ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణను ఆదుకోవాలంటూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు.    భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని కేసీఆర్‌ వెల్లడించారు. ఈ మేర‌కు సాయం చేయాల్సిందిగా ప్ర‌ధానికి లేఖ రాశారు. కాగా తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు అందించాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్‌ సాయం కోరారు.   కాగా, ప్రధాని మోదీ ఇప్పటికే సీఎం కేసీఆర్‌ తో మాట్లాడారు. స‌హాయ‌క చ‌ర్య‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని ర‌కాలుగా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్న‌ద‌న్నారు. తక్షణ సాయం కింద కేంద్రం రూ.1,000 కోట్లు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

సీనియర్ ఐఏఎస్ కు షాక్.. ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్..! 

ఏపీ ప్రభుత్వం సీనీయ‌ర్ ఐఏఎస్ అధికారి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ను ఆక‌స్మాత్తుగా బ‌దిలీ చేసింది. 1987 బ్యాచ్ కు చెందిన ఆయ‌న ప్రస్తుతం సీసీఎల్‌ఎ కమిషనర్‌ పదవితో పాటు అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ గా కూడా పని చేస్తున్నారు. అంతేకాకుండా అయన గ‌తంలో ఇంచార్జి సీఎస్ గా కూడా ప‌నిచేశారు. దీంతో ఈయ‌నే నెక్స్ట్ సీఎస్ అన్న ప్ర‌చారం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఉంది. విధుల్లో నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న పేరున్న ఆయ‌నను తాజాగా ప్ర‌భుత్వం బ‌దిలీ చేస్తూ, ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వకుండా జీఎడీలో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించింది. అంతేకాకుండా కొత్త సీసీఎల్ఏగా 1987 బ్యాచ్ కు చెందిన సీనీయ‌ర్ ఐఏఎస్ అధికారి ఆదిత్య నాథ్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటు నీరబ్ కుమార్ నిర్వహిస్తున్న ఇతర శాఖల బాధ్యతలను కూడా ఆయనకు అదనంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.   అయితే జ‌గన్ అక్ర‌మాస్తుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న సీనీయ‌ర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యానాథ్ దాస్ ను త్వరలోనే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌బోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూర్చేలా ఏపీ ప్రభుత్వం.. హఠాత్తుగా బుధ‌వారం రాత్రి చేసిన బ‌దిలీలే నిదర్శనం అని అధికార వర్గాలలో చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆదిత్యనాథ్ దాస్ అత్యంత కీలకమైన భారీ నీటి పారుదల శాఖ నిర్వహించారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఆయన పేరు కూడా ఉంది. అయితే ఆయనపై ఉన్న అభియోగాలపై విచారణను హైకోర్టు నిలిపివేసింది. ఈ ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు దీనిపై ఆదిత్యనాథ్ దాస్‌కు నోటీసులు కూడా జారీ చేసింది.   ఇది ఇలా ఉండగా ప్ర‌స్తుతం సీఎస్ గా ఉన్న నీలం సాహ్ని ప‌ద‌వీకాలం ఎప్పుడో ముగిసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి మేర‌కు ఆమెకు ఇప్ప‌టికే రెండు సార్లు ప‌ద‌వీకాలాన్ని పొడిగించారు. అయితే ఆమె పదవీకాలం ఇక కేంద్రం పొడిగించే అవ‌కాశం లేదు. మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా నీలం సాహ్ని ప‌ద‌వీకాలాన్ని పొడిగించాల‌ని కోర‌లేదు. దీంతో కొత్త సీఎస్ ఎంపిక అనివార్యమౌతోంది.

ఖుష్బూపై 50 పోలీస్ స్టేషన్లలో కేసులు!!

సీనియర్ నటి ఖుష్బూ సుందర్‌ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆమె బీజేపీలో చేరుతూ కాంగ్రెస్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లంతా మానసింక వికలాంగులే.. అటువంటి పార్టీ నుంచి బయటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నానని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఖుష్బూకు తలనొప్పిగా మారాయి.    ఖుష్బూ వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు అన్నారు. కాంగ్రెస్ పై ఆమెకు ఏదైనా కోపం ఉంటే మరోలా విమర్శించుకోవాలని, మధ్యలో తమను కించపరిచే మాటలు ఎందుకు? అంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఖుష్బూ క్షమాపణలు చెప్పారు. అయితే, ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ, కొందరు ఆమెపై 50 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఖుష్బూ చెప్పిన క్షమాపణలను తాము అంగీకరించబోమని, ఆమె చట్టాన్ని ఉల్లంఘించారని, ఆమెపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు. దీంతో తొందరపాటు వ్యాఖ్యలు ఖుష్బూకి చిక్కులు తెచ్చి పెట్టాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

మూడో స్థానమొస్తే పార్టీకి మూడినట్టే! హస్తంలో దుబ్బాక టెన్షన్

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. తెలంగాణలో అధికారం కోసం తహతహలాడుతున్న హస్తం పార్టీ భవిష్యత్ ను దుబ్బాక బైపోల్ డిసైడ్ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ కొత్త ఇంచార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ కూడా పార్టీ నేతలకు ఇదే చెప్పారట. అందుకే పీసీసీ, సీఎల్పీ నేతలంతా దుబ్బాక నియోజకవర్గంలోనే మకాం వేశారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు దుబ్బాకలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంత సీరియస్ గా కాంగ్రెస్ నేతలు దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.    తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా.. బీజేపీ ఇటీవల దూకుడు పెంచింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతోంది. కేసీఆర్ సర్కార్ పై పోరాటంలోనూ కాంగ్రెస్ కంటే స్పీడుగా ఉన్నారు కమలనాధులు. దుబ్బాక ఉపఎన్నికలోనూ ప్రచారంలో ముందున్నారు. రఘునందన్ రావు. ఆయనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. ఎందుకంటే దుబ్బాకలో బీజేపీ గెలిచినా... సెకండ్ ప్లేస్ వచ్చినా కాంగ్రెస్ కు గండమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అది మరింత బలపేతం అయ్యే అవకాశం ఉంటుంది. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం కలగానే మిగిలిపోతుందనే ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.    దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచి తీరాలి. ఒకవేళ ఓడినా కనీసం రెండో స్థానంలోనైనా నిలవాలి.. లేదంటే తమకు తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిచినా తమకు పెద్ద నష్టం ఉండదని హస్తం పార్టీ భావన. ఎందుకంటే కారు పార్టీ గెలిచినా అధికారంతో పాటు సెంటిమెంట్ తో గెలిచిందని చెప్పుకోవచ్చు. అదే తమ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తే ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ నేతలు ఓపెన్ గానే చెబుతున్నారు. అందుకే బీజేపీ లక్ష్యంగానే దుబ్బాకలో కాంగ్రెస్ ప్రచారం సాగుతున్నట్లు కనిపిస్తోంది. గెలవడం లేదంటే రెండో స్థానం సాధించడం కోసం హస్తం నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.    దుబ్బాక ఉప ఎన్నికలో గతానికి భిన్నంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తోంది కాంగ్రెస్. గ్రామగ్రామాన ప్రచారంతో హోరెత్తిస్తోంది. నియోజకవర్గంలోని 146 గ్రామాలకు టీపీసీసీలోని 146 మంది ముఖ్యనాయకులను ఇన్‌ఛార్జిలుగా నియమించింది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. పీసీసీ నియమించిన విలేజ్ ఇన్‌ఛార్జిలు ఆ గ్రామ పార్టీ నాయకులతో ప్రచారం కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీలతో కలిసి వారు బూత్‌ల వారీగా ప్రచారం చేస్తున్నారు. ప్రచార గడువు ముగిసే వరకు దుబ్బాక నుంచి నేతలెవరు రావొద్దని మాణికం ఠాగూర్ ఆదేశించారని చెబుతున్నారు. గ్రామాల వారీగా ఫలితాలను విశ్లేషించి మంచి ఫలితాలు తెచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారని తెలుస్తోంది. దాంతో కాంగ్రెస్ నేతలంతా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.   చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని చేర్చుకుని దుబ్బాక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ముఖ్యనేతలంతా ప్రచారం చేస్తుండటంతో గెలుపుపై ఆశలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తాము ఊహించిన దాని కంటే ఎక్కువ కనిపిస్తుందని.. ఇదే జోష్ లో ప్రచారం చేస్తే గెలుపు ఖాయమేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గెలవకపోయినా బీజేపీ కంటే ముందుండడం ఖాయమని కాంగ్రెస్ నేతలు ఖచ్చితంగా చెబుతున్నారు.

టీఆర్‌ఎస్ ఇమేజీకి.. ‘వర్షం’ డ్యామేజీ

‘కారు’ మబ్బులు.. విమర్శల ‘వర్షం’   ఇస్తాంబుల్‌గా మార్చేస్తాం.. మరో లండన్ చేసేస్తాం.. విశ్వనగరంగా మారుస్తాం.. ప్రపంచంలో నెంబర్ వన్ సిటీగా మారుస్తాం.. 640 కోట్లు ఖర్చు పెట్టాం.. ఇవన్నీ ఎక్కడో ఎప్పుడో విన్నట్లు ఉన్నాయి కదూ?.. కేసీఆరో, కేటీఆరో, ఇంకెవరో మంత్రులో ఇప్పటికి కొన్ని వందల డజన్ల సార్లు చెప్పినట్లు అనిపిస్తోంది కదూ? యస్.. మీరేమీ పొరపాటునో, గ్రహపాటునో వినలేదు. మీరు విన్నది, గుర్తు చేసుకుందీ నిఝంగా నిజం! సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అనేక సందర్భాల్లో చేసిన బాసలే ఇవి. ఇచ్చిన ప్రసంగాలే అవి!   అది ఎంత నిజమో..  ఇప్పుడు మీరు చూస్తున్న వర్షనగరమూ అంతే నిజం. ఒక్కరోజు కురిసిన రాకాసి వర్షానికి, రాజధాని నగర రాదార్లు గోదార్లయ్యాయి. మొసళ్లు రోడ్లపైకి వచ్చాయి. చిన్నారులతోపాటు, కార్లు జలసమాధి అయ్యాయి. రోడ్లమీద ఉండాల్సిన నీళ్లు వంటింట్లోకి చేరాయి. కాలనీలు చిన్నపాటి చెరువులయ్యాయి. మొత్తంగా విశ్వనగరం విషాదనగరమయింది. దీనికి కారణం కొంత మానవ స్వయంకృతమయితే, మిగిలిన పాపాలన్నీ  పాలకుల ఖాతాలోనివే. లోతట్టు ప్రాంతాలు, నాలాలని తెలిసి కూడా అక్కడే ఇళ్లు కట్టుకున్న జనంలో.. ఇన్ని భారీ వర్షాలు, ఇంత ప్రాణనష్టం  కూడా మార్పు తీసుకురాలేపోయాయి. కళ్లెదుటే కొట్టుకుపోతున్న కుటుంబాల ఆర్తనాదాలు కూడా,  అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించలేకపోతున్నాయి. ఇది నిస్సందేహంగా ప్రజల స్వయంకృతమే.   మరి ప్రభుత్వానికయితే బాధ్యత ఉంది కదా? వారిని బలవంతంగానయినా ఖాళీ చేయడం పాలకుల బాధ్యత కదా? అయినా ఓట్ల కోసం వారికి ఇంటి నెంబర్లు, రేషన్‌కార్డులిస్తున్న పాపం పాలకులదే కదా? కోట్లాదిరూపాయలతో వేస్తున్న రోడ్లన్నీ ఒక్క వర్షానికే కొట్టుకుపోతున్నాయంటే, వాటి నాణ్యతపై నిఘా పెట్టడంలో సర్కారు విఫలమయినట్లే అర్ధం. సెప్టెంబర్ 18న కురిసిన వర్షం మిగిల్చిన కాళరాత్రిని, ‘సిటి’జనులు ఇంకా మర్చిపోకముందే.. మరో జలప్రళయం నగరాన్ని నరకం చేయడాన్ని ప్రజలు తాళలేకపోతున్నారు. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షానికి, మల్కాజిగిరి దీనదయాళ్‌నగర్‌లో ఓ బాలిక, మరో ఘటనలో మరో మహిళ కొట్టుకుపోయిన విషాదం మరువకముందే ఇంకో ఉత్పాతం. కలసి వెరసి.. టీఆర్‌ఎస్ సర్కారుపై పెరుగుతున్న వ్యతిరేకత. హైదరాబాద్ నగరంలో 16.4 కి లోమీటర్ల మేర నాలాలు విస్తరిస్తామని కేటీఆర్ మొదట్లో హామీ ఇచ్చారు. ఇంకా ఆ లక్ష్యానికి 60 శాతం అడుగుల దూరంలో ఉన్నారు. అంటే గమ్యాన్ని ముద్దాడేందుకు ఇంకెన్ని దశాబ్దాలు పడతాయో ఎవరికీ తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి పాలకులు వేసిన కిర్లోస్కర్ కమిటీ.. 170 కిలోమీటర్ల మేర ఉన్న 71 నాలాలు విస్తరించాలని, అందుకోసం 10 వేల ఆక్రమణలు తొలగింపుతోపాటు, వీటికి 6700 కోట్లు ఖర్చు అవుతుందని  నివేదించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆ కమిటీ కొండెక్కింది.   మళ్లీ తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత, వోయాంట్స్ కన్సల్టెన్సీకి ఆ బాధ్యత అప్పగించింది. ఆ కమిటీ చేసిన సర్వేలో.. 28 వేల ఆక్రమణలు తొలగించాలని, 390 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించాలని, అందుకు 12 వేలు కోట్లు ఖర్చవుతుందని నివేదిక ఇచ్చింది. చివరాఖరకు 12,182 ఆక్రమణలున్నట్లు తేల్చింది. 390 కిలోమీటర్ల మేర ఉన్న నాలా ఉండగా, అందులో పైకప్పులున్నవి చాలా తక్కువ. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆక్రమణలు పెరిగాయన్నమాట. మరి జీహెచ్‌ఎంసీ ఏం చేస్తుందన్నది ప్రశ్న.   ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్‌కుమార్.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు,  పౌరులకు ఓ విచిత్రమైన సవాల్ విసిరారు. ఎవరైనా సరే.. గుంతలు పడిన రోడ్లు చూపిస్తే బహుమానం ఇస్తామన్నారు. అంటే హైదరాబాద్ రోడ్డు వంగి ముద్దుపెట్టుకోవాలన్నంత అందంగా.. చాలా సొంపుగా ఉంటాయని, అసలు గుంతలే ఉండవన్నది ఆయన కవి హృదయమన్నమాట. ఆయన సవాలుకు జవాబుగా, విపక్షాలు గుంతలుపడ్డ చోట నిలబడి ఫొటోలు దిగడంతో, సోమేష్‌కుమార్ ఇక ఆ సవాలు ముచ్చటే మర్చిపోయారు.   ఇప్పుడు మళ్లీ వందేళ్ల తర్వాత వచ్చిన జలప్రళయం రాజధానిని ముంచేసింది. జనజీవనాన్ని భయకంపితులను చేసింది. మళ్లీ.. ‘కఠిన చర్యలు’, ‘హామీ’ల వర్షం, ‘తగిన జాగ్రత్తలు’ అనే  పాలకుల పడికట్టు పదాలు, మామూలుగానే వినిపిస్తున్నాయి తప్ప, ఆచరణ శూన్యం. సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకూ వర్షాఘానికి బలవుతున్న నగర ప్రజలు, సహజంగానే టీఆర్‌ఎస్ సర్కారుపై నిప్పులు కురిపిస్తున్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలపై ఆగ్రహావేశంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వం తమను కష్టాల కడలి నుంచి కాపాడటంలో విఫలమయిందని భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు-కార్పొరేటర్లు చోద్యం చూస్తున్నారని, అధికారులు తమను గాలికొదిలేశారన్న నిర్ణయానికి వచ్చారు.  ఖచ్చితంగా ఇవన్నీ,  రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ప్రభావం చూపేవే.   ప్రజల ఆగ్రహజ్వాల,  ఖచ్చితంగా అధికార పార్టీకి ప్రమాదఘంటికనే. ప్రభుత్వ అసమర్ధ నిర్వాకం వల్లనే,  తాము గంటలపాటు కరెంటు-నిత్యావసర వస్తువులకు దూరమయ్యామని, రోజంతా నరకయాతన అనుభవించామన్న చేదు జ్ఞాపకాలు, విషాద దృశ్యాలు అప్పటివరకూ జనం గుర్తుంచుకుంటే..  ‘కారు’ ఒక్క అడుగు కూడా ముందుకేయడం కష్టం. ఈ అసంతృప్తి అగ్నికి విపక్షాలు,  ఎన్నికల వరకూ ఆజ్యం పోయకుండా ఉంటారనుకోలేం. అప్పటికీ నష్టనివారణకు దిగకపోతే నగరంలో షి‘కారు’కు...  కష్టమే! సహజంగా వర్షాలొస్తే పాలకులకు పండుగ. జనం కష్టాలు మర్చిపోతారు. కానీ రాజధాని నగరంలో వర్షాలొస్తే, పాలకుల ఇమేజీ దారుణంగా  డ్యామేజీ అవుతూనే ఉంటుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది.  -మార్తి సుబ్రహ్మణ్యం

గడువు ప్రకారమే గ్రేటర్ పోల్! వరదలతో మారిన గులాబీ ప్లాన్?

గ్రేటర్ లో టీఆర్ఎస్ కు వరదపోటు తగలనుందా? జీహెచ్ఎంసీ ముందస్తు ఎన్నికలపై గులాబీ పార్టీ ఆలోచనలో పడిందా? గడువు ప్రకారమే బల్దియా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుందా? అంటే ప్రస్తుతం అవుననే సమాధానమే వస్తోంది. గ్రేటర్ ఎన్నికలను మూడు నెలల ముందే నిర్ణయించాలని భావించిన అధికార పార్టీ.. ఆ దిశగా కసరత్తు కూడా చేసింది. ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ అయితే మరింత స్పీడ్ గా వెళ్లారు. గ్రేటర్ ఎన్నికలపై పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ వారిని పరుగులు పెట్టించారు. అయితే తాజాగా గ్రేటర్ ఎన్నికలపై అధికార పార్టీ ఆలోచనలో పడిందని తెలుస్తోంది. ముందస్తు వెళ్లకుండా షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని భావిస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇందుకు హైదరాబాద్ లో వచ్చిన వాన, వరదలే కారణమంటున్నారు.    గ్రేటర్ హైదరాబాద్ ను ముంచెత్తిన వరదలు... అధికార పార్టీని షేక్ చేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే నగరంలో వరద బీభత్సం పెరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. వరద నివారణ చర్యలు చేపడతామంటూ  అరేండ్లుగా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఎక్కడా ఏమి చేయడం లేదని జనాలు మండిపడుతున్నారు. వరదలో ఉన్న ప్రజలను కాపాడటంలోనూ విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. వరద బాధితులకు ఆహారం అందించడం లేనూ బల్దియా చేతులెత్తిసిందనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు అధికారులు ఎవరూ రాకపోవడంతో  స్థానిక యువకులే సాహసం చేసి వృద్ధులు, పిల్లలను ఇండ్ల నుంచి బయటికి తీసుకొచ్చిన విజువల్స్  వైరల్ గా మారాయి. మంగళవారం రాత్రి వరద ముంచెత్తితే జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం మధ్యాహ్నానికి తమ దగ్గరకు వచ్చారని కొన్ని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ స్వయంగా జనాగ్రహం చవిచూశారు. తమ ప్రాంతానికి వచ్చిన కేటీఆర్ తో స్థానికులు వాగ్వాదానికి దిగడం కనిపించింది. వర్షాలు వచ్చినప్పుడల్లా వరదలు ఇండ్లను ముంచెత్తుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జనాలు మంత్రిని నిలదీశారు. ప్రచారం చేసుకోవడమే తప్ప మీరు చేసిందేంటని కొందరు కేటీఆర్ ను నేరుగానే ప్రశ్నించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో ఆయన హడావుడిగా పర్యటించి వెళ్లారు. మంత్రి దగ్గరకు జనాలు రాకుండా పోలీసులు అడ్డుకోవడం ఎల్బీనగర్ ఏరియాలో వివాదాస్పదమైంది. తమతో మాట్లాడకుండా, సమస్యలు తెలుసుకోకుండా ... మంత్రి కేటీఆర్ ఇక్కడికి  ఎందుకు  వచ్చారని మహిళలు ప్రశ్నించడంతో బల్దియా అధికారులు సమాధానం చెప్పకోలేక దిక్కులు చూశారు.    వరదలు ముంచెత్తడంతో గతంలో ఎప్పుడు లేనంతా  భాగ్యనగరం  విలయాన్ని చూసింది. ప్రకృతి విలయానికి 30 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. పాత భవనాలు కూలి కొందరు సజీవ సమాధయ్యారు. నగరంలోని వందలాది కాలనీలు , వేలాది ఇండ్లు పూర్తిగా నీట మునిగాయి. లక్షలాది జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్లు, బైకులు ఎన్ని కొట్టుకుపోయాయే లెక్కలేదు.  వాహనాలు వరదలో పోతుండగా చూడటం తప్ప ఎవరూ ఏం చేయలేని పరిస్థితి ఉందంటే వరద ఉధృతి  రేంజ్ లో ఉందో ఊహించవచ్చు. సిటీలోని  రహదారులు, కాలనీలు చెరువులుగా మారాయి. హైదరాబాద్ నగరం కనివిని ఎరుగని జల విలయాన్ని చూసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు రెండు రోజులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.     పాతబస్తీ  అయితే చిన్నపాటి సముద్రంలానే కనిపించింది. వందలాది మంది కొన్ని గంటల పాటు వరద నీటిలోనే ఉండిపోయారు. బిల్టింగులపైకి చేరి సాయం చేయాలని, రక్షించాలని కేకలు పెట్టారు. వరద కట్టడిలో విఫలమైన అధికారులు.. వరద నుంచి బాధితులను కాపాడటంలోనూ ఆలస్యంగా స్పందించారు. వరద ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం లేకపోవడం కూడా సిబ్బందికి కష్టంగా మారింది. పాతబస్తీలో సహాయ చర్యల  కోసం హెలికాప్టర్లను ఉపయోగించాల్సి వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ కు తోడుగా ఆర్మీ, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగి వందలాది మందిని వరదల నుంచి రక్షించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో కరెంట్ లేకపోవడంతో ప్రజలు అంధకారంలో ఉండిపోయారు.               హైదరాబాద్ నగరాన్ని అమెరికాలోని డల్లాస్‌లా తయారు చేస్తాం.. పాతబస్తీని ఇస్తాంబుల్ గా మారుస్తామని  తెలంగాణ సీఎం కేసీఆర్  పలు సార్లు ప్రకటించారు. కాని అధికారంలోకి వచ్చి ఆరేండ్లైనాఅతీ గతి లేదు. అభివృద్ధి చెందడం కాదు గతంలో కన్నా సమస్యలు పెరిగాయంటున్నారు ప్రజలు.  ఆరేండ్లలో హైదరాబాద్ లో దాదాపు 60 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వం చెబుతోంది. అయితే సిటీలో ఎక్కడా కొత్త నాలాలు వేయలేదు. ఉన్నవాటిని విస్తరించలేదు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించలేదు. నగరంలోని  చెరువులు కబ్జాకు గురికావడంతో వరద ఉధృతికి వాటి కట్టలు తెగాయి. నీళ్లు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వరదంతా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. చెరువుల కబ్జాలు అడ్డుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలేవి  తీసుకోలేదని సిటీ జనాలు మండిపడుతున్నారు. 60 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.     హైదరాబాద్ దుస్థితిపై విపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా తయారైందని ఆరోపిస్తున్నాయి. డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ విశ్వనగరమంటూ హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చారని మండిపడుతున్నారు. విపక్షాలు ఆరోపణలు,  జనాల ఆగ్రహాన్ని స్వయంగా చూసిన కేటీఆర్.. జీహెచ్ఎంసీ ఎన్నికలపై వైఖరి మార్చుకున్నట్లు  చర్చ జరుగుతోంది.  వరదలతో ప్రభుత్వంపై జనాలంతా ఆగ్రహంగా ఉన్నారని, ఇప్పట్లో ఎన్నికలకు వెళితే వ్యతిరేక ఫలితాలు వస్తాయని కేటీఆర్ భావిస్తున్నారట. ప్రస్తుత పాలకమండలికి ఫిబ్రవరి వరకు గడువుంది. ఆ సమయానికి ప్రజల్లో కొంత మార్పు వస్తుందని, వరదలను మర్చిపోయే అవకాశం ఉంటుందని మెజార్టీ గులాబీ నేతల అభిప్రాయంగా ఉందట. అందుకే గ్రేటర్ లో ముందస్తుకు వెళ్లకూడదని కేటీఆర్ దాదాపుగా నిర్ణయించారని చెబుతున్నారు. అయితే వరదల కారణం కాకుండా కరోనా వంకతోనే .. షెడ్యూల్ ప్రకారమే బల్దియా ఎన్నికలు నిర్వహిస్తామని అధికార పార్టీ చెప్పాలని డిసైడైనట్లు తెలుస్తోంది.

ఏపీ హైకోర్టు మునిగింది.. సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారుల హల్చల్

ఏపీలో రాజధాని అమరావతిని వీలైనంతగా బదనాం చేసే పని వైసీపీ అధికారంలోకి రాకముందు నుండే మొదలు పెట్టింది. అది అమరావతి కాదు భ్రమరావతి అని ఒకసారి.. అది కేవలం ఒక కులం వారు ఉండే ప్రాంతమని మరోసారి చేసిన సంగతి తెల్సిందే. ఇపుడు మూడు రాజధానుల జపం చేస్తున్న జగన్ సర్కార్ ఆలోచనలకు తగ్గట్టుగా ఇప్పటికీ అమరావతి పై దాడి జరుగుతూనే ఉంది.   తాజాగా వైసీపీ మద్దతుదారులు సోషల్‌ మీడియాలో పెట్టిన ఒక పోస్టు తీవ్ర కలకలం రేపుతోంది. అమరావతిలోని హైకోర్టు చుట్టూ నీళ్లు చేరుతున్నట్లు, ఇక లాయర్లు పడవల్లో వెళ్తున్నట్లుగా ఓ భ్రమ సృష్టించారు. దీంతో హైకోర్టు మునిగిపోయింది, లాయర్లు పడవల్లో పోతున్నారంటూ దానికి ఒక వ్యాఖ్య కూడా జత చేసారు. దీంతో హైకోర్టు చుట్టూ నీళ్లు చేరాయంటూ వైసీపీ అనుకూల మీడియా కూడా హల్‌చల్‌ చేసింది. అయితే ఇది తప్పుడు ప్రచారమే అని తేలింది. అయితే వాస్తవానికి అక్కడ రోడ్ల నిర్మాణంలో భాగంగా తవ్విన మట్టిని రోడ్డుకు అటూ ఇటూ వేయడంతో... వర్షపు నీరు పోవడానికి దారిలేక కేవలం ఒకే ఒక్కచోట 50 మీటర్ల మేర నీరు నిలిచింది. పక్కనున్న మట్టికట్టకు చిన్న గండి కొడితే... ఐదు నిమిషాల్లో ఆ నీరంతా వెళ్లిపోతుంది. కానీ... వైసీపీ మద్దతుదారులు ఏకంగా హైకోర్టునే ముంచేశారు! అయితే తాజాగా ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ అమరావతి రైతులు సోషల్‌ మీడియాలో ఒరిజినల్ చిత్రాలతో పోస్టులు పెట్టారు. దీంతో వైసిపి మద్దతుదారులు సోషల్ మీడియాలో చేసిన ఈ మాయాజాలం చూసి అందరు అవాక్కవుతున్నారు   అంతేకాకుండా ఒకవైపు అమరావతిని పూర్తిగా డైల్యూట్ చేసేసి.. వైజాగ్ షిఫ్ట్ అయ్యేందుకు సర్వం సిద్ధం చేసుకున్న సర్కార్.. కేవలం కోర్టు క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తూ ప్రస్తుత రాజధానిపై ఇంకా బురద చల్లాలని చూస్తుండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఇలా ఉండగా ఆ పార్టీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సైతం.. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఊరు మునిగిపోయిన ఫోటో పెట్టి.. అమరావతి మునిగిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే దానికి కౌంటర్ పడిపోయింది. ఆ ఫోటో గోదావరి జిల్లాదని ఆధారాలతో సహా టీడీపీ వాళ్లు పెట్టేశారు.

తిరుపతిలో యువతిపై పాస్టర్ అత్యాచారం.. ఫిర్యాదుపై పట్టించుకోని దిశా స్టేషన్ పోలీసులు  

తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన 20 ఏళ్ల యువతిపై ఓ పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడదమే కాకుండా అత్యాచారం చేశాడు. ఈ ఘటన పై బాధితురాలి తల్లి కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు దిశా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినా కేసు నమోదు చేయకపోవడంతో.. వారు స్పందన కార్యక్రమంలో అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు అదనపు ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేయాల్సి వచ్చింది.   ఈ అత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలి తల్లి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం "తిరుపతిలో ఉండే పాస్టర్ దేవసహాయంకు చెందిన రెయిన్‌బో క్లినిక్ ప్రోడక్ట్ కంపెనీలో గత నెల 4వ తేదీన మా పెద్దకుమార్తె (బాధితురాలు) పనికి చేరింది. అయితే ఈ నెల 3వ తేదీన దేవసహాయం కారులో వచ్చి.. సరకు డెలివరీ ఇవ్వాలని.. బాధితురాలిని తీసుకెళ్లాడు. అలా చెప్పి తీసుకెళ్లిన పాస్టర్ రేణిగుంట రోడ్డులోని తుకివాకం గ్రామ సమీపంలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తరువాత అమ్మాయి ఇంటికి వచ్చాక జరిగిన ఘోరం గురించి తమకు తెలిసింది. దీంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దిశ పోలీస్ స్టేషన్‌కు వెళితే.. వాళ్లతో మీరు పోరాటం చేయలేరని అక్కడి అధికారులు అన్నారు. అంతేకాకుండా మా అమ్మాయిని వేరే పని చేసుకోమని కూడా సలహా ఇచ్చారు. దీంతో మేము స్పందన కార్యక్రమం ద్వారా ఈ దారుణం పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం" అని ఆమె చెప్పారు. ఇంకా, స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదును అదనపు ఎస్పీ సుప్రజ.. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ కు పంపడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి.. బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.   ప్రస్తుతం బాధితురాలు తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఈ ఘటన పై అలాగే.. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు నిరసనగా టీడీపీ నేత నరసింహయాదవ్‌, టీఎన్‌ఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ శ్రేణులు ధర్నా చేసారు.

తెలంగాణలో ‘తెలుగు’ జెండా పీకేసినట్లే!

రమణపై తమ్ముళ్ల తిరుగుబాటు   బాబుపై మరోసారి లేఖాస్త్రం   ఆర్ధిక పరిస్థితులే అసలు సమస్యట   తెలంగాణ గడ్డపై కళ్లు తెరచిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు అదే తెలంగాణలో కన్నుమూసే విషాదకర పరిస్థితికి చేరింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా పూర్తిగా పీకేసినట్లుగానే కనిపిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణలో పార్టీని అనాధను చేశారన్న ఆగ్రహం, ఎన్టీఆర్ కాలం నుంచి కొనసాగుతున్న తమ్ముళ్లలో కట్టలు తెంచుకుంటోంది. ఓటుకు నోటు కేసు తర్వాత, తమ అధినేత.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయపడి పార్టీని వదిలేసి పోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రనేతలంతా ఎవరి దారి వారు చూసుకుని వెళ్లిపోగా, ఉన్న వారి భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ అసమర్థ నాయకత్వం పుణ్యాన, కొస ప్రాణంతో ఉన్న పార్టీ.. పూర్తిగా సమాధి కావడానికి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కాలయాపన విధానమే కారణమని తమ్ముళ్లు ధ్వజమెత్తుతున్నారు.   తాజాగా.. రమణను మార్చాలని తెలంగాణ టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నేతలు మరోసారి చంద్రబాబుకు లేఖాస్త్రం సంధించారు. ఈ విధంగా టీటీడీపీ నేతలు బాబుకు లేఖ రాయడం ఇది రెండోసారి. మంగళవారమే వారు తమ లేఖను బాబుకు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఎవరినీ కలవడం లేదని సిబ్బంది చెప్పడంతో, లేఖను ఆయన పీఏకు ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ సంస్థాగత విషయాలు చర్చించాలని వారంతా లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితి అటు రమణకు సైతం పార్టీ కార్యాలయంలో సిబ్బంది ముందు ఇబ్బందికరంగా మారింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో అన్ని పార్టీలు తమ అభ్యర్ధిని ప్రకటించి, ఆ మేరకు ప్రచారంలో ఉన్నాయి. కానీ తమ పార్టీ మాత్రం ఇంతవరకూ అభ్యర్ధిని ప్రకటించలేదని తమ్ముళ్లు, రమణపై మండిపడుతున్నారు. అటు ఆరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలపైనా, రమణ ఇప్పటిదాకా చర్చించలేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందా? లేదా అన్న దానిపైనా స్పష్టత ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు.   ఈ విషయంలో రమణ చెబుతున్న దానికీ, చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకూ పొంతన ఉండటం లేదంటున్నారు. ఏ నిర్ణయమయినా చంద్రబాబును అడిగే తీసుకుంటానని రమణ, పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం.. తెలంగాణకు సంబంధించిన వ్యవహారాల్లో, మీరే సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ నేతలకు చెబుతున్నారు. ప్రతి దానికీ నా నిర్ణయం కోసం ఎదురుచూడవద్దని, మీరే నిర్ణయం తీసుకోమని స్పష్టం చేస్తున్నారు. దీనితో ఎవరి మాట నమ్మాలో అర్ధం కావడం లేదని నేతలు వాపోతున్నారు. లాక్‌డౌన్ మొదలయినప్పటి నుంచీ, బాబు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. అయినా, ఒక్కసారి కూడా తమతో భేటీ కాలేదని తమ్ముళ్లు చెబుతున్నారు.   అయితే ఈ విషయంలో పార్టీ నాయకత్వం.. కావాలనే తప్పించుకు తిరిగే ధోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు, సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచే పరిస్థితి ఉండదు కాబట్టి, పోటీ చేసి డబ్బులు ఖర్చు చేయడం ఎందుకన్న ఆలోచనతో, నాయకత్వం ఉన్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ నాయకత్వం ఆంధ్రాలోనే డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేనందున, ఇక తెలంగాణలో ఖర్చు పెడుతుందనుకోవడం అత్యాశేనంటున్నారు.   ‘ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో కూడా పార్టీ నయాపైసా ఇచ్చే అవకాశం లేదు. ఇక్కడ పార్టీపై మా సార్‌కు ఆసక్తి లేదు. నిజంగా ఆసక్తి, పట్టుదల ఉంటే రెండు నెలల ముందునుంచే ఎన్నికలపై దృష్టి పెట్టేవారు. ఆయన ఎన్నికల సమయంలో ఎంత వేగంగా పనిచేస్తారో, ఎంత వేగంగా ఆలోచిస్తారో మేం చూశాం కదా? ఇప్పుడు ఏం చేయాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలి. అదే గతం మాదిరిగా అన్ని వ్యవహారాలు బాబు చేతిలో ఉంటే, ఇప్పటి పరిస్థితి వేరుగా ఉండేది. సర్వే సంస్థలను ఎన్నికలకు మూడు నెలల ముందే దించేవారు.పరిశీలకుల హడావిడి, నాయకుల మీడియా సమావేశాలు ఉండేవి. అంటే దీన్నిబట్టి రెండు విషయాలు అర్ధమవుతున్నాయి. ఒకటి ఆయనకు తెలంగాణలో ఎన్నికలపై ఆసక్తి లేకపోయినా ఉండాలి. లేదా ఆర్ధికపరమైన నిర్ణయాలు ఆయన చేతిలో లేకపోయినా ఉండాలి. ఇప్పుడు ఈ కీలకమైన వ్యవహారాలన్నీ సారు చూడటం లేదంటున్నారు. గాలి వచ్చినప్పుడే గెలుస్తామన్న ధోరణి కనిపిస్తోంద’ని ఓ కీలక నేత వ్యాఖ్యానించారు.   రమణను తొలగించాలని నేతలంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నా, బాబు స్పందించకపోలడంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బహుశా మిగిలిన వారికి పగ్గాలు అప్పగిస్తే.. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారన్న భయంతోనే, నిర్ణయాన్ని నానుస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘మా సార్ కు బలమైన బీసీ కులానికి చెందిన నాయకుడు కావాలి. కానీ అతడు బలంగా ఉండకూడదు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా, తనపైనే ఆధారపడే నాయకుడు కావాలి. ఈ అర్హతలున్న నాయకుడి కోసమే, మా సార్ కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం లేదనిపిస్తోంద’ని ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.   కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి వంటి సీనియర్లలో ఒకరికి, అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందన్న సూచన చాలాకాలం నుంచీ వినిపిస్తోంది. ఓసీలకు ఇవ్వాలనుకుంటే దయాకర్‌రెడ్డి, రావులలో ఒకరికి ఇవ్వడం మంచిదని, బీసీలకు ఇవ్వాలనుకుంటే అరవిందకుమార్ గౌడ్‌కు ఇవ్వడం ఉత్తమమంటున్నారు. అదేవిధంగా ప్రత్యర్ధులపై విరుకుపడే నోరున్న న ర్శిరెడ్డి లాంటి నేతకు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే మంచిదని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా, వారు సొంత ఖర్చులతోనే పార్టీ నడిపించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కాగా దుబ్బాక ఉప ఎన్నికలో రమణను, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నర్శిరెడ్డి లేదా కాట్రగడ్డ ప్రసూనను రంగంలోకి దింపాలన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో? -మార్తి సుబ్రహ్మణ్యం

ఏపీ మంత్రికి 14 రోజులైనా తగ్గని కరోనా.. హుటాహుటిన హైదరాబాద్ అపోలోకు

ఏపీలో పులువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా సోకి ఇప్పటికే కోలుకున్నసంగతి తెలిసిందే. వీరిలో కొందరు హైదరాబాద్ మరి కొందరు చెన్నై హాస్పిటల్స్ లో చేరి చికిత్స తీసుకున్న విషయం తెల్సిందే. అయితే ఎపి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా సోకి ఇంకా తగ్గలేదు. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వెల్లంపల్లికి సెప్టెంబర్ 28వ తేదీన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్పటి నుండి ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే 14 రోజులు గడిచిన తర్వాత కూడా వెల్లంపల్లికి ఇంకా కరోనా తగ్గకపోవడంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.

జగన్ కు ఝలక్

కోరి కష్టాలు తెచ్చుకున్న జగన్   సీఎం సీటుకే ఎసరు తెస్తున్న పిటిషన్   జగన్ అంచనాలు తల్లకిందులు   ఒక్కతాటిపైకి వచ్చిన న్యాయవ్యవస్థ   జగన్ తీరును ఖండించిన ఢిల్లీ బార్ అసోసియేషన్   అదే బాటలో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేయన్   రహస్యాలు లీక్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే   151 సీట్ల తిరుగులేని మెజారిటీతో అధికారం కైవసం చేసుకున్న యుశ్రారైకా పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు తన మొండితనంతో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ఎన్వీ రమణపై ఆరోపణతో, జగన్ రాసిన లేఖ ఇప్పుడు ఆయన సీటుకే ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. చీఫ్ జస్టిస్‌కు జగన్ లేఖ రాయడం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది కాబట్టి, ఆయనను తక్షణం సీఎం పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలయిన పిటిషన్ ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసింది. ఇది ఆయన స్వయంకృతమే.   జగన్మోహర్‌రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించాలని జీఎస్ మణి, ప్రవీణ్‌కుమార్ యాదవ్ అనే సీనియర్ న్యాయవాదులు, తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ రమణకు వ్యతిరేకంగా రాసిన లేఖను విడుదల చేయడాన్ని, వారు తమ పిటిషన్‌లో ప్రస్తావించారు. మరోవైపు జగన్ లేఖ, దాని విడుదల తీరుపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా తీవ్రపదజాలంతో విరుచుకుపడింది. న్యాయ వ్యవస్థపై పెత్తనం చేసే ప్రయత్నంలో భాగంగానే.. జస్టిస్ రమణపై సీఎం జగన్ లేఖ రాశారని మండిపడింది.   రమణతోపాటు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు చేసి, లేఖలు రాయడం గర్హనీయమని ఖండించింది. ఇది న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేందుకు, జరిగిన కుట్రగానే భావిస్తున్నామని పేర్కొంది. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్న జస్టిస్ రమణ అత్యంత సమర్ధతగల, నిజాయితీపరుడయిన న్యాయమూర్తి అని స్పష్టం చేసింది. అటు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేయన్ కూడా, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ బాట పట్టింది. జగన్ తీరు న్యాయవ్యవస్థను బెదిరించేలా ఉందని, ఇది రాజ్యాంగ-న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకోవడమేనని, అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ జోసఫ్ అరిస్టాటిల్ ఖండించారు. జగన్ చర్య అవాంఛనీయమని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేదని వ్యాఖ్యానించారు.   తాజా పరిణామాలు పరిశీలిస్తే.. భారత న్యాయవ్యవస్థ అంతా ఒక్కతాటిపైకి వచ్చినట్లే కనిపిస్తోంది. తమపై రాజకీయ వ్యవస్థ పెత్తనం చేయడాన్ని, న్యాయవ్యవస్థ జీర్ణించుకోలేకపోతోందని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ లేఖలో వాడిన పదజాలం స్పష్టం చేస్తోంది. ఇలాంటి చర్యలను ఇప్పుడే ఎదుర్కొనకపోతే, భవిష్యత్తులో న్యాయవ్యవస్థ అందరికీ చులకన అవుతుందని, న్యాయమూర్తులను విలువ ఉండదని భావించినట్లు బార్ అసోసియేషన్ స్పందన స్పష్టం చేస్తోంది. ప్రధానంగా.. వివిధ ఆరోపణలతో జైల్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడు, సుప్రీంకోర్టు- హైకోర్టు న్యాయమూర్తులపైనే ఫిర్యాదు చేయడాన్ని, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ జీర్ణించుకోలేకపోయినట్లు కనిపిస్తోంది. ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తే, దేశంలో ఇక ఏ న్యాయమూర్తి స్వేచ్ఛగా తీర్పులివ్వకపోగా, తమపై సుప్రీంకోర్టుకు ఎలాంటి ఫిర్యాదులు వెళతయోనన్న భయంతో బతికే పరిస్థితి ఏర్పడుతుందని ముందుగానే ఊహించినట్లు స్పష్టమవుతోంది.   అయితే ఈ మొత్తం వ్యవహారంలో, తాను లక్ష్యంగా చేసుకున్న జస్టిస్ రమణ నైతిక-సాంకేతిక ఇబ్బందులలో  ఇరుక్కుంటారని జగన్ అంచనా వేశారు. ప్రధానంగా ఆయనకు చీఫ్ జస్టిస్ పదవి దక్కదని ఇప్పటికీ ఊహిస్తున్నారు. కానీ ఇది అటు తిరిగి ఇటు తిరిగి, తన పదవికే ఎసరు తెచ్చేలా చేస్తుందని అంచనా వేసినట్లు లేదు. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ చురుకుగా, క్రియాశీలకంగా పనిచేస్తుంది. గతంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రమణ వ్యవహార శైలిపై, ఢిల్లీ బార్ అసోసియేషన్‌కు బాగా అవగాహన ఉంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, రమణ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అవి ప్రజల అభిమానం కూడా చూరగొన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో, ఢిల్లీ బార్ అసోసియేషన్ ఏకోన్ముఖంగా జగన్ చర్యను ఖండించడం, జస్టిస్ రమణకు నైతిక స్ధైర్యం కలిగించే అంశమే.   సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదుల పిటిషన్ నేపథ్యంలో, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లంరెడ్డి కూడా ఇరుకున పడాల్సి వచ్చింది. చీఫ్ జస్టిస్‌కు సీఎం రాసిన లేఖ వివరాలను, ఆయనే మీడియాకు విడుదల చేశారు. ప్రభుత్వ  రహస్యాలను కాపాడతానని  రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం జగన్.. లేఖ వివరాలు వెల్లడించి, దానిని ఉల్లంఘించారన్నది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన ఎదుర్కోనున్న ప్రధాన అభియోగం.  అసలు చీఫ్ జస్టిస్‌కు ముఖ్యమంత్రి రాసిన లేఖ, ప్రభుత్వ సలహాదారుకు ఎలా వచ్చింది? ఆయన ఏ అధికారంతో వాటిని విడుదల చేశారన్న అభియోగం ఇటు కల్లం రెడ్డికి సంకటప్రాయమే. పాపం.. ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసుకుని, సలహాదారుగా ప్రశాంతంగా కాలం గడపుతున్న కల్లం రెడ్డి చివరకు ఈ వివాదంలో చిక్కుకున్నారు.  -మార్తి సుబ్రహ్మణ్యం  

సింహాచలం దేవస్థానం సీనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ పాలూరి నరసింగ రావు బుధవారం సస్పెండ్ అయ్యారు.    దేవాదాయ కమిషనర్ పి అర్జున రావు బుధవారం విడుదలచేసిన ఒక ప్రకటనలో, నరసింగ రావును సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేసారు. దేవస్థానంలో జరుగుతున్న అనేక అవకతవకలకు కారణమైన నరసింగ రావు, అనేక విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని, ముఖ్యంగా, దేవస్థానానికి సంబంధించిన 13 ఎకరాల భూమి విషయంలో హై కోర్ట్ యధా స్థితి (స్టేటస్ కో) ఇచ్చినప్పటికీ ఆ భూమి ఇతరులు చదును చేయడానికి నరసింగ రావు చట్ట విరుధంగా అది ఆక్రమించినవారికి సాయంచేస్తున్నదని తన దృష్టికి వచ్చినందున నరసింగ రావు ను వెంటనే సస్పెండ్ చేస్టజున్నట్లు ప్రకటించడం జరిగిందని కమిషనర్ తెలియజేసారు.    ఈ సస్పెన్షన్ ఆయనపై ఎంక్వైరీ అయ్యేవరకు కొనసాగుతుందని, తదుపరి అవసరమైన చర్యలు ఆ దేవాలయ ఎక్క్సిక్యూటివ్ ఆఫీసర్ తీసుకుంటారని కమిషనర్ తెలియజేసారు. నరసింగ రావు ప్రస్తుతమున్న పోస్టులో కొనసాగితే ఆయనపైనే జరుగుతున్న ఎంక్వైరీ ఏ కాకుండా, దేవాలయ భూములు ఫై జరుగుతున్న ఎంక్వైరీలలో కూడా అయన జోక్యం చేసుకునే అవకాశం ఉండడంవల్ల ఆయనను వెంటనే సస్పెండ్ చేయడం జరిగిందని అర్జున్ రావు తెలియజేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీకి పోతే బడికి పోయొచ్చినట్లుందట..

తెలంగాణాలో రెండు రోజుల పాటు నిన్న, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ సమావేశాల పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ.. తనకు మాత్రం ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీకి వెళుతున్నట్లుగా లేదని, స్కూలు కు పోయి హెడ్మాస్టర్‌ చెప్పే పాఠాలు విని వస్తున్నట్లుగ అనిపిస్తోందని జగ్గారెడ్డి అన్నారు. భారీ వర్షాలతో ఒకపక్క పంటలు నష్టపోయి రైతులు, మరోపక్క హైదరాబాద్‌ నగరం మునిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. అసెంబ్లీలో ఆ అంశాలపై అసలు చర్చే లేదని ప్రభుత్వ తీరును అయన తీవ్రంగా విమర్శించారు. శాసనసభ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ‘‘అసెంబ్లీ ఎప్పుడు పెడతరో.. ఎప్పుడు బంద్ జేస్తరో తెలియట్లేదు. బీఏసీ సమావేశాలు లేవు.. అజెండాలూ లేవు. ఈ రాష్ట్రంలో చాలా చిత్రమైన పాలన నడుస్తోంది’’ అని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కనీసం తమ నియోజకవర్గాల్లోని రైతుల ఇబ్బందుల గురించీ కూడా సభలో ప్రస్తావించలేదన్నారు. అంతేకాకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. చదువు వచ్చిన వేలుముద్రగాళ్లుగా మారారని అయన తీవ్రంగా విమర్శించారు. ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం బిల్లులను ఆమోదించుకునేందుకే ప్రస్తుత శాసనసభ సమావేశాన్ని పెట్టారని, అసలు ఆ బిల్లులపైన కూడా చర్చించలేదని అయన విమర్శించారు.   అసలు ఇంత హడావుడిగా జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌ విశ్వనగర అభివృద్ధికి రూ.72 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం కేసీఆర్‌ అంటున్నారని, అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే.. దాన్ని నమ్మేట్లుగా ఉందా? అని నిలదీశారు. హైదరాబాద్‌లో వేల కోట్లు ఖర్చు చేశారన్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే.. తన నియోజవర్గంలో జరిగిన అభివృద్ధి ఎక్కడో చూపాలన్నారు. హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లన్నీ‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌రెడ్డి హయాంలో కట్టినవేనన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించి.. తెలంగాణ ఉద్యమం వల్ల నిలిచిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారన్నారు. గడ్డిపోచ తప్పు చేస్తే.. ఏకంగా గడ్డిమోపునే తగలబెట్టిన చందంగా ధరణి వ్యవహారం ఉందని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల ఆస్తులను తీసుకొచ్చి ప్రయివేటు యాప్‌లో పెట్టి ఏం చేస్తారని అయన సర్కారు ని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చిన్న సమస్యలకు కూడా సీఎం దగ్గరికి వెళ్లి నిలదేసేవాళ్లు. ప్రస్తుత అసెంబ్లీతో ప్రజలకు ఏమాత్రం మేలు జరగదు. దుబ్బాక ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించి సీఎం కేసీఆర్‌కు దెబ్బ కొడితే అపుడు ఆయన ప్రజల వద్దకు వస్తడు. అలాకాకుండా రూ. 5 వేలే తీసుకుని ఓటేశారో ఆ డబ్బులతోనే బతకాల్సి వస్తది అని అయన ప్రజలను హెచ్చరించారు.

ఏపీలో పాలెగాళ్ళ పాలన.. జగన్ సర్కార్ పై రఘురామరాజు ఫైర్

వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "జగన్‌ నీరో చక్రవర్తిలా మారారు. రోడ్లు లేకపోయినా గన్నవరం వెళ్లేందుకు అయనకు హెలికాఫ్టర్‌ ఉంది. మరి ప్రజల సౌకర్యము కోసం ఇంటింటికీ హెలికాఫ్టర్స్‌ పథకం పెడతారా? ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని రాష్ట్రపతికి లేఖ రాశా. అసలు జగన్‌ మనసు తెలియకనే వైసీపీలో చేరా. ప్రస్తుతం ఏపీలో పాలెగాళ్ల పరిపాలన నడుస్తోంది. ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి ఒక పాలెగాడు. మా నియోజకవర్గం నరసాపురంలో ఓ పాలెగాడు ఆవ భూముల్లో అవినీతి చేశారు. అలాగే అమరావతి రైతులపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరం. పిచ్చి మాటలు మాట్లాడటం మంచిది కాదు. సీఎం బాబాయ్ ఆవ భూముల్లో అవినీతి చేశారని ప్రజలు అనుకుంటున్నారు. పార్లమెంట్‌లో మీ సామాజికవర్గం వారికి పదవులు ఇచ్చారు. అంతేకాకుండా జగతి పబ్లికేషన్స్‌లో ఎంపీ బాలశౌరి పెట్టుబడులపై సీబీఐకి ఫిర్యాదు చేశా. త్వరలో విచారణ కూడా జరుగుతుంది" అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

జగన్ లేఖపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సీరియస్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది.   హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడంతో ఆ పార్టీ నేతలు న్యాయమూర్తులపైనా, న్యాయవ్యవస్థపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అయితే ఏకంగా పార్లమెంట్ లో న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఇంకో అడుగు ముందుకేసి..  ఏపీ హైకోర్టును జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ సీజేఐకి లేఖ రాశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం మీడియా ముఖంగా వెల్లడించి సంచలనం రేపారు. అయితే, జగన్ లేఖను ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తప్పపట్టింది. న్యాయవ్యవస్థపై పెత్తనం చెలాయించే ప్రయత్నంలో భాగంగానే కాబోయే సీజేఐ స్థానంలో ఉన్న జస్టిస్ రమణపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.   జగన్ లేఖను ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, జగన్ చర్యలు న్యాయ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ మండిపడింది. జస్టిస్ రమణ ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి అని.. ఎలాంటి ఆధారాలు లేకుండా న్యాయమూర్తులపై, న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికింది. కోర్టుల స్వతంత్రతను దెబ్బదీసేలా జగన్ వ్యవహరించారని, న్యాయ వ్యవహారాల్లో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టుగా తాము భావిస్తున్నామని తెలిపింది. ఒక ప్రెస్ మీట్ ద్వారా ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడటం అత్యంత దారుణమని మండిపడింది. ఇది కచ్చితంగా కోర్టును ధిక్కరించడం కిందికే వస్తుంది. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న అపార నమ్మకాన్ని దెబ్బతీసే ఈ దుష్ట ప్రయత్నాన్ని ఢిల్లీ కోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది అని పేర్కొంది.    న్యాయమూర్తులపైనా, న్యాయవ్యవస్థపైనా బహిరంగ విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలు ఇప్పటికైనా దూకుడు తగ్గిస్తారో లేక అధికారంలో ఉన్న మమ్మల్ని ఆపే హక్కు ఎవరికీ లేదంటూ ఇలాగే దూకుడుగా వెళ్తూ ముందు ముందు పెద్ద సమస్యలు కొని తెచ్చుకుంటారో చూడాలి.

విలవిలలాడిన విశ్వనగరం! కేసీఆర్ పాలనకు సాక్ష్యం?

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గొప్పగా చెబుతున్న విశ్వనగరం విలవిలలాడింది. భారీ వర్షానికి అల్లాడి పోయింది. సిటీలో గల్లీ ఏరైంది.. కాలనీ చెరువైంది.. రహదారి సాగరమైంది. హైదరాబాద్ నగరం కనివిని ఎరుగని జల విలయాన్ని చూసింది. భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. భారీ వర్షానికి బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతున నీళ్లు నిలిచాయి. కొన్ని ప్రాంతాల్లో అపార్టుమెంట్లు సెల్లార్లలోకి వరద నీరు చేరడంతో వాహనాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.    నగరంలో కుండపోతగా కురిసిన వర్షానికి పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాంద్రాయణగుట్ట బండ్లగూడ మహ్మద్‌నగర్‌లో ఓ వెంచర్‌ ప్రహరీ కూలి.. ఇళ్లపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పాతబస్తీలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు.  అతన్ని ఎవరూ రక్షించలేని పరిస్థితి నెలకొంది. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాహనాలు కొట్టుకుపోయాయి. పాతబస్తీలో పరిస్థితి దారుణంగా ఉంది. వందలాది మంది వరద నీటిలోనే ఉన్నారు. బిల్టింగులపైకి చేరి సాయం చేయాలని, రక్షించాలని కేకలు పెట్టారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. వరద ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో హెలికాప్టర్లను ఉపయోగించారు. పాతబస్తీలో సహాచర్యల  కోసం ఎన్డీఆర్ఎఫ్ కు తోడుగా సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, పారామిలటరీ బలగాలను రంగంలోకి దించాల్సి వచ్చింది.               హైదరాబాద్ మహానగరంలో మధ్యాహ్నమే కారు చీకట్లు కమ్ముకున్నాయి. సగం నగరం అంధకారంలో మునిగిపోయింది. గ్రేటర్‌ పరిధిలో 800 ఫీడర్లు ఉండగా దాదాపు 400 ఫీడర్లలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.ప్రతిచోటా గంటల కొద్దీ సరఫరా నిలిచిపోయింది. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తుండడం, వర్షం తగ్గకపోవడంతో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రంతా కరెంట్ లేక నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని జనాలు చెబుతున్నారు.    వరద ఉధృతికి పలు జాతీయ రహదార్లు స్తంభించిపోయాయి. హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. పలు కార్లు నీట మునిగాయి. రోడ్డుకు ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోవడం, వరద తీవ్రత మధ్య వాహనదారులకు ఇళ్లకు చేరడం కష్టమైంది.  భారీ వర్షం, వరదతో నగరం జనం నరకం చూశారు.  హైదరాబాద్ నగరాన్ని అమెరికాలోని డల్లాస్‌లా తయారు చేస్తాం.. పాతబస్తీని ఇస్తాంబుల్ గా మారుస్తామని  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  2015 ఫిబ్రవరిలో ప్రకటించారు. .ఇప్పుడు కూడా సమయం వచ్చినప్పుడల్లా గ్రేటర్ ను ఎంతో అభివృద్ధి చేస్తామని చెబుతుంటారు కేసీఆర్. ఆరేండ్లలో హైదరాబాద్ లో దాదాపు 60 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. అయితే భారీ వర్షానికి హైదరాబాద్ లో పరిస్థితి చూస్తే.. నగరం ఎలా అభివృద్ధి చెందిందో జనాలకు అర్థమైపోయింది. విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.                        హైదరాబాద్ నగరంలో పరిస్థితికి ప్రధాన కారణం  నాళాలు, నగర శివారులో ఉన్న చెరువులు కబ్జాకు గురికావడమే. చెరువులు కబ్జా కావడంతో వాటి కట్టలు తెగి వరద నీరు ప్రవహిస్తోంది.  నీళ్లు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వరదంతా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. రోడ్ల వెంట నీళ్ల వెళ్లడానికే ఏర్పాట్లు లేకపోవడంతో ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. డ్రైనేజీలను పట్టించుకునే వారే లేకపోవడంతో అవన్ని వరదతో పొంగి ప్రవహించాయి. వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలేవి బల్దియా తీసుకోకపోవడంతో సిటీ జనాలకు శాపంగా మారింది. రోడ్లు, కాలనీలు, డ్రైనేజీలన్ని ఏకమయ్యాయి. కార్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటే హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేశారో ఊహించుకోవచ్చు.    ఆరేండ్లలో60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ డబ్బులతో హైదరాబాద్ లో ఏం చేశారో ఎవరికి అర్ధం కావడం లేదు. ఎక్కడ ఖర్చు పెట్టారో, ఏ నిర్మించారో చెప్పాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. వరద నీరు పోయే నాలాలు విస్తరించలేదు, కొత్త కాల్వలకు గతి లేదు.. రోడ్లన్ని గుంతలుగానే ఉన్నాయి. మరి 60వేల కోట్లతో ఏం చేశారనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. డల్లాస్ , ఇస్తాంబుల్ చేయడం కాదు ముందు వరద నీరు పోయే మార్గాలు చూడాలని సీఎం కేసీఆర్ పై ఫైరవుతున్నారు ప్రజలు.    ఓల్డ్ సిటీ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తామని, ఇస్తాంబుల్​లా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఐదేండ్ల కింద ప్రకటించింది. కానీ అడుగు కూడా ముందుకు పడలేదు. ఇరుకైన రోడ్లు, చెత్తతో నిండిన మురికివాడలు, డ్రైనేజీలను తలపించే బస్తీలు కనిపిస్తున్నాయి. రాజసౌధాలు, వారసత్వ సంపదగా ఉన్న మసీదులు, కట్టడాలను 150కి పైగా గుర్తించిన ఇస్తాంబుల్ ప్రభుత్వం.. వాటిని రక్షించేందుకు ప్రత్యేక నిధులను కేటాయించింది. కానీ మన నగరంలో 200కు పైగా ఉన్న కట్టడాలు, కోటలు, మసీదులు, దేవాలయాల పరిరక్షణ అంశాన్ని ప్రభుత్వం  గాలికొదిలేసిందన్న విమర్శలు ఉన్నాయి. నాలాల్లో పూడికతీత కూడా తీయకపోవడంతో వర్షానికి వరద నీరు పోయే మార్గం లేక.. ఆ వరదంతా కాలనీలను, ఇండ్లను ముంచెత్తింది. ఓల్ట్ సిటీలోని కొన్ని కాలనీల్లోని జనం రాత్రంగా ఇండ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారంటే.. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.    హైదరాబాద్ దుస్థితిపై విపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా తయారైందని మండిపడుతున్నాయి. విశ్వనగరం చేస్తామంటూ హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. డల్లాస్ చేస్తామంటూ సిటిని ఖల్లాస్ చేశారని  ఫైరవుతున్నారు. ఇస్తాంబులే చేస్తామన్న పాతబస్తీని సముద్రంలా మార్చారని మండిపడుతున్నారు.    ఇప్పటికైనా కేసీఆర్ గొప్పలు కట్టిపెట్టి గ్రేటర్ పై ఫోకస్ చేయాలని సిటీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.  ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటే చాలని, లండన్, డల్లాస్ , ఇస్తాంబుల్ సిటీ తరహా సౌకర్యాలు తమకు అవసరం లేదని చెబుతున్నారు.

హైదరాబాద్ కు దగ్గరలో తీవ్ర వాయుగుండం.. మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం

నిన్నటి నుండి కురుస్తున్న అతి భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అవుతోంది. తాజాగా తీవ్ర వాయుగుండం హైదరాబాద్ కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో వచ్చే 12 గంటలలో ఇది తీవ్ర అల్పపీడనంగా మారి బలహీనపడుతుందని వాతావరణ శాఖ చెపుతోంది. దీని ప్రభావంతో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.   ఇది ఇలా ఉండగా ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో న‌గ‌రంలోని రోడ్ల‌న్నీ చెరువులను తలపిస్తున్నాయి . కొన్ని చోట్ల అపార్ట్మెంట్ సెల్లార్లు నీటితో నిండిపోగా… మరి కొన్ని చోట్ల నాలాలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నిన్న ఒక్క రోజులో 32సెం.మీ వ‌ర్ష‌పాతం నమోదవడంతో లోత‌ట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ఇంట్లో నుండి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.   ఇది ఇలా ఉండగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో కురుస్తున్న భారీ వ‌ర్షాలతో.. వ‌ర‌ద ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌రిధిలో ఉన్న అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాల‌కు ఈరోజు, రేపు రెండ్రోజుల పాటు సెలవులు ప్ర‌క‌టించింది. త‌ప్ప‌నిస‌రి సేవ‌లు మిన‌హా అన్ని ర‌కాల కార్యక‌లాపాల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది. అంతేకాకుండా ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జైలులో ఆత్మహత్య చేసుకున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు

కోటి 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అరెస్టయిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు చంచల్‌గూడ జైల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజులుగా ఏసీబీ ఈ కేసు పై ఎంక్వైరీ చేస్తోంది. ఇటీవలే ఆయన ఇళ్లల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో నగదు, స్థిరాస్తి పత్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.   దాదాపు 19 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాన్ని క్లియర్ చేయడానికి నాగరాజు లంచం డిమాండ్ చేస్తున్నారని అప్పట్లో ఎసిబి అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో నెల రోజులుగా ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇక తాను ఈ కేసు నుంచి బయటపడటం సాధ్యం కాదని భావించడం వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకొని ఉంటారని తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

‘దేవుడి’ సన్నిధిలో దైవజ్ఞసమ్మేళం!

స్వరూపుల వారి సేవలో సర్కారు శాఖ   ఆ సాములోరి స్పెషాలిటీ ఏమిటో?   ఆయన నడిచే దేవుడు. శంకరాచార్య అంశలో విశాఖలో కళ్లు తెరచిన ఓ మహా తపస్వి. తన కఠోర తపస్సుతో.. ఒక నేతను పాలకుడిగా మార్చిన దైవాంశ సంభూతుడు. మరి అంతటి మహాత్ముడిని సేవించి తరించడం పాలకుల విధి. కర్తవ్యం. బాధ్యత కూడా! పాలకుల సేవిస్తున్నారంటే, భృత్యులు కూడా వారిని అనుసరించాల్సిందే. అందుకేనేమో.. తెలుగడ్డపై ఎంతోమంది పీఠాధిపతులు, వారి ఆశ్రమాలు ఉన్నప్పటికీ, సదరు స్వామి వారి పీఠంలోనే సర్కారీ శాఖ అధికార కార్యక్రమం నిర్వహించి తరించిపోయింది.   అసలు కథేమిటంటే.. సర్కారు ఏలుబడిలోని దేవదాయ ధర్మదాయ శాఖ కొద్దిరోజుల క్రితం,  ‘జగన్గురు’వయిన.. జగద్గురు స్వరూపానంద స్వామి వారి విశాఖ చినముషిడివాడ శారదాపీఠంలో ‘దైవజ్ఞ సమ్మేళం’ జరిగింది. దీనిని రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ నిర్వహించింది. దీనికి దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్,  రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ డైరక్టర్ కృష్ణశర్మ, దేవాలయ పాలనా సంస్థ డైరక్టర్ ద్రోణంరాజు రామచంద్రరావు హాజరయ్యారు. సరే..  రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ డైరక్టర్ కృష్ణశర్మ అంటే పూర్వాశ్రమంలో.. ఆ ఆశ్రమంలో అర్చక స్వామి కాబట్టి.. సాములోరి  సన్నిధిలో ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహిద్దామన్న ఆలోచన ఉండవచ్చు. తప్పులేదు. తనకు పదవి ఇప్పించినందుకు ఆపాటి కృతజ్ఞత, గురుభక్తి ప్రదర్శించడంలో ఆక్షేపణ ఏమీ కాదు. అది వేరే విషయం.   ఈ సందర్భంగా స్వామివారు పంచాంగాలపై పంచాయతీలు వద్దని, పండుగలు నిర్ణయించే అంశంలో పంచాంగ కర్తలంతా.. ఏకాభిప్రాయానికి రావాలని హితవు పలికారు. అంతవరకూ బాగానే ఉంది. పండుగల తేదీపై పండితుల మధ్య, చాలా ఏళ్ల నుంచి పంచాయతీ నడుస్తోంది. కాబట్టి స్వామి వారి హితోక్తులు వారిపై ప్రభావం చూపిస్తే, ఇకపై పండితులంతా స్వామి వారు సెలవిచ్చినట్లు.. ఒకే తేదీ ప్రకటిస్తారని ఆశించడంలో తప్పులేదు. కానీ..  రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ వారు,  విశాఖలోని ‘జగన్గురువు’ గారి పీఠంలోనే ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించాలన్న ప్రశ్నలు,  కొత్తగా తెరపైకి వచ్చాయి. రాష్ట్రంలో చాలామంది పీఠాథిపతులున్నారు. ఆశ్రమాలూ ఉన్నాయి. కానీ, సర్కారు వారు కేవలం స్వరూపానందుల వారి ఆశ్రమంలోనే, ఈ  దైవజ్ఞసమ్మేళం నిర్వహించారన్న ప్రశ్నలు హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రమోషన్ వ్యవహారాల వల్ల.. ఎవరి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. దేవదాయ శాఖ ఉన్నతాధికారులకంటే, సర్కారు వారి సేవలో తరించక తప్పదు. కానీ, ఒక ప్రైవేటు పీఠాథిపతి పీఠంలోనే అధికారిక కార్యక్రమం నిర్వహించి, స్వామి వారి సేవలోనూ తరించడం ఏమిటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.   ఇప్పటికే స్వామి వారి పీఠం ముందున్న.. పోలీసు పోస్టు, బుగ్గకారు, సెక్యూరిటీ వాతావరణం చూస్తే, అదేదో ఒక మంత్రి గారి బంగ్లా వాతావరణం దర్శనమిస్తుంది. ఇప్పుడిక సర్కారీ శాఖలు కూడా అక్కడికే తరలివెళితే.. ఇక దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే పెడితే నిక్షేపంలా ఉంటుందన్నది కొందరి వ్యాఖ్య. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఏ దేవదాయ కమిషనరు కూడా ఇప్పటివరకూ ఒక పీఠంలో అధికార కార్యక్రమాలు నిర్వహించడం గానీ, కార్యక్రమాల రూపకల్పన, నిర్ణయాలలో ఏ ఒక్క పీఠాధిపతి ఆశ్రమానికి అధికారులు వెళ్లి వారి అనుమతి తీసుకున్న దాఖలాలు, చరిత్ర ఎన్నడూ లేదు. ఎలాగూ ఆ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు కాబట్టి, ఆ కార్యాలయాలేవో పీఠంలోనే ప్రతిష్ఠిస్తే అధికారులకు సమయం, ఇంధన ఖర్చులూ మిగిలిపోతాయి కదా అన్నది బుద్ధిజీవుల ఆలోచన.   ఎలాగూ విశాఖకు రాజధానిని తరలిస్తున్నందన, కమిషనర్, జేసీ, ఏసీల కార్యాలయాల వరకూ పీఠంలోనే పెడితే.. వారికి దిశానిర్దేశం ఇచ్చేందుకు, స్వామి వారికి కూడా కొంత సౌకర్యంగానే ఉంటుంది కదా? ఏమంటారు? పాలకులు ఈ దిశగా ఆలోచిస్తే, ఒక్క ఎండోమెంటు శాఖ మాత్రమే కాకుండా.. అనంతకోటి  భక్తుల జన్మలు కూడా చరితార్ధమవుతాయి. ఓసారి ఆలోచించి చూద్దురూ?! -మార్తి సుబ్రహ్మణ్యం