ఫలితాలు ఇచ్చాక పోస్టింగులకు లేటెందుకు! మండలి కోసమేనా..
posted on Oct 7, 2020 @ 1:39PM
ఎన్నికలకు ముందు ఓటర్లకు తాయిలాలు కురిపించడం టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. అన్ని ఎన్నికల్లోనూ ఆయన అలాగే చేస్తూ విజయాలు సాధిస్తున్నారు. జనాల్లో తమపై వ్యతిరేకత పెరిగిందని గ్రహించిన ప్రతిసారి కేసీఆర్ ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తుంటారు. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు టీఆర్ఎస్ కు సవాల్ గా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లుగా ఉన్న నిరుద్యోగులు కేసీఆర్ సర్కార్ పనితీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మండలి ఎన్నికల్లో తమకు ఇబ్బంది అవుతుందని భావించిన టీఆర్ఎస్.. దిద్దుబాటు చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. మండలి ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్ల కోసం కేసీఆర్ సర్కార్ చర్యలు చేపట్టింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -4 ఫలితాలను విడుదల చేసింది.
1,595 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి 2018లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్షను అక్టోబర్ 7, 2018న నిర్వహించింది. మొత్తం 1,867 ఉద్యోగాలకు 4,80,545 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే పరీక్ష జరిగిన రెండేండ్లు అవుతున్నా టీఎస్‌పీఎస్సీ ఫలితాలు విడుదల చేయలేదు. ఫలితాలు ఇవ్వాలంటూ అభ్యర్థులు ఆందోళనలు కూడా చేశారు. అయినా కేసీఆర్ సర్కార్, టీఎస్‌పీఎస్సీ గాని స్పందించలేదు. కాని సడెన్ గా ఇప్పుడు ఫలితాలు విడుదల చేసింది.
రెండు పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోని ఆరు జిల్లాల పట్టభద్రులు ఓటేయనున్నారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ తీరుకు నిరసనగా నిరుద్యోగులు, యవకులు ఆగ్రహంగా ఉన్నారు. కేసీఆర్ చేయించిన సర్వేలోనూ ఇదే తేలిందట. ప్రభుత్వంపై యువత తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని ఇంటిలిజెన్స్ రిపోర్టులోనూ వచ్చిందని చెబుతున్నారు. దీంతో నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే రెండేండ్ల క్రితం జరిగిన గ్రూప్ 4 ఫలితాలను సడెన్ గా విడుదల చేసిందనే చర్చ జరుగుతోంది.
రెండేండ్ల తర్వాత గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసినా అందులో మరో మెలిక పెట్టింది టీఎస్‌పీఎస్సీ. నియామకాలు మాత్రం డిసెంబర్ తర్వాత చేపడుతామని ప్రకటించింది. దీనిపై అభ్యర్థుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. రెండు సంవత్సరాల తర్వాత ఫలితాలు విడుదల చేసి.. మళ్లీ నియామక ప్రక్రియ చేపట్టకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలి ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని మండిపడుతున్నారు. వెంటనే నియామక ప్రక్రియ చేపట్టి పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ సర్కార్ వచ్చాక టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఏ పరీక్షలు సాఫీగా జరగలేదు. టీఎస్‌పీఎస్సీ తప్పులతో పరీక్షలు, ఫలితాలు, నియామకాల ప్రక్రియలన్ని వివాదంగానే మారాయి. అభ్యర్థులు కోర్టుకు వెళ్లడం, విచారణల పేరుతో వాయిదా పడటం జరిగాయి. గ్రూప్ 2 ఫలితాలు వచ్చినా.. కోర్టుల కేసులతో ఇప్పటికి పూర్తిస్థాయిలో నియామకాలు జరగలేదు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన టీజీటీ, పీజీటీ పరీక్షలు ఇంతే. పరీక్షలు జరిగాకా చాలా కాలానికి ఫలితాలు ఇచ్చారు.తర్వాత పోస్టింగులు ఇవ్వడానికి మరింత సమయం తీసుకున్నారు. 2017లో పరీక్షలు జరిపి.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా నియామకాలు చేపట్టారు. అవి కూడా ఇంకా పూర్తి కాలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు టీజీటీ, పీజీటీ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు షో చేసిన ప్రభుత్వం.. తర్వాత మళ్లీ పట్టించుకోలేదు.
ట్రైనడ్ గ్రాడ్యువేట్ టీచర్ పోస్టులలో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలంటూ టిజిటి మెరిట్ అభ్యర్థులు కొన్ని రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. 2017 జరిగిన టిజిటి అర్హత పరీక్షలో తాను మెరిట్ సాధించామని ... 1:1 ఎంపిక ద్వారా తాము ఉద్యోగం కోల్పోయామని చెబుతున్నారు అభ్యర్థులు. టిజిటిలో ఉన్న ఖాళీలను మెరిట్ సాధించిన తమకు కేటాయించాలని కోరుతున్నారు. ఏళ్ళు గడుస్తున్నా ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయకుండా... నిరుద్యోగులకు మనోవేదన మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే నోటిఫికేషన్లు, పెండింగ్ ఫలితాలు ఇస్తూ.. ఎన్నికలు ముగిశాక మళ్లీ కాలయాపన చేయడం మానుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడటం మానుకోవాలని సూచిస్తున్నారు. ఎన్నికలకు ముందు చేసే ట్రిక్స్ ను ప్రజలంతా గమనిస్తున్నారని, ప్రభుత్వ తీరు మారకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిరుద్యోగులు, విపక్షాలు, ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి.