జవాన్లను బలితీసుకుంటున్న కరోనా
ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరిలో భయబ్రాంతులను సృష్టించి లక్షలాది మంది ప్రాణాలను హరిస్తున్న కరోనా కేంద్ర పోలీస్ బలగాలపై పంజా విసురుతుంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని పోలీసు బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ, ఎన్‌ఎస్‌జీ, సీఐఎస్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్‌లోని సిబ్బందికి కరోనా సోకింది. ఇప్పటికే దాదాపు 36 వేల మందికి ఈ మహమ్మారి బారిన పడగా వారిలో 128మంది మరణించారు. ఇంకా ఆరువేలకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అయితే ఈ వైరస్ బారినపడిన వారిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులలో విధులు నిర్వర్తించే బీఎస్ఎఫ్ సిబ్బందే ఎక్కువగా ఉన్నారు. సీఆర్‌పీఎఫ్‌లో 10,602 మంది, సీఐఎస్ఎఫ్‌లో 6,466 మంది, ఎన్‌డీఆర్ఎఫ్‌లో 514 మంది, ఐటీబీపీలో 3,845 మంది, ఎస్ఎస్‌బీలో 3,684 మంది, ఎన్ఎస్‌జీలో 250 మందికి కరోనా సోకింది. ఈ వైరస్ కారణంగా సీఆర్‌పీఎఫ్‌లో 52 మంది, బీఎస్ఎఫ్‌లో 29 మంది, సీఐఎస్ఎఫ్‌లో 28 మంది మరణించారు. కరోనా సోకిన వారందరికీ సైనిక వైద్యఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నారు. కరోనా కట్టడికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని అయినా వందలాది మంది వైరస్ బారిన పడుతున్నారని అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.