టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్...!
posted on Oct 6, 2020 @ 7:46PM
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి వైసీపీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు కేసులతో సతమతమౌతున్న అయన పై మరో కేసు నమోదయ్యింది. తాజాగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీపై తాడిపత్రి పీఎస్‌లో ఈ కేసు నమోదయ్యింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, తనయుడు అస్మిత్‌రెడ్డితో పాటు 32 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో కరోనా చికిత్స తీసుకున్న జేసీ సోమవారం నాడు తాడిపత్రికి చేరుకున్నారు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డికి భారీ ర్యాలీతో కార్యకర్తలు, అనుచరులు స్వాగతం పలికారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఇలా ర్యాలీ చేయకూడదని ఇది నిబంధనలకు విరుద్ధమని చెపుతూ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విషయమై జేసీ బ్రదర్స్ కానీ.. అస్మిత్ రెడ్డి కానీ స్పందించలేదు. ఇప్పటికే జేసీ ప్రభాకర్, అయన కుమారుడు అస్మిత్ కొన్ని రోజుల పాటు కడప సెంట్రల్ జైల్‌లో కూడా ఉన్న సంగతి తెలిసిందే.