్పింది మేమెందుకు వినాలి అన్నట్టు ఉంటుంది నాయకుల తీరు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి సరేసరి. నాయకులు ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు ఉంటారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి అధికార పార్టీని డీ కొట్టాల్సింది పోయి.. టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే పనిచేస్తాం లేదంటే మా దారి మేం చూసుకుంటాం అన్నట్టుంటుంది పరిస్థితి. అయితే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా మాణికం ఠాకూర్ రాకతో ఈ పరిస్థితిలో కొద్దిగా మార్పు కనిపిస్తుంది. దుబ్బాక ఉపఎన్నికల్లో విజయం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించడంతో రాష్ట్ర స్థాయి నాయకులంతా అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపుకోసం ప్రచారంలో మునిగిపోయారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రచారంలో రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.   గత ఎన్నికల్లో కాంగ్రెస్ దుబ్బాకలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కానీ ఈ ఉపఎన్నిక పోరులో మాత్రం కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం, రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారంలో పాల్గొనడంతో.. ఈ సారి కాంగ్రెస్ టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తున్న మంత్రి హరీష్ రావు.. దుబ్బాకలో కాంగ్రెస్ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. కానీ ఆయన వ్యాఖ్యలకు భిన్నంగా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా వేల సంఖ్యలో జనాలు కనిపించారు. ముఖ్యంగా ప్రచారంలో రేవంత్ రెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ప్రచారానికి, ప్రసంగాలకి విశేష స్పందన కనిపిస్తోంది. జన ప్రభంజనంతో దుబ్బాక వార్ వన్ సైడ్ అని భ్రమిస్తున్న అధికార పార్టీ నేతలకు గట్టి సంకేతాలు పంపినట్లు అయింది. అధికార పార్టీపై ఆయన పేల్చుతున్న మాటల తూటాలకు చప్పట్ల వర్షం కురుస్తోంది. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట్ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్దితో దుబ్బాకని పోల్చి చూడండి.. దుబ్బాక అంటే వాళ్లకి ఎంత చిన్న చూపో మీకే తెలుస్తుంది అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలకు దుబ్బాక ప్రజల నుంచి వచ్చిన స్పందన టీఆర్ఎస్ వర్గాలను ఆలోచనలో పడేశాయి.   తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఒక బ్రాండ్ గా మారిపోయారు. ఆయన అయితేనే కేసీఆర్ ని డీ కొట్టగలరని, ఆయనకు టీపీసీసీ చీఫ్ పదవి అప్పగించాలని కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా దుబ్బాకలో రేవంత్ ప్రచారానికి వచ్చిన రెస్పాన్స్ తో.. ఈ డిమాండ్ మరోసారి తెర మీదకు వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ లో ఏ నాయకుడికి ఈ స్థాయిలో జనం నీరాజనం పట్టట్లేదని అర్థమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జోష్ లో దుబ్బాకలో కాంగ్రెస్ సత్తా చాటితే రేవంత్ కి మరింత మైలేజ్ రావడం ఖాయమని, అప్పుడు ఇంచార్జ్ మాణికం ఠాకూర్ కూడా పటుబట్టి రేవంత్ కి తెలంగాణలో పార్టీ పగ్గాలు ఇప్పించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

విభజన కాకుండానే రికార్డుల విధ్వంసమా?

ఏపీ రికార్డులు కూడా ధ్వంసం చేస్తారా?   హక్కుల కమిషన్ తీరుపై అభ్యంతరాలు   ఏపీలో హక్కుల కమిషన్ నియమించని ఏపీ   హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయని జగన్ సర్కార్   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ఇంకా విభజన జరగలేదు. కోర్టు ఆదేశాలతో ఒక్క తెలంగాణ రాష్ర్టమే, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసింది. కానీ ఇంతవరకూ ఏపీ సర్కారు హక్కుల కమిషన్‌ను నియమించలేదు. ఉద్యోగుల విభజన జరగలేదు. అయినప్పటికీ తెలంగాణ హక్కుల కమిషన్ కార్యాలయంలోనే, ఏపీ మానవహక్కుల కమిషన్ కొన సాగుతోంది. ఏపీ హక్కుల కమిషన్ కార్యాలయ చిరునామా కూడా, హైదరాబాద్‌లోని గృహకల్ప కార్యాలయంలోనే ఉండటం మరో విచిత్రం. ఇప్పటికీ హక్కుల ఉల్లంఘనపై ఏపీ నుంచి వచ్చే ఫిర్యాదులన్నీ, తెలంగాణ హక్కుల కార్యాలయమే తీసుకోవడం మరో విచిత్రం. ఇన్ని విచిత్రాల నడుమ.. కార్యాలయంలోని అనవసరమైన రికార్డులను ధ్వంసం చేస్తున్నట్లు, తెలంగాణ హక్కుల కమిషన్ పత్రికా ప్రకటన ఇవ్వడం వివాదానికి దారితీస్తోంది.   కమిషన్ కార్యాలయ విభజన పూర్తికాకుండానే, రికార్డుల ధ్వంసం చేసేందుకు జారీ చేసిన ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘పాత రికార్డులకు సంబంధించిన తుది ఆదేశాలు మినహా, మిగిలిన రికార్డులను ధ్వంసం చేస్తాం. రికార్డుల ప్రకాక్షళనలో భాగంగా దీనిని చేపడుతున్నాం. అభ్యంతరాలేమైనా ఉంటే, 15 రోజుల్లోగా హెచ్చార్సీ కార్యదర్శిని సంప్రదించాలి’- ఇదీ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తాజాగా ఇచ్చిన పబ్లిక్ నోటిఫికేషన్. పైగా రికార్డుల ప్రక్షాళన రెగ్యులేషన్స్ -2013 ప్రకారం 2003 నుంచి 2017 వరకూ రికార్డులను రీస్టోర్ చేసినట్లు తెలిపింది. ఇదీ.. తెలంగాణ హెచ్చార్సీ ఇచ్చిన పత్రికా ప్రకటన!   రికార్డుల ప్రక్షాళన కోసం, దీనిని చేపడుతున్నట్లు ప్రకటించడం వరకూ బాగానే ఉంది. అయితే, ఆ రికార్డుల ధ్వంసంలో ఏపీకి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయా? లేవా అన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవడమే, గందరగోళానికి దారితీసింది. ఎందుకంటే ఇప్పటివరకూ.. ఏపీ హక్కుల కమిషన్ కార్యాలయంతోపాటు, ఏపికి సంబంధించిన  రికార్డులు కూడా తెలంగాణ హెచ్చార్సీ కార్యాలయంలోనే ఉన్నాయి. ఇప్పటిదాకా ఉద్యోగుల విభజన జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులే కొనసాగుతున్నారు.   పైగా.. గత 9 నెలల నుంచి ఏపీలో హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులన్నీ, తెలంగాణ హెచ్చార్సీ కార్యాలయమే స్వీకరిస్తోంది. మరి ఆ ప్రకారంగా.. తెలంగాణ హెచ్చార్సీ కార్యాలయంలోనే, ఏపీకి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. తాజా నోటిఫికేషన్ అనుసరించి, రికార్డులు ధ్వంసం చేసే వాటిలో.. ఏపీకి సంబంధించిన కేసుల తాలూకు రికార్డులు కూడా ఉంటాయా? ఉండవా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.   ఇంతవరకూ ఏపీకి హక్కుల కమిషన్  నియమించపోయినప్పటికీ, ఆ రాష్ర్టానికి సంబంధించిన ఫిర్యాదుదారులు,  ఇప్పటికీ హైదరాబాద్ గృహకల్పలో ఉన్న తెలంగాణ హెచ్చారీ కార్యాలయానికే వచ్చి అర్జీలు ఇస్తున్నారు. వాటిని అధికారులు స్వీకరించి, రశీదులు కూడా ఇస్తున్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ కేసు, శిరోముండనం కేసుకు సంబంధించిన ఫిర్యాదులు కూడా, ఈ కార్యాలయంలోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఏపీ మాన వ హక్కుల కమిషన్ కార్యాలయ బోర్డును తొలగించారు. అది మీడియాలో రావడంతో.. ఆంధ్ర ప్రదేశ్-తెలంగాణ హక్కుల కమిషన్ కార్యాలయం పేరిట, రెండు బోర్డులు విడిగా ఏర్పాటుచేశారు. అయితే రెండు రాష్ట్రాల హక్కుల కమిషన్ కార్యాలయాల చిరునామా అదే కావడం ఆశ్చర్యం.   నిజానికి, ఏపీకి హక్కుల కమిషన్ నియమించనందున, తమ వద్దకు వచ్చే ఫిర్యాదుల వివరాలను తెలంగాణ హెచ్చార్సీ అధికారులు, ఏపీ ప్రభుత్వానికి పంపించాలి. వాటిని ఏం చేయాలన్న దానిపై వివరణ కోరాలి. కానీ ఈ రెండింటిలో ఏదీ జరిగినట్లు కనిపించడం లేదంటున్నారు. ఏపీ నుంచి వచ్చే ఫిర్యాదులన్నీ కట్ట కట్టి పక్కన పెడుతున్నారు. అయితే, ఇటీవల మాలహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుమార్‌రాజా తెలంగాణ హెచ్చార్సీ చైర్మన్‌కు ఒక లేఖ రాశారు. మీరు ఏపి నుంచి వస్తున్న అర్జీలు, ఆ ప్రభుత్వానికి పంపిస్తున్నారా? లేదా? ఆవిధంగా ఏపి అర్జీలు కూడా తీసుకోమని మీకేమైనా ఆదేశాలున్నాయా? అని ప్రశ్నిస్తూ రెండుపేజీల లేఖ రాశారు.  ఇదీ ప్రస్తుతం హెచ్చార్సీలో జరుగుతున్న పరిణామాలు.   ఉమ్మడి రాష్ట్రంలో నిస్సార్ అహ్మద్ కక్రూ చైర్మన్, కాకుమాను పెద పేరిరెడ్డి, మిరియాల రామారావు కమిషన్ సభ్యులుగా ఉన్నప్పుడే..  2013లో  రెగ్యులేషన్స్ రూపొందించి, జీఓ ఎంఎస్ నెంబర్ 555తో గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అందులో .. హెచ్చార్సీ ఎలా పనిచేయాలన్న నిర్దేశం ఉంది. నిజానికి కక్రూ చైర్మన్‌గా ఉన్నప్పటికీ, ఆయన ఎక్కువకాలం సీట్లోనే ఉండేవారు కాదు. తీర్పులు-విచారణలన్నీ, కాకుమాను పెద పేరిరెడ్డి చూసేవారు. ఆ తర్వాత ఆయనే యాక్టింగ్ చైర్మన్ అయ్యారు. అది వేరే విషయం.  రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తెలంగాణ హెచ్చార్సీ కూడా.. ఆ మేరకు రెగ్యులేషన్స్ రూపొందించి, ప్రభుత్వానికి పంపి, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది.  కానీ, ఇప్పటివరకూ అలాంటి చర్యలు చేపట్టకుండానే, రికార్డుల ధ్వంసంపై నోటిఫికేషన్ ఎలా ఇస్తారన్న ప్రశ్నలు న్యాయవాదుల నుంచి వినిపిస్తున్నాయి. అది కూడా ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హెచ్చార్సీని విభజించకుండా చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.   నిజానికి, ఒక పిటిషన ర్ వేసిన కేసు మేరకు... ఏపీలో మానస హక్కుల కమిషన్ ఏర్పాటుచేయాలని, దాని కార్యాలయం కూడా ఏర్పాటుచేయాలని.. హైకోర్టు గత ఏడాది అక్టోబర్ 31న ఏపీ సర్కారును ఆదేశించింది. అందుకు ఏపీ ప్రభుత్వం రెండు నెలల గడువు కోరింది. అయితే హైకోర్టు మాత్రం నాలుగు నెలల గడువు ఇచ్చింది. అప్పుడు హెచ్చార్సీ ప్రక్రియ పూర్తయిందని తమకు చెప్పాలని ఆదేశించింది. హెచ్చార్సీ లేనందున, ఆ కేసులు కూడా తమ వద్దకు రావడంతో పనిభారం పెరిగిపోయిందని వ్యాఖ్యానించింది. అందుకు స్పందించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం.. మూడు నెలల్లోగా కమిషన్‌ను తిరిగి ఏర్పాటుచేస్తామని చీఫ్ జస్టిస్ సీజే మహేశ్వరి, జస్టిస్ కె.విజయలక్ష్మితో కూడిన ధర్మాసనానికి చెప్పారు.   అయితే.. హైకోర్టు ఆదేశాలను, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి యధావిధిగా బేఖాతరు చేశారు. దీనిపై మళ్లీ అదే పిటిషనర్.. సర్కారుపై కోర్టు ధిక్కరణ కేసు వేశారు.  తొలుత బెజవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయాన్ని కార్యాలయంగా ఎంచుకున్నట్లు ప్రచారం జరిగింది. అది కూడా ఏ కారణం వల్లనో వెనక్కి పోయింది. ఏపీలో హెచ్చార్సీ ఏర్పాటుచేయమని ఆదేశించి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకూ ఆ ఊసే లేకపోవవడం కచ్చితంగా ధిక్కారమేనని న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. చివరకు హైకోర్టు ఆదేశాలు కూడా అమలుచేయకపోతే, ఇక ఎవరికి చెప్పాలన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మండలి చైర్మన్ టీడీపీకి చెందిన వ్యక్తి ఉన్నందున, ఆయన పదవీకాలం ముగిసేవరకూ.. హక్కుల కమిషన్‌ను ఏర్పాటుచేయకూడదన్న భావనతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే నిజమయితే వచ్చే ఏడాది కూడా ఏపీలో హక్కుల కమిషన్ ఏర్పాటు కల్లగానే మారడం ఖాయం. -మార్తి సుబ్రహ్మణ్యం

రాజకీయ... ‘ప్రేమాభిషేకం’!

బలపడుతున్న వైసీపీ-బీజేపీ బంధం   రఘురామకృష్ణంరాజు పదవికి ఎసరు   ఏపీలో మూగబోయిన బీజేపీ గళం   అమిత్‌షా పేరుతో అణచివేస్తున్నారన్న ఆగ్రహం   అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు.. అయినా వారిద్దరూ ఇప్పటికే రహస్య ప్రేమికులే. ఒకరి కాలిలో ముల్లు గుచ్చుకుంటే, మరొకరు నోటితో దానిని తీసేంత అపూర్వ బంధం వారిది. అందుకే ఒకరి ఉన్నతి కోసం మరొకరు పనిచేస్తున్నారు. వారి ప్రేమ బంధం ఈనాటిది కాదు. ఏనాటిదో? విశాఖ చినముషిడివాడ పీఠం నుంచి విక సించిన ప్రేమ.. ఢిల్లీలో పరిమళించి, ఇప్పుడు పువ్వులయి విరబూస్తోంది. వైసీపీ-బీజేపీ బంధం ఆ రకంగా ఫెవికాల్ మాదిరిగా బలపడుతోంది. కమలం తోటలో ఎప్పుడో పూసిన కొత్త పుష్పం, నత్వానీ పౌరోహిత్యంలో ఇద్దరూ ఆరకంగా ముందుకువెళుతున్నారు.   నిజం.. బీజేపీ-వైసీపీ బంధం కమలం రేకుల మాదిరిగా వికసిస్తోంది. తాజాగా యుశ్రారైకా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును,  స్టాండింగ్ కమిటీ నుంచి తొలగించి, ఆ స్థానంలో తాను అనుకున్న బాలశౌరిని ప్రతిష్ఠించిన తర్వాత కూడా.. ఆ రెండు పార్టీల మధ్య ఏమీ లేదనుకునేవారు, అమాయకుల కిందే లెక్క. ఇప్పటికే బీజేపీ చెలికాడు అంబానీ భాగస్వామి పరిమళ్ నత్వానీని వైసీపీలో చేర్చి, ఆయనకు రాజ్యసభ ఇప్పించిన అపూర్వబంధం వారిది. బీజేపీలో సభ్యురాలిగా ఉన్న సంచయితకు మాన్సాస్ చైర్మన్ పదవి ఇప్పించిన ఉమ్మడి బంధం వారిది.  అయినా సరే ఆ రెండు పార్టీల మధ్య ఏమీ లేదనుకున్న వారు, వెర్రివెంగళప్పల కిందే లెక్క అన్నది బుద్ధిజీవుల వ్యాఖ్య.   ఎంపీ రఘురామకృష్ణంరాజుకు,  లోక్‌సభ స్పీకర్ తన విచక్షణాధికారాల కింద స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. అప్పుడాయన జగనన్నపై ఇంకా తిరుగుబాటు చేయలేదు.  రోజూ రచ్చబండ పెట్టి జగన్ అండ్ అదర్స్‌ను ఉతికి ఆరేస్తున్న రాజును, వైసీపీ రాచమార్గంలోనే ఆ పదవి నుంచి దించేసింది. మరి భాజపేయుల అదృశ్యహస్తం లేకుండానే, రాజుగారికి పదవీవియోగం కలిగిందని భావించలేం కదా? అలాగైతే మరి రాజుగారికి 13 మందితో భద్రత కల్పించారు కదా? అన్న సందేహం రావచ్చు. నిజమే. అదొక ఆట!  మరెందుకు ఆయనను ఆ పదవి నుంచి తొలగించారన్న, ఇంకో సందేహం రావచ్చు. ఇదొక ఆట!!  ప్రధాని-హోంమంత్రి మద్దతు లేకుండానే, జగనన్న సుప్రీంకోర్టు-హైకోర్టు జడ్జిలపై లేఖ రాశారా? అన్న మరో డౌటనుమానం కూడా రావచ్చు. అది నిజమూ కావచ్చు. కాకపోనూ వచ్చు. అది ఇంకో ఆట!!! ఇప్పటి దేశరాజకీయాలను ఆడించేది ‘ఆ ఇద్దరయితే’, ఆడేవారు మాత్రం  అమాయక చక్రవర్తులు. ఇదీ నిజం!   అందుకే.. ఏపీలో తన ‘కమలవనం’ నీరు లేక ఎండిపోతున్నా సరే.. ఎదురుగా ఉన్న ‘పచ్చవనం’ పూర్తిగా కాలిపోతే, సరిపోతుందని సంబరపడుతోంది. ఏపీ లాంటి చిన్న చిన్న మొక్కలు ఎండిపోయినా, ఢిల్లీలోని తన మహావృక్షానికి ‘ఫ్యాను’గాలి తగిలితే, బతికిపోతామనుకునే విశాల హృదయం దానిది. అందుకే రాష్ట్రంలో ఏం జరిగినా కమలం కళ్లు కనిపించవు. చెవులు వినిపించవు. అర్జునుడికి చెట్టుపై ఉన్న పిట్ట మాత్రమే కనిపించినట్లు.. ఏపీ కమలదళాలకు ఒఖ్క తెలుగుదేశమే కనిపిస్తుంది. అదో ‘పచ్చ’పాతం మరి! బహుశా.. ఎలాగూ రాష్ట్రంలో ‘పాయింట్ ఎయిట్’ పార్టీనే కాబట్టి, ఇప్పట్లో కొత్తగా సాధించేది లేదు. అందుకే రాజ్యసభలో ప్రాణవాయువయిన ‘ఫ్యాను’తో కలసి ఉంటేనే మంచిదన్న,  ముందుచూపే దానికి కారణమేమో?!   ఏపీలో మతమార్పిళ్లు, హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని.. భాజపా గురువులయిన సంఘపరివారం కోడై కూస్తుంటుంది. కానీ అదే భాజపా తన ట్వీట్లు, ప్రకటనల్లో మాత్రం, జగనన్న సర్కారును పల్లెత్తు మాట అనదు. పైగా.. యుశ్రావైకాపాకు భాజపాలోని అదృశ్యమిత్రులు, అను‘కుల’భిమానులు ‘ఆ ఒక్కటీ తప్ప’ అన్నట్లు..  అన్నీ ట్వీటుతుంటారు! విగతజీవిగా మారిన టీడీపీ అనే సగం చచ్చిన పార్టీపై, విరుచుకుపడుతున్న విచిత్ర బంధం కనిపిస్తుంది. అంతర్వేది ఊసులు, బెజవాడ అపచారం, గుళ్లలో విగ్రహాలు విరిగినప్పుడు వినిపించిన వీరావేశం,  ఇప్పుడు బీజేపీలో భూతద్దం వేసి వెతికినా కనిపించదు. వినిపించదు. కారణం ‘మామూలే’.. ఆ రకంగా రెండు పార్టీలూ ముందుకువెళున్నాయన్న మాట!   ఇక బీజేపీ స్వరం ఇటీవలి కాలంలో, ఎక్కడా వినిపించకపోవడం మరొక చర్చనీయాంశమయింది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పురిఘళ్ల రఘురాం, విల్సన్, లంకా దినకర్, ఓవి రమణ, యామిని వంటి పెద్ద గొంతులు టీవీ చానళ్ల చర్చల్లో గళమెత్తేవి. అటు వైసీపీని-ఇటు టీడీపీని ఏకిపారేసేవి.  వీరిలో ఓవి రమణను అసలు పార్టీ నుంచే వెలివేయగా, మిగిలిన వారి గొంతులు నులిమేసినట్లు కనిపిస్తోంది. అసలిప్పుడు టీవీ చర్చల్లో భాజపా మొహాలేవీ కనిపించకపోవడం, ఆ పార్టీ నేతలను ఆశ్చర్యపరుస్తోంది. జాతీయ అంశాలపై అవగాహన ఉన్న లంకాదినకర్ వంటి నాయకులు, పార్టీ పేరు లేకుండా పత్రికల్లో వ్యాసాలు రాసుకోవలసిన దుస్థితి ఏర్పడింది.   పైగా హైదరాబాద్‌లో ఉండే నేతలకు పదవులివ్వవద్దని ఒక నియమం పెట్టుకున్నారట. మరి అదే హైదరాబాద్‌లో ఉండే ఓ ప్రముఖురాలి ఇంటికి.. ఇప్పటి రాష్ట్ర ప్రముఖుడితోపాటు, అప్పటి సంఘ ప్రముఖుడూ వెళ్లి ఒత్తిడి చేసి మరీ పార్టీలో తీసుకున్నారు కదా? ఆ తర్వాత ఆ ప్రముఖురాలికి కన్నా కమిటీలో పెద్ద పదవే దక్కి,ంది కదా? వారంతా గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు కదా? మరి.. అప్పుడు పనికొచ్చిన వాళ్లు, ఇప్పుడు పనికిరానివాళ్లెలా అయ్యారన్నది కమలనాధుల ప్రశ్న. అధికార ప్రతినిధులుగా ఎంచుకున్న వారిని చూస్తే.. వైకాపాపై బీజేపీ విధానం ఏమిటన్నది స్పష్టమవుతూనే ఉందన్న వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.   కాగా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రముఖులు.. అంతా అమిత్‌షా ఆదేశాలతోనే నిర్ణయం తీసుకున్నామని చేస్తున్న ప్రచారంపై, పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమరావతిపై మాట్లాడవద్దని అమిత్‌షా ఆదేశించినట్లు, ఏపీ వ్యవహారాల్లో అత్యుత్సాహం ప్రదర్శించే ఎంపీ ఒకరు ప్రచారం చేశారు. ఇప్పుడు నేతలను టీవీ చర్చలకు వెళ్లకుండా, అమిత్‌షానే ఆదేశిచ్చినట్లు చేస్తున్న ప్రచారంపై, నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమిత్‌షా పేరు చెప్పి, కొందరు రాష్ట్ర నేతలు తమ సొంత అజెండాను అమలుచేస్తున్నట్లు కనిపిస్తోందన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో వైసీపీ-టీడీపీపై పార్టీ విధానం ఏమిటన్నది.. ఇప్పటివరకూ అటు నద్దా గానీ, ఇటు అమిత్‌షా గానీ రాష్ట్ర పార్టీ ప్రముఖుల సమక్షంలో స్పష్టంచేయకపోవడం వల్లనే, ఈ గందరగోళం-అవకాశవాదం ఏర్పడిందని సీనియర్లు చెబుతున్నారు.   రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే ఉంటాయన్న దానికి, తమ పార్టీ అనుసరిస్తున్న ‘అదృశ్య విధానాలే’ ఉదాహరణ అని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ వ్యవహారమే దానికి నిదర్శనమంటున్నారు. కేంద్రనిధులతో కట్టిన ఆ ఫ్లైఓవర్ నిర్మాణ ఖాతాను, అటు వైకాపా-ఇటు టీడీపీ తమ ఖాతాలో వేసుకునేందుకు, ఆ రెండు పార్టీలు మాటల యుద్ధం చేస్తున్నాయి. కానీ, అందులో కేంద్రంలోని బీజేపీ వాటా ఎంతన్నది చెప్పి.. అది బీజేపీ వల్లే పూర్తయిన ప్రాజెక్టని చెప్పేందుకు, కమలదళాలు తెగ మొహమాట పడుతుండటమే ఆశ్చర్యం. -మార్తి సుబ్రహ్మణ్యం

కరోనా వైరస్ కు సంబంధించి మరో సంచలన విషయం.. పరిశోధకుల వెల్లడి

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెల్సిందే. దీనికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వైరస్ కు సంబంధించి పరిశోధకులు కొత్తగా ఒక ఆందోళనకర విషయాన్నీ బయట పెట్టారు. ప్రస్తుతం పాండమిక్ గా అంటే మహమ్మారిగా ఉన్న కరోనా వైరస్ భవిష్యత్తులో ఎండెమిక్ గా అంటే స్థానపరమైన వ్యాధిగా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. దీంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ వ్యాధి మళ్లీమళ్లీ సోకే అవకాశం ఉందని ఆ పరిశోధకులు ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం తట్టు వంటి వాటికి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ దానిని పూర్తిగా నిర్మూలించలేకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.   కరోనా వైరస్ ఏదైనా ఒక ప్రదేశానికి పరిమితమై అది మళ్లీ మళ్లీ సంక్రమించే "ఎండెమిక్" లక్షణంగా మారే అవకాశం ఉందని కొలంబియా మెయిల్‌మాన్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఇలా మారడానికి రీ-ఇన్ఫెక్షన్, వ్యాక్సిన్ లభ్యత, దాని సమర్థత, సీజనాలిటీ వంటివి దోహదం చేస్తాయన్నారు.   నిజానికి వైరస్ సోకి కోలుకున్న తర్వాత వచ్చే రోగనిరోధకశక్తి కానీ, వ్యాక్సిన్ ద్వారా లభించే ఇమ్యూనిటీ కానీ ఏడాదిలోపే తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత కూడా ఇమ్యూనిటీ తగ్గుట వైరస్ సోకే అవకాశం ఉంటుందన్నారు. అయితే అదే సమయంలో ప్రాంతాలవారీగా స్థానిక కరోనా వైరస్ (ఎండెమిక్) వ్యాప్తి ద్వారా లభించే రోగనిరోధకశక్తి చాలా కాలం ఉండే అవకాశం ఉందని, అది సాధ్యమైతే కొన్ని సంవత్సరాలపాటు వైరస్ వ్యాప్తి రిపీట్ ఐన తర్వాత దానిని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందని వారు వివరించారు. అయితే, దీనికి కూడా వ్యాక్సిన్ లభ్యత, దాని ప్రభావం వంటివి దోహదం చేస్తాయని వారు తెలిపారు. అయితే, దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని ఆ పరిశోధకులు తెలిపారు.  

సీఎం జగన్ క్షమాపణ చెబితేనే పదవి నిలుస్తుంది.. లేదంటే గోవిందా..

ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అమూల్యమైన సలహా ఇచ్చారు. ఈరోజు ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కేసులపై హైదరాబాదు సీబీఐ కోర్టులో విచారణ మొదలవుతోందని, బహుశా దీనికోసం ఇకపై జగన్ హైదరాబాదులోనే ఉండాల్సి రావొచ్చని అయన అన్నారు. అయితే ఈ కేసుల నుంచి సీఎం జగన్ బయటపడొచ్చని అనుకున్నా, ఇటీవల కోర్టులపై ఆయన చేసిన వ్యాఖ్యల నుంచి ఎంతమాత్రం తప్పించుకోలేరని అయన స్పష్టం చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన సీఎం జగన్మోహన్ రెడ్డి తన పదవి కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. అయితే తప్పు జరిగిందని భావించి క్షమాపణలు చెబితే మాత్రం.. ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయని అయన పేర్కొన్నారు. ప్రభుత్వం న్యాయవ్యవస్థపై దాడి చేయడం సరికాదని ఈ సందర్భంగా రఘురామ రాజు అన్నారు.   న్యాయవ్యవస్థపై దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా..న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలున్నాయని అయన అన్నారు. న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పి జగన్ సీఎంగా కొనసాగాలని, ఒకవేళ అలా కాని పక్షంలో సీఎం పదవికి వేరేవారిని సిద్ధం చేసుకోవాలని రఘురామ రాజు సూచించారు. బహుశా విజయలక్ష్మి, భారతి గార్లు కూడా సీఎం కావచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసును సెక్షన్‌ 174 కింద నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు. ఇక రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరగలేదని అయన అన్నారు.   ఇక తనపై విమర్శలు చేస్తున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. "సోషల్ మీడియాలో కొందరు దరిద్రులు ఉన్నారని, ప్రెస్ మీట్ చెట్టుకింద కాకపోతే కుప్పతొట్టి పక్కన పెట్టుకోరా.. అని తనపై విమర్శలు చేస్తున్నారని అంటూ.. అలాంటి వాళ్లను అయన పందులతో పోల్చారు. సీఎం జగన్ పదవి పోగొట్టుకునే వరకు ఇలాగే అనండ్రా వెధవల్లారా, ఇలాంటి పనికిమాలిన పోస్టులు కాదురా పెట్టాల్సింది దరిద్రుల్లారా!" అంటూ మండిపడ్డారు.  

మంత్రి అనిల్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన అనురాధ

నిర్మించే విజనరీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుది అని.. పడగొట్టే ప్రిజనరీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిది అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. చంద్రబాబు నిర్మించిన సైబరాబాద్, అమరావతి.. వరదలకు మునగలేదనే విషయం అనిల్ గుర్తుపెట్టుకోవాలని ఒకింత కౌంటరిచ్చారు. జగన్ రెడ్డి దరిద్ర పాదం వల్ల రాష్ట్రం 17 నెలలుగా వణికిపోతోందని చెప్పుకొచ్చారు. వరదలు వచ్చినా సాగునీరు ఇవ్వలేని మంత్రి అనిల్‌.. నీటి పారుదలశాఖకి రాజీనామా చేసి నోటి పారుదలశాఖ తీసుకోవాలని అనురాధ సూచించారు.   కాగా.. కొద్దిసేపటి క్రితం మంత్రి మాట్లాడుతూ కృష్ణానదికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కరకట్టపై నిర్మించిన అక్రమ నివాసాన్ని వదిలివెళ్లాలని మాట్లాడారు. మంత్రి వ్యాఖ్యలపై అనురాధ స్పందిస్తూ పై విధంగా కౌంటరిచ్చారు.

తల బెంగళూరులో.. మొండెం మధ్యప్రదేశ్ లో!

రైలు ఢీకొట్టడంతో చనిపోయిన ఓ వ్యక్తి తల ఒక రాష్ట్రంలో మొండెం మరో రాష్ట్రంలో దొరకడం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ లోని బేతుల్ ప్రాంతంలో ఓ వ్యక్తి మొండెం మాత్రమే దొరికింది.  రైలు పట్టాల పక్కన పడివున్న మృతదేహానికి తల లేకపోగా, మరికొన్ని అవయవాలు కూడా గల్లంతయ్యాయి. బేతుల్ సమీపంలోని మచ్నా బ్రిడ్జి వద్ద అక్టోబరు 3న  పోలీసులు తల లేని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.   అయితే ఆ మృతదేహం తలభాగం బేతుల్ కు 1,300 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరులో లభ్యమైంది. రాజధాని ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో చిక్కుకుని ఉన్న తలను రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తల బేతుల్ వద్ద లభ్యమైన మొండేనిది అని తేలింది. న్యూఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే రాజధాని ఎక్స్ ప్రెస్ ఢీకొనడం వల్లే ఆ వ్యక్తి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరణించిన వ్యక్తిని రవి మర్కమ్ గా  గుర్తించారు.    రవి కుటుంబసభ్యులకు బెంగళూరు వెళ్లేంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో బెంగళూరు పోలీసులు అతడి తలను అక్కడే ఖననం చేశారు. బేతుల్ లో లభ్యమైన మొండేన్ని మాత్రం అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైలు ప్రమాదంలో చనిపోయిన శరీర భాగాలు రెండు రాష్ట్రాల్లో దొరకడం మృతుడి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో నింపింది.

కెప్టెన్సీకి దినేశ్‌ కార్తీక్‌ గుడ్‌ బై.. కేకేఆర్ కొత్త కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్

ఐపీఎల్‌ కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్(కేకేఆర్‌) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు దినేశ్‌ కార్తీక్‌ ప్రకటించాడు. బ్యాటింగ్‌ పై ఫోక‌స్ పెట్టాల‌న్న ఉద్దేశంతో కెప్టెన్సీ వ‌ద‌లుచుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఇక నుంచి ఆ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఇంగ్లండ్ క్రికెట‌ర్ ఇయాన్ మోర్గన్ చూసుకోనున్నాడు.   ఈ సీజన్ ఆరంభంలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. దానికితోడు.. తన బ్యాటింగ్ ప్రదర్శన సరిగా లేకపోవడంతో.. ఫ్యాన్స్ కార్తీక్‌ ను కెప్టెన్సీ వదులుకోవాలని డిమాండ్ చేశారు. ఇంగ్లండ్‌ కు వరల్డ్ కప్ అందించిన మోర్గాన్‌ ను జట్టులో ఉంచుకొని కార్తీక్‌ కు కెప్టెన్సీ ఎందుకని కూడా కొందరు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని.. బ్యాటింగ్‌ పై ఫోక‌స్ పెట్టాల‌న్న ఉద్దేశంతో దినేశ్‌ కార్తీక్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.   దినేశ్ కార్తీక్ నిర్ణయంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూరు స్పందించారు. దినేశ్‌ కార్తీక్‌ వంటి ముందుండి నడిపించే వ్యక్తులు తమ జట్టులో ఉండటం అదృష్టమన్నారు. దినేశ్ కార్తీక్ నిర్ణయంతో ఆశ్చర్యానికి గురయ్యామని.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. జట్టు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని దినేశ్ కార్తీక్ భావించేవాడని, అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. కొత్త కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్ బాధ్యతలు చేపడుతున్నాడని వెంకీ మైసూర్ వెల్లడించారు.   కాగా, ఈ సీజన్ లో కేకేఆర్‌ జట్టు ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించింది. ఇవాళ ముంబై ఇండియ‌న్స్‌తో కేకేఆర్‌ తలపడనుంది.   

గులాం నబీ ఆజాద్‌ కు కరోనా పాజిటివ్‌

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ అజాద్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ప్రస్తుతం హోం క్యారంటైన్ లో ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. అయితే, ఆజాద్‌ కు ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.   దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 63,371 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469 కి చేరింది. కరోనా కారణంగా మరో 895 మంది మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,12,161 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,04,528 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జైలుకెళ్తాననే భయంతోనే సీఎం జగన్ తప్పుమీద తప్పులు... యనమల సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ రాయడం.. గోప్యంగా ఉంచాల్సిన ఆ లేఖను తరువాత ప్రెస్ కు రిలీజ్ చేయడం పై అటు ఏపీలోను ఇటు న్యాయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై పలు బార్ అసోసియేషన్లు.. పలువురు సీనియర్ న్యాయవాదులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయం పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నారని... సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని సీనియర్ న్యాయవాదులే చెప్పారని అన్నారు. దీంతో జగన్ పై కోర్ట్ ధిక్కరణ కేసు ఖాయమని చెప్పారు.   దీంతో ''జైలుకెళ్తాననే భయంతో సీఎం జగన్ తప్పుమీద తప్పులు, అలాగే తప్పుడు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ జైలుకు వెళ్తాడనే చర్చ అయన సొంత పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ తర్వాత సిఎం ఎవరనే ఆలోచనలు కూడా వైసిపిలో జోరుగా చేస్తున్నారు. జగన్ లోని ఆందోళన, వైసిపి కార్యకర్తల్లో చర్చలు ఈ లేఖలో స్పష్టంగా ప్రతిబింబించాయి'' అని అయన అన్నారు.   అంతేకాకుండా ''భస్మాసురుడి మార్గంలో జగన్ నడుస్తున్నాడు. భస్మాసురుడి తరహాలోనే తన చెయ్యి తననెత్తిపై జగన్ ఇప్పటికే పెట్టుకున్నారు. తనపై ఇప్పటికే ఉన్న 31కేసులకు (ఈడి - 7 , సిబిఐ - 11, ఇతర కేసులు - 13) అదనంగా తాజాగా మరో కేసు(కోర్టు ధిక్కరణ కేసు) ను కూడా కొనితెచ్చుకోబోతున్నారు. శిక్షపడితే 6ఏళ్ల అనర్హత వేటు పడుతుందనే భయం జగన్ ను వెన్నాడుతోంది. పదేళ్ల శిక్ష పడితే 16ఏళ్లు పోటీకి కూడా అనర్హుడు అవుతాడు. ఈ 31కేసులతో తన రాజకీయ జీవితం ముగిసి పోతుందనేది జగన్ భయం. సీఎం జగన్ తప్పటడుగులు, తప్పుడు పనులు ఎపి భవిష్యత్తుకే అవరోధాలుగా తయారయ్యాయి'' అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.   ఇప్పటికే "బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ బార్ అసోసియేషన్, తమిళనాడు అడ్వకేట్స్ అసోసియేషన్, మహిళా న్యాయవాదుల సంఘం తదితర అసోసియేషన్లు అన్నీ జగన్ దుర్బుద్దిని, రహస్య అజెండాను తప్పుపట్టాయి. అంతేకాకుండా విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ అడ్వకేట్లు జగన్ లేఖను ఖండించారు. సిజెఐకి లేఖ రాయడం ద్వారా జగన్ రెడ్డి రాష్ట్రానికే తలవంపులు తెచ్చాడు. దీంతో దేశవ్యాప్తంగా తన అవినీతిపై జగన్ మళ్లే చర్చ పెట్టాడు. జగన్ రెడ్డి రూ43వేల కోట్ల అవినీతి, 31కేసులు, హవాలా, మనీలాండరింగ్ తదితర తీవ్ర అభియోగాలపై దేశ వ్యాప్తంగా డిబేట్ తెచ్చాడు'' అని అయన అన్నారు.   'సిజెకు లేఖ ద్వారా జగన్ తన స్వార్ధానికి మొత్తం రాష్ట్రాన్నే బలి పెడుతున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఏపీని పాలిస్తున్నాడని దేశం మొత్తం విస్తుపోయేలా చేశారు. తనను నమ్మి ఓట్లువేసిన ప్రజలను కూడా మోసం చేశారు'' అని యనమల విమర్శించారు. అంతేకాకుండా ''అధికారంలో లేనప్పుడు తండ్రి అధికార అండతో... ఇప్పుడు స్వయంగా అధికారం హస్తగతమవ్వడంతో జగన్ మోసాలు, ద్రోహాలు ఎక్కువయ్యాయి. ఇప్పటిదాకా హవాలా, మనీ లాండరింగ్ నేరాలతో రాష్ట్రానికి జగన్ చెడ్డపేరు తెస్తే, ఇప్పుడీ లేఖతో యావత్ దేశానికే తీరని కళంకం తెచ్చాడు. తన నేరాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్న ఉమ్మడి ఏపి హైకోర్టుపై జగన్ పగ పట్టాడు. న్యాయవ్యవస్థపై పగబట్టిన ఒక పాలకుడిని మనం ఇప్పుడే చూస్తున్నాం'' అని అయన మండిపడ్డారు.   తాజాగా ''హైకోర్టును, సుప్రీంకోర్టును జగన్ టార్గెట్ చేశాడు. దీని ద్వారా తన కేసులపై రాబోయే తీర్పులను ప్రభావితం చేయాలనే అయన పథకం వేశాడు. ఇప్పటికే తన కేసులలో సహనిందితులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో నియమించారు. ప్రభుత్వ సీక్రెట్ డాక్యుమెంట్స్ ను కూడా వారి ద్వారా పబ్లిక్ చేయిస్తున్నారు. సిజెకు రాసిన లేఖతోపాటు తన ప్రభుత్వ సలహాదారుతో విడుదల చేయించారు. కోర్టు ధిక్కరణతోపాటు సీక్రెట్ డాక్యుమెంట్స్ బహిర్గతం చేసిన నేరానికి కూడా పాల్పడుతున్నారు. దీంతో రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండే నైతిక అర్హత కూడా కోల్పోయారు'' అని యనమలఅన్నారు.   అసలు "ప్రభుత్వాలను కోర్టులు అస్థిర పర్చడం ఎప్పుడైనా విన్నామా..? తన ప్రభుత్వాన్ని న్యాయస్థానం అస్థిర పరుస్తోందన్న సీఎం ఈ దేశంలో ఉన్నాడా..? ఇంత విధ్వంస మనస్తత్వం ఉన్నవారు పరిపాలనకు తగరు. తాజాగా జగన్ రెడ్డి బెదిరింపులు తారాస్థాయికి చేరాయి, ఏకంగా న్యాయవ్యవస్థనే బెదిరించే స్థాయికి చేరడం జగన్ బరితెగింపు రాజకీయాలకు పరాకాష్ట. ఇప్పటివరకు ప్రతిపక్షాలను బెదిరించడం, శాసన వ్యవస్థను బెదిరించడం, పరిపాలనా వ్యవస్థను బెదిరించడం, అధికార యంత్రాంగాన్ని బెదిరించడం, మీడియాను బెదిరించడం, ఇప్పుడు ఏకంగా న్యాయవ్యవస్థనే బెదిరించడం చూస్తున్నాం. ఈ పెడధోరణులను ఇలాగే వదిలేస్తే వీళ్ళు రేపు ఎంతకైనా తెగిస్తారు'' అని అయన ఆరోపించారు. పరిపాలన గాలికి వదిలేసి తన కేసులు,రోజువారీ విచారణ, రాబోయే తీర్పుల గురించి కంగారెత్తి పోతున్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట్లో ముంచేశారు, రాష్ట్ర భవిష్యత్ ను అంధకారం చేశారు'' అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

అమరావతిని ముంచే కుట్ర? జగన్ సర్కార్ పై రైతుల ఆగ్రహం 

వరదలతోనూ ఏపీలో రాజకీయం చేస్తున్నారా? సొంత ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారా? అమరావతిని ముంచేందుకు ప్లాన్ చేశారా? ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వర్గాల నుంచి ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి. అమరావతిని రాజధానిగా అంగీకరించని జగన్ సర్కార్.. ఆ ప్రాంతాన్ని ముంపుగా చూపించే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని గ్రామాల్లోకి వరద రావాలనే ఉద్దేశ్యంతోనే.. అక్కడి వాగుల పూడిక తీత చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్యాముల నుంచి సకాలంలో నీటిని వదలకుండా, ఎత్తిపోతల మోటార్లు వేయకుండా కావాలనే కుట్రలు చేస్తున్నారని చెబుతున్నారు. వందేళ్లలో రాని ముంపు అమరావతికి వస్తే అందుకు  జగన్ ప్రభుత్వమే కారణమంటున్నారు రాజధాని రైతులు,   వైసీపీ నేతల తీరు కూడా రాజధాని రైతుల అనుమానాలకు బలమిచ్చేలా ఉన్నాయి. వరదలతో అమరావతి మునిగిపోయిందని, రోడ్ల మీద చేపలు పట్టుకోవచ్చు అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు కూడా మునిగిపోతుందని హడావిడి చేశారు. ఏపీ హైకోర్టును వరద ముంచెత్తిందని కొందరు పోస్టులు పెట్టారు. అయితే సోషల్ మీడియా ప్రచారం జరిగినట్లు అమరావతి  ఎక్కడా నీట మునగలేదు. హైకోర్టు దరిదాపుల్లోకి కూడా వరద రాలేదు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు కూడా భద్రంగానే ఉంది. పరువు పోగొట్టుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే అమరావతికి పెద్దగా వరద ముంపు లేదు. అమరావతిలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వైసీపీ నేతలే ఫేక్ ఫోటోలు పెట్టి ప్రచారం చేశారు. వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారాన్ని పట్టుకుని కొందరు వైసీపీ ముఖ్య నేతలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పరువు పొగొట్టుకున్నారు.    తమ కుట్రలో భాగంగానే వైసీపీ నేతలు, కార్యకర్తలు ముందుకు పోతున్నారని రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. అమరావతి ప్రాంతం వరదలో మునిగేలా జగన్ ప్రభుత్వ చర్యలు ఉండగా.. అసత్య  ప్రచారాలతో బద్నాం చేేసే పనిలో వైసీపీ కేడర్ ఉందని చెబుతున్నారు. అమరావతి ముంపునకు గురవుతుందని ప్రభుత్వం చేస్తోన్న విష ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలని రైతులు సూచిస్తున్నారు. దమ్ముంటే అమరావతి రాజధానిపై బహిరంగ చర్చకు వస్తారా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మహా నగరాలు మునుగుతున్నా అమరావతి సేఫ్ గా ఉందని చెప్పారు. విపత్తులో ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వానికి ముంచడమే ఎజెండాగా మారిందని మండిపడుతున్నారు.    జగన్ సర్కార్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. సకాలంలో నీటిని కిందకు విడుదల చేయకుండా అమరావతిని ముంచడమే ధ్యేయం అన్నట్లుగా వ్యవహరించారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. జలాశయాల నీటి నిర్వహణలోనూ కక్ష సాధింపు యోచనలకు పూనుకోవడం అమానుషమన్నారు చంద్రబాబు.మొత్తానికి రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి నీటిలో మునిగేలా కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి పనులకు పూనుకోవడం మంచిది కాదనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది. ప్రకృతితో పరిహాసం చేస్తే.. జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇకనైనా అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు.

ఏపీ దిశా చట్టంలో లోపాలు.. తిప్పి పంపిన కేంద్రం

ఏపీలో మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు ఉద్దేశించి జగన్ ప్రభుత్వం పంపిన దిశా చట్టాన్ని కేంద్రం వెనక్కు పంపింది. హైద‌రాబాద్ నగరంలో దిశ పై హత్యాచారం ఘటన జరిగిన త‌ర్వాత ఒకపక్క ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఏపీ స‌ర్కార్ హడావిడిగా దిశ బిల్లును ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదింపజేసుకొని కేంద్రం యొక్క ఆమోదం కోసం పంపింది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఈ దిశ చట్టం పైన కేంద్ర హోంశాఖ‌, న్యాయ శాఖ‌, మ‌హిళా శిశు సంక్షేమ శాఖల‌కు పంపి అభిప్రాయాన్ని కోర‌గా… చ‌ట్టంలో లోపాలున్నాయని ఆ శాఖలు తెలిపాయి. దీంతో దిశ చ‌ట్టంలో మార్పులు చేర్పులు సూచిస్తూ కేంద్రం దీన్ని వెన‌క్కి పంపినట్లు తెలుస్తోంది.   రాష్ట్ర ప్ర‌భుత్వం తయారు చేసిన దిశా చ‌ట్టం అమ‌లులోకి రావాలంటే కేంద్రం ఆమోదంతోపాటు రాష్ట్రప‌తి కూడా ఆమోదం తెలిపిన త‌ర్వాతే అధికారికంగా ఏపీలో దిశ చట్టం అమ‌లులోకి వస్తుంది. అయితే ఏపీలో దిశా చట్టం ఆధారంగా ఇప్పటికే పలు చోట్ల దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఈ చట్టం కింద కేసులు కూడా పెట్టగా.. ఇపుడు కేంద్రం దీన్ని వెనక్కు పంపడం గమనార్హం. ఈ దిశ చ‌ట్టం ప్రకారం మ‌హిళ‌ల‌పై ఎవ‌రైనా అఘాయిత్యాల‌కు పాల్ప‌డితే 21రోజుల్లోగా దోషుల‌కు శిక్ష పడేలా ఏపీ ప్ర‌భుత్వం ఈ దిశ చ‌ట్టాన్ని తీసుకొచ్చింది. అయితే కేంద్రం ఈ చ‌ట్టాన్ని వెన‌క్కి పంపడంతో.. కేంద్రం సూచించిన మార్పులు చేర్పులు చేసి రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ చట్టాన్ని తిరిగి పంపాల్సి ఉంటుంది.

విజయదశమికి పార్టీ పేరు! రజనీతో డీఎంకేలో టెన్షన్ ? 

తమిళనాడులో  రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది  అధికార, ప్రతిపక్ష పార్టీలు కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. కొత్త పార్టీలు, కొత్తగా వచ్చే పార్టీలతో తమిళనాడు రాజకీయం సరికొత్తగా మారుతోంది.  సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రజనీ ఎప్పుడెప్పుడు రాజకీయ పార్టీని ప్రకటిస్తారా  అని ఆయన అభిమానులు, ప్రజలతో పాటు పొలిటికల్ పార్టీలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విజయదశమి రోజున ఆయన పార్టీ పేరు ప్రకటిస్తారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది.      పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్‌ చేయడానికి రజనీకాంత్ సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు. రజనీ సన్నిహితులు వారం రోజులుగా ఢిల్లీలోనే  ఉండి పార్టీ రిజిస్ట్రేషన్‌ చేయడానికిగాను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. 2021 జనవరి నుంచి రజనీకాంత్ పూర్తిగా పార్టీ వ్యవహారాలపైనే ప్రత్యేక దృష్టిసారిస్తారని తెలుస్తోంది.    కరోనా లాక్‌డౌన్‌ లో పార్టీ ప్రారంభం కోసం కావాల్సిన ప్రచార సామగ్రికి  రజనీకాంత్ సన్నాహాలు చేశారని తెలుస్తోంది. గత ఏడు నెలలుగా  ఆయన  50 రకాల ప్రచార వీడియోలు రూపొందించారట. తనదైన స్టైల్‌లో రాజకీయాలు, సామాజిక విషయాలు, తన పార్టీ లక్ష్యాలు, ప్రజలకు తానందించే పథకాల వివరాలు తెలియజేస్తూ ప్రసంగించిన వీడియోలను రికార్డు చేయించారు. పార్టీ పేరును ప్రకటించిన వెంటనే 50 రకాల వీడియోలను వరుసగా సోషల్‌ మీడియాలో ఆయన విడుదల చేయనున్నారని సన్నిహితులు తెలిపారు. అందులో పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయంటున్నారు. విజయదశమి రోజున  పార్టీ ప్రకటన తర్వాత  తాను మాట్లాడిన వీడియో రజనీ విడుదల చేస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు,    2017 డిసెంబర్‌ 31న రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు బాషా. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి రజనీ పార్టీ పేరు ప్రకటిస్తారని కోట్లాదిమంది ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలలే మిగిలివున్నా రజనీ నుంచి ఎలాంటి రాజకీయ  ప్రకటన రాలేదు. రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించి రెండేళ్లు గడచిపోయాయి.  గత మార్చిలో మీడియాతో మాట్లాడిన రజనీ తాను ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయననని, పార్టీలో యువకులకు  ప్రాధాన్యం ఇస్తానని,  పదవులు అధికంగా వుండవని, సేవచేసే వారికే ఇస్తామని ప్రకటించారు.  సీఎం పదవికి పోటీ చేయనన్న రజనీ ప్రకటన ఆయన అభిమానులకు తీవ్ర నిరాశకు గురిచేసింది. రజనీ మక్కల్‌ మండ్రాల నేతలు ఆయనతో పలు మార్లు చర్చించి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయననే నిర్ణయాన్ని రజనీ మార్చుకుంటారని అందరూ భావిస్తున్నారు.    ఇక తమిళనాడు వ్యాప్తంగా ఇటీవల రజనీకాంత్ సర్వే చేయించారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు రజనీ పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 12 శాతం ఓటు బ్యాంక్‌ లభిస్తుందని ఆ సర్వేలో తేలిందని చెబుతున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే వ్యతిరేక ఓట్లు, తటస్థుల ఓట్లు, అభిమానులు, మక్కల్‌ మండ్రాల ద్వారా లభించే ఓట్లే అధికంగా వున్నాయి. ఈ ఓటు బ్యాంక్‌తో రజనీ పార్టీ అధికారంలోకి రాలేకపోవచ్చునని సర్వే నిర్వహించిన సంస్థలు చెబుతున్నాయి. అదనంగా మరో  20 శాతం ఓట్లను సంపాదించుకున్నప్పుడే అధికారం సాధ్యమని తెలిపాయి. దీంతో తన ఓటు బ్యాంక్‌ పెంచుకునే దిశగా త్వరలో సంచలనాత్మకమైన ప్రజా సంక్షేమ పధకాలకు సంబంధించిన ప్రకటన రజనీకాంత్ చేయనున్నారని తెలుస్తోంది.   రజనీ పార్టీ పేరును ప్రకటించగానే ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌, నటుడు లారెన్స్‌ ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. లారెన్స్‌తోపాటు తమిళురువి మణియన్‌, కాంగ్రెస్‌ నేత కరాటే త్యాగరాజన్‌, మాజీ మంత్రి ఏసీ షణ్ముగం, సినీ నిర్మాతలు, నటీనటులు, అన్నాడీఎంకే, డీఎంకే ల నేతలు కూడా రజనీ పార్టీలో చేరటానికి రెడీగా వున్నారు. ఇప్పటికే రజనీ మక్కల్‌ మండ్రాల నాయకుల్లో పలువురిని రజనీకాంత్‌ మార్చారు. పార్టీ పెడితే ఏయే ప్రముఖులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా వున్నారనే వివరాలను రజనీ ఇప్పటికే సేకరించారు. ఆ దిశగానే పార్టీలో చేరబోతున్నవారి వద్ద రజనీ తరచూ చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. అదే సమయంలో గత నెల రోజులుగా రజనీ మక్కల్‌ మండ్రాల జిల్లా శాఖల నాయకులతో చర్చలు జరిపి బూత్‌ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ వెయ్యికి పైగా బూత్‌ కమిటీలను  రజనీ ఏర్పాటు చేశారట.   మరోవైపు రజనీ రాజకీయ పార్టీ స్థాపనపై తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలో తీవ్ర ఆందోళన నెలకొంది. దీనిపై తమిళనాట ఓ వార్త వైరల్ అవుతోంది. రాజకీయ ప్రవేశం చేయవద్దని రజనీకాంత్‌పై డీఎంకే తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీఎంకే పెద్దలు రజనీకి అత్యంత సన్నిహితుడైన ఓ ప్రముఖుడిని ఆయన వద్దకు దూతగా పంపినట్లు సమాచారం. రజనీ ఆరోగ్య పరిస్థితులు, రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న దృష్ట్యా రాజకీయాల్లోకి రావద్దంటూ ఆ దూత ఆయనకు తెలిపినట్లు చెబుతున్నారు.అయితే ఇదంతా వట్టి పుకార్లేనని డీఎంకే సీనియర్లు నేతలు ఖండించారు. రజనీ రాజకీయ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఒక వేళ రజనీని రాజకీయాల్లోకి రావద్దంటూ డీఎంకే చెప్పినా ఆయన ఆ మాటను ఆమోదిస్తారా అని డీఎంకే నేతలు ప్రశ్నిస్తున్నారు. రజనీ రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా డీఎంకేకు ఎలాంటి నష్టం జరగదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.     మొత్తానికి  విజయ దశమి సమీపిస్తుండటంతో రజనీకాంత్ అడుగులపై తమిళనాడులో ఆసక్తి పెరుగుతోంది. బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లేనని.. కచ్చితంగా రజనీ రాజకీయ పార్టీ ప్రకటిస్తారని ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారు. అదే జరిగితే తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయని అనలిస్టులు చెబుతున్నారు. మరీ దసరా రోజున రాజనీకాంత్ ఏం చేస్తారో చూడాలి మరీ...

ఖమ్మం మైనర్ బాలిక మృతి

ఖమ్మం జిల్లాలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక(13) మృతి చెందింది. హైదరాబాద్‌ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక గురువారం రాత్రి కన్నుమూసింది.    ముస్తాఫా నగర్‌లోని ఓ ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలికపై.. ఆ ఇంటి యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక ప్రతిఘటించడంతో కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 70 శాతం కాలిన గాయాలైన ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించి గోప్యంగా చికిత్స అందజేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను చంపేస్తామని నిందితుడి కుటుంబం బెదిరింపులకు పాల్పడటమే కాకుండా.. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు.. మధ్యవర్తుల ద్వారా డబ్బు ఇప్పించేలా బాలిక తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే, బాలిక పరిస్థితి విషమించడంతో ఆ తరువాత హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా.. ఘటన వెలుగులోకి వచ్చింది. కాలిన గాయాలతో 27 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలిక చివరకు తన ప్రాణాలు విడిచింది. 

మాజీ మంత్రి నాయని నర్సింహా రెడ్డి పరిస్థితి ఆందోళనకరం.. కుటుంబంలో మరో ముగ్గురికి కరోనా 

తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, టిఆర్ఎస్ సీనియర్ నేత నాయని నర్సింహా రెడ్డి ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. నాయని నర్సింహా రెడ్డికి గత నెల 28వ తేదీన కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేరి దాదాపు 16 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. అయితే వారం రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో ఇక ఇంటికి వస్తారని అనుకున్న సమయంలో అకస్మాత్తుగా ఆయనకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఆయనకు పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకి న్యూమోనియా వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో నర్సింహా రెడ్డి శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో.. ఆయనను వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనను ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రి లో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు.    ఇది ఇలా ఉండగా నాయని కుటుంబంలో మరో ముగ్గురికి కూడా కరోనా సోకింది. అయన సతీమణి అహల్య కూడా బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆమెకు నెగెటివ్ వచ్చింది . ఇక నాయని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పోరేటర్ వి. శ్రీనివాస రెడ్డికి, ఆయన పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకాగా వారు కోలుకుంటున్నారు.

ఏపీలో దళిత బాలికలపై పెరుగుతున్న పాస్టర్ల అత్యాచార యత్నాలు

మొన్న గాజువాక.. నిన్న తిరుపతి   మాజీ ఐపీఎస్ ట్వీట్ తర్వాతనే కదలిక   ‘దిశ’ లేని ఏపీ సర్కార్   మతమార్పిళ్లపై దళితులలో మారుతున్న ఆలోచనలు   పండితురాలు నందమూరి లక్ష్మీపార్వతి చెప్పినట్లు.. హిందూమతంలో చేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనలో, దళిత మహిళలపై పాస్టర్లు చేస్తున్న అత్యాచారాల సంఖ్య పెరుగుతుండటం, మహిళాలోకానికి కలవరం కలిగిస్తోంది. విశాఖ పీఠాథిపతి స్వరూపానంద సరస్వతి.. సీఎం జగన్‌తో మూడుసార్లు గంగలో మునక వేయించి, హిందూమతంలోకి తీసుకువచ్చారని పండితురాలు పార్వతమ్మ ఇటీవలే ప్రకటించారు. అయినప్పటికీ జగన్‌పై క్రైస్తవ ముద్ర వేయడం దారుణమని, ఆవేదన వ్యక్తం చేశారు. అటు రోజా కూడా జగన్ పాలనలో హిందువులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. అంటే జగన్ క్రైస్తవుడు కాదు. ఫక్తు హిందూ అని చెప్పడమే, ఈ మహిళానేతల కవిహృదయం కావచ్చు. మంచిదే. జగన్‌పై అలాంటి ప్రచారానికి తెరపడి, ఆయన అందరివాడయితే, రాష్ట్ర ప్రజలకూ సంతోషమే.   కానీ, ఏపీలో ఇటీవలికాలంలో నిర్నిరోధంగా జరుగుతున్న పాస్టర్ల అత్యాచారాలపై.. సర్కారు నుంచి ఎలాంటి చర్యలు కనిపించకపోవడం, హిందూ సంస్థల ఆగ్రహానికి దారితీస్తోంది. నిజంగా హిందువు సీఎంగా ఉంటే మహిళలు, దళితులపై పాస్టర్ల అత్యాచారాలు నిర్నిరోధంగా జరుగుతాయా? అన్న ప్రశ్నలు హిందూ సమాజం నుంచి వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విశాఖ జిల్లా గాజువాకలో ఒక పాస్టర్.. ప్రార్ధన పేరిట ఒక దళిత బాలికపై అత్యాచార యత్నం ఘటన, స్థానిక దళితులకు ఆగ్రహం కలిగించింది. ఈ ఘటనలో పాస్టర్‌పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. దళితులను మతం మారుస్తున్న పెద్దలు.. ప్రార్ధనల పేరిట అదే దళిత బాలికలపై, అత్యాచారాలకు ఒడిగడుతున్న వైనం.. దళితవర్గాల్లో కొత్త ఆలోచనలకు బీజం వేసింది.   అనేక ప్రలోభాలతో మతం మారుస్తున్న పాస్టర్లు, చివరకు తమ పిల్లలపైనే అత్యాచారానికి పాల్పడుతుండటాన్ని, దళితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా.. క్రైస్తవంలో చేరాలంటూ తమపై వస్తున్న ఒత్తిళ్లపై తమ నిర్ణయాన్ని పునరాలోచించుకునేందుకు, ఈ ఘటన బీజం వేసింది. మతం మారితే జీవితాలు మార్చేస్తామని, పిల్లలకు ఉచితంగా ఖరీదైన విద్య అందిస్తామన్న ప్రలోభాలవైపు, దళితులు ఇప్పటివరకూ ఆశగా చూసేవారు. ఇప్పటివరకూ ఇలాంటి ప్రలోభాలతోనే, గ్రామాల్లో పాస్టర్లు తమ జాతికి చెందిన వారిని మతం మార్చారని, హిందూ- మాల, హిందూ మాదిగ నేతలు స్పష్టం చేస్తున్నారు.   ఆ తర్వాత ప్రలోభాలకు లొంగి, మతం మారిన తమ ఆడపిల్లలపై పాస్టర్లు, ప్రార్ధనల పేరుతో.. లైంగిక వేధింపులు, అత్యాచారయత్నానికి ఒడిగడుతున్న వైనంపై, దళితుల్లో కొత్త ఆలోచన మొదలయినట్లు కనిపిస్తోంది. తాము ప్రలోభాలకు లొంగడం వల్లనే, తమ బిడ్డలపై ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయన్న వాస్తవం.. ఇలాంటి ఘటనలతో తమ జాతికి అర్ధమయిందని చెబుతున్నారు. పాస్టర్లు అత్యాచారం చేయడానికే.. దళితులను మతం మార్చేందుకు ఎంపిక చేసుకున్నట్లుందన్న వ్యాఖ్యలు, హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి.   గాజువాకలో దళిత బాలికపై పాస్టర్ పాశవిక దాడి చేసిన దారుణం మర్చిపోకముందే.. వాటికన్ సిటీగా పేరున్న తిరుపతిలో, మరో పాస్టర్ ఒక యువతిపై అత్యాచార యత్నం చేయడం కలకలం సృష్టించింది. 20 ఏళ్ల యువతిపై దేవసహాయం అనే పాస్టర్, లైంగిక వేధింపులు-అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాధితులురాలు ఈస్ట్ పోలీస్‌స్టేషన్, దిశ పోలీసుస్టేషన్‌లో, తనపై అత్యాచారయత్నం చేసిన పాస్టర్ దేవసహాయంపై ఫిర్యాదు చేసింది. తాము పదిరోజుల నుంచి దిశ పోలీసుస్టేషన్ చుట్టూ తిరుగుతున్నా, పట్టించుకోవడం లేదని బాధితురాలు, ఆమె స్నేహితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.   ఈ ఘటనపై పోలీసులు స్పందించని వైనంపై నిరసన వ్యక్తమయింది. అటు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. పాస్టర్‌పై దిశ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలిపై రెండుసార్లు అత్యాచారయత్నం జరిగిందని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి ఆరోపించారు. పైగా దిశ స్టేషన్ ఎస్‌ఐ హైమావతి, బాధితురాలితో అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈలోగా పాస్టర్ చేసిన అత్యాచార యత్నంపై పోలీసుల మౌనాన్ని మాజీ ఐపిఎస్ నాగేశ్వర్‌రావు ట్వీట్ చేయడంతో, పోలీసు యంత్రాంగం అనివార్య పరిస్థితిలో స్పందించాల్సి వచ్చింది. దీనితో ఏఎస్పీ సుప్రజ రంగంలోకి దిగడంతో, ఎట్టకేలకూ పోలీసులు కదిలారు. చివరకు గాజులమండ్యం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వాయువేగంతో స్పందించి.. కేసు నమోదు చేయాల్సిన దిశ పోలీసుస్టేషన్ అధికారులు, మీనమేషాలు ఎందుకు లెక్కబెడుతున్నారన్నది ప్రశ్న. కేవలం మహిళలపై అత్యాచారాలు నిరోధించేందుకు, నిందితులను శిక్షించేందుకు మాత్రమే ఏర్పాటుచేసిన దిశ పోలీసుస్టేషన్లు.. తమకు అప్పగించిన బాధ్యత కూడా నిర్వర్తించకపోతే, ఇక ఆ వ్యవస్థపై ఎవరికి నమ్మకం ఉంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.   రాష్ట్రంలో దళితులపై పాస్టర్ల అత్యాచారాలు, రోజురోజుకూ పెరిగిపోతున్నా.. పోలీసులు వారిపై వెంటనే చర్యలు తీసుకునేందుకు, భయపడుతున్నారన్న విమర్శలు, హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో ఏ ప్రభుత్వంలోనయినా ఇలాంటి ఘటనలు జరిగితే, పోలీసులు వాయువేగంతో స్పందించేవారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అధికారులు కూడా.. పాస్టర్లపై చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందోనన్న భయంతో ఉన్నారని, హిందూ సంస్థల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   అంతర్వేది వ్యవహారంలో కూడా, రథాన్ని తగులబెట్టిన వారిని ఇప్పటిదాకా గుర్తించలేని పోలీసులు.. చర్చిపై రాళ్లేశారన్న ఫిర్యాదు మేరకు, డజన్ల మందిపై కేసులు పెట్టి, అరెస్టు చేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. బాలికలపై అత్యాచార యత్నానికి పాల్పడిన.. ఇద్దరు పాస్టర్లపై దిశ చట్టం కింద కేసు నమోదు చేస్తేనే, లక్ష్మీపార్వతి చెప్పినట్లు.. జగన్మోహన్‌రెడ్డిని హిందూ సమాజం హిందువుగా భావిస్తుందని, హిందూ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మరి పండితురాలు పార్వతమ్మ, ‘జగన్గురువు’ స్వరూపా సాములోరు ఏం చెబుతారో చూడాలి! -మార్తి సుబ్రహ్మణ్యం

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై దాడి యత్నం... అడ్డుకున్న గన్ మేన్

బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. గత రాత్రి 10.30 గంటల సమయంలో గుంటూరులోని ఎంపీ నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. దాడికి యత్నించిన వ్యక్తిని మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావుగా గుర్తించారు. నిన్న రాత్రి ఎంపీ సురేశ్ తన ఇంటి నుంచి కారులో బయలుదేరుతుండగా.. పూర్ణచంద్రరావు ఆయన వాహనానికి బైక్ అడ్డుపెట్టి..తన వద్ద ఉన్న రాడ్డుతో కారుపై దాడిచేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన ఎంపీ గన్‌మెన్ అతడి చేతిలోని రాడ్డు లాక్కొని పడేయడంతో, నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఎంపీ గన్‌మెన్ అతడిని వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

"మీ పేరు రాసి చచ్చిపోతాం".. హైదరాబాద్ లో ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహం..

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అవుతోంది. దీంతో ఒక పక్క నాలాలు మరోపక్క చెరువులు పొంగి కాలనీలు మునిగిపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజల పరిస్థితి దారుణంగా తయారయింది. దీంతో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులను జనం కడిగిపారేస్తున్నారు. తాజాగా వరదలో చిక్కుకున్న వారిని పరామర్శించేందుకు వచ్చిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సుభాష్ రెడ్డిని చూసిన బాధితులు అయన మీద మండి పడ్డారు. సుభాష్ రెడ్డితో స్థానిక మహిళలు వాగ్వాదానికి దిగారు. ‘‘మీ పేరు రాసి చచ్చిపోతాం’’ అంటూ ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకున్న తమని అసలు ఎవరు ఆదుకోవడం లేదని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ఇది ఇలా ఉండగా మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. మేడిపల్లి గ్రామంలో చెరువు నిండటంతో పూజలు చేసేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వాహనంపై ఏకంగా చెప్పులు, రాళ్లు విసిరారు. ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతే పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి తమ గ్రామంలోకి రావొద్దంటూ గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు వారికీ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు స్థానికులపై లాఠీ చార్జ్ చేసారు. ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.